20, అక్టోబర్ 2015, మంగళవారం

జననీ నిను వినా - తంజావూరు సుబ్బరాయశాస్త్రి గారి రచన



అమ్మ వారి సంకీర్తనలలో ఒక ఆర్తి ఉంటుంది. అమ్మను వేడుకోవటం ఆమె అనుగ్రహించటం మనం నిత్యం చూసేదే. ఆ ఆదిపరాశక్తి కరుణామయి, దయామయి. ఆ భావనతోనే భక్తుడైన వాగ్గేయకారులు అమ్మను శరణాగతితో వేడుకున్నారు. ఆ తల్లి కనులలో కురిసే కరుణ, లాలన, బిడ్డ పట్ల గల వాత్సల్యం ఒక పక్క, మనలను భవసాగరాన్ని దాటించే శక్తిగా మరొక పక్క, మన కోరికలను తీర్చే వరదాయినిగా ఇంకో పక్క..ఇలా ఆ ఆదిపరాశక్తి వైభవాలను ఎంతో మనోజ్ఞంగా నుతించారు మన వాగ్గేయకారులు. అమ్మను నుతించిన ప్రతి వాగ్గేయకారుడూ అమ్మ ఉపాసకుడే. ఉపాసన త్రికరణ శుద్ధితో, భక్తి శ్రద్ధలతో, శరణాగతితో చేయనిదే అమ్మ వైభవం అందంగా సంకీర్తనలలో ఆవిష్కరించటం కుదరదు. సంగీత త్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి వారు పరదేవతను ఉపాసించి సిద్ధి పొందారు. ఆ శ్యామశాస్త్రి వారి కుమారులు సుబ్బరాయ శాస్త్రి గారు. ఆయన ఎక్కువ కృతులను రచించకపోయినా, మనకు అందుబాటులో ఉన్నవన్నీ ఆయన ఆధ్యాత్మిక సౌరభాన్ని తెలియజేస్తున్నాయి.

సుబ్బరాయశాస్త్రిగారు 1803వ సంవత్సరంలో తంజావూరులో శ్యామశాస్త్రి గారికి రెండవ కుమారునిగా జన్మించారు. చిన్నతనంలో తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నారు. శ్యామశాస్త్రి గారు కుమారుడికి సంగీతం నేర్పవలసిందిగా త్యాగరాజు వారిని అభ్యర్థించగా ఆయన అందుకు ఎంతో సంతోషించి శిష్యునిగా అంగీకరించారు. సుబ్బరాయశాస్త్రి గారు త్యాగరాజస్వామి వారి ప్రధాన శిష్యులలలో ఒకరిగా పేరొందారు. అటుతరువాత మళ్లీ తండ్రి వద్ద సంగీతాభ్యాసం చేశారు. ఆ సమయంలోనే తమ ఇంటి వెనుక ప్రాంతంలో ఉండే ముత్తుస్వామి దీక్షితుల వారి వద్ద కూడా సంగీతం నేర్చుకునే అవకాశం లభించింది. ఈ విధంగా సంగీత త్రయం వద్ద విద్యనభ్యసించే అరుదైన భాగ్యం సుబ్బరాయ శాస్త్రి గారికి మాత్రమే దక్కింది. ఆయన కర్ణాటక సంగీతమే కాకుండా హిందూస్థానీ కూడా నేర్చుకున్నారు. వయోలిన్ విద్వాంసులు కూడా. సుబ్బరాయశాస్త్రిగారు రాగభావానికి ప్రసిద్ధి. గురువులు త్యాగరాజస్వామి వారు ఈయన భక్తికి, రాగభావానికి ఎంతో ఆనందపడ్డారట. సుబ్బరాయశాస్త్రి గారి రచనలలో సంగీత త్రయం ఛాయలు కనిపిస్తాయి. ఈయన ముద్ర 'కుమార '. ఆయన చాలా కాలం తీర్థయాత్రలలోనే గడిపారు. చెన్నైలో నివసించారు. ఆయన సంగీత వారసత్వం వీణ ధనమ్మాళ్ మొదలైన వారి ద్వారా కొనసాగుతునే ఉంది. ఆయన రచించిన జననీ నినువినా అనే కృతిని ఈరోజు పరిశీలిద్దాం. ఈ కృతిలో ఆయన తండ్రి శ్యామశాస్త్రిలా భక్తి భావనను, పరదేవతతో అనుసంధానాన్ని, ఉపాసనా సాఫల్యాన్ని ప్రతిబింబింపజేశారు.

సాహిత్యం:

జననీ నిన్ను వినా అంబ జననీ నిను వినా త్రిలోక
జననీ నిను వినా దిక్కెవరమ్మా జగములోన గాన అంబా

మనసిజ మానస సమ్మోదిని
వినవే నా మనవిని విని నన్ను బ్రోవుము

వనజాయత నేత్రి కుమార జనని కామితదాత్రి
ఘన పాప లతాలవిత్రి సనకాది మునిజన సన్నుత పాత్రి

నిరవధిక సుఖ దాయకి యనుచు విని నిను చాల గొలిచితి
నిరతముగ తనయుని మొరలు విని నీవలెనె బ్రోచుటకు ఎవరికి
ధరలో వినుమా ఇది ఘనమా తరుణమిది కృపసలుపు దురుసుగ
సరసీరుహ లోచని సువాసిని తామసము సేయకనే బ్రోవుము

అర్థం:

ఓ మూడు లోకాలకు తల్లీ! అంబా! నీవు కాకుండా నాకు ఈ ప్రపంచములో బ్రోచుటకు దిక్కెవరు?

మన్మథునికి మోదాన్ని కలిగించిన తల్లీ! నా మనవిని విని నన్ను కాపాడు. కలువలవంటి కన్నులు గల అమ్మా! కుమారస్వామికి జననీ!  కోర్కేలను తీర్చే తల్లీ! పెనవేసుకున్న ఊడలవంటి పాపములను నాశనం చేసే తల్లీ! సనకాది మునులచే నుతించబడిన అమ్మా! అనంతమైన సుఖాలను ప్రసాదించే తల్లివని విను నిన్ను చాలా కొలిచితిని.  ఈ తనయుని మొరలు విని వేగముగా బ్రోచుటకు నీవు తప్ప ఈ భూమిపై ఎవ్వరు? నా మొరలు వినుము. ఆలస్యము తగదు తల్లీ! నీ కృపను కలిగించుటకు ఇది తగిన సమయము. బహుళముగా ప్రసాదించుము.  ఓ కలువలవంటి కన్నులు గల తల్లీ! శుభకరీ! నన్ను వెంటనే బ్రోవుము.

వివరణ:

సుబ్బరాయశాస్త్రిగారి ఈ రచనలో తండ్రి శ్యామశాస్త్రిగారి భావ జాలం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పరదేవతపై గల భక్తి విశ్వాసములు, ఆ తల్లితో ద్వైత భావంతో గల అనుబంధం, విన్నపాలు మొదలైనవి శ్యామశాస్త్రి గారి సాహిత్యంలో కోకొల్లలు. అదే రీతిన సుబ్బరాయశాస్త్రిగారు ఈ కీర్తనను రచించారు. సాహిత్యానికి రాగం ప్రాణం. అందుకే కరుణ, భక్తి రసాలను బాగా పండించే రీతిగౌళ రాగాన్ని ఆయన ఎంచుకున్నారు. శరణాగతి, ఆర్తి కలిగిన ఈ కీర్తన సాహిత్యానికి రీతిగౌళ రాగం ప్రాణప్రతిష్ఠ చేసి శాశ్వతత్వాన్ని ప్రసాదించింది.

ఈ కృతిలో వాగ్గేయకారుని భాషా పటిమ,  భక్తి సువాసన పదప్రయోగంలో విదితం. మనసిజ మానస సమ్మోదిని...ఇదేంటి అమ్మవారు మన్మథునికి మోదం ఎలా కలిగించింది అన్న ప్రశ్న కలుగవచ్చు. మన్మథుని బూడిద చేసింది శివుడైతే దేహంలేని రూపాన్ని ఇచ్చింది పార్వతి. ఆ విధంగా మన్మథునికి ఆనందం కలిగించింది అమ్మ. చరణంలో పదప్రయోగం గమనించండి - వనజాయత నేత్రి కుమారజననీ కామితదాత్రి ఘనపాపలతాలవిత్రీ...ఇందులో శాస్త్రులుగారి సాహిత్యం తెలుగు తెలుగు సంస్కృత భాషా పాండిత్యాన్ని చాటుతుంది. ఘనపాపలతాలవిత్రి అట అమ్మ...మర్రి ఊడలను ఎప్పుడైన చూశారా? పెనవేసుకుని విడదీయలేకుండా, త్రెంచటానికి అలవికాకుండా ఉంటాయి. మన పాపసంచయం కూడ అటువంటిది అని అద్భుతంగా పోల్చారు వాగ్గేయకారులు. అటువంటి పాపాలను కూడా నాశనం చేసే తల్లిగా అమ్మను అభివర్ణించారు. చిట్టస్వర సాహిత్యంలో ఆయన తెలుగుభాషా సౌందర్యాన్ని మనకు అందించారు. ఈ నాలుగు పంక్తులలో అమ్మను ఒక తనయుడు అడిగినట్లే ఆ ఆదిపరాశక్తిని వేడుకునే సాహిత్యాన్ని ఆవిష్కరించారు. అమ్మను తామసము చేయక బ్రోవుము అని అడగటం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. చిన్నపిల్లవాడు అమ్మతో ఎప్పుడూ ఒకేలా మాట్లాడడు. మధ్యలో నిష్ఠూరము, ఆత్రుత, ఒకింత అలుక...అన్నీ ప్రదర్శిస్తాడు. అదే విధంగా వేర్వేరు భావనలను సుబ్బరాయశాస్త్రిగారు ఈ సాహిత్యంలో మనకు అందించారు. ఇది ఒకింత మధురభక్తికి దగ్గరగా ఉంటుంది. అన్నమాచార్యులు, శ్యామశాస్త్రి ఈ సాహితీ లక్షణాలకు పితామహులు. ఈ ఒక్క కృతి చాలు సుబ్బరాయశాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని తెలుపటానికి. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

ఈ కృతి ఎందరో పాడారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి పాడినది బాగుంటుంది. ఇటీవలి చారులత మణి గారు ఆలపించింది ఉచ్ఛారణలో స్పష్టంగా అనిపించింది. మాధుర్యత కొంత లోపించినా, సాహిత్యం యొక్క గొప్పతనం కోసం ఈ వీడియోను ఎంచుకున్నాను. మహారాజపురం సంతానం వారిది రాగాలపనతో కూడినది, ఉచ్ఛారణలో స్పష్టత లేదు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి