27, మే 2010, గురువారం

తద్దినపు రోజు ప్రహసనం

===== నాకు తద్దినం, దాని ప్రాముఖ్యత, విశిష్టత తెలుసు. కేవలం కొంత హాస్యం కొరకు ఈ వ్యాసం. మీ మనోభావాలను కించపరచటానికి మాత్రం కాదు ==========

తద్దినం అనగానే గారెలు, అల్లం పచ్చడి, పప్పు ధప్పలమే కాదండి, మా ఇంట్లో చాలా నాటకం జరిగేది.  మా బామ్మ మా నాన్న పాకే పిల్లాడిలా ఉన్నప్పుడే పోయింది పాపం అందుకని మా అమ్మ పెళ్లి అయినప్పటినుంచి బామ్మ తద్దినాలు పెడుతూనే ఉంది. ఇప్పటికి అమ్మ అక్కిరాజు వారింటికి వచ్చిన తర్వాత 43 బామ్మ తద్దినాలు, 26 తాతయ్య తద్దినాలు పెట్టాము. ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయ్యాం, వంట వాళ్ళు ఉన్నారు, వ్యవహారం కూడా సులభమయ్యింది కానీ అప్పట్లో మా తాడు తెగేది ఆ రోజు.

ఒక  మూడు నాలులు రోజుల ముందు నాన్న భోక్తలకు, మంత్రం చెప్పే బ్రాహ్మణులకు, మా లలితత్తయ్యకు చెప్పటంతో మొదలయ్యేది. బామ్మ తద్దినం అయితే ముత్తైదువ కావాలి భోజనానికి అందుకని అత్తయ్య వస్తుందో రాదో కనుక్కుని ఇంకొక మహిళామణికి చెప్పి ఉంచుకోవాలి.  ఇక ముందు రోజు సాయంత్రం మార్కెట్టుకి వెళ్లి అరటి ఆకులు, కూరలు, నెయ్యి, నూనె, నువ్వులు లాంటి వస్తువులు తెచ్చుకోవాలి.  పిండాలు తినిపించటానికి గొల్లవాళ్లకి ఆవుకి చెప్పాలి, లేదా చెరువు దాక వెళ్లి కలిపే ఏర్పాటు చేసుకోవాలి. ఆవుకు చెప్పేటప్పుడు గొల్ల వీరమ్మ చూపించేదండి ఒక స్టైల్ - అదేదో వాళ్ళ ఆవు చాలా బిజీ అయినట్టు, మాకేదో అప్పాయింట్మెంట్ ఇచ్చినంత ఫీల్ చూపించేది. ఏదో ఆమెను బతిమిలాడుకొని ఒక ఆవును "బుక్" చేసుకునేవాళ్ళం.  దాదాపుగా వంకాయ, దొండకాయ/చిక్కుడుకాయ, అరటికాయ కూరలు, అల్లం పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి, నువ్వుల పొడి, నీళ్ళ చారు (ముక్కలు లేని చింతపండు నీళ్ళు అనుకోండి), ఉత్త పప్పు (పెసర పప్పుతో), పెరుగు - ఇవీ వంటకాలు. ప్రతిసంవత్సరం రిపీట్.

ఇక ఆరోజు ఉదయం - పాపం అమ్మ ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి, తుడవాలి (పనిమనిషా పాడా అప్పట్లో అన్నీ అమ్మే - దశావధానం చేసేది అమ్మ). మేము నిద్రలు లేవకుండా దున్నపోతుల్లా పడుకునేవాళ్ళం. లేచి అమ్మకు సాయం చేద్దామనే ఆలోచనే ఉండేది కాదు. కాసేపటి దాక అమ్మ ఓపిగ్గానే చేసుకునేది. ఇక మొదలయ్యేది యుద్ధకాండ. తిట్ల పర్వం. వరుసగా ముగ్గురిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి పనిలో మునిగేది అమ్మ. ఈ లోపల చన్నీళ్ళ స్నానం చేసి, మడి బట్టలు ఆరేసి తను మడి (తడిచీర కట్టుకుని ఎవ్వరిని తాకకుండా ఉంటె మడి కింద) కట్టుకుని ఇక వంటింట్లోకి దూరేది. ఏదో నాన్న కూరలు కడగటం, ఆకులు శుభ్రం చెయ్యటం, దొప్పలు, దక్షిణలు సమకూర్చుకోవటంలో ఉండేవారు. మధ్యమధ్యలో అమ్మ విసుర్లు, నాన్న ప్రతివిసుర్లు మాకు శ్రవణానందంగా ఉండేది. కష్టపడి అమ్మ గారెల పిండి రోట్లో రుబ్బుకొని, పచ్చళ్ళు రోట్లే వేసి రుబ్బి, పొడి కొట్టి, కూరలు తరుక్కుని వంటకు సిద్ధపడుతు రుసరుసమనడం.

ఎప్పుడన్నా మా పుణ్యం పుచ్చి అత్తయ్య రంగంలోకి దిగింది అనుకోండి ఆరోజు ఇహ రణరంగమే. ఆవిడ చిన్నముక్కలు కోయమంటే పెద్దవి, చెక్కు తీయవద్దు అంటే తీయటం, ముక్క చేదు కోసం రుచి చూడొద్దు అంటే చూడటం, బియ్యం 2 కిలోలు పోయమంటే 3 కిలోలు పోయటం లాటి తమాషాలు చాల చేసేది. అసలు విషయం ఏమిటి అంటే ఆవిడకి బొత్తిగా పని అలవాటు లేదు, రెండోది మతిమరుపు. ఆవిడ చేసే ప్రయోగాలను సవరించలేక అమ్మ ఇంకొక ఉగ్రరూప అవతారం..

ఇక 11 అయ్యేసరికి మాకు కడుపులో నకనకలు. తద్దినం రోజు టిఫిన్లు ఉండవు కదా. అందుకని మాకు పాలతో సరిపెట్టుకొని ఏకంగా 2 ఇంటికి భోజనం కోసం చకోర పక్షుల్లా కాచుకొని ఉండేవాళ్ళం. విసుగు, నీరసం.

నాకు బాగా గుర్తు. రెండు మూడు సార్లు బ్రాహ్మణులు రాకుండా ఎగ్గొట్టారు. దాదాపు పన్నెండు అయ్యింది. ఇక నాన్న ఉగ్ర నరసింహావతారం, అమ్మకు వణుకు ఎలా అని. ఆయన బయటికి లోపాలకి ఒక వందసార్లు తిరిగి ఇక ఫోన్ తిప్పటమో, సైకిల్ వేసుకొని పురోహితుడు సుబ్రహ్మణ్యంగారింటికి వెళ్ళటమో జరిగేది. మళ్ళా బ్రాహ్మణులు దొరికి తద్దినం మొదలయ్యేదాకా తకిటతోం తకిటతోం. బ్రాహ్మణులు సమయానికి రాకపోయినా తరికిటతోం తరికిటతోం. వాళ్లకు రాగానే నాన్న క్లాసు పీకి తలంటి పోస్తే గానీ కార్యక్రమము మొదలయ్యేది కాదు.

ఇంట్లో ఎప్పుడు అరటి పళ్ళు ఉండేవి కాబట్టి నేను ఈ 11 నుంచి 2 లోపల ఒక డజను అరటి పళ్ళు లాగించేవాడిని. పాపం అక్క, అన్న ఏదో వాళ్ళ అవస్థ వాళ్ళు పడే వాళ్ళు.  మధ్యలో నైవేద్యం తర్వాత ప్రాణాలు నిలపటానికి తలా ఒక గారెను ఇచ్చేవాళ్ళు. అది అమృతంలా అనిపించేది. మొత్తానికి తిట్లు, విసుర్లు, ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాల మధ్య తద్దినం కార్యక్రమం పూర్తి అయ్యేది. నాన్న వెళ్లి ఆవుకు పిండాలు తినిపించి లేదా చెరువులో వాటిని కలిపి వచ్చేదాకా వేచి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇవన్ని ఎందుకని అమ్మ అగ్నిహోత్రం పెట్టి అందులో పిండాలు హుతం చేస్తుంది. అప్పుడూ అమ్మ చేసిన వంటలన్నీ బాగా లాగించి, కింద పడి దొర్లి నవ్వుకునేవాళ్ళం. అదండీ మా బామ్మ/తాతల తద్దినం రోజు భాగవతం.

(తద్దినం అనేది ఒక యజ్ఞ్యం. అది మన పితృదేవతలను సంతృప్తి పరచే కార్యక్రమం: వారికి ఇష్టమైన పదార్థాలు వండి, పిండాలలోకి మూడు తరాల వాళ్ళను పిలిచి, భోక్తలకు భోజనం పెట్టి వారికి దక్షిణ, తాంబూలం సమర్పించి ప్రసాదాన్నిమనం భుజించటం. భక్తీ శ్రద్ధలతో సంవత్సారానికి ఒక్కసారి ఆ పిత్రుదేవతను గుర్తు చేసుకొని త్రుప్తిపరచటం దీని ఉద్దేశం).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి