బేబీ కార్న్-గోబీ మంచూరియన్
బయటకు వెళితే చాలా మంది ఆర్డర్ చేసే ఐటం మంచూరియన్. కొంతమంది గోబీ ఇష్టపడితే, కొంతమంది బేబీ కార్న్ ఇష్టపడతారు. నేను బేబీ కార్న్, గోబీ కలిపి చేశాను. అసలు మంచురియన్ అంటే ముందుగా ముక్కలను నూనెలో వేయించాలి, తరువాత మళ్లీ మిగిలిన పదార్థాలు వేసి స్టిర్ ఫ్రై చేయాలి. నేను అలా చేయలేదు. స్టీం కుక్ చేసి తరువాత నూనెలో స్టిర్ ఫ్రై చేశాను. కాబట్టి నూనె తక్కువే పట్టింది.
కావలసిన పదార్థాలు:
- ఒక అంగుళం పరిమాణంలో కోయబడిన బేబీ కార్న్
- ఒక అంగుళం పరిమాణంలో కింద కాండం కాస్త ఉండేలా కోయబడిన కాలీఫ్లవర్
- సన్నగా కోయబడిన అల్లం, వెల్లుల్లి
- సన్నగా కోయబడిన ఉల్లికాడలు
- సోయా సాస్
- టబిస్కో సాస్
- తగినంత నూనె
- తగినంత రెడ్ చిల్లీ సాస్
- తగినంత టమాటో కెచప్
- మిరియాల పొడి
- ఉప్పు
- నూనె
- కార్న్ ఫ్లోర్
తయారు చేసే పద్ధతి:
ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను, బేబీకార్న్ ముక్కలను 5 నిమిషాల పాటు స్టీం చేసుకోవాలి. దీని ఉద్దేశం ముక్కలు లోపల పచ్చి పోవటానికి. నూనెలో ఫ్రై చేయకూడదు అనుకుంటేనే ఇలా చేయాలి. లేకపోతే నూనెలో ముక్కలను డీప్ఫ్రై చేయాలి. స్టీం పద్ధతిలో ముక్కలు బాగా ఆవిరిపట్టి పచ్చి పోయిన తరువాత కాసేపు చల్లార్చుకోవాలి. నాన్-స్టిక్ ప్యాన్‌లో మరింత నూనె వేసి, వేడి అయిన తరువాత అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడల ముక్కలను వేసి బాగా వేయించాలి. ఒక 5 నిమిషాలు వేగి రంగు మారిన తరువాత బేబీ కార్న్, కాలీ ఫ్లవర్ ముక్కలను వేసి కాసేపు స్టిర్ ఫ్రై చేయాలి. తరువాత సోయా సాస్, టబిస్కో సాస్, చిల్లీ సాస్, టమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరింత సేపు స్టిర్ ఫ్రై చేయాలి. ముక్కలు అన్ని సాస్‌లను, కెచప్‌ను పీల్చుకొని రంగు మారుతున్న తరువాత, 3-4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌ను కాస్త నీటిలో బాగా కలిపి బాణలిలో ముక్కలపై వేయాలి. దీనివలన అన్ని మిశ్రమాలు దగ్గరకు అయ్యి కొద్దిగా గ్రేవీలా వస్తుంది. దీనిని పాత్రలోకి మార్చుకొని వేడి వేడిగా తినాలి.
గమనిక: ఈ వంటకంలో అల్లం, వెల్లుల్లి బాగా పడతాయి.
వెజిటబుల్ ఫ్రైడ్ రైస్
కావలసిన పదార్థాలు:
- బాస్మతీ బియ్యం
- చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్, సన్నగా కోయబడిన ఫ్రెంచ్ బీన్స్, బంగాళ దుంప (ఇంకా కూరగాయలు కావాలనుకుంటే తురిమిన క్యాబేజీ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా కోయబడిన క్యాప్సికం, సన్నగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు)
- తగినన్ని ఫ్రోజెన్ బఠాణీలు
- ఆలివ్ ఆయిల్
- జీలకర్ర
- మిరియాల పొడి
- సోయా సాస్
తయారు చేసే పద్ధతి:
బాస్మతి బియ్యాని ముందుగానే ఉడికించుకోవాలి. దీనికి బియ్యాన్ని ఒక అరగంటసేపు నీళ్లల్లో నానపెట్టుకోవాలి. తరువాత బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో కానీ, రైస్ కుక్కర్లో కానీ వేసి, తగినంత నీరు పోసి, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఉడికించాలి. ఉడికిన తరువాత మూత తీసి మరి కాస్త ఆలివ్ ఆయిల్ వేసి పొడి పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఎక్కు సేపు మూత ఉంచితే అన్నం మెత్తబడిపోతుంది. ఫ్రైడ్ రైస్ బాగుండదు.
ఒక బాణలిలో నూనె వేసి తరిగిన కూరగాయ ముక్కలన్నీ వేయాలి. కాస్త జీల కర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. చైనీస్ వంటకాలకు ముఖ్యం బాగా వేడి మీద స్టిర్ ఫ్రై చేయటం. అంటే బాణలిని అటు ఇటూ తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు స్టిర్ ఫ్రై చేసిన తరువాత ఉడికించిన బాస్మతీ బియ్యం, సోయా సాస్, మిరియాల పొడి వేసి, మొత్త రైస్‌కు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే మరింత వేసుకోవాలి. దీనిని 3-4 నిమిషాల పాటు మళ్లీ స్టిర్ ఫ్రై చేయాలి. అంతే, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. పైన చేసిన బేబీకార్న్-గోబీ మంచురీన్ తో కలిపి తింటే చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి వేరే సైడ్ డిష్ ఏమీ లేకున్నా కూడా బానే ఉంటుంది.
గమనిక: పై రెండు వంటకాలలోనూ సోయా సాస్ మరియు ఇతర సాస్‌లలో ఉప్పు, కారం ఎక్కువే ఉంటాయి కాబట్టి మీ అభిరుచులను బట్టి జాగ్రత్తగా వేసుకోండి. లేకపోతే వంటలు బాగా కారంగా, ఉప్పగా వచ్చే అవకాశం ఉంది.
aaaha entha ruchiga undoooo.... narayana... narayana...!
రిప్లయితొలగించండి