జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మ
శరణము కోరితినమ్మా భవాని
నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచి
జయమునీయవే అమ్మాభవాని
చలనచిత్రాలు ఎంత ప్రభావవంతమైన మాధ్యమాలో తెలుగు సినీ చరిత్రలోని స్వర్ణయుగాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అప్పట్లో ప్రతి చలన చిత్రంలోనూ ఒక భక్తిగీతం ఉండేది. తప్పకుండా సామాజిక స్పృహ ఉండేది. పాత్రలలో పవిత్రత ఉండేది. నర్తనశాల పౌరాణిక చలనచిత్రమైనా అందులో ద్రౌపది పాత్రకు భక్తిగీతాన్ని పొందుపరచాల్సిన అవసరం దర్శకునికి నిజంగా లేదు. కానీ, ఆ గీతం చిత్రానికి వన్నె తెచ్చింది. సావిత్రి గారి సినీయాత్రలో అది ఒక కలికితురాయిలా నిలిచింది.
భక్తి సంగీతం అంటే కేవలం వాగ్గేయకారుల కృతులే కాదూ, తాము కూడా ఏమీ తీసిపోము అన్నరీతిలో అప్పటి సినీ గేయ రచయితలు గీతాలు రాసేవారు. అటువంటిదే నర్తనశాల చిత్రంలోని జననీ శివకామిని అన్న గీతం. ఈ పాటను పరిశీలిద్దాం.
పాండవులు అరణ్యవాసం పూర్తై అజ్ఞాతవాసానికి విరాటరాజు కొలువులో మారువేషాలలో ఉండాలని నిర్ణయించుకొన్న తరువాత సైరంధ్రిగా పాంచాలి విరాటరాజు భార్య సుధేష్ణాదేవి వద్దకు వెళ్లే సందర్భంలో ఈ గీతాన్ని దర్శకులు పొందుపరచారు. దర్శకుల ప్రతిభ ఇలాంటి సందర్భాలలోనే తెలుస్తుంది. అప్పుడు ద్రౌపది మానసిక పరిస్థితి ఏమిటి? తమ అజ్ఞాతవాసం భంగమైతే మళ్లీ వనవాసం మొదలు. తనకు జరిగిన పరాభావానికి బదులు ఉండదు. భర్తలకు గౌరవం, రాజ్యం తిరిగిరాదు. ఇలా పరిపరి విధాల తలపులలో ఉన్న ద్రౌపదికి అమ్మవారి మందిరం కనిపిస్తుంది. ఆ అమ్మను ప్రార్థించే సన్నివేశంలోని గీతం ఇది.
మహాభారతంలోని విరాటపర్వం మొదలులో ధర్మరాజు తమ అజ్ఞాతవాస విజయానికి దుర్గాదేవిని కొలుస్తాడు. ఎంతో మహిమగల స్తోత్రం అంది. అలాగే ద్రౌపది అమ్మవారిని కొలిచినట్లు కూడా ఉంది. ఇక నర్తనశాల చిత్రానికి వస్తే, ఇది విరాటపర్వ నేపథ్యం.
ఈ గీతంలో రచయిత సముద్రాల రాఘవాచార్యులవారు భక్తిని, ఆర్తిని, శరణాగతిని సులభమైన పదాలలో తెలియజేశారు. శివకామిని అన్నపదం చిదంబరంలో శివుని రాణి అయిన శివకామసుందరినుండి వచ్చింది. ఆ అమ్మ ఎటువంటిది? జయమును, శుభమును కలిగించేది, విజయాని రూపం ఆ తల్లి. ఆ అమ్మ సకలలోకాలకు తల్లి. అమ్మలను గన్న అమ్మ. అటువంటి తల్లి పాదాలను నమ్మి శరణు కోరుతున్నాను అని పాంచాలి ప్రార్థిస్తుంది. ఆ అమ్మ దగ్గర ఉంటే భయాలు తొలగిపోతాయి. ఆ అమ్మ దయ ఉంటే జయాలు కలుగుతాయి. మాకు ఎల్లప్పుడూ నీడగా నిలిచి జయాన్ని ప్రసాదించు తల్లీ భావనీ అని వేడుకుంటుంది.
ఎంతటి శక్తిసంపన్నులైనా, ధర్మపరాయణులైనా పాండవులకు కష్టాలు తప్పలేదు. కానీ, వారు ఆ ధర్మాన్ని త్యజించలేదు. తాము నమ్ముకున్న దైవంపై విశ్వాసంతో ముందుకు సాగారు. ఆ ధర్మపరాయణత్వం వలనే వారికి సమస్త అస్త్రశస్త్రాలు, చీకటిలో వెలుగులు లభించాయి. ఆ పాండవుల ధర్మపరాయణతకు ఒక లక్షణం భక్తి. ఆ భక్తికి సూచిక ఈ పాంచాలిపై చిత్రీకరించబడిన గీతం.
పురాణాలలో పాత్రలు ఎంతో దివ్యత్వం కలిగినవైనా వారు కూడా దైవాన్ని ప్రార్థించటంలో ఉద్దేశం అన్నిటినీమించిన శక్తి గురించి మనకు తెలియజేయటం, ఎంతటివారికైన ఆపదలు, కష్టాలు కలుగుతాయి, వాటిని దైవానుగ్రహంతో దాటగలం అని చెప్పటానికి. మా గురువుగారు రమణరావుగారు ఎప్పుడూ చెబుతారు - "మనం చేసే ఉపాసన మనకు ఎండవానల్లో గొడుగులాగా రక్షణనిస్తుంది. పూర్తిగా తడువకుండా కాపాడుతుంది. దీనివలన మనం ఆ వర్షమనే అవరోధాన్ని దాటి ముందుకు వెళ్లగలం". అదే ఈ గీతం యొక్క ఉద్దేశం కూడా.
సముద్రాల రాఘవాచర్యుల వారు రాసిన ఈ గీతానికి సంగీత సరస్వతి సుసర్ల దక్షిణామూర్తిగారు సంగీతం అందించారు. మాధుర్యానికి, భక్తి భావానికి మారు రూపైన సుశీలమ్మ గారు ఈ పాటను పాడారు. అమ్మా అని పాట ఆరంభంలో ఆవిడ పాడిన ఆలాపన శిలలనైనా కరిగించేలా ఉంటుంది. భక్తివిశ్వాసాలకు ఈ గీతం నిలువుటద్దం. ఇక సావిత్రి గారి సంగతి చెప్పేదేముంది. పాటలోని భావానికి, పాత్రకు జీవం పోశారు. అందుకే నర్తనశాల చిత్రం ఇప్పటికీ సజీవంగా నిలిచింది. ఈ గీతం శాశ్వతమైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి