RightClickBlocker

5, జులై 2015, ఆదివారం

భ్రాతృ ప్రేమ - ధర్మనిష్ఠ, సత్య వాక్పరిపాలన

భ్రాతృ ప్రేమ - ధర్మనిష్ఠ, సత్య వాక్పరిపాలన


భ్రాతృ ప్రేమకు నిర్వచనం రామచంద్రుడైతే అన్నపై భక్తికి నిర్వచనం భరతుడు. పదునాలుగేండ్లు అన్న అరణ్యవాసములో ఉన్నంత వరకూ తానూ రాజ్య త్యాగము చేసి అన్న పాదుకలను నందిగ్రామంలో నిలిపి పూజించిన నిర్మల మూర్తి భరతుడు. అన్నపై గల ప్రేమతో కన్నతల్లిపై కత్తిని దూసిన సత్యపరాయణుడు భరతుడు.  నాన్న మాట కోసం నిస్సంకోచంగా రాముడు అడవికేగితే అన్న కోసం చేతికి వచ్చిన రాజ్యాన్ని తృణప్రాయంగా వదలి యోగియైనాడు భరతుడు. ఈ అన్నదమ్ముల అవ్యాజమైన ప్రేమకు మూలం నిస్వార్థమైన అత్యున్నతమైన మానవ విలువలు మరియు ధర్మపరాయణత్వం. ఇప్పుడూ ఉన్నారు సోదరులు - ఆస్తుల కోసం, తల్లిదండ్రులను పంచుకోవటం కోసం, చెప్పుడు మాటలు విని అహంకారంతో సోదరులను హతమార్చే వారు, సోదరులను మోసం చేసే వారు, సోదరులను దూరం చేసుకునే వారు. కళ్ల ఎదుటబడితే సోదరుని ఆత్మీయంగా పలుకరించలేని దుస్థితిలో ఎంతో మంది సోదరులు. శాశ్వతం కాని ఆస్తుల కోసం శాశ్వతమైన ప్రేమను దూరం చేసుకునే మూర్ఖత్వంలో మరి కొందరు. భార్యల చెప్పుడు మాటలు విని సోదర దూషణ చేసే వారు మరి కొందరు....తోడబుట్టినవారిని నిష్కల్మషంగా ప్రేమించాడు కాబట్టే రాముడు పరిపూర్ణ పురుషుడయ్యాడు. సోదరుల కోసం త్యాగంలోనే భోగమని నిరూపించారు రామ లక్ష్మణ భరతులు. ఒకే మాటతో, ఒకే ఆత్మ అన్నంత గాఢమైన సోదర వాత్సల్యాన్ని ప్రదర్శించారు ఈ సోదరులు. అందుకే వారు లోక పూజ్యులు.

శ్రీమద్రామాయణంలో ఈ భ్రాతృప్రేమకు, తద్వారా ధర్మనిష్ఠకు, సత్య వాక్పరిపాలనకు కొన్ని మచ్చుతునకలు:

1. సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్లిన తరువాత, దశరథుడు మరణిస్తాడు. మేనమామల వద్దనుండి తిరిగి వచ్చిన భరతుడు తండ్రి మరణవార్త వింటాడు. అప్పుడు ఇలా అంటాడు:

"అద్భుతమైన కార్యములన్నీ అవలీలగా సాధించే ప్రజ్ఞామూర్తి శ్రీరాముడు. నాకు అన్న మాత్రమే కాదు, తండ్రి, బంధువు, సర్వస్వమూ అతడే. నేను ఆయన దాసుడను. జ్యేష్ఠ సోదరుడు తండ్రితో సమానము. ధర్మమును బాగుగా తెలిసిన ఆ శ్రీరాముని పాదములకు నేను మ్రొక్కెదను. ఇప్పుడు ఆ ధర్మాత్ముడే నాకు పరమగతి. "

కైకేయి వెంటనే సీతారామ లక్ష్మణులను అడవికి పంపినానన్న వార్తను కుమారునికి తెలుపి, పట్టాభిషేకానికి సిద్ధముగమ్మని చెప్పగానే, భరతుడు తల్లితో ఇలా అంటాడు:

"ఓ పాపాత్మురాలా! మా అన్న శ్రీరాముడు ధర్మాత్ముడు. పెద్దలకు సేవ చేయటంలో ఉత్తముడు. శ్రీరాముడు అందరిలోనూ మంచినే చూసేవాడు. మహాశూరుడు. సజ్జనులలో పేరుగలిగిన వాడు. అట్టి సత్పురుషుని నారచీరలతో అడవులకు పంపి ఏమి బాపుకోదలచినావు? పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు శక్తిప్రదాతలు. వారులేకుండా రాజ్యపాలనము చేసే శక్తి నాకు లేదు. ఇక్ష్వాకువంశములో ముందునుండి జ్యేష్ఠునకే రాజ్యాధికారమునిచ్చిరి.అదే సాంప్రదాయం. తక్కిన సోదరులందరూ పెద్దవానికి విధేయులై ఆయనను అనుసరించుచుండెడివారు. అటువంటి ధర్మపరాయణ కలిగిన ఇక్ష్వాకు వంశ వైభవం నీవలన భ్రష్టమైనది. నేను ఎట్టి పరిస్థితులలోనూ రాజ్యాధికారాన్ని స్వీకరించను. శ్రీరాముడే కోసల రాజ్యాధీశుడు. నేను రాముని వద్దకు వెళ్లి వేడుకొని, అతనికి రాజ్యాన్ని అప్పగించి అతనికి సేవ చేసెదను. "

అటు తరువాత, కౌసల్య వద్దకు వెళ్లి ఇలా అంటాడు: "అమ్మా! ధర్మాత్ముడైన శ్రీరాముని వనవాస విషయమున నా జోక్యమున్నచో నేను మహాపాపమును పొందెదను గాక. అగ్నిహోత్రాది ధర్మకార్యములకు దూరమై, సంతానహీనునిగా మరణించెదను గాక. స్త్రీలు, పిల్లలను చంపిన పాతకము నాకు కలుగు గాక. అనేక నరకబాధలు కలుగుగాక. గురుద్రోహ పాతకము కలుగు గాక" అని ఎంతో విలపిస్తాడు. కౌసల అతనిని ఓదార్చి "నాయనా! నీవు ధర్మమార్గమును వీడలేదు. నీవు సత్యప్రతిజ్ఞుడవు. కావున నీవు సత్పురుషులలో శ్రేష్ఠుడవు." అని అంటుంది.

2. భరతుడు సపరివార సైన్యముతో చిత్రకూటము చేరుకున్నప్పుడు లక్ష్మణుడు భరతుని అనుమానిస్తాడు. అప్పుడు రాముడు భరతుని గురించి ఇలా అంటాడు.

"లక్ష్మణా! భరతుని సోదరప్రేమ నిరుపమానమైనది. అటడు నాకు ప్రాణములకన్నా మిన్న. అతని రాకకు వేరే కారణము వెదుకవద్దు. అతను మనలను చూచుటకే వచ్చాడు. ఒక సోదరుడు తన ప్రాణతుల్యుడైన సోదరుని ఎట్లు చంపును. మనకు అపకారము చేయవలెనని అతను మనసులో కూడ తలపడు. కాబట్టి శాంతించి అతనికి స్వాగతము పలుకుము" అంటాడు.

3. భరతుడు పర్ణశాలలో ప్రవేశించి ఇలా తలపోసెను:

"ఈ జగత్తులో నరశ్రేష్ఠుడైన, మహాప్రభువగు శ్రీరాముడు నా కారణమున, జన సంచారములేని ఈ వనములకు చేరి, వీరాసనమున కూర్చున్నాడు. అయ్యో నా జన్మ, జీవితమూ వ్యర్థమే. నా తల్లి కుట్ర ఫలితముగా మహాతేజస్వి, జగత్ప్రభువు అయిన శ్రీరామచంద్రుడు కష్టాలపాలైనాడు. అతడు సమస్త సుఖములను త్యజించి ఈ వనమునందు నివసించుచున్నాదు. ఈవిధముగా నేను లోకనిందకు గురైతిని. శ్రీరాముని ప్రసన్నుని జేసుకొనెదకు నేను సీతాదేవి పాదములకు మోకరిల్లెదను."

అన్న వద్దకు వెళ్లి అతనిని చూసి "అయ్యో! నిండు సభలో పురజనుల చేతను, మంత్రుల చేతను సేవాసత్కారములు అందుకోవలసిన మా అన్న నేడు ఇచట వన్యమృగములచే సేవింపబడుచున్నాడు. అమూల్యమైన పీతాంబరములు ధరించవలసిన రాముడు పితృవాక్యపరిపాలనము కొరకు మృగచర్మము ధరించి యున్నాడు. నానావిధములైన ఆభరణములను పుష్పములను ధరించిన రాముడు ఈ జటాభారమునెట్లు మోయుచున్నాడో? అత్యుత్తమమైన చందనాదిలేపములుకు యోగ్యమగు ప్రభువు శరీరము నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది? ఈ కష్టములన్నిటికీ కారణమైన నా జీవితం వ్యర్థము" అని విలపిస్తూ రాముని పాదములపై వ్రాలుతాడు.

4. దశరథునికి పిండప్రదానము, తర్పణములు వదిలిన పిమ్మట, రాముడు భరతుని ఆతని రాకకు గల కారణాన్ని అడుగుతాడు. భరతుడు ఇలా అంటాడు:

"అన్నా! నీ దాసుడనై ఇక్కడి వచ్చిన నన్ను అనుగ్రహింపుము. అయోధ్యకు  విచ్చేసి రాజ్యాభిషిక్తుడవు కమ్ము! నేను నీకు తమ్ముడను, శిష్యుడను, దాసుడను. "

అపుడు రాముడు:

"ఓ భరతా! నీవు ఉత్తమ వంశమున పుట్టిన వాడవు. సత్త్వగుణ సంపన్నుడవు. బలశాలివి. సత్ప్రవర్తన కలిగిన వాడవు. అటువంటి నీవు పాపము చేయలేదు. ధర్మశీలురైన తల్లిదండ్రులు నన్ను వనవాసమునకు ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞను నేను కాదనను. కావున నీవు అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలెను. నేను వల్కములు ధరించి వనవాసము చేయవలెను." అని సమాధానం చెబుతాడు.

భరతుడు, వశిష్ఠుడు, జాబాలి మొదలైన వారు ఎంత చెప్పినా రాముడు తండ్రిమాట జవదాటను అని సమాధానం చెప్పి భరతుడే రాజ్యాన్ని పాలించాలి అని మరల మరల చెబుతాడు. అప్పుడు భరతుడు రామునితో ఇలా అంటాడు:

"పూజ్యుడవైన ఓ అన్నా! నీ పాదుకలు బంగారముతో తాపబడినవి. ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడుగుకొని నాకు అనుగ్రహింపుము. అవియే సమస్త లోకములకు యోగక్షేమమగును."

రాముడు అందుకు సమ్మతించి పాదుకలను తొడిగి విడువగా, భరతుడు ఆ పాదుకలకు ప్రణమిల్లి ఇలా అంటాడు: " నేను ఈ పదునాలుగు సంవత్సరములు జటాధారినై నారచీరలను ధరించెదను. ఫలములను, కందమూలములను ఆహారముగా స్వీకరించుచు మీ రాకకై నిరీక్షించుచు నగరమునకు వెలుపలి భాగమున యుందును. ఈ పదునాలుగు సంవత్సరములు రాజ్యపాలనా భారమును నీ పాదుకల మీదనే ఉంచెదను. పదునాలుగవ సంవత్సరము ముగిసిన మరునాడు మీ దర్శనము కానిచే అగ్నిప్రవేశము చేసెదను."

ఈవిధముగా రాముడు వచ్చేంత వరకు భరతుడు అయోధ్య ప్రవేశించలేదు. తను అన్న మాటకు నిలబడి సత్యప్రతిజ్ఞుడైనాడు.

5. వాలిని చెట్టుచాటునుండి రాముడు నేలకూల్చిన పిమ్మట రాముని ధర్మమును వాలి అధిక్షేపిస్తాడు. అప్పుడు రాముడు వాలితో ఇలా అంటాడు:

" కొండలతో, కోనలతో, అరణ్యములతో కూడిన ఈ భూమి అంతా ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనములోనిది. ఇక్కడ మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుటకు, అనుగ్రహించుటకు వారికి అధికారము కలదు. ఈ భూమి ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తున్నాడు. అతడు సత్యసంధుడు, ఋజువర్తనుడు, ధర్మార్థకామ్యముల రహస్యము తెలిసిన వాడు, నిగ్రహానుగ్రహ సమరథుడు, రాజనీతిని, శిక్షాశాస్త్రమును, సత్యమును, శాస్త్రవిహిత పద్ధతిని దేశకాల పరిస్థితులను చక్కగా తెలిసిన మహారాజు. మిక్కిలి పరాక్రమశాలి. మేము, ఇతర రాజులు అతని ధర్మబద్ధమైన ఆదేశములను పాటించుచు ధర్మ పరిరక్షణకై ఈ భూమి యంతటా సంచరించుచున్నాము. రాజశ్రేష్ఠుడు, ధర్మనిరతుడు అయిన భరతుడు ఈ భూమిని పాలించుచుండగా అట్టి ధర్మమును ఎవరు అతిక్రమించగలరు? రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి మేమందరము పూర్తిగా ధర్మాచరణ యందు నిమగ్నులమై యున్నాము. ధర్మమార్గమును వీడి ప్రవర్తించు వారిని మేము తప్పక దండించెదము. నీవు పూర్తిగా స్వార్థ పరుడవు, భోగలాలసుడవు, రాజధర్మమును  వీడినావు. కావున ధర్మజ్ఞులు నిను తప్పక నిందింతురు. నీవు ధర్మము తప్పిన వాడవు. ఈ దేశమున ధర్మమును అతిక్రమించిన వారిని, కట్టుబాట్లకు లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించువారిని శిక్షించుటలో భరతుడు నిరతుడై యున్నాడు. ఆతని  ఆజ్ఞలను మేము అమలుపరచుచున్నాము".

ఈ విధముగా సత్యమైన సోదర ప్రేమ కలిగి రామభరతులు నిరంతరం ధర్మపరాయణులై మాటకు కట్టుబడి తమ జీవితాలే మానవాళికి ఆదర్శప్రాయం చేశారు. రాముని వంటి అన్న, భరతుని వంటి తమ్ముడు న భూతో న భవిష్యతి.

జై శ్రీరాం!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి