"కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే"...ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధురమైన గళంలో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం ఎఫ్ఎం రేడియోలో వస్తోంది. ప్రాతః సంధ్యావందనం చేసుకున్నాడు చంద్రశేఖరన్ అయ్యర్. భార్య గౌరి కాలేజీకి వెళ్లాల్సిన పిల్లలను నిద్రలేపే ప్రయత్నంలో కేకలు వేస్తోంది. ఎనభై ఏళ్ల సీతారామన్ అయ్యర్, భార్య జానకమ్మాళ్ వృద్ధాప్యపు భారంతో కాలకృత్యాలలో ఉన్నారు. చంద్రశేఖరన్ సెక్రెటేరియట్లో సెక్షన్ ఆఫీసరు.
పక్క ఫ్లాట్లో రైతుబజార్లో కూరగాయలు, పూలమ్ముకునే సయ్యద్ మిర్జా మార్కెట్టుకు వెళ్లటానికి సిద్ధమవుతున్నాడు. క్రిందటి వారం వానలకు చాలా నష్టపోయిన మిర్జా దానిని ఎలా పూడ్చాలి, పిల్లవాడి స్కూలు ఫీజులు ఎలా కట్టాలి అన్న దిగులుతో భారంగా బయలుదేరాడు. భార్య సల్మా నిండు గర్భిణి. అతి కష్టం మీద వాకిలి దాక వచ్చి భర్తకు ధైర్యం చెప్పి సాగనంపింది. సయ్యద్ తండ్రి షేక్ మిర్జా భార్య పోయి ఒంటరిగా ఉన్నాడు. ఉదయం నమాజ్‌కు సిద్ధమవుతున్నాడు. తాము చేసే ప్రార్థనలు తమ కుటుంబానికి ఏమి సహాయం చేస్తున్నాయని సల్మా ఆలోచన. కానీ బయట పడదు.
వీళ్లకు రెండు ఫ్లాట్ల అవతల శామ్యూల్, నీలం దంపతులు ఉంటారు. శామ్యూల్ కేరళ వాడు, నీలం ముంబై నుండి వచ్చి చెన్నైలో ఉద్యోగం చేస్తోంది. కొత్తగా పెళ్లయ్యింది. మతాంతర ప్రేమ వివాహం. ఇరువైపులా తల్లిదండ్రులు వీరి నిర్ణయంతో పిల్లలను దూరం చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. శామ్యూల్ ఛాందసం కల క్రైస్తవుడు. హిందువుల ప్రసాదాలు ఇస్తే తినడు. విగ్రహారాధనను ఘోరంగా దూషిస్తాడు. సమయం దొరికినప్పుడల్లా ఆ దంపతులిద్దరూ అక్కడి దగ్గర లోని క్రైస్తవ వృద్ధాశ్రమంలో తమ సేవను అందిస్తూ ఉంటారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు కావలసిన వస్తువులను ముందే సేకరించిన విరాళలతో కొనిపెట్టుకొని వారం వారం వెళ్లి ఇచ్చి వస్తారు.
సాయంత్రమైంది. చెన్నైలోని అన్నానగర్‌లోని ఈ అపార్టుమెంటు కాంప్లెక్సులో ప్రజలంతా కాసేపు మిగితావారితో గడుపుదామని తమ ఇళ్లలోనుండి బయటకు వచ్చారు. "అయ్యరు గారూ! మా వాడు మంచి మంచి పూలు తెస్తాడు మార్కెట్లో. మీ శేఖరన్ పూజకు తీసుకుంటారా? అలాగే, వాడు మంచి కూరలు తెస్తాడు తీసుకోండి" అని అడిగాడు షేక్ మిర్జా సీతారామన్ మరియు జానకమ్మాళ్ దంపతులను. "అబ్బే వద్దండీ" అని చెప్పి ముందుకు కదిలారు వారు. "ఏవిటండీ! వాడు మనలను పూలు తీసుకోమంటాడు. మహాపాపం కదా..." అంది జానకమ్మాళ్. "నిజమేనే. వదిలేసేయ్" అని వాకింగ్ చిన్నగా సాగించారు.
షేక్ మిర్జాకు నీలం ఎదురు పడింది. "అంకుల్! ఆదాబ్ అర్జ్ హై! రేపు శనివారం మన కాంప్లెక్సులో వృద్ధులకు ఉచిత రక్త పరీక్షలు, తరువాత ఫలహారం ఉంది. మీరు కూడా తప్పక రండి..." అని చెప్పింది. "పర్లేదు. మేము ఈ మధ్యనే పరీక్షలు చేయించుకున్నాము. అయినా అల్లా దయతో నాకేమీ కాదు" అని సందేహ పూర్వకంగా ముందుకు సాగాడు మిర్జా. మిర్జాకు మతాంతర వివాహాలంటే మహా ద్వేషం.
రాత్రి అయ్యే సరికి ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. సల్మాకు మళ్లీ దిగులు, భర్త సయ్యద్ పూలన్నీ పాడైపోతాయి. ఎలాగా అని ఆలోచనలో పడింది. ఈ వారం కూడా డబ్బులు రాకపోతే పస్తులే అనుకుంది. సయ్యద్ ఇంటికి రాలేదు. రాత్రి పది దాటింది. వాన కాస్తా కుంభవృష్టిగా మారింది. సల్మాకు దిగులు మొదలైంది. వస్తాడులేమ్మా అని షేక్ సర్ది చెప్పినా ఆయనకు కూడా లోపల గుబులు మొదలయ్యింది. దాదాపు పదకొండు గంటలకు సయ్యద్ తడిసిన పూల మూటలతో ఇంటికి చేరాడు. "రోడ్ల మీద మూడడుగుల నీళ్లున్నాయి. వాటిలో ఈ పూలను మోసుకుంటూ మధ్య మధ్యలో ఆగటం వలన ఆలస్యమైంది" అని చెప్పాడు.
"శేఖరన్ గారూ! ఉన్నారా! నీలం ఇంకా ఇంటికి రాలేదు. నేను తొందరగా వచ్చేశాను. బస్సు ఎక్కి రెండు గంటలైందిట. ఫోన్ స్విచాఫ్ వస్తోంది. పన్నెండున్నర అయ్యింది. ఏమి చెయ్యాలో తోచట్లేదు. కాస్త మీ సెక్రటేరియట్ కాంటాక్ట్స్ ద్వారా పోలీసులకు ఫోన్ చేయించండి"...శేఖరన్ ఫోన్ తీసుకోబోయాడు. జానకమ్మాళ్ లోపలనుండి పిలిచి ఆ "శామ్యూల్ మనింట్లోకి ఎందుకు వచ్చాడు. పంపించేసెయ్.." శామ్యూల్‌కు వినబడి వెనుదిరిగి వెళ్లిపోయాడు. శేఖరన్ తలదించుకున్నాడు.
రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. మధ్యలో కరెంటు పోయింది. వానకు సెల్లార్ నిండిపోయింది. ఈ అపర్టుమెంటు ఎత్తు మీద ఉన్నా నీళ్లు బాగా ప్రవహిస్తూ పైకి వస్తున్నాయి. సెల్ ఫోన్లు పనిచేయటం లేదు.
సీతారామన్ గారికి ఎడతెరపి లేని వానలకు ఆయాసం మొదలయ్యింది. గుండె చిక్కబట్టినట్లుగా ఉంది. గౌరి, జానకమ్మాళ్ గృహవైద్యం చిట్కాలన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఊపిరి అందటం లేదు ముసలాయనకు. భర్త పరిస్థితి చూసి జానకమ్మాళ్ స్పృహతప్పి పడిపోయింది. "ఏవండీ! మన పక్కింటి శామ్యూల్ దగ్గర వృద్ధులకు కావలసిన మందులు, అత్యవసర వస్తువులు ఉంటాయని మన సొసైటీ మీటింగులో చెప్పారు. మామయ్యగారి కోసం మందులు అడగండీ"...కాసేపటి క్రింద తాను శామ్యూల్‌కు చేసిన అవమానం శేఖరన్‌కు గుర్తుకు వచ్చింది. అడుగు బయటకు లోపలకు పడుతోంది. తప్పు చేశానన్న భావన ఒకవైపు, తండ్రి ప్రాణం మరో వైపు...ఆలోచనలలో గడప దగ్గర ఆగిపోయాడు.
సల్మాకు నొప్పులు మొదలయ్యాయి. క్రిందకు వెళ్లి దాక్టర్ దగ్గరకు వెళ్ళే పరిస్థితి లేదు. సయ్యద్‌ను దగ్గరకు పిలిచింది. "సునో మియా! మన పక్కింటి గౌరి నర్స్ ట్రైనింగ్ తీసుకున్నానని ఇది వరకు ఎప్పుడో చెప్పింది. కొంచెం పిలవండి." అని చెప్పింది. "బేటా! తుం రుకో. వో లోగొన్ సే హం మదత్ నహీ లేంగే. అల్లా సల్మా కా దేఖ్‌బాల్ కరేగా" అని ఉరిమాడు. సయ్యద్ తన అపార్టుమెంటు ద్వారం దగ్గర ఆగిపోయాడు.
రాత్రంతా నీలం ఇంటికి రాలేదు. సల్మా నొప్పులతో బాధ పడుతునే ఉంది. సీతారామన్ గారిది వచ్చే ప్రాణం పోయే ప్రాణంలా ఉంది. ఎవరి మతాలు వారి మానవత్వానికి అడ్డుగోడలు వేశాయి. తెల్లవారే సరికి సీతారామన్ గారి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. ఇంట్లో రోదన. శేఖరన్ మదిలో నిర్వేదం. బయట కుంభ వృష్టి, ఫోన్లు పనిచేయటం లేదు. విద్యుత్తు లేదు. ఇంట్లో తాగటానికి నీళ్లు అంతంత మాత్రం ఉన్నాయి. రోజూ బయట తింటారు కాబట్టి శామ్యూల్-నీలంల ఇంట్లో ఆహారం కూడా ఏమీ లెదు. శామ్యూల్ నీరసంతో గడప దగ్గర కూలబడి ఏడుస్తున్నాడు. కొద్ది దూరంలో సల్మా పురిటి నొప్పులు భరించలేక ఏడుపు.
జానకమ్మాళ్ భర్త శవం పక్కన రోదిస్తున్నా బయట నుండి సల్మా నొప్పులతో ఆర్తనాదాలు బిగ్గరగా వినబడుతున్నాయి. భారమైన హృదయంతో గడపదాకా వెళ్లింది. అక్కడ సల్మా కింద పడుకొని అటు ఇటూ దొర్లటం చూసింది. మతం పేరుతో మూసుకుపోయిన మానవత్వం కళ్లు భర్త మరణంతో తెరుచుకున్నాయి. "గౌరీ! వెంటనే వెళ్లు. పక్కింటి అమ్మాయికి సాయం చేయి. మనం అజ్ఞానంతో పోగొట్టుకున్నది చాలు" అని చెప్పింది. పక్కనే గడప దగ్గర కూలబడి ఉన్న శామ్యూల్ వైపు చూసింది. తిండి తినలేదని అర్థమయ్యింది. ఆ సాయంత్రం చేసిన నివేదన చేసి పాలు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి అన్నది గుర్తుకు వచ్చింది. వెంటనే పరుగు పరుగున వెళ్లి వాటిని తెచ్చి శామ్యూల్‌కు పెట్టింది. హిందువుల ప్రసాదం తినరాదన్న తన అజ్ఞానానికి ఏడ్చి ప్రభువే జానకమ్మాళ్ రూపంలో వచ్చినట్లుగా భావించి అవి తిన్నాడు.
వాన కురుస్తునే ఉంది. మనిషి రావటానికి పోవటానికి లేదు. సల్మాకు కానుపు దగ్గర పడింది. గౌరి సాయంతో ఇంట్లోనే ఆమె ఆడబిడ్డను కన్నది. సయ్యద్ ఊపిరి పీల్చుకున్నాడు. గౌరి ఇంట్లోకి వచ్చింది. పురిటి మైల లేదు మామగారు మరణించిన మైల లేదు..మానవత్వ పరిమళంతో ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. సీతారామన్ మరణించి నాలుగు గంటలయ్యింది. ఇంట్లోనుంచి బయటకు తెసుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో కూరలు లేవు. తన మత మౌఢ్యానికి చింతించిన షేక్ అడుగులు వేస్తూ సయ్యద్ దగ్గరకు వచ్చి "బేటా! బాజూ వాలే కే ఘర్ మే సబ్జీ నహి హై దిఖ్తా హై. జాకే యే సబ్జీ దో...." తండ్రి మాటలకు ఎంతో సంతోషించాడు సయ్యద్. పరుగు పరుగున శేఖరన్ ఇంటికి వెళ్లి కూరగాయలు ఇచ్చాడు. అతను వాటిని భార్యకు అందించాడు. గౌరిని తమ కుటుంబంతో పాటు సయ్యద్ కుటుంబానికి, శామ్యూల్‌కు వంట చేయమని చెప్పాడు.ఉన్న మంచి నీళ్లను జాగ్రత్తగా ఆ పది మంది ఎలా తాగాలో ఆలోచన చేసి అందరికీ తెలిపాడు.
వాన తగ్గట్లేదు. బయట ప్రపంచంతో మాట్లాడటానికి లేదు. తండ్రి శవం ఇంక పాడయ్యే సమయం వస్తోంది. ఆలోచనలో ఉన్న శేఖరన్ దగ్గరకు శామ్యూల్ వచ్చాడు. "సార్, దురదృష్టమో అదృష్టమో మా ఇంట్లో ఒక చెక్క పెట్టె ఉంది. అందులో నాన్న గారి శరీరాన్ని పెట్టి నా కారుపై పెట్టే ప్రయత్నం చేద్దాము." రెండో ఆలోచన లేకుండా శేఖరన్ అమ్మను అడిగాడు. ఆవిడ సరే అంది. కుటుంబమంతా ఆయన దేహానికి నమస్కారం చేసి అవే అంత్యక్రియలుగా భావించారు. శామ్యూల్ తన ఫ్లాట్ నుండి పెట్టెను తీసుకువచ్చాడు. దైవలీల ఎలా ఉంటుందో చూడండి. సీతారామన్ గారి శరీరం అందులో సరిగ్గా పట్టింది. దానిపై ఆయన వస్త్రాలను కప్పారు. సయ్యద్ తన వద్ద ఉన్న పూలన్నీ తీసుకు వచ్చి ఆయన శరీరంపై కప్పాడు. పెట్టెను మూసి సయ్యద్ ఒక పక్క, షేక్ ఒక పక్క, శేఖరన్ ఒక పక్క, శామ్యూల్ ఒక పక్క సీతారామన్ గారి శవం మోశారు.
జానకమ్మాళ్‌కు అక్కడ నలుగురు కుమారులు కనిపించారు. పైకి చూసి నమస్కారం చేసింది. అల్లా, రాముడు, జీసస్ అనుగ్రహించినట్లుగా అనిపించింది. నలుగురు మగవాళ్లు కలిసి పెట్టెను శామ్యూల్ బండిపై పెట్టి జోరువానలో తాడు వేసి కట్టారు. శామ్యూల్, శేఖరన్ బండిలో కూర్చుని స్టార్ట్ చేశారు. వాన నీటికి మునిగిన రోడ్లపై కారు తేలుతున్నట్లుగా ఉంది. ఒక కిలోమీటర్ దూరం పోగానే బండి ఆగిపోయింది గుంతలో ఇరుక్కుంది. శేఖరన్, శామ్యూల్ బండి దిగారు. గుండెలవరకు నీరు, పైన కుంభవృష్టి. నీటి ఉద్ధృతికి పెట్టె కొట్టుకుపోయింది. శామ్యూల్, శేఖరన్ ఏమీ చేయలేకపోయారు. అలా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పెట్టె ఒక ఎత్తైన ప్రదేశం దగ్గర ఆగింది. అక్కడ ఒక బస్ షెల్టర్ కింద వంద మంది ఉన్నారు. వారిలో నీలం కళ్లు మూసుకొని కూలబడి ఉంది. పెట్టె పెట్టె అని ఉన్నవారంతా అరిచారు. నీలం కళ్లు తెరిచింది. పెట్టెను అందరూ షెల్టర్ కిందికి చేర్చారు. తెరిచారు. నీలం సీతారామన్ గారి దేహాన్ని గుర్తు పట్టింది. నోటమాటరాలేదు. పెట్టెను కూడా గుర్తు పట్టింది. దానిని కాపాడాలని నిర్ణయించుకొని పక్కవారికి చెప్పింది. వరదల్లో గంటల తరబడి నిలబడి మానవత్వం అంటే ఏమిటో అప్పటికే బాగా అర్థమైన వారందరూ అంగీకరించారు.
దాదాపు ఏడు గంటల తరువాత వాన వెలిసింది. నీలం షెల్టర్ కింద ఉన్నవారి సాయంతో ఆ పెట్టెను స్మశానానికి తీసుకువెళ్లి అక్కడ కాపరికి చెప్పింది. శామ్యూల్, శేఖరన్లకు వార్త తెలిసి అక్కడికి రావటానికి చాలా సమయం పట్టింది. చివరకు వచ్చి శేఖరన్ తండ్రికి అంత్యక్రియలు చేశాడు.
ఇంటికి వచ్చిన శేఖరానికి తల్లి, భార్య ఎదురయ్యారు. శేఖరన్ అంతా వివరించాడు. మూడు కుటుంబాలు ఒక చోట చేరాయి.
"అమ్మా! ఆ రోజు వారి జీవనోపాధి కోసం నాన్నను పూలు కూరగాయలు తీసుకోమని చెప్పిన షేక్ గారిని మీరు తిరస్కరించారు. ఇంటికి సాయం కోరి వచ్చిన శామ్యూల్‌ను నేను అవమానించి, అతని దగ్గర వైద్య సదుపాయం ఉన్నా అహంకారంతో వెళ్లలేకపోయాను. చివరికి ఆ సయ్యద్ గారి పూలే నాన్నకు మాలలయ్యాయి. ఆ శామ్యూల్ ఇంటి పెట్టే నాన్న అంతిమ యాత్రకు తోడైంది....ఆ శామ్యూల్ గారి భార్యే నాన్న శరీరం నీళ్లపాలు కాకుండా నా ధర్మం నిర్వర్తించేలా చేసింది. మనం ఏమి నేర్చుకున్నాము, ఏమి పాటించాము ఆలోచించు"...
"శేఖరన్ గారు! నా అజ్ఞానంతో సయ్యద్‌ను మిమ్మల్ని సహాయం అడగవద్దని చెప్పాను. గౌరి గారు లేకపోతే మా కోడలు, మనవరాలు ఏమయ్యేవారు? మత దురహంకారం నా కళ్లను కప్పేసింది. అందుకే నీలంగారు నా మంచికోరి చెబితే వినలేదు. మీ అందరిలోని దైవత్వాన్ని గుర్తించ లేకపోయాను" అన్నారు షేక్.
"శేఖరన్ గారు! అందరమూ తప్పు చేశాము. ఇన్నాళ్లూ హిందూ మతంపై ద్వేషంతో మీరు దేవతలకు సమర్పించే నివేదనను నేను ఎన్నో మార్లు తిరస్కరించాను. కానీ, చివరకు అదే నా ప్రాణాలను కాపాడింది..మీకు తెలియదు. నాకు చిన్నతనంలోనే చక్కెర వ్యాధి వచ్చింది. ఇంకాసేపు ఏమీ తినకుండా ఉంటే నా పరిస్థితేమిటో ఊహించలేను. మీ అమ్మగారు నాకు ఇచ్చిన ఆహారం నా పాలిట అమృతం..." అన్నాడు శామ్యూల్.
"మామగారి ప్రార్థనలు ఎందుకు ఉపయోగం అని తిట్టుకునే దాన్ని. ఇంతటి వానలో నాకు అవసరానికి దేవతలా వచ్చి పురుడు పోసిన గౌరి గారు మామయ్య చేసిన ప్రార్థనలకు పరమాత్మ స్పందన..." మియాజీ! మామా గారు! మీరు అంగీకరిస్తే నా బిడ్డకు గౌరి ఇన్సానియత్ మిర్జా అని పేరు పెడతాను" అని సల్మా కన్నీళ్లతో గద్గద స్వరంతో చెప్పింది. సయ్యద్, షేక్ వెంటనే అంగీకరించారు. అందరూ వారి వారి పరమాత్మ స్వరూపాలకు నమస్కరించారు. అందరూ ఒకే భోజనం చేశారు.
అక్కడే మరణం, అక్కడే జననం, అక్కడే మతమనే గోడలు మానవత్వం ముందు విరిగి నేలకు ఒరిగాయి. అక్కడ శౌచము లేదు, శుచి లేదు, అక్కడ ఇతర విశ్వాసాల పట్ల ద్వేషం లేదు. అక్కడ పక్కవాడు నా శత్రువన్న అభద్రతా భావం లేదు. అక్కడ హింస లేదు. అక్కడ అశాంతి లేదు. అక్కడ బేలతనం లేదు. అక్కడ అబలలు లేరు. అందరిలోనూ పరమాత్మ తత్త్వం ప్రజ్జ్వలిస్తోంది. అక్కడే మనిషి జన్మకు సార్థకత ఏమిటో తెలిసింది. అక్కడే నవశకానికి నాంది పలికింది.
ఈ కథ చెన్నైలో గత నాలుగు రోజులుగా అత్యంత దయనీయమైన, కఠినమైన పరిస్థితులలో ప్రాణాలొడ్డి మానవత్వాన్ని పరిమళిస్తున్న వాలంటీర్లకు, మానవతా మూర్తులకు, భారతీయ సైన్యానికి అంకితం. జై హింద్.
కధ చదువుతంటే కళ్ళకు ప్రత్యక్షంగా కనిపించి గగుర్పొడిచింది. చాలా ఉదాత్తమయిన కధావస్తువును తీసికుని గొప్పగా చిత్రీకరించారు. అన్ని మతాల్ని సమంగా స్పృశించారు. మత మౌడ్యానికి మానవత్వమే విరుగుడని చూపించారు. మంచికో చెడ్డకొ మనుషుల్లో ఒచ్చిన ఈ మార్పు పెను ఉప్పెనలా మానవ సమాజమంతా వయాపించి వసుధైక కుటుంబం అవతరిస్తుందని ఆశిద్దాం. This story is a winner. Modesty apart,.if this is sent to some reputed magazine, it is sure to win many rewards and prizes for the promotion of religious tolerance and national intigrity. Coongrats Akkiraju Prasad garu for an excellent story nerration.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వదినా. అర్థంలేని అడ్డుగోడలు అని కష్టాలలోనే తెలిసేది అనిపించింది 3 రోజులనుండి.
రిప్లయితొలగించండిChala baga undi. Daivam manusha rupena antaru anduke mari
రిప్లయితొలగించండిఅవునండీ. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి