RightClickBlocker

29, అక్టోబర్ 2015, గురువారం

సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినానుసాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను 
సదానంద వార్నిధిలో సదా డోలలూగినాను

హరే రామ హరే కృష్ణ హరే సాయి హరే హరే 
భజే సాయి శాంతిదాయి సత్యసాయి హరే హరే

మనసులోన భక్తిసుధా మధురిమలే నిలిపినాను 
కనులలోన కాంతి ప్రభా కవిత జ్యోతి నిలిపినాను
ఆరాధన పూర్వకముగ అనవరతము కొలిచినాను
తనివారగ దరిశించి తరియించెద స్వామి నేడు

హృదయ పథములో నిరతము పదయుగమును నిలిపినాను
భావవీథిలో సతతము సేవసేయ తలచినాను
ఆవేదన పొంగగ నను ఆదుకొనగ వేడినాను
పరమాద్భుత మహిమాన్విత కరుణ కోరినాను నేడు

త్రేతాయుగమందు వెలయు సీతాపతి నీవుకదా
ద్వాపరమ్ములోన వెలుగు గోపాలుడు నీవు కదా
ఈ కలికాలమున అవతరించిన సాయీవి కదా
పర్తివాస పరమపురుష పరమాద్భుత నీవె కదా

ఆశ్రిత జన కోటికెల్ల అభయమొసగు దాత నీవు
నామకీర్తన మురియు నారాయణమూర్తి నీవు
లీలా మానుష దేహుడు బోళా శంకరుడు నీవు
త్రిమూర్త్యాత్మ రూపుడవు దీనబాంధవుడవు నీవుగురువు సనాతన ధర్మంలోని అతిముఖ్యమైన కోణం. అదే దీని విశిష్టత. సాధకుడు అడవిలో దిక్సూచి/పటం లేకుండా వెదికే యాత్రికుడైతే గురువు ఆతనికి దిక్సూచి/పటం చూపించి మార్గనిర్దేశకం చేసేవాడు. చీకటిలో వెలుగును చూపే జ్ఞానజ్యోతి. కారడవిలో తప్పిపోయిన వ్యక్తికి లాంతరుతో వచ్చి దారిచూపేవాడు గురువు. అలా సద్గురువుగా వచ్చిన దత్తావతారుడు షిర్డీ సాయి. ఆయన సమాధి తరువాత 8 ఏళ్లకు తదుపరి అవతారంగా పుట్టపర్తిలో జన్మించారు సత్యసాయిబాబా. ఒకరా ఇద్దరా? ఒక ఊరా ఒక జిల్లానా? దేశదేశాలలో కోట్లాది మందికి ఆరాధ్యదైవమైనారు. ప్రేమ, సేవలకు ప్రతిరూపమై నిలిచారు. సత్యసాయి భక్తులలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు, సమాజం పట్ల సేవా తత్పరత. ఆ సత్యసాయిబాబా గురించి సాయికృష్ణ యాచేంద్ర గారు ఎంతో ఆరాధనా భావంతో ఈ గీతాన్ని రచించారు.

ఒక మహనీయునితో అనుబంధం వారి పట్ల ఎంతటి ఉత్తమమైన భావవీచికలను కలిగిస్తుందన్నదానికి ఈ గీతం మంచి ఉదాహరణ. సమస్త దేవతలను సాయిలోనే చూశారు రచయిత. భక్తికి ప్రతిస్పందన భావం సౌందర్యం. భావం రచయిత అంతఃకరణాన్ని సూచిస్తుంది. ఈ గీతంలో సాయికృష్ణ గారు తన సాయి భక్తి ఔన్నత్యాన్ని చాటారు.

నమ్మిన దైవం పాదాల వద్దకు చేరితే అది శాశ్వతానందమనే సముద్రమే కదా? సాయి పదముల వద్దకు చేరినపుడు ఆనందసాగరంలో తేలియాడుతున్నట్లు రచయిత అనుభూతి చెందారు. సాయినే రామునిగా కృష్ణునిగా నుతించారు. శాంతి ప్రదాతగా సత్యసాయిని ప్రస్తుతించారు. మనసులో భక్తిని, కనులలో కాంతులను నిలుపుకొని ఎల్లప్పుడూ ఆయనను కొలిచిన భక్తుడు తనివితీరా దర్శించి తరియించే తరుణంలో ఈ గీతం వెల్లువై పొంగింది. హృదయములో స్వామి పాదాలను నిలిపి, నిరంతర సేవా తత్పరతను భావములో నిలిపి, అవేదన పొంగగా, ఆదుకోమని వేడుకొంటూ, పరమాద్భుతమైన మహిమ కల, కరుణామయుడైన సాయిని ప్రస్తుతించే  భావం సుమం ఈ గీతం. రాముడిగా, కృష్ణుడిగా అవతరించ పరమాత్మ ఈ కలికాలంలో పుట్టపర్తిలో సాయిగా వెలసినాడని, ఆ సాయిని పరమాద్భుతమైన పరమపురుషునిగా నుతిస్తుంది ఈ గీతం. తనను ఆశ్రయించిన వారిని ఆదుకునే దాతగా, నామకీర్తనలో నిరంతరం మురిసే నారాయణునిగా, తన లీలగా మనిషి రూపాన్ని ధరించిన శివునిగా, త్రిమూర్తుల రూపంగా, దీనులకు బంధువుగా కీర్తించే గీతం ఇది.

ఒక మహనీయుడిని, అవతార పురుషుడిని ఇంత భావసంపదతో నుతించే గీతాలు చాలా అరుదు. సాయి కృష్ణ యాచేంద్ర గారు ఇటువంటి గీతాలు ఎన్నో రాశారు. సాయి భక్తి పూర్తిగా ఒంటబట్టితే తప్ప ఇలాంటి గీతాలు ప్రకటితం కావు. శరణాగతి, భక్తి, నమ్మకం, ఆనందం అన్నీ కలిస్తేనే గుణవైభవ వర్ణన సరైన పదాలతో ముత్యాల వరుసలా ఆవిష్కరించబడేది. సాయి భక్తులలో ఇటువంటి లోతైన భావనలకు కారణం వారికి స్వామితో గల వ్యక్తిగత అనుభూతులు. స్వామి కొందరికి రోగాలను నయం చేస్తే, కొందరికి సన్మార్గం చూపించారు. కొందరికి ప్రేమతో సాంత్వన కలిగిస్తే కొందరికో వ్యంగ్యంతో అహంకారాన్ని అణచారు. నీరులేని ఎడారి గ్రామాలకు నీటిని అందించి దీనబంధువైనారు. విలువలతో కూడిన విద్యను అందించి బ్రహ్మజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఉచితవైద్యం అందించి పేదలకు ప్రాణాలు పోశారు. ఇవన్నీ అద్భుతాలే. కేవలం స్వామి సంకల్పంతో, శక్తితో జరిగిన పనులే. గురువుగా, దైవంగా, తల్లిగా, తండ్రిగా వేర్వేరు పాత్రలను పోషించి స్వామి తన భక్తులకు సర్వం అయినారు. అందుకే వారికి స్వామిపై అంత ఆరాధనా భావం. అటువంటి భావంతోనే సాయికృష్ణ గారు ఈ గీతాన్ని రచించారు. అందుకే మహత్తరంగా ప్రచోదనమైంది.

సత్యసాయి అనగానే గుర్తుకు వచ్చేది ఆయన ప్రేమ, కరుణ, వాత్సల్యం, ఆయన స్థాపించిన సంస్థలలో సేవాతత్పరత, భజనలు, క్రమశిక్షణ, వినమ్రత. ఇవన్నీ ఈ గీతంలో మనకు పుష్కలంగా గోచరిస్తాయి. స్వామి యొక్క అత్యద్భుతమైన లీలగా నాకు అనిపించేది ఆయన శిష్యకోటి. ప్రపంచవ్యాప్తంగా సాయి సిద్ధి పొందిన నాలుగేళ్ల తరువాత కూడా కార్యక్రమాలు స్వామి ఉన్నప్పుడు ఎలా జరిగాయో అలాగే జరుగుతున్నాయి. మీడియా ఎంత బురద జల్ల ప్రయత్నించినా, ఎన్ని వ్యతిరేక శక్తులు దాడులు చేసినా, సంఘటితమైన శిష్యగణం స్వామి ఆరంభించిన అద్భుతమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తునే ఉన్నారు. కులమతాలకు అతీతంగా లక్షలమంది వాలంటీర్లు ఈ సేవలో తరిస్తునే ఉన్నారు. ఒక వ్యక్తి ప్రపంచాన్ని సైతం మార్చగలడు అన్నదానికి  మనకళ్లముందటి సత్య సాయి అవతారమే ప్రమాణం. సాయికృష్ణ యాచేంద్ర గారి గీతం వీటన్నిటికీ సాక్షి.

ఈ గీతాన్ని షణ్ముఖ ప్రియ, హరిప్రియ గార్ల గానంలో వినండి.

2 వ్యాఖ్యలు:

  1. సాయిని భగవంతునిగా కొలిచే ఒక భక్తురాలిగా, కవి యొక్క భక్తి పూరిత హృదయ భాష నేనర్ధం చేసుకోగలను. రాం, రహీం, అల్లా, యేసు, బుద్ధ, జోరాష్టర్, కృష్ణ అన్నీ ఆయనై భక్తులను అలరించారు బాబా. ఆయన మహిమలతో భక్తులకు పని లేదు. ఆయన చూపిన సేవా మార్గమే వారికి స్వర్గ పధము. షణ్ముఖ ప్రియ, హరి ప్రియలు స్వామికి అత్యంత ప్రయతమ గాయనీ మణులు. వారి గళంలో యాచేంద్ర గారి సాహిత్యం మనని భక్తి పరవశుల్ని చేస్తుంది. మంచి గీతాన్ని అందించిన ప్రసాద్ గారు అభినందనీయులు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. సత్యసాయి భక్తిలో ప్రత్యేకత ఉంది కదా! ప్రేమ, శాంతితో కూడినది ఆయన మార్గం. చివరి చూపు దక్కించాడు స్వామి. అదే నాకు పదివేలు.

    ప్రత్యుత్తరంతొలగించు