అఖిలాండేశ్వరి రక్షమాం ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ
అఖిలాండేశ్వరి రక్షమాం ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ
నిఖిలలోక నిత్యాత్మికే విమలే
నిర్మలే శ్యామలే సకల కళే
లంబోదర గురుగుహ పూజితే
లంబాలకోధ్భాసితే హసితే
వాగ్దేవతారాధితే వరదే
వరశైలరాజసుతే శారదే
జంభారి సంభావితే జనార్దన నుతే
ద్విజావంతి రాగ నుతే జల్లీ మద్దళ
ఝర్ఝర వాద్య నాద ముదితే జ్ఞానప్రదే
ఓ అఖిలాండేశ్వరీ! నన్ను రక్షించుము. వేద సాంప్రదాయాలలో నైపుణ్యము గల తల్లీ నన్ను రక్షించుము!
సమస్త లోకములలో పరబ్రహ్మమై యున్న తల్లివి! మచ్చలేని, నిర్మలమైన తల్లీ! శ్యామలాదేవీ! సకల కళలో ప్రావీణ్యము గల తల్లీ అఖిలాండేశ్వరీ! నన్ను రక్షించుము!
గణపతి, సుబ్రహ్మణ్యులచే పూజించబాడిన తల్లీ! పొడవైన కురులచే శోభిస్తూ చిరునవ్వు కలిగిన తల్లీ! వాగ్దేవత అయిన సరస్వతిచే పూజించబడిన వరములిచ్చే తల్లీ! హిమవంతుని పుత్రికవు శారదవు! ఇంద్రుడునిచే పొగడబడి, విష్ణువుచే నుతించబడిన తల్లీ! ద్విజావంతి రాగంలో నుతించబడిన తల్లీ! గజ్జెలు, ఢక్క, మృదంగము మొదలైన వాద్యముల నాదముతో మోదము పొంది జ్ఞానాన్ని ప్రసాదించే తల్లీ అఖిలాండేశ్వరీ నన్ను రక్షింపుము.
ముత్తుస్వామి దీక్షితులు రచించిన క్షేత్ర కృతులలో ఇది ఒకటి. శివుని పంచభూత లింగ క్షేత్రములలో జలలింగ క్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ శివుడు జలలింగ రూపంలో ఉంటాడు. ఆయన నాయికగా అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా అలరారుతుంది. ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది. అమ్మవారు జంబుకేశ్వరంలో కావేరీ నది నీటితో లింగాన్ని చేసి స్థాపించి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు సంతుష్టుడై శివుడు ప్రత్యక్షమై శివజ్ఞానాన్ని ఆమెకు ఉపదేశిస్తాడు. అప్పటినుండీ జంబుకేశ్వరం ఉపదేశ స్థలంగా ప్రసిద్ధి చెందింది. దీనికి సూచికగా, ఇప్పటికీ మధ్యాహ్న సమయమున అర్చకుడు స్త్రీవేషంలో వచ్చి స్వామిని పూజిస్తారు.
పృథివ్యాపస్తేజోవాయురాకాశములనే పంచ మహాభూతముల రూపంలో దక్షిణాదిన ఐదు శివక్షేత్రాలు ఎంతో పవిత్రమైనవిగా తెలుపబడ్డాయి. వాటిలో పృథివీ లింగం కంచిలో, ఆప (నీటి) లింగం జంబుకేశ్వరంలో, తేజో లింగము అరుణాచలంలో (తిరువణ్ణామలై), వాయులింగము శ్రీకాళహస్తిలో, ఆకాశలింగం చిదంబరంలో వెలశాయి. ఆయా శివలింగములకు కామాక్షి, అఖిలాండేశ్వరి, ఉణ్ణమలై (అపీతకుచలాంబ) అమ్మ, జ్ఞానప్రసూనాంబ, శివకామి అమ్మలు పార్వతీదేవి రూపాలుగా వెలసాయి.
దీక్షితులవారి దేవీ ఉపాసనలో వీలైనంత వివిధ పరదేవతా స్వరూపాలను, ఆయా రూపాల విలక్షణమైన లక్షణాలను, గుణాలను, మహిమలను వర్ణించారు. ఈ కృతిలో శివుని వద్ద ఉపదేశం పొందిన అమ్మను ఆగమ సాంప్రదాయములలో, సకల కళలలో నైపుణ్యముగల మహిమాన్విత శక్తి రూపిణిగా నుతించారు. దీక్షితులవారు రాసినట్లుగా జంబుకేశ్వరంలో అమ్మవారిని నిత్యం వివిధ వాయిద్యముల నాదముతో అలరిస్తారు. దీక్షితుల వారి ఇతర కృతులలాగానే ఈ క్షేత్ర కృతి కూడా రాగ భావ సమన్వయం అత్యంత సమగ్రంగా కలిగినది. శరణాగతి, భక్తి భావాలను ఎంతో హృద్యంగా ద్విజావంతి రాగంలో పండుతాయి.
దీక్షితులవారి ప్రత్యేకత రాగం పేరును కృతిలో సముచితమైన స్థానంలో ప్రస్తావించటం. గురుగుహుని అనుగ్రహం పొందిన ఆయన ఆ కార్తికేయుని తన కృతులలో ముద్రగా ఉపయోగించారు. పరదేవతానుగ్రహం అపారంగా లేనిదే ఇటువంటి కృతులు వాగ్గేయకారుని చిత్కమలం నుండి వెలువడవు. ఎక్కడికి వెళ్లినా ఆ దేవతానుగ్రహం పొందిన మహోన్నత ఆధ్యాత్మిక విద్వాంసుడు దీక్షితుల వారు.
ఈ కీర్తనను ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు మనసుకు ప్రశాంతత కలిగించేలా అమ్మ రూపాన్ని కళ్లముందు నిలబడేలా ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి