RightClickBlocker

26, మే 2010, బుధవారం

అమ్మ - ఆమె జీవితంలో ఒక సువర్ణాధ్యాయం నిజామాబాద్

నిజామాబాదు అనేది చిన్న పట్టణం అప్పట్లో. మేము ఊరి చివర క్వార్టర్స్లో ఉండే వాళ్ళం. మంచి గాలి, చుట్టూ చెరకు తోటలు, కొన్ని వందల ఇళ్ళు, ఆ ఇళ్ళలో ఉండే వాళ్ళ మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు - అదొక భూతల స్వర్గం అనుకోండి. అప్పట్లో ఈ తెలంగాణా, నక్సలిజం లాంటి సమస్యల ఊసే లేదు సుమండీ అక్కడ.  అన్ని ప్రాంతాల వాళ్ళు, వివిధ రాష్ట్రాల వాళ్ళు, మతాల వాళ్ళు, కులాల వాళ్ళు - అందరం కలిసి మెలసి ఒక మంచి కాలనీ వాతావరణంలో నివసించాం.

ఈ కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డు కాలనీలో మేము ఎల్.ఐ.జీ లో ఉండే వాళ్ళం. ఉన్న 150 గజాల స్థలంలో మా అమ్మ తన ప్రతిభనంత చూపించి అన్ని రకాల మొక్కలన్నీ పెంచింది. మంచి మట్టి తెప్పించి వేసి, ఎరువుగా మేక, బర్రె పేడ, కంపోస్ట్ తయారు చేసి మంచి సారవంతం గా చేసి విత్తనాలు, మొలకలు, పిలకలు, అంట్లు నాటించింది.

ఒక పక్క అంతా గులాబీల వనం, వాటికి ఒక పక్క చేమంతుల వనం, మరొక పక్క లిల్లీలు, మరువం, దవనం, మాచుపత్రి  లాంటి సుగంధ పత్రపు మొక్కలు, చుట్టూరా బంతి చెట్లు. అబ్బో చూస్తె అదొక నందనవనంలా ఉండేది.  ఎన్ని రంగుల గులాబీలో - ఎరుపు, పసుపు, తెలుపు, రెక్క, ముద్ద - ఎండాకాలం వస్తే ఇవన్ని ఆకు కనిపించకుండా పూసేవి. అలాగే దసరా పండగ సమయానికి తెలుపు, పచ్చ, ఎరుపు చేమంతులు, ముద్ద బంతులు తెలుపు, పసుపు, కాషాయం రంగులలో రెండు చేతులలో  పట్టనంత పూలు పూసేవి. ఆరోజులలో మా దగ్గర కెమెరా లేదు కాని, ఉంటె అమ్మ ఎన్నో పోటీలలో గెలిచేది.

మా దేవుడికి, గడపలకు, కాలనీలో చాల మందికి మా పూలే. చాలారోజులు చుట్టూ చెట్లతోనే కంచే ఉండేది. తరవాత తడికేలతో పెట్టాము. అలా గేటు తెరిస్తే పూల వాసన, ఆ చెట్లనుంచి ఆహ్లాదమైన అనుభూతి కలిగేది. నిజామాబాదు వాతావరణం చలి, వేడితో కూడినది కాబట్టి పచ్చదనం బాగా ఉండేది. నేలలో కూడా మంచి సారం ఉండేది కాబట్టి వేసింది వేసినట్టు బాగా పెరిగేవి. నీళ్ళ వసతి అంతగా లేకపోయినా అమ్మ బోరేవేల్ కొట్టి నీళ్ళు పోసేది. చాల కష్ట పడి పెంచింది అమ్మ వాటిని.  కష్టపడటం, దాని ఫలితాన్ని నలుగురితో పంచుకోవటం ఆమెకు చాలా తృప్తినిచ్చేది.

ఇంకొక పక్క కూరగాయల చెట్లు - వంకాయ, దొండకాయ, బెండకాయ, టమాటో, సొరకాయ, బీరకాయ, పొట్ల కాయ; ఆకు కూరలు - చుక్క కూర, తోటకూర, గోంగూర, బచ్చలి కూర, మెంతికూర, కొతిమీర, కరివేపాకు - ఆ మొక్కలన్నీ అమ్మ పెంచి పండించింది నాలుగేళ్ళపాటు -1979 -1983 .

ఇంటి పెరట్లోకి వెళితే అరటి చెట్లు. అవి ఎంత కాసేవి అంటే 365 రోజులు గెలలు ఉండేవి. ఇంటి వెనకాల భాస్కర శర్మ గారికి, చుట్టూ పక్కల చాలా మందికి అమ్మ పంచేది. ఒక్క పిలక వేస్తె వంద పిలకలు వచ్చాయి. అరటి తోట అనుకునే వాళ్ళు.

ఇంకొక పక్క తీగ పాదులు. బూడిద గుమ్మడి కాయ చెట్టు పెడితే ఒక సంవత్సరం వంద కాయలు కాసింది. మా చుట్టాల అమ్మాయి గాయత్రి వచ్చి రిక్షా లో తీసుకు వెళ్ళేది. మామిడి చెట్టు కూడా వేసింది అమ్మ. ఆ చెట్టు మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కాపుకు వచ్చి కొన్న వందల బంగినపల్లి పండ్లు కాసిందిట. అమ్మ చేతిలో ఏదో ఉంది ఆ మొక్కలలో అంత జీవశక్తి ఉండటానికి.

ఈ మొక్కలన్నీ, ఇలాంటి వాతావరణం వదిలిపెట్టి మా చదువులకోసం కష్టాల ఊబి అనే హైదరాబాద్ కి వచ్చాము మేము 1983లో. ఆ తర్వాత నిజంగా అమ్మ పెద్ద మానసిక ఆనందం, శారీరిక సౌఖ్యం పొందలేదు. ఏదో ఒక సమస్య, చికాకు వాతావరణం, పిల్లలు దూరం వెళ్ళటం, నాన్న వేరే ఊళ్ళో పనిచెయ్యటం ఇవన్ని ఆమె సామర్థ్యాన్ని కొంత వరకు నిర్వీర్యం చేసాయి. కానీ ఆమె ఎప్పుడు తన ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కోల్పోలేదు. ఎవ్వరికి తలవంచలేదు. ఇప్పటికి అలాగే దేవుడు పెట్టిన పరీక్షలను అధిగమిస్తూ అలానే సాగుతోంది ముందుకు...

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి