7, జులై 2016, గురువారం

ఆషాఢం ఎడబాట్లు-శ్రావణ సమీరాలు


"ఏవండీ! బామ్మ, అమ్మ చెప్పినప్పుడు అంతగా తెలియలేదు. కానీ మిమ్మల్ని వదిలి నెలరోజులు...ఈ ఆషాఢం అవసరమా? " అంది శ్రావణి బుంగమూతితో భర్తను హైదరాబాదుకు సాగనంపుతూ. "శ్రావణీ! ఇప్పటికి అర్థమైందా నా పరిస్థితి ఏమిటో? అయినా, అంతా మన మంచికే. ఈ ఎడబాటు మన బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. నువ్వు లేకుండా నాకు మాత్రం తోస్తుందా? ఎంత, నెలరోజులేగా?" అని సర్ది చెప్పి శ్రావణిని వాళ్ల పుట్టింట్లో దించి హైదరాబాదు బయలుదేరాడు ఆదిత్య. మనసంతా శ్రావణి మీదే. నాలుగు నెలలు కూడా కాలేదు. నెలరోజుల పాటు శ్రావణిని విడిచి పెట్టి ఉండాలా? ఏం చేస్తాం అని బస్సెక్కాడు. ఆలోచనలు నాలుగు  నెలలు వెనక్కి వెళ్లాయి. తమ పెళ్లినాటి మధురస్మృతులు అతని పెదవులపై చిరునవ్వునొలికించాయి.

"పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేను పెండ్లి కూతురు" అనే అన్నమాచార్యులవారి సంకీర్తన నాదస్వరంలో వస్తూ ఉంటే తలంబ్రాలు పోసుకుంటున్నారు శ్రావణి-ఆదిత్య. పక్కనే శ్రావణి చెల్లెలు, ఆదిత్య చెల్లెలు ఉత్సాహంగా "అక్కా! వంగకు", అన్నయ్యా! ఎత్తిపొయ్యి" అని చెబుతూ గలగలా మంటపమంతా సందడి చేస్తుంటే, వధూవరులు ఎవ్వరి మాట కూడా వినే పరిస్థితిలో లేరు. కళ్లు కలిసాయి, మనసులు ఏకమయ్యాయి, పవిత్ర బంధం వారి చేతులలో ఆనంద తాండవంతో  ఒకరిపై ఒకరు లయబద్ధంగా తలంబ్రాలను జలపాత ధారలుగా పోసుకుంటున్నారు. ఎవ్వరి మాట వినకుండా మైమరపుతో, ఆరాధనతో వేడుకను జరుపుకుంటున్నారు. "బాబూ, అమ్మా, తలంబ్రాలు సంపూర్ణం" అని పురోహితుడు తట్టి పలకరిస్తే వారు తమ ఆలోచనలనుండి బయటక వచ్చి కిలకిలా నవ్వుకున్నారు. పసుపు బట్టలతో కొంగు ముడి వేసుకొని శ్రావణి-ఆదిత్యల జంట అరుంధతీ నక్షత్రం చూడటానికి బయటకు వెళ్లారు. మాఘమాసం చల్లని వెన్నెలలో సప్తర్షి మండలంలో అరుంధతి అద్భుతంగా కనబడింది. వధువు సిగ్గుతో వరుని కళ్లలోకి చూసి అతనికి నమస్కరించింది. వరుడు ఆమెను గట్టిగా చేయిపట్టుకొని తిరిగి మంటపంలోకి నడిపించుకు తీసుకు వచ్చాడు.

"అమ్మా! శ్రావణీ! మీ వారి పేరు చెప్పి కుడి కాలు లోపలికి పెట్టు" అని అత్తగారు రాజేశ్వరి అడిగింది. సిగ్గుతో "శ్రీనివాస ఆదిత్య" అని చెప్పి లోపలకు అడుగిడింది. పసుపు బట్టలతో, నుదుటన బాసికం, జీలకర్ర-బెల్లం, తలంబ్రాలు, కర్పూర హారాలు, పారాణి, కళ్లకు కాటుక, బుగ్గన చుక్క...ఆ జంట సీతారాముల్లా వెలిగిపోతున్నారు. శోభనానికి ముహుర్తం మర్నాడు రాత్రి కావటంతో దంపతుల కొంగు ముడి విప్పారు. వేరుగా పడుకున్నా వారి ఆలోచనలు అన్నీ ఆ  మధురమైన వివాహ బంధంపైనే. "వదినా, ఏమిటా పరధ్యానం" అని గిల్లికజ్జాలు ఆడే ఆదిత్య చెల్లెలు ఆమని మాటలకు చిలకలా నవ్వి తలవంచుకోవటమే తప్ప నోట మాట రావటంలేదు.  "అన్నయ్యా! అప్పుడే మమ్మలని మర్చిపోయావురా" అని ఆమని ఆదిత్యను ఆటపట్టిస్తుంటే "పోవే! నీకు పనీ పాట లేదు" అని మృదువుగా చెల్లిని మందలించినా, అతని ఆలోచనలన్నీ శ్రావణిపైనే.

మాఘమాసం, నిండు పున్నమి వెన్నెల, డాబాపై ఆదిత్య-శ్రావణి. చందమామ వైపు చూస్తూ మైమరపులో ఉన్నారు. "ఆదిత్యా!" అనబోయి సిగ్గుతో ఏవండీ అంది. ఆదిత్య-శ్రావణి చిన్ననాటి స్నేహితులు. 15ఏళ్ల అనుబంధం వాళ్లది. పేరు పెట్టి పిలిచే అలవాటు. ఏవండీ అనే సరికి "ఎవరిని" అని అడిగాడు ఆదిత్య. "మిమ్మల్నే" అని సొట్టబుగ్గలతో నవ్వుతూ శ్రావణి బదులిచ్చింది. "ఇదేదో బావుందోయ్! కొత్త హోదా వచ్చినట్లుంది. "ఐ ఫీల్ ఎలివేటెడ్" అన్నాడు చిలిపిగా. "అవునవును. కానీ, ఎలివేషన్ కంస్ విత్ రెస్పాన్సిబిలిటీ" అండోయ్ అంది శ్రావణి. సరే కానీ, "తొలిరేయి మాటలతో కాలక్షేపమా..నేరం..." అని చేయిపట్టుకొని దగ్గరకు లాగి హత్తుకున్నాడు శ్రావణిని"..."అబ్బాయిగారి ఆత్రం చూస్తుంటే..." అని బలంగా తప్పించుకొని దూరంగా వెళ్లింది. "అటు చూశారా! తార-జాబిలి ఒకటైనట్లు ఉంది. ఈ శుభసమయంలో మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏమీ అనుకోకండీ!" అంది. "ఏమిటబ్బా" అని ఆశ్చర్య పడుతూ సరే అన్నాడు ఆదిత్య. "ఇన్నేళ్లు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏ నిర్ణయమైనా, అడుగినా మనది, మీది కాదు నాది కాదు. కాబట్టి ఏమి చేసినా ఒకటే మాట మీద ఉండాలి. దానికి నాకు కొన్ని ప్రమాణాలు కావాలి" అంది శ్రావణి. "ప్రమాణాలు ఏ ప్రమాణమో?" అన్నాడు. "చిన్నవేలెండి" అని మొదలు పెట్టింది "1. మన ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా దానికి కారణం మూడవ  వ్యక్తి కాకూడదు, పరిష్కారం కూడా మూడవ వ్యక్తినుండి రావటం నాకు ఇష్టం లేదు. ఏదైనా సరే మనిద్దరమే చర్చించి పరిష్కరించుకోవాలి 2. ఇద్దరం ఒకరి కుటుంబాలను ఒకరం వాళ్ల వాళ్ల పద్ధతులను, సాంప్రదాయాలను, వ్యక్తిత్వాలను గుర్తించి గౌరవించుకోవాలి. మనిద్దరం ఒకరికొకరు  ఇన్నేళ్లనుండి తెలిసినా, మనం పెరిగిన వాతావరణాలు వేరు. అందుకే ఈ నిబంధన 3. ఏట్టి పరిస్థితిలోనూ ఒకరిపై ఒకరు నమ్మకం పోగొట్టుకోకూడదు 4. మన సంసారం వివరాలు బయట వాళ్లకు తెలిసే వీల్లేదు 5. మనిద్దరికీ ఎవరికి వారి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. ఈ స్వేచ్ఛకు లక్ష్మణ రేఖ మనిద్దరమూ కలిసి గీచుకోవాలి..." అంది. "నాకేమి అభ్యంతరం లేదు. కానీ, ఇవి ఆచరణలో పెట్టగలమా? ఐడియలిస్టిక్ అనిపిస్తున్నాయి..." అన్నాడు ఆదిత్య. "నిజమే, కానీ, వీటిని అమలు పరచటం అసాధ్యం కూడా కాదు" అంది శ్రావణి. సరే ప్రయత్నిద్దాం అని తన రెండు చేతులూ తీసుకొని తన చేతులతో కలిపి ప్రమాణం చేశాడు. తారాచంద్రుల సాక్షిగా "నాతి చరామి" అన్నారు. రతీమన్మథులు ఏకమై ఆ జంటకో శుభోదయానికి నాంది పలికారు.

"శ్రావణీ! ఉగాది పదిరోజుల్లోకి వచ్చింది. పండక్కు ఆమని వాళ్లను పిలుద్దామనుకుంటున్నాను. నీకేమైనా  ఆలోచనలు ఉన్నాయా?" అడిగింది రాజేశ్వరి. "మొదటి పండుగ కదా అత్తయ్యగారు, అమ్మ వాళ్లు బెజవాడ రమ్మంటున్నారు. ఇంకా తుది నిర్ణయం కాలేదు. ఈయనతో మాట్లాడాలి" అంది. తాను కోరుకున్న సమాధానం రాకపోవటంతో మౌనంగా రాజేశ్వరి లోపలికి వెళ్లిపోయింది. అర్థం చేసుకొని శ్రావణి ఆదిత్యతో "ఏవండీ! అత్తయ్యగారు మనం పండుగకు ఇక్కడ ఉంటామనుకున్నారు.  అమ్మ నాన్న బెజవాడ రమ్మన్నారు . ఏం చేద్దాం?" అంది. ఆదిత్య ఆలోచించి రాజేశ్వరి వద్దకు వెళ్లి "అమ్మా! మొదటి పండుగ కదా! మేము బెజవాడ వెళితే బాగుంటుందని నా అభిప్రాయం. రెండేళ్ల క్రితం ఆమని పెళ్లి కాగానే దీపావళి పండుగకు నువ్వు వాళ్లిద్దరూ మనింటికి రావాలని గట్టిగా కోరుకున్నావు, అడిగావు గుర్తుందా? ఎంచక్కా శ్రీరామనవమికి ఆమనిని, బావగారిని మనింటికి రమ్మను, నలుగురం కలిసి కళ్యాణం చేయించుకుంటాము. ఏమంటావ్?". కొడుకు అంతరంగం అర్థం చేసుకొని రాజేశ్వరి "శ్రావణీ! అలాగే. మీరిద్దరూ ఉగాదికి బెజవాడ వెళ్లండి. నేను రామనవమి ఏర్పాట్లు చూసుకుంటాను" అంది.  శ్రావణి ఫోన్ అందుకొని "ఆమనీ! పండక్కు బెజవాడ వెళుతున్నాను. నువ్వు, అన్నయ్యగారు వచ్చినప్పుడు మేము ఉండట్లేదు. నీకోసం ఓ సర్ప్రైజ్. పండగ రోజు అత్తయ్య గారు నీకు దాని రహస్యం విప్పుతారు.." అని చెప్పింది. "ఏమీ పరవాలేదు వదినా! అన్నయ్య ఇందాకే నాకు ఫోన్ చేశాడు. అన్నీ చెప్పాడు.  హాయిగా మొదటి పండుగ బెజవాడలో జరుపుకోండి" అని సంతోషంగా ఫోన్ పెట్టేసింది ఆమని. "వదిన గారు! మీరు అన్నయ్యగారు కూడా పండగకు బెజవాడ రావాలని మా కోరిక, కానీ అమ్మాయి వాళ్లు వస్తున్నారని అల్లుడు గారు చెప్పారు..." అని శ్రావణి తల్లి కామేశ్వరి చెప్పబోయింది. "వదిన గారూ! మొదటి పండుగ, హాయిగా అమ్మాయి, అల్లుడితో జరుపుకోండి. ఈ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. మేము ఇంకోసారి వస్తాము" అంది. అలా మొదలైంది ఆ కుటుంబంలో ఆ కోడలి రాకకు, ఆమె వ్యక్తిత్వానికి, ఆమె ఇష్టాయిష్టాలకు స్థానం ఇవ్వటం.

"శ్రావణీ! ఏమి ఆషాఢ పట్టే! నువ్వు లేకుండా నెల రోజులు ఇంట్లో నేను ఎలా?. నువ్వు వచ్చిన తరువాత నేను చేసే వంటలు మీ మామయ్యగారికి నచ్చట్లేదు. నీ పానీ పూరీలు, నూడిల్స్, బిరియానీలు నావల్ల కాదు. నేనేం చెయ్యను?" అంది రాజేశ్వరి. "అదేం లేదు అత్తయ్యా! ఎవరి హస్తవాసి వాళ్లది. మీ వంట కూడా అద్భుతంగా ఉంటుంది.  నేను ఆషాఢానికి రావాలని బామ్మ, అమ్మ పట్టుబడుతున్నారు" అంది. "అయినా, నా రెసిపీలు కావాలంటే ఒక్క ఫోన్ కాల్ మాత్రమే అత్తయ్యా.." గల గలా నవ్వేసింది శ్రావణి. మీ మందులు, మామయ్యగారి మందులు ఎప్పుడు ఏవి వేసుకోవాలో అన్నీ పుస్తకంలో రాసి పెట్టాను. రెండు రోజులకోసారి నాకు ఇద్దరూ లెక్క చెప్పాలి" అంది అత్తమామలతో శ్రావణి. "ఏవండోయ్ నేను ఉండను కదా అని బయట తిళ్లు తినకండి. బుద్ధిగా అమ్మ చేతి వంట మాత్రమే తినండి. అమ్మ ప్రేమతో చేసే వంట అమృతం అని భావించి తినండి. నా వంటల మీద కావాలని వంకలు పెట్టినట్లు అత్తయ్యగారి వంటల మీద వంకపెట్టకండి..." అని భర్తకు వంద పాఠాలు చెప్పింది.

బస్సు టోల్ గేట్ వద్ద ఆగడంతో మధురస్మృతుల్లోనుంచి బయటకు వచ్చాడు ఆదిత్య. శ్రావణి...చిన్ననాటి స్నేహితురాలు శ్రీమతి కావటం తన అదృష్టం అనుకున్నాడు. ఇంటికి ఫోన్ చేశాడు. "అమ్మా! నేను బయలుదేరాను. ఉదయం ఐదింటికల్లా ఇంట్లో ఉంటాను" అని రాజేశ్వరితో చెప్పాడు. గంటలో ఫోను.."శ్రీవారూ! ఎక్కడుంది బస్సు?" అని శ్రావణి అడిగింది. "బస్సు ఎక్కడో ఉందిలే, మా మనస్సు మాత్రం అక్కడే ఉంది" అన్నాడు ఆదిత్య. "అబ్బాయి గారికి ప్రాసలు వస్తున్నాయే.."...అంది నవ్వుతూ స్రావణి. "విరహం ఎటువంటి వారి చేతనైనా కవిత్వం చెప్పిస్తుందోయ్" అని ఆశువుగా ఒక కవిత చెప్పాడు. కళ్లలో నీళ్లు తిరిగి, నోటమాట రాక శ్రావణి "మళ్లీ మాట్లాడతానండీ" అని ఫోన్ పెట్టేసింది.

తరువాతి పదిహేనురోజులు హైదరాబాదు-బెజవాడలోని ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్ని ఫోన్లో, ఎన్ని స్కైప్ కాల్స్లో, ఎన్ని వాట్సాప్ సందేశాలో పరమాత్ముడికే ఎరక. "శ్రావణీ ఫలాన వస్తువెక్కడ? పనీర్ కూర ఎలా చేయాలి? శ్రావణీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అత్తయ్యగారు, మామయ్య గారు మందులేసుకుంటున్నారా?.." ఇవి సాధారణ ప్రశ్నలైతే, భార్యా భర్తల మధ్య వందల సంభాషణలు."ఏం తిన్నారండీ"  "ఏదో తిన్నాలే, నీకెందుకు, వెళ్లావుగా..." "అబ్బా! అడిగితే ఒక తప్పు, అడక్కపోతే ఒక తప్పు"..."అలా కాదోయ్! అసలే జీవితం యాంత్రికంగా ఉంటే, నువ్వు తిన్నారా లేదా అని ప్రశ్నలు వేస్తే అన్నీ తెలిసి కూడా  అడుగుతుందేమిటి అని నా విసుగు..." "అసలు ఈ ఆషాఢ పట్టి ఎందుకు వచ్చింది?" "నేను హాయిగా మా అమ్మ నాన్నలతో కొన్నాళ్లు ఉండటానికి" "మరి నేను కూడా అంతేగా?" "అంటే, నేను లేకపోతే మీకు హాయిగా ఉందన్నమాట" "మరి నువ్వు అన్నది కూడా అదేగా"...ఇలా గిల్లి కజ్జాలు కాసేపు, విరహపు వేదనలు కాసేపు...

"ఇవన్నీ కాదు కానీ, అత్తకోడలు ఒక చోట ఉండకూడదు అన్నారు, భార్యాభర్తలు అనలేదు కదా? మనిద్దరం ఎంచక్కా అన్నవరం వెళదాము. ఏమంటావ్?" అన్నాడు ఆదిత్య. "ఏవండీ! అసలు ఆషాఢమాసంలో భార్యాభర్తలు ఒకచోట ఉండటం అనేది నిషిద్ధం. అత్తాకోడళ్లు కాదు. ముందు తరాలలో స్త్రీలకు చిన్నవయసులో వివాహమయ్యేది. దానివల్ల గర్భధారణలో ఉండే ఆటుపోట్లు తట్టుకునే శక్తి అందరికీ ఉండేది కాదు. ఇదివరకు మన సాంప్రదాయంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉత్తరాయణంలో (మాఘం నుండి జ్యేష్టం వరకు) జరిగేవి. ఆషాఢం సమయానికి గర్భం దాల్చే అవకాశం ఉంది కాబట్టి, ఆ గర్భ రక్షణకు, భార్యాభర్తలు ఒకచోట ఉండరాదు అనే వాళ్లు. ఇప్పుడు మాతృత్వానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పురోగతి సాధించింది. కాబట్టి, ఈ సాంప్రదాయానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. అందుకని, అన్నవరం వగైరా వగైరా తరువాత. పెద్దవాళ్ల మాటలకు ఎదురు ఎందుకు చెప్పటం అని నేను కాదనలేదు. ఈ ఒక్కసారే కదా..." అంది.

"శ్రావణీ! తెలంగాణాలో బోనాలు అంటే ఏమిటో అనుకున్నానే! ఎంత అద్భుతంగా చేస్తున్నారో! వచ్ఛేసారు మనిద్దరం, ఆమని కలిసి బోనాల్లో పాల్గొందాము. వి ఆర్ మిస్సింగ్ యూ హియర్" అంది రాజేశ్వరి శ్రావణితో. "అత్తయ్యా! అవునా! నేను టీవీలో చూడటమే.  ఎప్పుడూ వెళ్ళలేదు. వచ్చే సంవత్సరం సరదాగా వెళదాం" అంది శ్రావణి. "అత్తయ్యా!నేను గోరింటాకు పెట్టుకున్నా" అని అత్తగారికి వాట్సాప్ తన అందమైన చేతుల ఫోటోలను  పంపించింది. అది చూసి రాజేశ్వరికి కొడుకు-కోడలి పెళ్లి రోజులు గుర్తుకు వచ్చాయి. శ్రావణిని పెళ్లి కూతురిని చేసే రోజు అది. "ఆమనీ! నేను మంచి గోరింటాకు ఆకులు సంపాదించాను. మన నలుగురికీ వస్తాయి. నేను చెల్లాయితో పంపిస్తాను. మీరూ పెట్టుకోండి" అని ఫోన్లో ఉత్సాహంగా చెప్పింది శ్రావణి. . మంచి మంచి డిజైన్లు వాట్సాప్ లో  పంపించింది.  అమ్మాయి ఉత్సాహానికి రాజేశ్వరి, ఆమని సంతోషపడి పోటీపడి  గోరింటాకు పెట్టుకున్నారు. పెళ్లినాడు అందరూ అడగటమే - "ఎంత బాగున్నాయి వదినా  ఈ డిజైన్లు...ఎవరు పెట్టారు" అని ఓ వదిన అడిగితే "మా శ్రావణి పంపింది..ఎలా పెట్టుకోవాలో మెళకువలు  చెప్పింది..ఇట్టే పెట్టేసుకున్నాము" అని సమాధానం గర్వంగా చెప్పింది రాజేశ్వరి. ఆ పెళ్లినాటి మధుర జ్ఞాపకాలు ఆమెలో తెలియని ఆనందాన్ని నింపింది.

ఆషాడం నెల గడిచిపోయింది. వేసవి వేడి గాలులు తగ్గి నైరుతి ఋతుపవనాలు  చురుగ్గా తెలుగు రాష్ట్రాల్లో పురోగమిస్తున్నాయి. కామేశ్వరి శ్రావణిని హైదరాబాదు తీసుకువెళ్లేముందు రాజేశ్వరికి ఫోన్ చేసింది. "వదినగారు! అమ్మాయిని రేపు తీసుకు వస్తున్నాము. ఆషాఢపట్టి..." అని కానుకల గురించి మాట్లాడబోయింది. "వదిన గారూ! మీరేమి తీసుకోవద్దు. అమ్మాయిని తీసుకు రండి చాలు. వివరాలు మీరు వచ్చాక మాట్లాడుకుందాం" అంది. కామేశ్వరికి అర్థం కాలేదు. హైదరాబాదులో ఆవిడకు కావలసినట్లుగా కొనమని అంటారేమో అని అనుకుంది. శ్రావణి, తల్లిదండ్రులు హైదరబాదు చేరుకున్నారు. పలకరింపులు పూర్తయ్యాక, మధ్యాహ్నం రాజేశ్వరి కామేశ్వరిని పిలిచి "వదిన గారు! పెళ్లి ముందర నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, ఈ నాలుగు నెలలలో నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. మన బిడ్డలే మనకు నిజమైన సంపదలు, కానుకలు. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తరువాత మా జీవితంలో వచ్చిన మార్పులే మాకు వెలకట్టలేని కానుకలు. అలాగే, మీ పట్ల మా వాడు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి, ఇక మీదట మన మధ్య ఎటువంటి కానుకలు, ఆర్భాటాలు వద్దు. కావలసింది మనమందరం కలిసి ఒక కుటుంబంలా ఉండటం" అంది. కామేశ్వరి కళ్లలో నీళ్లు తిరిగాయి. తన బిడ్డ ఔన్నత్యం, అత్తవారింట ఉన్న విలువలకు, ప్రేమానురాగాలకు ఎంతో సంతోషించింది.

"శ్రీవారూ! ఈ నెలరోజుల దూరం మనకు మంచే చేసింది అనిపిస్తోంది. ఏమంటారు?". "ఆ!ఆ! మంచే చేసింది. ఇక్కడ మాత్రం ఎదురుచూపులు దావానలాన్ని సృష్టించేశాయి..." అన్నాడు ఆదిత్య. "ఏవండోయ్! లెక్క ప్రకారం ఆషాఢం అంటే గ్రీష్మ ఋతువే. కాబట్టే, దావానలాలు ఓకే! శ్రావణం వచ్చేసింది, శ్రావణి మీ ఎదుట ఉంది. ఇంక అంతా వర్షాలు, చల్లదనమే" అని చిలిపిగా నవ్వింది.  "ఏదీ! శ్రావణ సమీరాల చల్లదనం ఇంకా తెలియటం లేదే? ఇంకా దగ్గరికి రావాలేమో"  అని  శ్రావణిని దగ్గరకు తీసుకున్నాడు. "వదినా! నీ ఆషాఢం ఏమో కానీ, మా అన్నయ్యకు నీ మీద ప్రేమ మాత్రం పదింతలు పెరిగింది" అని దూరం నుండి  గట్టిగా అరిచింది ఆమని. అందరూ పకపకా నవ్వేశారు. భార్యభర్తల అనురాగం, కుటుంబసభ్యుల ఆనందంతో ఆ ఇల్లు నిత్య కళ్యాణం-పచ్చతోరణంలా ముందుకు సాగింది.

2 కామెంట్‌లు: