RightClickBlocker

27, మే 2010, గురువారం

మన సూర్యకాంతం గారు


చచ్చి ఏ లోకంలో ఉందోగాని ఆ మహాతల్లి కొన్ని దశాబ్దాలు కోడళ్ళ, సవితి కూతుళ్ళ, తోడికోడళ్ళ, మొగుళ్ళ ప్రాణాలని తోడేసి, ఉతికి ఆరేసిందంటే నమ్మండి. అమ్మో అమ్మో అదెక్కడ అఘాయిత్యమో, ఆ పుర్రచేయి వాటమేందో, ఒక ఊపు ఊపి గరిటె కాల్చి వాతలు పెట్టిందండి ఆయా పాత్రలు వేసిన వాళ్ళందరికీ.  ఒకళ్ళా ఇద్దరా ఎంత మంది నటేనటులు ఆమె చేత దెబ్బలు, శాపనార్థాలు తిన్నారో.

నిస్సహాయులైన భర్తలుగా రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, ఎస్వీ రంగారావు గారు, నాగయ్య గారు - ఆమె కళ్ళకు, చేతులకి భయపడి పిల్లిలాగ ఉన్నవాళ్ళే. పాపం మహానటి సావిత్రి అయితే  చీపురు, గరిటె దెబ్బలు కూడా తిన్నారు ఈ తల్లి చేతుల్లో. ఇలా జమున, వాణిశ్రీ వగైరా వగైరా అందరు ఆమె బాధితులే.

అయ్యిందండి ఆమె పరిచయం - అదేనండి మన సూర్యకాంతం గారే. ఇంకెవరుంటారు చెప్పండి?.  అంత ధాటిగా, దీటుగా, కర్కశంగా ఆ అమాయక పక్షులపైన?. పాపం హైకోర్ట్ జడ్జీ అయిన ఆ పెద్దిభొట్ల చలపతిరావు గారు ఎలా భరించారో కానీ ఈవిడని భార్యగా.

ఆ తల్లికి జోహార్లు అర్పిస్తూ ఈ చిన్న వ్యాసం:

ఆమె అభినయచాతుర్యం, ఆ భాష, ఆ పదాలు, ఆ వేషం - ఆవిడకి వేరే సాటి లేనే లేరు.  ఆ చేతులు తిప్పుతూ తిట్ల దండకం మొదలెట్టిందంటే ఎదురుగా ఎన్టీఆర్ అయిన సరే ఏఎన్నార్ అయిన సరే గజ గజ వణికి పోవాల్సిందే. ఆరణాల తెలుగు కోనసీమ, మన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఆ మహాతల్లి మన భాషను, అందులో ఉన్న అద్భుతమైన పదప్రయోగాలు, ప్రాసలు, సామెతలు, యాసలు ఉపయోగించి అది ఒక చలనచిత్ర సంభాషణలా కాకుండా ఒక నిజ జీవితంలో ఘట్టంలా పాత్రలలో తాదాత్మ్యం చెంది జీవించింది.

ఆమె కౌశలాన్నితెలుగు చలనచిత్ర ప్రేక్షకులు విస్తుపోయి, నోళ్ళు వెళ్ళబెట్టి చూసారు. అది ప్రతినాయిక పాత్ర అయిన సరే దాని చప్పట్లతో హర్షించారు, జేజేలు కొట్టారు. అత్త, సవితితల్లి, తోడికోడలు, గయ్యాళి కోడలు అంటే సూర్యకాంతమే అనుకునేలా మన మనస్సుల్లో నిలిచిపోయింది ఆ కళామతల్లి ముద్దు బిడ్డ.

ఇక్కద రెండు పాత్రలు ఉదహరించాలి:

1. గుండమ్మ కథ

ఈ చిత్రం పేరు ఆవిడ పాత్ర పేరును బట్టి పెట్టారు అంటే ఆవిడ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో తెలుస్తుంది. ఇక్కడ అసలు కథ ఇద్దరు అన్నదమ్ములు గుండమ్మగారి ఇద్దరు కూతుళ్ళని ఎలా పెళ్ళిచేసుకుంటారు అన్నది. రామారావుగారు, నాగేశ్వరరావుగారు, సావిత్రి, జమున - వీరు ప్రధాన పాత్రలు. కానీ వీరందరినీ మించి సినిమా మొత్తం గుండమ్మ గారి చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే ఆవిడకు డబ్బున్న అహంకారం, సవితి కూతురైన సావిత్రిని పెట్టిన బాధలు, గారాబంతో కూతురిని (జమున) జీవితపు విలువలు తెలియకుండా పెంచటం, తల్లి నోటికి భయపడి కొడుకు (హరనాథ్) చాటుగా ప్రేమించి తర్వాత ఎదిరించటం , నమ్మిన తమ్ముడు గంటయ్య (రమణారెడ్డి) మోసం చెయ్యటం, ఇలా సినిమా మొత్తం ఆవిడ పాత్రమీద అల్లుకుని ఉంటుంది.

తెలుగు సినీ స్వర్ణయుగంలో హేమాహేమీలున్న సమయంలో, అందరిని ఆదరకొట్టే ఎస్వీరంగారావు, నటనాశిఖరంపై ఉన్న రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున పాత్రలను మించి కాంతమ్మ గారి పాత్రకు అగ్రతాంబూలం వేసి, దానికి తగ్గ పోటీ పాత్రలో ఛాయాదేవిని పెట్టి అద్భుతంగా తీసారు సినిమా దర్శకులు.

అలా పేరు పెట్టి, ఆమె పాత్రకు ప్రాణం పోసి, ఆమె అనిర్వచనీయమైన నటనతో ఆ సినిమా విజయభేరి మోగించి స్వర్ణయుగపు సినిమాలలో కలికితురాయిగా మిగిలింది.

2.  తోడికోడళ్ళు

ఈ చిత్రంలో ఈవిడ రేలంగి గారి భార్య. మహానటి కన్నాంబ, మహానటి సావిత్రి ఈవిడ తోడికోడళ్ళు. నాగేశ్వరరావు గారు ఈవిడ మరిది, ఎస్వీ రంగారావు గారు బావగారు. ఇంత మంది అతిరధుల మధ్య ఒక అత్యాస, అసూయలు కలిగిన ఒకే ఒక ప్రతినాయిక పాత్ర మన కాంతమ్మ గారిది. క్షణక్షణం తన అత్యాశకు అడ్డుపడే చిన్న తోడికోడలిని  పెట్టిన తిప్పలు చెప్పనలవి కాదు. పరాయి పిల్లల్ని, తన పిల్లల్ని నిజ జీవితంలో ఒక దురాశ ఉన్న గృహిణి ఎలా భేదంతో చూసి సాధిస్తుందో సినిమా చూసి ఆస్వాదిస్తే కానీ అర్థం కాదు. పని తక్కువ, ఆకలి ఎక్కువ అన్న కోణంలో రాత్రి పూట దొంగతనంగా భోజనం చేసే సన్నివేశంలో ఆమె నటన అద్భుతం.

ఇలా ఎన్ని పాత్రలో - పాశ్చాత్యపు పోకడలు ఉన్న స్టైలిష్ తల్లి పాత్ర, తెలివైన అమ్మమ్మ, వంటమనిషి రూపంలో  పచ్చని ఇంట్లో సెగలు రేపే పాత్ర,  వీరమాత హిడింబిగా - ప్రతి పాత్ర ఒక కళాఖండం, ప్రతి సన్నివేశం ఒక రసప్రవాహం.

తెలుగుదనాన్ని నింపి, గుప్పించి, పాత్రకు వందశాతం న్యాయం కూర్చి స్వర్ణయుగపు మహారథుల సాటిగా నిలిచింది ఆ పెద్దిభొట్ల వారికోడలు. ఎక్కడో చదివాను - ఆవిడ నిజ జీవితంలో వెన్నలాంటి మనసు ఉన్న తల్లి అట. కష్టంలో ఉన్న ఎంతోమంది నటీనటులకు మానసిక,ధన సహాయం చేసిన మహామహిళ ఆవిడ. భానుమతి అంత మహానటికి నచ్చిన ఏకైక నటి ఈ కాంతమ్మగారు.

ఆ తల్లి మళ్ళా మన గోదావరి జిల్లాలోనే పుట్టి మళ్ళీ వెండితెరను ఏలాలని నా కోరిక. జోహార్లు తల్లీ!!!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి