నర్తనశాల - సలలిత రాగ సుధారస సారం
సలలిత రాగ సుధారస సారం
సర్వ కళామయ నాట్య విలాసం
మంజుల సౌరభ సుమ కుంజముల
రంజిలు మధుకర మృదు ఝుంకారం
కల్పనలో ఊహించిన హొయలు
శిల్ప మనోహర రూపమునొంది
పదకరణముల మృదుభంగిమల
ముదమార లయమీరు నటనాల సాగే
ఝణణ ఝణణ ఝణ నూపుర నాదం భువిలో దివిలో రవళింపగా
నాట్యము సలిపే నటరాయని ఆనంద లీలా వినోదమే
భావ సంపద, భాషా సౌందర్యం, సంగీత పుష్టి కలిగిన గీతాలు తెలుగు సినీ చరిత్రలోని స్వర్ణయుగం అయిన 1950 మరియు 1960 దశకాలలో వచ్చిన చలనచిత్రాలలో పుష్కలంగా కనిపించేవి. కళారాధకులు, కళాపోషకులు, విరించి ముఖమునుండి వెలువడ్డారా అనిపించే సాహితీకారులు, నాదబ్రహ్మ పుత్రులా అనిపించే సంగీతకారులు, గంధర్వ గాయనీ గాయకులు, సురలోక నృత్యాలను తలపించే నృత్యదర్శకులు, పాత్రలలో జీవించే నటులు, విశ్వకర్మను తలపింపజేసే కళాదర్శకులు...ఇలా చిత్రనిర్మాణంలో అణువణువు పరిపూర్ణమైన ప్రజ్ఞను కనబరచిన రోజులువి. భావదారిద్ర్యానికి తావులేనందున చిత్రాలు కళాఖండాలుగా ఎన్ని దశాబ్దాలైనా ప్రజల హృదయాలలో నిలిచాయి. దీనికి అనుగుణంగా దర్శకులు, నిర్మాతలు కూడా ఎక్కడా రాజీపడలేదు. అందుకే ఆ చిత్రాలు అజరామరమైనాయి.
అటువంటి ఒక మేటి చిత్రం 1963లో విడుదలైన నర్తనశాల చలనచిత్రం. మహాభారతంలోని విరాటపర్వం ఈ చిత్రానికి సందర్భం. అరణ్యవాం ముగిసిన తరువాత అజ్ఞాతవాసం ఎక్కడ గడపాలి అన్న మీమాంసలో ఉన్నప్పుడు విరాటరాజు కొలువు సరైనదని ధర్మరాజు నిర్ణయిస్తాడు. వారి నిజరూపాలు తెలియకుండా వారు విరటుని కొలువులో వేర్వేరు వేషాలలో చేరతారు. పూర్వం దేవకన్య శాపాన్ని సద్వినియోగం చేసుకుంటూ సవ్యసాచి,విజయుడు,కిరీటి, శ్వేతవాహనుడు, భీభత్సుడు మొదలైన దశనామములు కలిగిన అర్జునుడు పేడివాని రూపంలో బృహన్నల నామంతో విరాటుని కుమార్తెకు నాట్యాచార్యునిగా చేరతాడు. ఆ సన్నివేశం ఈ సలిలత సుధారస సారం అనే గీతం యొక్క నేపథ్యం.
సముద్రాల రాఘవాచార్యుల వారి గీతాలు సహిత్యంలో లాలిత్యానికి, పద సంపదకు ఆలవాలం. ఈ గీతం సర్వలక్షణ సంపన్నమై సంగీత నాట్య రసాలను అద్భుతమైన ఉపమానములతో అలంకార విశేషణములతో ప్రకాశిస్తుంది.
నాట్యాభినయం లాలిత్యము కూడిన అమృత రస సారమై, సమస్త కళలకు ఆలవలం. మృదువైన, సువాసనలను విరజిమ్మే పూ పొదరిల్లు నాట్యము.
కల్పనలో ఊహించబడిన సొగసులు అందమైన శిల్పరూపమును పొంది పదవిన్యాసముతో, మృదువైన భంగిమలతో, ఆనందాన్ని కలిగిస్తూ లయబద్ధంగా సాగే నాట్యాభినయం అమృత రస సారమై, సమస్త కళలకు ఆలవలం.
కాలి అందెల ఝణణ ఝణణ అనే శబ్దము దివిలో భూమిపై రవళించగా నాట్యము చేసే పరమశివుని ఆనందమయమైన లీలా వినోదమే లాలిత్యము కూడిన అమృత రస సారమై, సమస్త కళలకు ఆలవలమైన నాట్యాభినయం.
కళకు పరమావధి రసాస్వాదన. ఆ రసాస్వాదన పరమాత్మకు సమర్పించబడితే ఆ కళ సార్థకమవుతుంది. నాట్య కళకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో అనేక కళలు ఇంద్రధనుసులో రంగులలా అందంగా ఒదిగి పరమాత్మ అద్భుతమైన సృష్టికి ప్రతీకగా నిలుస్తాయి. ఆంగికం, వాచికం, ఆహార్యము, అభినయం శృతి లయ స్వర సాహితీ యుతమై మైమరపు కలుగజేస్తాయి. పదాలలో తెలియజేయలేని భావనలను అభినయంలో అనుభూతి చెందగలిగే అద్భుతమైన ప్రక్రియ నాట్యం. ఈ భావాన్ని సముద్రాలవారు సలలిత రాగ సుధారస సారం గీతం ద్వారా అందించారు. ఈ చిత్రంలో అన్ని గీతాలూ ఆయన సాహితీ ప్రతిభకు ఉత్తమ ఉదాహరణలు.
సుసర్ల దక్షిణామూర్తి గారు నాదబ్రహ్మ స్వరూపులు. నర్తనశాలతో పాటు ఎన్నో చిత్రాలకు మధురమైన, శ్రావ్యమైన, శాస్త్రీయతను ప్రస్ఫుటించే సంగీతాన్ని అందించారు. కల్యాణి రాగంలో సాగే ఈ గీతంలో మాధుర్యాన్ని, మృదువైన నాట్య భంగిమలకు ప్రాధాన్యత ఉంది కాబట్టి అదే రీతిలో సంగీతం కూర్చారు సుసర్ల వారు. ఝుంకారములు, ఝణత్కారములు కూడిన అందెల రవళిని ఆయన తన సంగీతం ద్వారా మనకు తెలియజేశారు.
సంగీతంలో గంధర్వులను మరపింపజేసే బాలమురళీకృష్ణ గారు ఈ గీతానికి ప్రధాన నేపథ్య గాయకులు. భావాన్ని, సంగీతాన్ని లలిత మధుర స్వర లయాది లక్షణాలతో ఆయన గానం చేశారు. బెంగుళూరు లత గారు ఆయనకు సహకారం అందించారు. ఆలాపనలో బాలమురళి గారు వినిపించిన మాధుర్యం చిక్కని పాలమీగడకు చక్కెరను కలిపినట్లు రుచిస్తుంది.
ఇక పాత్రధారుల గురించి చెప్పేదేముంది? పౌరాణిక పాత్రలకు ప్రతిరూపం నందమూరి తారక రామారావు గారు. పేడి బృహన్నల రూపాన్ని తానే స్వయంగా తీర్చిదిద్ది మూర్తీభవింప జేశారు. గీతం కొరకు నాట్యంలో మెలకువలను నేర్చుకున్నారు. మేటి భరతనాట్య కళాకారిణి అయిన ఎల్ విజయలక్ష్మి ఉత్తర పాత్రలో ఈ గీతానికి మహాద్భుతమైన నాట్యాన్ని అందించగా, ఆమెకు గురువుగా అన్న ఎంటీఆర్ గారు అంతే ప్రతిభను ప్రదర్శించారు.
ఇంత మంది మహానుభావుల కళలు మేళవించాయి కాబట్టే ఈ గీతం ఒక వినూత్నమైన రసావిష్కరణగా ఇప్పటికీ సువాసనలు విరజిమ్ముతూనే ఉంది.
ఎన్ టీ ఆర్ , ఎల్ విజయలక్ష్మి అభినయంలో బాలమురళీకృష్ణ , బెంగుళూరు లత పాడిన గీతాన్ని చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి