14, అక్టోబర్ 2015, బుధవారం

ధైర్య కాత్యాయని - అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ


"వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం..."

అని లక్షీ అష్టోత్తర శతనామావళి శ్రావ్యంగా పూజగది నుండి వినబడుతోంది. పాత చెక్క పూజ మందిరం, దానిలో వంశపారంపర్యంగా వచ్చిన దేవీ పంచాయతనం, మధ్యలో అమ్మ వారు. స్ఫటిక లింగం, మిగిలినవి పంచలోహ విగ్రహాలు, అంగుష్టమాత్రం కన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయి. చక్కగా ఎర్రని మందారాలు, తెల్లని నంది వర్ధనాలు ఆ పంచాయతన దేవతామూర్తులకు అలంకరించబడి ఉన్నాయి. చూచిన వారికి పవిత్రమైన భావన. మందిరం ముందు కాత్యాయని ఆకుపచ్చని చీర కట్టి భక్తితో అమ్మను కొలుస్తోంది. భక్తురాలి ప్రార్థనలను ఎదురుగా ఆ అమ్మలగన్న అమ్మ శ్రద్ధగా ఆలకిస్తోందా అన్నట్లు ప్రశాంతంగా దివ్యంగా ఉంది వాతావరణం. కాత్యాయని కంట నీరు. "అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే" అని ఆర్తితో పాడుతోంది.

పరుగు పరుగున ఏడేళ్ల సర్వజ్ఞ దేవుడి మందిరంలోకి వచ్చి తల్లి ఒడిలో వాలింది. అమ్మా అమ్మా అని తల్లి గడ్డం పట్టుకొని లాగింది. తల్లి తలతిప్పి చూసింది. ఆమె కళ్లలో నీటిని చూసి పిల్ల దిగాలుగా చూసింది. ఇంతలో కాత్యాయని తమాయించుకొని పిల్లను దగ్గరకు తీసుకొని ముద్దాడింది..."నా బంగారు తల్లీ! అమ్మా సర్వజ్ఞా! ఆ గౌరి అనుగ్రహంతో నాకు పుట్టావు..." అని హత్తుకొంది. తల్లి ప్రేమకు కరిగి కిల కిల నవ్వింది సర్వజ్ఞ.

"వినబడుతోందా లేదా! కాఫీ అని గంటనుండి గొంతు చించుకుంటున్నాను. నీ పూజలే కానీ మొగుడంటే పట్టదు. అంతే, ఉద్యోగం లేదు కదా అని అలుసు..." పడక గదిలోనుండి తిట్ల దండకం మొదలైంది. చటుక్కున లేచి వెళ్లి అరుస్తున్న భర్త సూర్యం ముందు నిలబడింది కాత్యాయని. కళ్లెర్ర చేసి ఉగ్ర రూపంలో ఊగిపోతున్నాడు. "నేనూ సంపాయిస్తాను, నాకు కుడా మంచి రోజులోస్తాయి చూడు" అని ఛర్రున లేచి బాత్రూంలోకి వెళ్లాడు. బయటకు రాగానే కాఫీ అని అందించబోయింది. విసిరి కొట్టాడు. జుట్టు పట్టుకొని కొట్టబోయాడు. బిక్కపోయి సర్వజ్ఞ తల్లిని తండ్రి బారినుండి తప్పించాలని ప్రయత్నించింది. పసిపిల్ల అన్న జ్ఞానం లేకుండా చెంప ఛెళ్లుమనిపించాడు. గుక్కపెట్టకుండా ఏడ్వటం మొదలు పెట్టింది. భర్తవైపు అసహ్యంగా చూసి పిల్లను తీసుకొని అక్కడినుండి వెళ్లిపోయింది. ఆలోచనలు గతంలోకి వెళ్లాయి.

తల్లిదండ్రుల బీదరికానికి తలవంచి 18 ఏళ్ల వయసులోనే తన అందం చూసి మోజు పడ్డ సూర్యంతో వివాహానికి కాత్యాయని అంగీకరించింది. అప్పటికి డిగ్రీ మొదటి సంవత్సరమే. స్నేహితులందరూ ప్రశ్నించినా తండ్రికి ఆర్థిక వెసులుబాటు లేదు, వెనుక ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు అన్న ఆలోచనతో గృహిణి అయ్యింది. వివాహ సమయంలో మంచి ఉద్యోగం ఉన్న సూర్యం తన అహంకారంతో తోటి  ఉద్యోగులతో, యాజమాన్యంతో చీటికి మాటికి పోట్లాటలు తెచ్చుకునే వాడు. సహనం తక్కువ అతనికి. తెలివి ఉన్నా నలుగురితో పనిచేసే చాకచక్యం లేకపోవడంతో ఉద్యోగం ఊడిపోయింది. ఇలా 2-3 ఉద్యోగాలు అయిన తరువాత ఇక ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. ఇంతలో సర్వజ్ఞ పుట్టింది. కాత్యాయని భర్త పరిస్థితి గ్రహించి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయాలని సంకల్పించింది. పరీక్షలలలో మంచి మార్కులు సంపాయించి ఒక ప్రైవేట్ సంస్థలో రిసెప్షనిష్టుగా పనిచేస్తోంది. భార్య ఉద్యోగం, తన నిరుద్యోగం, కష్టపడలేని మనస్తత్త్వం సూర్యాన్ని మృగంగా మార్చాయి. భార్య నలుగురితో మాట్లాడటం భరించలేకపోయేవాడు. తను ఇంట్లో ఒంటరిగా ఉండలేక బయట తిరుగుళ్లకు అలవాటయ్యాడు. తాగుడు, సిగరెట్లు, వాటికి డబ్బుకోసం భార్యను వేధించటం. అంతంత జీతం, సంసారం గడవటమే కష్టంగా ఉండటంతో కాత్యాయని డబ్బు నిరాకరించేది. అంతే కాదు, ఆ చెడు అలవాట్లంటే ఆమెకు అసహ్యం. అరుపులు కాస్తా కొట్టటం, బూతులు తిట్టటం వరకు వెళ్లాయి.

గతంలోనుండి వర్తమానంలోకి వచ్చింది కాత్యాయని. నవరాత్రులు చిన్నప్పటినుండి చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోవటం ఆమెకు అలవాటు. ఈ సంవత్సరం కూడా అలాగే ఎన్ని కష్టాలున్నా అమ్మను కొలుస్తోంది. ఎంతో జాగ్రత్తగా కూడబెట్టుకున్న డబ్బుతో పిల్లను చదివిస్తోంది.

"నాకు 1000 రూపాయలు కావాలి.స్నేహితులతో బయటకు వెళ్లాలి"...సూర్యం అరిచాడు. ఆలోచనలనుండి బయట పడింది కాత్యాయని. "నా దగ్గరలేవు. ఇంకో వారంలో పిల్లకు టర్మ్ ఫీజు కట్టాలి" అంది. అంతే. ఉగ్రరాక్షసుడైనాడు సూర్యం. "మొగుడికి డబ్బు లేదు కానీ, దీని చదువుకు ఉన్నాయి. ఇది చదవకపోతే మనకు నష్టమేమీ లేదు...." అని కాత్యాయనిని కొట్టాడు. ఈడ్చుకుంటూ బజారులోకి తీసుకెళ్లాడు. పిల్ల ఏడ్చుకుంటూ ఇరుగుపొరుగు వారిని సాయం కోరింది. అందరూ మౌనంగా చూశారు తప్ప ముందడుగు వేయలేదు. వీధిలో ముడి వీడిన జుట్టుతో, దుఃఖంతో, కోపంతో కాత్యాయని చూస్తోంది. సూర్యం కాలు ఎత్తి తన్నబోయాడు.

"ఒరేయ్ సూర్యం!". అరుపు విని ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా కర్రతీసుకొని వడి వడిగా తన వైపు వస్తున్న సుబ్బమ్మ. తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్యం. దగ్గరకు వచ్చి "ఒరేయ్! నువ్వు మనిషివా! రాక్షసుడివా! బంగారంలాంటి పిల్లను తెచ్చి పెళ్లి చేస్తే బాధ్యత లేకుండా ఇలా బజారుకీడుస్తావా? ఇంకొక్క అడుగు ముందుకు వేశావో...నీ ప్రాణాలు నీకు దక్కవు" అని కర్ర ఎత్తింది. అంతే, వెనుకడుగు వేశాడు.

సుబ్బమ్మ వినోదంగా చూస్తున్న అందరినీ ఒక్కసారి అసహ్యంగా చూసి, కాత్యాయని దగ్గరకు వెళ్లి గంభీరంగా పలికింది. "అమ్మా కాత్యాయనీ! నీలో భయాన్ని పారద్రోలు. మనిషికి కావలసిన కనీసపు అవసరాలను తీర్చలేను భర్త నా కొడుకు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. సంసారం నడుపుతోందన్న ఇంగిత జ్ఞానం లేక మృగంలా ప్రవర్తిస్తున్నాడు వీడు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని, నీ మానసిక ఆనందాన్ని కోల్పోయి నిస్సహాయగా ఉండవద్దు. ఎదురు తిరుగు. నిర్భయవై ముందడుగు వేయి. పెళ్లి సంసారం కన్నా నీ ప్రాణం ముఖ్యం. నీ ఆత్మ గౌరవం ముఖ్యం" అని సెల్ ఫోన్ తీసి పోలీస్ కమీషనరుకు ఫోన్ చేయించింది. ఐదు నిమిషాల్లో పోలీసులు వచ్చి సూర్యాన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. గృహహింస చట్టం కింద సూర్యాన్ని విచారించవలసిందిగా స్వయంగా సుబ్బమ్మ అర్జీ రాసి ఇచ్చింది.

ఇంటికి వచ్చి కాత్యాయనిని, పిల్లను దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది. "స్త్రీకి సహనం పురుషుడి గుణాన్ని బట్టి ఉండాలి. ఎప్పుడైతే పురుషుడు తన ధర్మాన్ని మరచి, తన బాధ్యతను విడిచి ఇలా ప్రవర్తిస్తాడో స్త్రీ చూపించాల్సింది సహనం కాదు. ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడి జీవించాలి అన్న దృక్పథం. నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తున్నావు కదా? దానిలో నీకు అర్థమయ్యింది ఏమిటి? భర్త అంటే అమితమైన ప్రేమానురాగాలు కల మహాలక్ష్మి, తన భర్తలో అర్థ దేహమైన పార్వతి, నిరంతరం భర్తకు ఆనందం కలిగించే సరస్వతి, ముగ్గురూ కలసి ప్రపంచాన్ని పీడుస్తున్న రాక్షసుడిని చంపటానికి ఉగ్ర దుర్గగా అవతరించారు. ప్రేమ, శాంతము, వాత్సల్యము, కరుణ కలిగిన ఆ ముగ్గురు అమ్మలు ఈ విధంగా అవతరించటానికి కారణం ఎదురుగా ఉన్న సమస్య. లోకరక్షణ కోసం వారి తమ శక్తులను ఏకీకృతం చేసి ఆది పరాశక్తిగా అవతరించి మహిషుడిని సంహరించారు. నీలోని ఓర్పు, సహనం, శాంతం వాడి బాధ్యత విస్మరించినప్పుడే వదిలివేయాలి. భర్త ఎన్ని హింసలు పెట్టినా భరించాలి అన్నది కాదు పాతివ్రత్యం అంటే. సమయానుగుణంగా, పరిస్థితులను బట్టి స్త్రీ వేర్వేరు రూపాలను ధరించాలి. ధర్మం తప్పి మతిభ్రంశుడైన సూర్యం నీ శాంతం, ఓర్పుతో మారడు. వాడికి కావలసింది శిక్ష. శిక్ష ద్వారా మార్పు. మార్పు ద్వారా భార్య యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవటం. అప్పుడే వాడు మళ్లీ నీకు భర్తగా ఉండటానికి అర్హుడు..."

ఏడేళ్ల సర్వజ్ఞ, ఇరవై ఆరు ఏళ్ల కాత్యాయని డెబ్భై ఏళ్ల సుబ్బమ్మలో జ్ఞానజ్యోతిని దర్శించారు. సాంత్వన పొందారు. స్ఫూర్తితో ధైర్యంగా నిలబడ్డారు.

విజయదశమి సాయంత్రం. ప్రక్కనే కనకదుర్గమ్మ దేవస్థానం. అమ్మ ముంగిట నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదట బాల త్రిపుర సుందరిగా ఏడేళ్ల పాప అద్భుతమైన నాట్య విన్యాసం చేసింది. అనంతరం "ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయురీం ఆర్యాం అంతర్విభావాయేత్ గౌరీం" అన్న శ్లోకం మొదలైంది. ఎదురుగా ఎరుపు రంగ పట్టు చీర కూచిపూడి శైలితో ధరించింది కళాకరిణి. సిగలో ఎర్రని కనకాంబరాల మాల, నుదుట ఎర్రని కుంకుమ బొట్టు, సర్వాభరణాలు ధరించి అమ్మవారిని తలపించింది. ముగురమ్మల లక్షణాలను వివరించే "అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ" అని పాట మొదలైంది.

ఎదురుగా ఉన్న పెద్దముత్తైదువకు నమస్కారం చేసి కళాకారిణి నాట్యం ఆరంభించింది. ముందు గౌరిగా, శంకరుని అర్థ భాగంగా, భగవతిగా శాంకరి రూపాన్ని ఆవిష్కరించింది. తరువాత శ్రీహరి ప్రణయరాశిగా, స్వామి పాదములొత్తే ఆదిలక్ష్మిగా, అష్టలక్ష్ముల రూపాలను మనోజ్ఞంగా ప్రదర్శించింది.చంద్రబింబము వంటి ముఖం కలిగి, బంగారు మేని ఛయతో వీణా పుస్తకములు ధరించి చతుర్ముఖ బ్రహ్మను అలరిస్తున్న సాహితీ సంగీత రూపిణి శారదగా అద్భుతమైన నర్తన చేసింది. తరువాత పతాక సన్నివేశంలో ఆది పరాశక్తిగా నడచి వచ్చింది. సమస్త శక్తులకు మూలమై, కేశములు  ముడి వేయకుండా, త్రిశూల ధారియై, అస్త్ర శస్త్రములతో, త్రిమూర్తులు, ముగురమ్మల శక్తి సంహితయై కాళరూపిణియై మహిషుని సంహరించే దుర్గగా రోమాంచకముగా నర్తించింది. ముగింపుగా మహిషాసుర మర్దన స్తోత్రం సామూహిక నృత్యంగా ప్రదర్శించబడింది.

మొత్తం ప్రదర్శనలో ప్రతి కదలికలోనూ కళాకారిణి ఆత్మ స్థైర్యంతో భక్తితో దేవీమహాత్మ్యాన్ని ప్రేక్షకుల మనసుల్లో నిలిపింది. సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. ఉత్సవ నిర్వాహకులు కళాకారిణిని అభినందిస్తూ "శ్రీమతి కాత్యాయని నేడు మనకు దుర్గమ్మ అంటే ఇలా ఉంటుంది అన్న భావనను కలిగించారు. నాట్య ప్రతిభే కాకుండా సాహిత్యంలో లీనమై ఆయా రూపాలను భావ సౌందర్యంతో ప్రదర్శించారు. అలాగే బాలా త్రిపుర సుందరిగా కుమారి సర్వజ్ఞ ఎంతో సుందరమైన ప్రదర్శన ఇచ్చింది. వారికి మన కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉణ్డాలి. దేవస్థానం పక్షాన వారికి శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు" అని పలికారు. తరువాత కాత్యాయని మాట్లాడింది.

"నేను చిన్నప్పటినుండీ నాట్య సంగీత శాస్త్రాల అభ్యసించేటప్పుడు దేవీ తత్త్వమంతే ఇష్టపడే దాన్ని. కానీ, నిజ జీవితానికి వచ్చేసరి నా వ్యక్తిత్వ వికాసంలో ఆ తత్త్వాన్ని పూర్తిగా అమలుపరచలేకపోయాను. నా జీవితంలో పెళ్లి అనేది ఒక పీడకలగా మిగిల్చింది నాలోని భయం. ఓర్పుగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని భావించాను. కానీ, ఈ నాటి సమాజంలో ఉన్న మృగాళ్ల పాలిటి కావలసింది ఓర్పు కాదు. ధైర్యం, సాహసం, జీవితం పట్ల సకారాత్మకమైన ధోరణి. ఈ విషయాన్ని నా నిస్సహాయ స్థితిలో మా అత్తగారు నాకు తెలియజేశారు. కన్నబిడ్డ అన్న మమకారాన్ని వదలి ఆవిడ నన్ను స్త్రీగా గౌరవించి, కఠినమైన నిర్ణయం తీసుకొని నన్ను ముందుకు నడిపించారు. ఇది నాకు నిజంగా విజయదశమి. నిర్భయ రూపాన్ని నేను మా అత్తగారిలో చూశాను. నేటి సమాజంలో స్త్రీల పట్ల హింస అత్యాచారాలు స్త్రీ తన శక్తిని గ్రహించకపోవటం వలన పేట్రేగిపోతున్నాయి. ప్రతి స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడి సమస్యను ఎదుర్కుంటే మృగంలాంటి మగవాడు వెనుకంజ వేస్తాడు. శారీరికంగా మగవాడు బలవంతుడైన మన మనసు గట్టిగా ఉంటే ఆతని శరీరబలాన్ని తప్పక జయించగలం. మన ఆడపిల్లలకు ఓర్పు, సహనం, శాంతం, ప్రేమలతో పాటు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. నా ఈ విజయదశమి ప్రదర్శనకు స్ఫూర్తి మా అత్తగారు. ఆవిడలోని ఆదిపరాశక్తిక్తి నా నమస్కారాలు. అత్తగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను." అని చెప్పింది. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. స్త్రీలు ఆనందబాష్పాలు రాల్చారు. వారందరికీ తెలియని ప్రేరణ కలిగింది.

సుబ్బమ్మ వేదికపైకి వచ్చి "స్త్రీని అబల చేసింది స్త్రీయే. సమాజం ఏమనుకుంటుందో, భర్తను వదిలితే సమాజం అవహేళన చేస్తుంది, తోడు లేకుండా ఎలా జీవించటం, ఆడదంటే అన్నీ భరించాలి...ఇవన్నీ మనం తరతరాలుగా వింటున్నవే. శారీరికంగా స్త్రీపురుషుల బలాలలో తేడా ఉండవచ్చు. కానీ, సాటి స్త్రీని ఒక మగవాడు హింసిస్తుంటే చూస్తూ ఊరుకోవటం ఈ సమాజం చేసే పెద్ద తప్పు. ఆ సమస్య రేపు మనింట్లోనే వస్తే అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆడపిల్లలకు చిన్నపటినుండీ పరిస్థితులను ఎదుర్కొనగలిగే ఆత్మస్థైర్యం ఇస్తే వారు అపారమైన శక్తివంతులవుతారు. సమాజం వారి మేధో సంపత్తిని, సుగుణాలను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోగలదు. ఆడపిల్లల రక్షణకు వారిలో ఆత్మస్థైర్యం ఎంతో ముఖ్యం. వీగిపోయే మనస్తత్వాలను పిల్ల్లకు ఇవ్వకూడదు. నా కొడుకు రాక్షసుడు. ఒక స్త్రీని వాడు పెడుతున్న బాధలు చూసి నాలో ఎంతో అంతర్మథనం జరిగింది. రక్తసంబంధం కన్నా నా ధర్మం ముఖ్యం అనుకున్నాను. నేను చేసినదానికి వాడు నన్ను జీవితాంతం అసహ్యించుకోవచ్చు. కానీ, ఒక స్త్రీకి తోడుగా నిలబడ్డాను అన్న తృప్తి నాకు చాలు. ధన్యవాదాలు".

ఆ రోజు గుడిలో అమ్మ వారి విగ్రహంతో పాటు, నలుగురు ఆది పరాశక్తుల రూపాలు కనిపించాయి. వెనుదిరిగి ఇంటికి వెళుతున్నపుడు ప్రతి వ్యక్తిలోనూ అంతర్మథనం మొదలయ్యింది. ఆడపిల్లలను ఎలా పెంచాలి అని కొందరు, కోడలిని ఎలా గౌరవించాలి అని కొందరు, భార్యను ఎలా చూసుకోవలి అని కొందరు...దిద్దుబాటు దారిలో పడ్డారు. అదే కదా ఆధ్యాత్మికత ఉద్దేశం?


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి