12, జులై 2015, ఆదివారం

జోహారు శిఖిపింఛమౌళి

జోహారు శిఖిపింఛమౌళి


జోహారు శిఖిపింఛమౌళి! ఇదె జోహారు రసరమ్య గుణశాలి వనమాలి!

కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే పరులను జడిపించి
నయగారమొక కంట జయవీరమొక కంట
చిలకరించి చెలువమెంచి నిలచిన శ్రీకరా నరవరా సిరిదొరా

నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగయుగాల దివ్యలీల నడపిన అవతారమూర్తి ఘనసార కీర్తి

చకిత చకిత హరిణేక్షణావదన చంద్రకాంతులివిగో
చలిత లలిత రమణీకేలాంచల చామరమ్ములివిగో
ఝళంఝళిత సురలలనానూపుర కలరవమ్ములివిగో
మధుకర రవమ్ములివిగో మంగళరవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు సుందర నందన సుమమ్ములివిగో

జోహారు శిఖిపింఛమౌళి! ఇదె జోహారు రసరమ్య గుణశాలి వనమాలి!

 డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు 1970లో విడుదలైన శ్రీకృష్ణ విజయం (ఎన్ టీ ఆర్, జయలలిత నటించిన) చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావుగాఇ సంగీతం, సుశీలమ్మ గళంలో అందించిన రసప్రవాహం. ఈ పాటకు నృత్యం చేసిన అద్భుత కళాకారిణి హేమమాలిని గారు. నవరత్నాలన్నీ కలిస్తే ఇక అది మృదు మంజుల మధురమే.

గీతానికి వస్తే, అప్సరసలు ఇలా శ్రీకృష్ణునికి జోహారు సమర్పిస్తున్నారు:

శిఖములో నెమలిపింఛము ధరించిన, అనేకమైన సుగుణములకు నిలయమైన, వనమాలను ధరించిన నీకు జోహార్లు

అందమైన చూపులతో చెలుల మనసులను కరిగించి, కఠినమైన చూపులతో శత్రువులను జడిపించి, మృదుత్వమొక పక్క, వీరరసమొక పక్క చిలకరిస్తూ అందముగా నిలిచిన, సంపదలను కలిగించే, నరశ్రేష్ఠుడవైన, సిరికి పతివైన శ్రీకృష్ణా నీకు జోహార్లు.

నీ వేణుగానలహరిలో సమస్త లోకాలు నిదురించును. నీ నాట్యలీలలో ఆకాశాలన్నీ నినదించును. సమస్త వేదవేదాంతములకు నీవు తలమానికమైనావు. యుగయుగాలలో వివిధ అవతారములతో దివ్యలీలలను చేసిన గొప్ప కీర్తికి కలిగిన శ్రీకృష్ణా నీకు జోహార్లు!

బింకముతో అందముగా జింకకన్నులు కలిగిన నీకు చంద్రకాంతులతో జోహార్లు ఇవిగో. అందమైన స్త్రీల కురుల వలె చల్లని గాలులు వీచే చామరమ్ములతో జోహార్లు ఇవిగో. తుమ్మెదలా ఝుంకరించే రవములతో, లలితమైన ధ్వనులతో జోహార్లివిగో. అన్నిదిక్కుల అంచుల వరకు అనంతమైన సువాసనలను విరజిమ్మే సుందరమైన నందనవన పుష్పములతో జోహార్లు ఇవిగో!

నారాయణరెడ్డి గారు అనగానే తెలుగుదనం యొక్క గుబాళింపు గుర్తుకు వస్తుంది. కొత్త పదాలకు, అపురూపమైన సాహితీ సంపదకు ఆయన రచనలు నెలవు. ఈ గీతంలో ఆయన చేసిన పదప్రయోగం అమోఘం. సిరిదొర, సిగబంతి మొదలైన పదాలు ఆయన సాహితీ ప్రతిభకు నిలువటద్దం. తెలుగు భాషలో మాధుర్యం సినారె గారి కలంలో రసప్రవాహంలో జాలువారింది. చిత్రంలో శ్రీకృష్ణుడు ఇంద్రుని సభకు వెళ్లినపుడు అప్సరసలు ఆడే నాట్యకేళికి ఈ గీతం సందర్భం. అనుపమానమైన సౌందర్యం కలిగిన హేమమాలినిపై ఈ గీతం చిత్రీకరించబడింది. కూచిపూడి నాట్య రీతిలో సినారె గారి గీతానికి హేమమాలిని గారు అద్భుతమైన నాటవిన్యాసాన్ని అందించారు. కృష్ణుడు అనగానే సుందరమైన బృందావని గుర్తుకు వస్తుంది. అలాగే ఈ గీతం కూడా సాహితీ సౌందర్యంతో ప్రకాశిస్తుంది. 

సుశీలమ్మ గోంతులో ఈ పాట వినండి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి