మాయాబజార్ (రంగులో) విడుదల అయ్యి వంద రోజులయ్యింది. హైదరాబాద్ ప్రజలు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. ఇన్నేళ్ళ తర్వాత కూడా ప్రజల మనస్సులో ఆ అసలు సిసలు కళాఖండానికి మంచి స్థానం ఉంది అని నిరూపించారు. ఆ ప్రేక్షకులందరికీ నా జోహార్లు.
ఏంటండీ అంత గొప్ప ఈ చిత్రంలో? నన్నడిగితే ఏది గొప్ప కాదో చెప్పండి అని ప్రశ్న వేస్తాను. అవరోహణాక్రమంలో ఇవన్ని గొప్పే:
1 . మహానటి సావిత్రి - శశిరేఖ పాత్రలో జీవించి ప్రతి క్షణం అభినయ శిఖరాన్ని అధిరోహించింది. మాయ శశిరేఖ పాత్రలో హావ భావాలు, నటనా చాతుర్యం, మూర్తీభవించే అందం - అన్నీ ఓహో ఆహా అనుకునేలా ఉంటుంది - అందుకనే ఆమెకు ఈ సినిమాలో అగ్ర తాంబూలం ఇచ్చి బంగారు పతకం.
2 . విలక్షణ మహానటుడు ఎస్వీ రంగారావు గారు - భీకరమైన ఘటోత్కచుడిగా, సున్నితమైన వీర, హాస్య రసాలను మేళవిస్తూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో మున్చెత్తించారు. ఆయన మాట భీషణ మేఘగర్జనలా ఉంటుంది ఈ చిత్రంలో. ఆయన వేషభూషణ ముమ్మూర్తులా ఘటోత్కచుడిని తలపిస్తుంది. ఆయన రంగప్రవేశం ఒక కమనీయ దృశ్యం. ఆయనకు కూడా సావిత్రితో బంగారు పతకం.
3 నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ - తన సమ్మోహనారూపంతో, సందర్భోచితంగా ఆధ్యాత్మిక, ఆధిభౌతిక సందేశం ఇమిడియున్న మృదు, మధుర, కఠిన భాషణతో, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మహనీయుడి నటనా కౌశల్యానికి రజత పతకం. సావిత్రి, ఎస్వీఆర్ తో పోలిస్తే పాత్ర కొంత తక్కువ కాబట్టి రజత పతకం అని నా అభిప్రాయం.
స్త్రీల సంభాషణలు (ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్ననానుడిని తలపిస్తూ), వీర, శృంగార, హాస్య రసాలను సమ పాళ్ళలో కలిపి సంగీతంతో రంగరించి తేనెలా తెరపైకి ఎక్కించిన కెవి రెడ్డి గారికి కృతజ్ఞతాభివందనాలు.
ఇకపోతే ఘంటసాల వారి సంగీతం, పింగళి వారి సాహిత్యం, మార్కస్ బార్ట్లీ అద్భుత ఛాయాగ్రాహం, అక్కినేని, గుమ్మడి, రేలంగి, ఛాయాదేవి, రుష్యేన్ద్రమణి, సంధ్య, రమణారెడ్డి, వంగర, అల్లు రామలింగయ్యల నటన....ఇవన్నీ కూడా వెలలేని శోభలు. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి