RightClickBlocker

28, మే 2010, శుక్రవారం

సంక్రాంతి శోభలు

చలికాలం మధ్యలో వచ్చే పండుగ, ఆంగ్లకొత్తసంవత్సరంలో వచ్చే మొదటి పండుగ, కొత్త పంటతో కూడిన పండగ కాబట్టి మంచి ఊపులో ఉత్సాహంలో ఉంటారు తెలుగు ప్రజలు. పొగమంచుతో మొదలయ్యే సూర్యోదయం - అబ్బో వర్ణిస్తే ఏడు సముద్రాలైన చాలదు.

భానుప్రకాశుడి అరుణ కిరణాలు ఆ తెలిమంచుతో సరసాలు, దోబూచులు ఆడుతూ చివరకి తానే సునాయాసంగా విజయుడై సప్తాశ్వరథారూఢుడై చలిని పారద్రోలే శిశిర ఋతువులో వచ్చే పండగ సంక్రాంతి. మూడురోజుల పండగ కాబట్టి కొంత అట్టహాసంగానే ఉంటుంది. కొత్తబియ్యం, కొత్త బట్టలు, బొమ్మలకొలువులు, రకరకాల వంటలు, రంగురంగుల రంగవల్లులు, ముగ్ధ మనోహరంగా పూచే ముద్ద బంతులు, సువర్ణవర్ణమైన, దోసిట్లో పట్టనంత గుమ్మడి పూలు, తీయగా, పుల్లగా, వగరుగా రేగి, వెలగ పళ్ళు, అప్పుడే కోతకు వచ్చిన సుమధుర రస చెరకుగడలు, పుట్టింటికి వచ్చే తనయలు, జామాతలు, బుల్లిబుల్లి బుడతలు, సప్తవర్ణ శోభితమైన గాలి పటాలు, పోటీలు, కోడిపందాలు, నవరత్న, వస్త్ర శోభితమైన గంగిరెద్దులు, సన్నాయిగాళ్ళు, వైజయంతిమాలా శోభిత, నిరంతర హరినామ సంకీర్తనాతరంగులైన హరిదాసులు, వారి వెంట తిరిగే బాలబాలికా గణము - ఎన్నో ఎన్నెన్నో..

అబ్బ చాలండి ప్రసాదు గారు మీ వర్ణన ఈ పండగ ఈ హడావిడి మా హైదరాబాద్, అమెరికాలో ఉండవండి. వివరానికి రండి అనుకుంటున్నారా - ఇదిగో వచేస్తున్నానండీ నా సోదరసోదరీమణులారా.

(తెలుగునాట కొంతమందికి సంక్రాంతికి బొమ్మలు పెట్టటం సంప్రదాయం. తమిళనాట, దాన్ని అనుకొన్న కొన్నిజిల్లాలలో మరియు కోనసీమ జిల్లాల్లో దసరాకు పెట్టటం రివాజు. ఎప్పుడైతేనేమి చెప్పండి మనకు ఇంట్లో హడావిడి, చేసే వంటలు, ఆర్భాటం ముఖ్యం)

ఇక రంగప్రవేశం, మొదటి ఘట్టం:

బొమ్మలకొలువుకు సమాయత్తం అవ్వటం. మా ఇంట్లో కొలువు ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మ ఒక హరితవనం (పార్క్) ఏర్పాటు చేసేది. ఒక వారం ముందు ఒక పెద్ద ఇనుప రేకు మీద మట్టితో కట్టలుకట్టి ఒకవరుస నల్లమట్టి పోసి, బాగా సాంద్రంగా వరిగింజలు వేసేది. రోజు నీళ్ళు పోసి అవి పండగనాటికి మంచి మొలకలు వచ్చి ఒక అంగుళంకి పైగా పైరు ఉండేలా దట్టంగా పెంచేది. అప్పుడు దాంట్లో వివిధ రకాల జంతువులూ, పక్షులు, చెట్లు అమర్చి ఒక అడవిని తలపించేలా చేసేది.

ఈ హరితవనం తర్వాత బొమ్మల కొలువుకి కావలసిన వరుసక్రమం ఏర్పాటు. ఇంట్లో పాత ఇనపబల్ల ఒకటి ఉండేది మడతబెట్టే రకం. అది గట్టి కాళ్ళతో మొదటి వరుస. రెండు, మూడు వరుసలు మా ఇంట్లో బొమ్మలకోసం అని రెండు చెక్కపెట్టెలు ఉండేవి (ఇప్పటికి ఉన్నాయి అనుకుంటా). ఆ తర్వాతి వరుసలు చిన్న ఇనపపెట్టెలు, చెక్క స్టూలు లాంటివాటితో చేసి వాటిమీద చక్కగా పట్టు చీరలు కప్పి వరుస మెట్లు తయారు చేసే వాళ్ళు అమ్మ, అక్క. దీనికి దాదాపు ఒక పూట పట్టేది.

తర్వాత, వీటి మీద బొమ్మలను పేర్చటం. అమ్మ కొన్ని ఏళ్ళనుంచి మంచి మంచి మట్టి, చెక్క, ప్లాస్టర్ అఫ్ పారిస్ బొమ్మలు సమకూర్చింది. రాధాకృష్ణులు, సీతారామలక్ష్మణ, హనుమంతులు, వెంకటేశ్వర స్వామి కొండపల్లి బొమ్మ, లక్ష్మి దేవి విగ్రహం, శివుడు, బాజమేళం బృందం, రైతు, ఎడ్లబండి, గడ్డిమోపు, ఎడ్లు, ఆవు, క్రూరమృగాలు, ఇలా అన్ని రకాల బొమ్మలు ఉండేవి. ఇప్పటికి చాలా ఉన్నాయి వీటిల్లో. దేవుళ్ళు, పెద్ద బొమ్మలు పైన మెట్టు మీద, వనం, మృగాలు నేలమీద అమర్చి మిగిలిన బొమ్మలు మధ్య వరుసలలో పెట్టేది. ఈ పనిలో మేము అమ్మకి సహాయం చేసేవాళ్ళం. అప్పట్లోనే అమ్మ రంగుల లైట్లు పెట్టేది కొలువుకి. ఇవన్ని అమర్చేసరికి భోగి ముందురోజు రాత్రి చాలా ఆలస్యం అయ్యేది.

ఇక వీటితోపాటు, పాత పనికిరాని వస్తువులు అన్ని పారేయటం. భోగిమంటలు వేయటానికి  పనికి వచ్చే కట్టెలు, చెక్క ముక్కలు లాంటివి అన్ని సేకరించి పెట్టటం.

రెండవ ఘట్టం:

భోగి రోజు -

భోగిమంటలు:

తెల్లవారుఝామునే లేచి సూర్యోదయం కన్నా ముందు భోగి మంటలు వేయటం. ఇది అన్నిట్లోకి నాకు నచ్చిన అంశం. బాగా చలి కాచుకుని ఇంట్లోకి వెళ్లి అమ్మ చేత తల అంటించుకుని తలస్నానానికి తయారు.

భోగి రోజు ముగ్గు:

ముందుగానే ఏ పండగ రోజు ఏ ముగ్గు వేయాలో నిర్ణయించుకొని ఈనాడు పేపర్లో వచ్చిన ముగ్గులు, ఆంధ్రప్రభలో వచ్చిన ముగ్గులు కట్ చేసి లేదా నోట్సులో చుక్కలతో సహా రాసుకొని పెట్టుకోనేవాళ్ళు అమ్మ, అక్క.  ఉదయం తెల్లారకముందే ముగ్గు వేసి, రంగులు పెట్టి, గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు. ఆ గొబ్బెమ్మల కొప్పుల్లో మంచి ముద్దబంతి బెట్టి అలంకరించేవాళ్ళు. వీధి మొత్తంలో వీళ్ళ ముగ్గే ఆకర్షణ. అదొక తృప్తి, ఆనందం. రంగులు అద్దటంలో మేము సహాయం చేసే వాళ్ళం.

భోగి తలంట్లు, భోగి పండ్లు:

ముందు రోజు నాన్న తెచ్చిన రేగి పళ్ళతో తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవటం. మా ఇంట్లో ఎందుకో భోగి రోజే కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ తర్వాత అమ్మ వంట వగైరా. సాయంత్రం కొలువుకి దీపం, నైవేద్యం పెట్టటం. అమ్మలక్కలని పేరంటానికి పిలవటానికి అక్క, అమ్మ వెళ్ళే వాళ్ళు. మర్నాటి పేరంటానికి కావలసిన పళ్ళు, తమలపాకులు, వక్కలు వగైరా, కూరగాయలు (చిక్కుడు కాయ కూర ఉండల్సినే మాయింట్లో సంక్రాంతి నాటికి) నాన్న బాధ్యత.

అరిసెలు వండటం:

అమ్మ బియ్యం నానా పోసి రోట్లో దంచేది. చాలా కష్టమైనా పని ఇది. రోటి పైన చెక్క కుదురు పెట్టి, పొడవాటికి రోకలితో ఒక రెండు గంటలు దంచితే ఆ బియ్యం పొడి అయ్యేవి. తర్వాత దాన్ని జల్లించి, మెత్తటి పిండి తయారు చేసేది. జల్లించి మిగిలిన పిండిని మళ్ళీ రోట్లో వేసి దంచి అలా అలా మొత్తానికి మెత్తటి బియ్యప్పిండి స్టీల్ బేసిన్లో పెట్టుకునేది. తర్వాత సమపాళ్ళలో బెల్లం పాకం చేసుకొని, పిండిలో వేసి కలిపేది. ఆ తర్వాత నేను, నాన్న, ఎవరు వీలయితే వాళ్ళు ప్లాస్టిక్ కవర్ మీద నూనె వేసుకుని అరిసె అద్ది అమ్మకు  ఇస్తే, అమ్మ వాటిని బాగా వేయించి చేతులు బలంగా ఉన్న నాన్న,అమ్మ వొత్తేవాళ్ళు. చిల్లుల గరిటెలు ఉండేవి ఇంట్లో. వాటితో ఈ కాల్చిన అరిసెల పని పట్టేవాళ్ళం నూనె అంత కారే పోయేదాకా. అప్పుడు వాటిని ఒక పెద్ద అల్యూమినియం డబ్బాలో వేసి పెట్టేది. నాకు, నాన్నకు నువ్వులు వేసిన అరిసెలు ఇష్టమని అమ్మ కొన్ని అవి చేసేది.

గాలి పటాలు:

మేము గాలి పటాలు కొనుక్కుని, మాంజా, చరఖా సరిచూసుకుని వాటిని ఎగరవేయటానికి సిద్ద్ధం అయ్యేవాళ్ళం. రంగురంగుల గాలిపటాలు ఐదు, పది పైసలకు వచ్చేవి. వీలయితే ఆరోజే ఎగురవేసేవాళ్ళం. పక్కన నాగరాజు, శ్రీను, భాను ఇలా ఎవరు మా వయసు మొగపిల్లలు ఉంటే వాళ్ళతో పోటీపడి ఎగురవేసి కొన్నిట్ని కోసి, మావి కోయిన్చుకుని, తెగినవాటిని పరిగెత్తి పట్టుకొని...అలా అలా రెండు మూడు విడతలుగా సాగేది ఈ ప్రహసనం.

మూడవ ఘట్టం:

సంక్రాంతి ముగ్గు:

సంక్రాంతి ముగ్గు మొత్తం పండగకి మకుటం. అమ్మ, అక్క చాలా సంక్రాంతి పండుగలకి కలశాల ముగ్గు వేసారు. నాలుకు వైపులా నాలుగు కలశాలు (తెలుగుతల్లి పూర్ణకుంభంలా), వాటిమధ్యలో పద్మం. అద్భుతంగా ఉండేది ఆ రంగవల్లి. పసుపు, నెమలిపించం రంగు, ఊదా రంగు, గులాబి రంగు, ఆకుపచ్చ, నీలం ఇలా అన్ని రంగులను సమంగా ముగ్గులోని గళ్ళలో నింపి వాటిపైన గొబ్బెమ్మలు పెట్టి అలంకరించేవాళ్ళు. ఈ కలశాలముగ్గు మా అమ్మ/అక్క బ్రాండ్, పేటెంట్ లాగ ఉండేది.  ఏ ఊరిలో ఉన్నా ఆ వీధిలో అమ్మ,అక్క వేసిన ఈ ముగ్గు మహారాణి ముగ్గు.

సంక్రాంతి వంట:

సంకురాత్రి రోజు అమ్మ పులగం (పెసరపప్పు, జీలకర్రతో అన్నం), చిక్కుడుకాయ కూర, నువ్వుల పొడి. ఇది మా ఇంట్లో మాములుగా ఉండే వంటలు. వీటికి తోడు పాయసం, కారప్పూస, అరిసెలు ఉన్నాయి కదా. సంక్రాంతి పెద్దల పండగ కదా అమ్మ దేవుడి దగ్గర బామ్మకు, తాతయ్యకు బట్టలు పెట్టి నమస్కారం చేసేది. భోజనం బాగా తిన్న తర్వాత అమ్మకు కొంత విశ్రాంతి.

సాయంత్రం పేరంటం:

పిలిచిన అమ్మలక్కలు అందరు వచ్చి బొమ్మలకొలువుని చాలా పొగిడే వాళ్ళు. అందులో ముఖ్యంగా వనం, బొమ్మలో ఉండే కళ (అమ్మ వెతికి వెతికి కొనేది), పేర్చిన పధ్ధతి అందరిని బాగా మురిపించి ఆకర్షించేది. అక్క చాలా పాటలు పాడేది. మంచి గొంతు, స్వరం, అమ్మ స్ఫూర్తి అన్ని కలిసి మాకు అక్క పాట అమృతంలాగ ఉండేది. వచ్చిన వాళ్ళు కూడా పాడి ఆనందిచేవాళ్ళు. సన్నిహితులకి అమ్మ చేసిన అరిసెలు, కారప్పూస లాంటివి పంచి త్రుప్తిపొందేది.

అలా సాగేది మా సంక్రాంతి లక్ష్మి ఆహ్వానం. చాలా హాయిగా, వివిధ రకాల పనులు, కళలు, సందడి, పోటీ వాతావరణంలో ఎంతో ముచ్చటగా సాగేది.

నా శ్రీమతి ఇప్పటికి ఈ సంప్రదాయాన్ని హైదరాబాద్ అపార్ట్మెంట్లో ఉండి కూడా నడిపిస్తోంది. బొమ్మల కొలువు, పేరంటం, ముగ్గు, అరిసెల యాత్ర అమ్మ నుంచి బాధ్యత తీసుకొని మా అమ్మాయి సరదాకోసం ముందుకు విజయవంతంగా నడిపిస్తోంది జ్యోత్స్న.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి