15, జులై 2026, బుధవారం

భావస్వరాల పల్లకి శిష్ట్లా జానకి - భాగం 3



ఒక స్త్రీ ఎన్నని ఆటుపోట్లను తట్టుకోగలదు? జానకి గారు 59 ఏళ్ల వయసులో అమితంగా ప్రేమించే భర్త రాం ప్రసాద్ గారు హఠాత్తుగా చనిపోయారు. ఏదో విశ్రాంతిగా వృద్ధాప్యం గడుపుదామనుకుంటే కొడుకు, కోడలు విడాకులు తీసుకున్నారు, 2023లో మనవరాలు అమృతవర్షిణి మరణించింది, ఈ ఏడాది జనవరిలో ఒక్కగానొక కొడుకు మరణించాడు...ధైర్యానికి, మనసు దిటవు చేసుకోవటానికి కూడా ఒక పరిధి ఉంటుంది, ఎందుకు ఇంక జీవించటం అన్న భావన కలిగి తీరుతుంది. ఎంతటి సకారాత్మక ధోరణి ఉన్నా ఇన్ని ఎదురుదెబ్బలు తట్టుకొని నిలబడటం చాలా కష్టం. మూడు తరాల వారు - తనకు నిరంతరం వెన్నుదన్నుగా నిలిచి అద్భుతమైన గాయనిగా విజయం సాదించటంలో ప్రధాన పాత్ర పోషించిన భర్త, తను కన్నబిడ్డ, తను అమితంగా ప్రేమించే మనవరాలు తన ముందు దాటిపోవటం చాలా బాధాకరం. విధి చాలా కర్కశమైనది.


అయినా కూడా చివరి వరకూ నవ్వుతూ, సంగీతాన్ని ఆస్వాదిస్తూ జానకమ్మ జీవించారు. బాధ మనకు కనబడదు, ఎందుకంటే ఆవిడ ఆధ్యాత్మికతను ఒంటబట్టించుకున్నారు. ఆవిడ నలుగురి ముందు బాధపడితే అభిమానులు ఆస్వాదించలేరు కూడా. అందుకే పోరాటంలా కాకుండా సుఖదుఃఖాలను సమదృష్టితో చూడటం అలవరచుకున్నారు.

ప్రజాజీవితంలో ఉండటం వల్ల వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ మీడియాలో చెప్పుకోనక్కర్లేదు అన్నది జానకి గారి సిద్ధాంతం. జానకమ్మ వ్యక్తిత్వంలోని ఈ కోణాన్ని అర్థం చేసుకుంటే ఆవిడ ఎందుకు గొప్ప మహిళో అర్థమవుతుంది. మహిళలందు పుణ్యమహిళలు వేరయా!

కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు

తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్లు దారి ఓ ముళ్ల దారి
రాలేరు ఎవరూ నాతో చేరి

వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగిన నాడే తెలియును కొన్ని

14, జులై 2026, మంగళవారం

నరవరా ఓ కురువరా - జానకమ్మ స్వరలహరి



జానకమ్మ గాత్రం సౌరభం ఎంత మనోజ్ఞమైనదో తెలిపే ఓ అద్భుతమైన నృత్యప్రధాన గీతం ఇంద్రసభలో ఊర్వశి అర్జునుని ఎదుట నాట్యం చేసే సన్నివేశంలో. పద్మిని ప్రియదర్శిని అనే గొప్ప నర్తకిపై ఈ గీతాన్ని నర్తనశాల (1963) చిత్రంలో చిత్రీకరించారు. భీం పలాస్ రాగంలో సుసర్ల దక్షిణామూర్తి గారు స్వరపరచగా, సముద్రాల వారి సాహిత్యాన్ని అతిమధురమైన గమకాలతో, నృత్యశైలికి తగిన గాత్రధర్మంతో ఆలపించారు జానకమ్మ. ముఖ్యంగా రెండు చరణాలలోని ఆఖరి పంక్తులు నిజంగా సురలోకాన్ని తలపిస్తాయి. గీతం పల్లవిలో, చరణాల్లో షడ్జమం తారాస్థాయిని దాటినా శృతి తప్పకుండా ఆలపించారు. ఇది మరెవ్వరికీ సాధ్యం కాని ప్రక్రియ. ఆవిడకు గాత్రంపై ఉన్న పట్టు దైవదత్తం. 

పద్మిని ప్రియదర్శిని గారు నటి కన్నా ముందు గొప్ప నర్తకి. వళవూరు రామయ్య పిళ్లై గారి వద్ద శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుని ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. తరువాత బెంగళూరులో నాట్యప్రియ అనే నృత్య శిక్షణాలయాన్ని స్థాపించారు.

పాటకు తిరిగి వస్తే, జానకమ్మను ఎక్ప్రెషన్ క్వీన్ అని ఊరికే అనలేదు మరి. వీడియోలో పద్మిని ప్రియదర్శింగి గారి మెరుపు నృత్యం, నటన చూస్తూ, సాహిత్యాన్ని అర్థం చేసుకోండి, జానకమ్మ మనకు అందించిన స్వరామృతాన్ని ఆస్వాదించండి. పాటలో ఎన్ని హోయలున్నాయో, నృత్యంలో కూడా అన్నే హోయలను ప్రదర్శించారు పద్మిని గారు. అందుకే ఈ గీతం, చిత్రం అజరామరం అయ్యాయి. 

నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి లేరని
సరసులలో జాణవని
విన్నారా కన్నారా కనులారా

సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి బలాన
సాటి లేని వీరుండన్న యశమును గన్నా
అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదు గొన్న విజయా 

నిను గని తల ఊచే ఉలూచి కొనుమని చేయి సాచే సుభద్ర
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
అలరుల విలుతుని ములుకుల గురియై వలపులమ్ముకొనురా

https://www.youtube.com/watch?v=s7aHgIiG8NI

12, జులై 2026, ఆదివారం

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు - జానకమ్మ ఇంద్రజాలం


శ్రీవారికి ప్రేమలేఖ తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న వినోదాత్మక ప్రేమకథా చిత్రం. నరేష్, పూర్ణిమల సినీ ప్రస్థానంలో అత్యంత విజయవంతమైన చిత్రం కూడా. రామోజీరావు గారి నిర్మాణంలో జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నేపథ్యం స్వర్ణ ఆనందరావుకు రాసే ప్రేమలేఖ. ఇంతకీ ఆ ఆనందరావెవరో తెలియదు, ఆ ప్రేమలేఖ వారిద్దరినీ ఒకరికొకరు తెలియకుండా ఒకే వీథిలో నివసించేలా మలుపులు తిప్పుతుంది. పొత్తూరి విజయలక్ష్మి గారి కథ సినిమాకు బలమైతే, ప్రేమలేఖ ఆవిష్కరణ, పాట రూపంలో జానకమ్మ దాన్ని ఆలపించిన రీతి, సినిమాకు హైలైట్. జానకమ్మ వాయిస్ మాడ్యులేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, విరహ శృంగార భావనలను వ్యక్త పరచే ఊర్పులు, నిట్టూర్పులతో, అణువణువునా జానకమ్మ వేటూరి సాహిత్యానికి, రమేష్ నాయుడు గారి సంగీతానికి జీవం పోశారు.

ఈ సినిమా తెలుగు చిత్రాల గమనాన్ని మార్చింది. జంధ్యాల గారిని హాస్య వినోద కుటుంబ కథల దర్శకేంద్రునిగా నిలిపింది. జానకమ్మ శృంగార గీతాలకు మహారాణిగా శాశ్వతకీర్తిని తెచ్చిపెట్టింది. ఇదిగో ఆ ప్రేమలేఖ, వీడియో.

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
ప్రియానంద భోజా
మీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి
మిము వరించి
మీ గురించి
ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో భక్తితో అనురక్తితో
శాయంగల విన్నపములూ

సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు ఎన్నెన్నో కధలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో

నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు ప్రేమ లేఖ

ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి

తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్ అబ్బా
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్ర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
ఆహ్ ఆహ్
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి

https://www.youtube.com/watch?v=I7-aGw7rBmo

భావస్వరాల పల్లకి శిష్ట్లా జానకి - భాగం 2


1. పుట్టుకతో వచ్చింది పాట అనేది. మాడ్యులేషన్‌తో సహా అన్ని మెలకువలు మూడేళ్ళ చిన్నవయసులోనే జానకమ్మకు అబ్బాయి.

2. పదేళ్ల వయసులో తల్లి ప్రోద్బలంతో అక్కలతో పాటు రాజమండ్రిలో అయిష్టంగానే పైడిస్వామి గారి వద్ద ఒక ఏడాది పాటు సంగీతం నేర్చుకున్నారు. నీకు నేను కొత్తగా సరిగమలు నేర్పక్కర్లేదు అని నగుమోము గనలేని కీర్తనను ఆయన నేర్పించారు.

3. చిన్నతనంలో సినిమా పాటలు పాడాలన్న అభిలాష తప్ప శాస్త్రీయ సంగీతం మీద ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు.

4. తెలుగులో నీ లీల పాడెద దేవా అనే పాట మురిపించే మువ్వలు చిత్రంలోది. ఇది డబ్ చేయబడిన చిత్రం. తమిళంలో నాదస్వరానికి జోడీగా పాడటానికి ఎందరో గాయనీమణులను వెదికినా సుబ్బయ్యనాడు గారికి తృప్తి కలగలేదు. చివరకు లీల గారు స్వరాల స్థాయికి పాడగలిగేది ఒక్క జానకి మాత్రమే అని ఆవిడ పేరు సూచించారు.

5. తెలుగులో సిరిమల్లె పూవా అనే పాట పదహారేళ్ల వయసు చిత్రంలోనిది. ఈ ట్యూన్ తమిళంలో పదినారు వయదినిలె అనే చిత్రంలో సెందూర పూవే అనే పాట. ఈ పాటకు జానకమ్మ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు వచ్చింది.

6. తెలుగులో జయప్రద తొలిచిత్రం అంతులేని కథ. అందులో కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు అన్న పాట తమిళ మూలం అవళ్ ఒరు తోడర్ కథై అన్న తమిళ చిత్రంలో కన్నిలే ఎన్న ఉందు అన్న పాట. రెండు చిత్రాలకు సంగీతం ఎం ఎస్ విశ్వనాథన్ గారే. రెండూ కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి.

7. 24 ఏళ్ల వయసు నుండే దుమ్ము ఎలర్జీ వల్ల విపరీతమైన ఆయాసం ఉన్నా శివదీక్షాపరురాలనురా వంటి ఎన్నో గీతాలను జానకమ్మ పాడారు. అలాగే, శంకరాభరణంలో సామజవరగమన పాడే సమయంలో ఒక మందు వల్ల ఎలర్జీ వచ్చినా గుండె బిగబట్టి బాలు గారితో రిహర్సల్ చేసి పాడారు.

8. వాయిస్ మాడ్యులేషన్ ఆవిడ ప్రత్యేకత. చాలా సార్లు పురుష కళాకారులకు వాయిసోవర్ ఇచ్చారు.

9. జానకి గారి గొంతులో సన్నాయి మోగుతుంది, సామవేదం పలుకుతుంది, పండు ముసలి వణుకుతుంది, పసిపాప పలవరిస్తుంది అన్నారు కళాతపస్వి విశ్వనాథ్ గారు. గోవులు తెల్లన, చిన్నారి పొన్నారి కిట్టయ్యా...ఈ ప్రతిభకు ఉదాహరణలు.

10. అభిలాష చిత్రంలో సందెపొద్దుల కాడ, బంతీ చామంతీ సూపర్ డూపర్ హిట్ పాటలు. ఇళయరాజా గారి సంగీతం పతాక స్థాయికి వెళ్లటానికి ఉన్న కారణాల్లో జానకి గారి వాయిస్ మాడ్యులేషన్, సృజనాత్మకత ముఖ్యమైనవి. అలాగే, రాక్షసుడు చిత్రంలో నీ మీద నాకు ఇదయ్యో అనే పాటలో జానకమ్మ గారి మాడ్యులేషన్ న భూతో న భవిష్యతి.

11. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో ప్రతి ఒక్క పాట కూడా జానకమ్మ పతాక స్థాయి ప్రతిభకు ఉదాహరణలే. అందాలలో అహో మహోదయం, ప్రియతమా నను పలకరించు ప్రణయమా, యమహో నీ యమా యమా అందం..ఇళయరాజా గారి సంగీతాన్ని అజరామరం చేశారు జానకమ్మ, బాలు గారు.

12. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం అన్నక్కిళి (తమిళం). అందులో అన్నక్కిళి ఉణ్ణై అనే పాట పెద్ద హిట్ అయ్యింది, అదే ట్యూన్‌లో తెలుగులో రామచిలుక చిత్రంలో సత్యం గారు రామచిలుక పెళ్ళికొడుకెవరే అనే పాటను జానకి గారి చేత పాడించారు. తెలుగులో కూడా అంతే హిట్ అయ్యింది పాట.

13. కొంజుం సాలంగై చిత్రంలోని సింగార వేలనే దేవా అనే పాట విని జానకి గారి గాత్రం నచ్చి మేటి దర్శకులు బీ ఎన్ రెడ్డి గారు పూజాఫలం చిత్రంలో పట్టుబట్టి మూడు పాటలు పాడించుకున్నారు - పగలే వెన్నెల, శివదీక్షాపరురాలనురా, మదనా మనసాయెరా అనే పాటలు.

14. ఆమె గొంతు స్వరకర్తలకు కల్పవృక్షం లాంటిది, ఆవిడ ఉచ్చారణ కానీ, భావం కానీ కవి ఎలా రాశాడో అలాగ యథాతథంగా పాడగల ప్రతిభ అని నమ్మి కళాతపస్వి విశ్వనాథ్ గారు తన చిత్రాలలో జానకమ్మ గారి చేత ఎన్నో పాటలు పాడించారు - ఓంకార నాదాను సంధానమౌ గానమే, సారిగరీగపదాపా, సామజవరగమన, సప్తపది చిత్రంలో నెమలికి నేర్పిన నడకలివి, భామనే సత్యభామనే, గోవులు తెల్లన, సాగరసంగమంలో ఓం నమశ్శివాయ, మౌనమేలనోయి వంటి ఎన్నో పాటలను పాడించుకున్నారు.

14. ఒకమ్మాయి ఒకబ్బాయిని వలలో వేసుకోవాలంటే మరి పాట సాహిత్యం అలా ఉన్నప్పుడు సాహిత్యానికి తగిన ధ్వనులు చేయాలి అన్నది ఆవిడ నమ్మకం. అందుకే ఆవిడ అప్పట్లో బూతు పాటలు అనుకున్న కొన్ని శృంగారగీతాలను పాడారు, అవి హిట్ అయ్యాయి. వృత్తి రీత్యా వీరు ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాలలో పని చేశారు, కొన్నాళ్లు రాజమండ్రిలో కొన్నాళ్లు సిరిసిల్లలో ఉన్నారు.

15. జానకి గారి తండ్రి శిష్ట్లా శ్రీరామమూర్తి గారు. ఆయన ఆయుర్వేదం డాక్టర్. వీరు ప్రస్తుతం బాపట్ల జిల్లా రేపల్లె దగ్గరలోని పల్లపట్ల గ్రామంలో జానకి గారు 1938వ సంవత్సరం ఏప్రిల్ 23న జన్మించారు.

16. హైదరాబాదులో ఉన్నప్పుడు మోనో యాక్టర్‌గా జానకమ్మ మామయ్య గారు అనేక పాత్రలను ధరించే వారు, మధ్యలో లతా మంగేష్కర్ పాటలు జానకమ్మ చేత పాడించుకునే వారు. ఆయన పాత్రలను మార్చుకునే సమయంలో ఆయన జేబులో నుండి రాంప్రసాద్ గారి ఫోటో కిందపడగా, దాన్ని దాచుకుని ఆయనపై ప్రేమలో పడ్డారు. వీళ్ల ప్రేమాయణం కొన్నళ్లు సాగింది. 1959లో వీరి వివాహం జరిగింది. రాంప్రసాద్ గారి ప్రోద్బలంతోనే ఆయన తండ్రి జానకి గారిని ఏవీఎం స్టూడియో అధినేతకు సిఫారసు చేశారు. ఆ తరువాతే ఆవిడకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగ, జానకి గారిది ప్రేమ వివాహం. తాను మరణించేంత వరకు జానకి గారి పరిపూర్ణమైన సహకారం, ప్రోత్సాహం అందించారు రాం ప్రసాద్ గారు. వీరికి ఒక అబ్బాయి మురళీకృష్ణ. కోడలు ఉమ కూచిపూడి మరియు భరత నాట్య కళాకారిణి. చెన్నైలో నాట్యశిక్షణా సంస్థను నడుపుతున్నారు. వీరి కుమార్తే వైద్యుల అప్సర బెంగళూరులో యోగా టీచర్. మురళీకృష్ణ గారు 2026లో మరణించారు.

17. ప్రముఖ సంగీత విద్వాంసులు, అన్నమాచార్యుల వారి కీర్తనలను ప్రచారం చేసిన వారిలో ప్రముఖులైన గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు జానకమ్మ గారి అక్కయ్య కొడుకు. అలాగే అలనాటి గాయకులు మాధవపెద్ది సత్యం గారి తల్లి శిష్ట్లా వారి ఆడపడుచు. ఆ విధంగా వీరిద్దరికి బంధుత్వం ఉంది.

18. 1997లో రాంప్రసాద్ గారి మరణం జానకి గారికి తీరని లోటుగా నిలిచింది. అయినా పాడటం మనలేదు,తరువాతి తరం కళాకారులను తల్లిలా ప్రోత్సహించారు.

19. భారతదేశంలోని 17 భాషలలో (హిందీతో సహా) జానకమ్మ గారు 48 వేలకు పైగా పాటలు పాడారు. హిందీలో యార్ బినా చైన్ కహారే (సాహెబ్), హోజా రంగీలా రే (రంగీలా) వంటి ఎన్నో హిందీ పాటలు ప్రజాదరణ పొందాయి. చెన్నై-ముంబై మధ్య తిరుగుతూ పాడిన రోజులు ఉన్నాయి.

20. జానకమ్మకు ఉత్తమ గాయనిగా 4 మార్లు జాతీయ అవార్డులు, 10 మార్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డు, 6 మార్లు తమిళనాడు రాష్ట్ర అవార్డు, 11 మార్లు కేరళ రాష్ట్ర అవార్డు, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 30కు పైగా ఇతర ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందారు.

11, జులై 2026, శనివారం

భావస్వరాల పల్లకి శిష్ట్లా జానకి - భాగం 1



ఏమని చెప్పాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఆవిడ నేపథ్య గాన ప్రస్థానంలోని విశేషాలు చెప్పటానికి ఆద్యంతాలు నిర్వచించటం కష్టం. జీవిత విశేషాలలా కాకుండా పాటల విశేషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.

ఎస్. జానకి గారి గాన వైభవం – సంగీత వైవిధ్యం, సంక్లిష్టత, భావగాంభీర్యం ఆధారంగా ఎంపిక చేసిన పది అపూర్వ గీతాలు:

1. నీ లీల పాడెద దేవా (మురిపించే మువ్వలు) – భక్తి / శాస్త్రీయ గానం

ఈ గీతం ఎస్. జానకి గారి గాన ప్రస్థానంలో ఒక అపూర్వ శిఖరాగ్రం. శాస్త్రీయ సంగీతంలోని సూక్ష్మ గమకాలను అత్యంత సహజంగా, ఎక్కడా శ్రమ కనిపించకుండా ఆలపించడం ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనం. భక్తిరసాన్ని కేవలం పదాలతో కాదు, ప్రతి స్వరంతో శ్రోత హృదయంలో ప్రవహింపజేసే అరుదైన సామర్థ్యం ఈ గానంలో వినిపిస్తుంది. ఉన్నత స్థాయి స్వరసంచారాలు, గాత్ర విస్తృతి, భావ గాంభీర్యం ఈ మూడింటినీ సమానంగా మేళవించిన అరుదైన గీతమిది. ఎస్. జానకి గారి సంగీత వైభవాన్ని ఒక్క పాటలో పరిచయం చేయాలంటే, నిస్సందేహంగా ఈ గీతాన్నే ఎన్నుకోవచ్చు. సుబ్బయ్య నాయుడు గారి సంగీతానికి, కారైకురిచ్చి అరుణాచలం గారి నాదస్వరానికి, అభేరి రాగంలో పోటీగా జానకి గారి ఈ పాట పాడారు.

2. సిరిమల్లె పువ్వా (పదహారేళ్ల వయసు)

ఈ పాటలో జానకిగారి స్వరం ఒక పల్లెటూరి అమ్మాయి అమాయకత్వాన్ని అత్యంత సహజంగా పలికిస్తుంది. ప్రతి పదంలో వినిపించే మృదుత్వం శ్రోతను పాత్రతో మమేకం చేస్తుంది. గాత్రంలో ఉన్న సూక్ష్మమైన గమకాలు పాటకు అపూర్వమైన సంగీత గాఢతను అందిస్తాయి. సరళమైన బాణీని అసాధారణమైన భావవ్యక్తీకరణతో చిరస్మరణీయంగా మార్చిన అరుదైన గీతమిది. తెలుగు సినీ సంగీతంలో భావగానానికి ఇది ఒక చిరస్థాయి ప్రమాణం.తమిళంలో ఈ గీతాన్ని ఇళయరాజా స్వరపరచగా అదే బాణీని చక్రవర్తిగారు తెలుగులో ఉపయోగించారు. జానకమ్మ శ్రీదేవి నటనకు 100 శాతం గాత్రంతో న్యాయం చేశారు.

3. గోవులు తెల్లన (సప్తపది)

ఈ గీతంలో జానపద సంగీతం, మిమిక్రీ అద్భుతంగా కలిసిపోతాయి. జానకిగారి ఉచ్చారణలో పాట చిత్రంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది. పూడిపెద్ది రవిశంకర్ గారు (సాయికుమార్ గారి సోదరుడు) బాలనటుడిగా ఈ పాటలో జానకమ్మ గాత్రం ద్వారానే గుర్తింపు పొందారు.

4. మౌనమేలనోయి (సాగర సంగమం)

సున్నితమైన ప్రేమ భావాలను స్వరంతో ఎలా చిత్రించాలో ఈ పాట ఒక పాఠంలాంటిది. జానకిగారి గాత్రంలో నిశ్శబ్దానికే ఒక సంగీత రూపం లభిస్తుంది. ప్రతి చరణంలో ఆమె చూపించిన భావ నియంత్రణ అసాధారణం. శాస్త్రీయ సంగీత ఛాయలను ఆధునిక మెలోడీతో మేళవించిన అరుదైన గీతమిది. వినేవారి మనసులో దీర్ఘకాలం నిలిచిపోయే మధురానుభూతిని ఈ పాట అందిస్తుంది. ఇళయరాజా సంగీతానికి, వేటూరి శృంగార సాహిత్య తరంగాలకు గాత్రంతో జీవం పోశారు జానకి గారు.

5. వెన్నెల్లో గోదారి అందం (సితార)

ఈ గీతంలో ప్రకృతి అందాలు, ప్రేమానుభూతి, కవిత్వం అన్నీ జానకిగారి స్వరంలో ఒకటైపోతాయి. ఆమె గాత్రంలోని వెన్నెలలాంటి మృదుత్వం పాటకు అపూర్వమైన కాంతిని ఇస్తుంది. ఎత్తు స్వరాల్లోనూ, మృదు స్వరాల్లోనూ సమానమైన నియంత్రణ ఆమె ప్రత్యేకత. ఇళయరాజా బాణీకి ఆమె గానం ప్రాణం పోసింది. తెలుగు మెలోడీలలో ఇది శాశ్వత స్థానం సంపాదించుకుంది. ఈ గీతంలోని లోతైన స్వరప్రస్థానాలకు, భావవీచికలకు జానకమ్మ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ నేపథ్య గాయని అవార్డు వచ్చింది.

6. పగలే వెన్నెల (పూజా ఫలం)

ఈ గీతం ఎస్. జానకి గారి ప్రారంభ దశలోనే ఆమెను అగ్రశ్రేణి మెలోడీ గాయనిగా నిలబెట్టిన అపూర్వ రత్నం. సాలూరి రాజేశ్వరరావు అద్భుత స్వరరచనకు జానకిగారి నిర్మలమైన, మృదుమధురమైన గాత్రం ప్రాణం పోసింది. ప్రతి స్వరం వెన్నెల కిరణంలా హృదయాన్ని స్పృశిస్తూ, భావం మరియు రాగ మాధుర్యాన్ని సమపాళ్లలో ఆస్వాదింపజేస్తుంది. ఎక్కడా ఆర్భాటం లేకుండా, అత్యంత సహజమైన భావవ్యక్తీకరణతో శ్రోతను ఒక ప్రశాంతమైన సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఈ గీతం ప్రత్యేకత. గాత్ర నియంత్రణ, స్వచ్ఛమైన ఉచ్చారణ, సూక్ష్మమైన గమకాల వినియోగం ఈ పాటను తెలుగు సినీ సంగీతంలోని శాశ్వత మెలోడీలలో ఒకటిగా నిలబెట్టాయి.


7. సన్న జాజి పడక (క్షత్రియపుత్రుడు)

ఈ గీతంలో ప్రేమ, సిగ్గు, అనురాగం, శృంగారం అన్నీ అత్యంత సున్నితంగా ప్రవహిస్తాయి. జానకిగారి స్వరంలోని మృదుత్వం ప్రతి పదానికి అపూర్వమైన సౌందర్యాన్ని తీసుకొస్తుంది. ఇళయరాజా స్వరరచనలోని సూక్ష్మమైన భావాలను తన గాత్రంతో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన తీరు అసాధారణం. ఎత్తు స్వరాల్లోనూ, మంద్రస్థాయిలోనూ ఆమె చూపించిన గాత్ర నియంత్రణ సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. శృంగార మెలోడీలలో కాలాతీతంగా నిలిచిపోయిన ఈ గీతం ఎస్. జానకి గారి అపూర్వ గాన మాధుర్యానికి చిరస్మరణీయ నిదర్శనం.ఈ పాటకు తమిళంలో జాతీయ స్థాయి ఉత్తమ నేపథ్య గాయని అవార్డు పొందారు జానకి గారు.

8. ఆకాశం ఏనాటిదో (నిరీక్షణ)

విరహం, ఆశ, ఎదురు చూపు ఈ మూడు భావాలను ఒకే పాటలో అంత ప్రభావవంతంగా వ్యక్తపరచడం జానకిగారికే సాధ్యం. ఆమె స్వరంలోని స్వల్ప కంపనమే హృదయాన్ని తాకుతుంది. ప్రతి చరణం ఒక భావయాత్రలా అనిపిస్తుంది. గానంలో ఉన్న లోతు పాటను సాధారణ మెలోడీ స్థాయిని దాటి తీసుకెళ్తుంది. భావగానంలో ఆమెకు సాటి ఎవరూ లేరని ఈ పాట నిరూపిస్తుంది. ఆత్రేయ సాహిత్యానికి, ఇళయరాజా లయవిన్యాసానికి దీటుగా నిలిచింది ఎస్ జానకి గారి గానం.

9. యమహో నీ యమ యమ అందం (జగదేక వీరుడు అతిలోక సుందరి)

ఈ గీతం యవ్వనోత్సాహం, శృంగార రసం, ఉల్లాసభరితమైన ప్రేమను సంగీత రూపంలో ఆవిష్కరించిన ఇళయరాజా అద్భుత సృష్టి. వేటూరి పదాలలోని చమత్కారం, ప్రేమలోని చిలిపితనం ప్రతి చరణంలో కొత్త అందాన్ని సంతరించుకోగా, ఎస్. జానకి తన మృదుమధురమైన గాత్రంతో దివిలోక సౌందర్యాన్ని, అమాయకమైన ప్రేమను, సిగ్గును ఎంతో సహజంగా పలికించారు. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె గాత్ర సమన్వయం పాటకు అపూర్వమైన ఉత్సాహాన్ని, మాధుర్యాన్ని అందిస్తూ ప్రతి పల్లవిని చిరస్మరణీయంగా మార్చింది. పాశ్చాత్య సంగీత శైలిని భారతీయ మెలోడీతో సమన్వయం చేసిన ఇళయరాజా స్వరకల్పనలో జానకిగారి గాత్రంలోని లాలిత్యం, భావసంపద ఈ గీతాన్ని ఒక కాలాతీత ప్రేమయుగళగీతంగా నిలబెట్టాయి. ఎస్. జానకి గారి వైవిధ్యభరితమైన గానశైలికి, భావవ్యక్తీకరణకు, గాత్ర సౌందర్యానికి ఈ పాట ఒక అద్భుతమైన నిదర్శనం.

10. పగలైతే దొరవేరా (బంగారు పంజరం) ఈ గీతం మధురమైన శృంగార రసానికి, లలిత శాస్త్రీయ సంగీత సౌందర్యానికి అపూర్వ సంగమం. సాలూరి రాజేశ్వరరావు గారి సున్నితమైన స్వరరచనలో ప్రతి స్వరం ప్రేమానుభూతిని పలికిస్తే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వం ఆ ప్రేమకు అపూర్వమైన కవితాత్మకతను అందిస్తుంది. ఎస్. జానకి గారి స్వరంలో వినిపించే సిగ్గు, మమత, ఆరాధన, ఆత్మీయత పాటను కేవలం ఒక ప్రేమగీతంగా కాకుండా ఒక భావానుభూతిగా మలుస్తాయి. శాస్త్రీయ సంగీతపు సుగంధాన్ని కోల్పోకుండా, అత్యంత సహజమైన మెలోడీగా ప్రవహించే ఈ గీతంలో ఆమె గాత్రంలోని మృదుత్వం, భావగాంభీర్యం ప్రతి పదానికి కొత్త జీవం పోస్తాయి. మెలోడీ, శృంగారం, కవిత్వం ఈ మూడింటినీ సమానంగా ఆస్వాదింపజేసే ఎస్. జానకి గారి అత్యంత సొగసైన గాన రత్నాలలో ఇది ఒకటి. 

గానకోకిలకు అక్షరాంజలి

ఎస్. జానకి గారు కేవలం ఒక గొప్ప గాయని మాత్రమే కాదు; భావాలకు స్వరరూపం ఇచ్చిన మాంత్రికురాలు. శాస్త్రీయ సంగీతం నుండి జానపదం వరకు, భక్తి నుండి శృంగారం వరకు, లాలిపాట నుండి విరహగీతం వరకు ఏ ప్రక్రియను తీసుకున్నా, ఆమె స్వరం దానికి సంపూర్ణ న్యాయం చేసింది. ప్రతి పాటలో పాత్ర వయస్సు, మనస్తత్వం, భావోద్వేగం, పరిస్థితిని తన గొంతులోనే ఆవిష్కరించే అద్భుతమైన నటనా సామర్థ్యం ఆమె గానానికి మరొక విశిష్టత. అందుకే సంగీత దర్శకులు ఆమెను కేవలం గాయనిగా కాకుండా, ఒక సంపూర్ణ సంగీత వాద్యంలా భావించారు.

పదిహేడు భారతీయ భాషల్లో దాదాపు యాభై వేలకుపైగా పాటలు ఆలపించిన ఆమె, నాలుగు జాతీయ పురస్కారాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, కోట్లాది సంగీతాభిమానుల ప్రేమను సంపాదించారు. అవార్డుల కంటే కళాత్మకత గొప్పదని నమ్మి, తనకు ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని వినయపూర్వకంగా తిరస్కరించిన అరుదైన కళాకారిణిగా కూడా ఆమె చరిత్రలో నిలిచిపోయారు.

ఈ రోజు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రతి ఉదయం ఆలయంలో వినిపించే భక్తిగీతంలో, ప్రతి ప్రేమికుడి హృదయంలో మార్మోగే మెలోడీలో, ప్రతి తల్లి ఆలపించే లాలిపాటలో, ప్రతి సంగీత విద్యార్థి సాధనలో, ప్రతి సంగీతాభిమాని జ్ఞాపకంలో ఎస్. జానకి గారి స్వరం చిరంజీవిగా నిలిచి ఉంటుంది. సంగీతం ఉన్నంతకాలం జానకమ్మ ఉంటారు; జానకమ్మ ఉన్నంతకాలం భారతీయ సంగీతానికి ఒక అపూర్వమైన ఆత్మ ఉంటుంది.

గాన సరస్వతికి, గానకోకిలకు, భారతీయ సంగీత చరిత్రలో ఎన్నటికీ చెరగని మహాస్వరానికి హృదయపూర్వక అశ్రునివాళి. ఓం శాంతిః.

కర్నాటక సంగీతం - సంగీతత్రయ సాహిత్యంలోని ప్రత్యేకత


భారతదేశంలో ఉన్న శాస్త్రీయ సంగీతంలో ప్రధానంగా రెండు రకాలు, హిందూస్తానీ శాస్త్రీయ, కర్నాటక శాస్త్రీయ సంగీతం. రెండిటిలోనూ కర్నాటక సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. శాస్త్రం (ఆంగ్లంలో సైన్స్), భావం కలిపి మేళవించే సంగీత సమ్మేళనం మరింత ఉన్నతంగా ఉంటుంది. 

దీనికి ప్రధాన కారణం సంగీతత్రయమైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల వారి సాహిత్యంలోని ఔన్నత్యం. ఇవి వ్యక్తిపూజను పూర్తిగా వర్జించి మన ధర్మంలోని దేవతామూర్తుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఛందోబద్ధంగా వర్ణించి, సముచితమైన రాగంలో స్వరపరచబడటం వల్ల శాస్త్రం, ధర్మం ఏకమై దివ్యమైన సంగీతంగా కర్నాటక శాస్త్రీయ సంగీతం పరిణమించింది, కాలపరీక్షను తట్టుకుని దృఢంగా నిలిచింది. సంగీతత్రయానికి పూర్వం వారి స్థాయిలో సాహిత్యానికి విలువనిచ్చిన అన్నమాచార్యుల వారు, పురందరదాసుల వారు ఈ త్రయం కన్నా దాదాపు 250 ఏళ్లు ముందు జీవించిన వారు. అనగా ఒక 10 తరాల పాటు సమాజంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. వాటిలో ముస్లిం పాలకులు, తెల్లవారి పాలన ప్రధానమైనవి. కాబట్టే శాస్త్రీయ సంగీతం ధర్మంతో నిరంతరం మేళవించబడి పరిఢవిల్లటానికి అప్పటి పరిస్థితులు అనుకూలంగా లేవు. రామదాసు గారు చాలా సంకీర్తనలు రాసినా, ఆయన శాస్త్రీయత కన్నా భజన సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చారు అని చెప్పుకోవచ్చు. 

అందుకే, కర్నాటక శాస్త్రీయ సంగీతానికి ప్రధానమైన వృద్ధియుగం సంగీతత్రయం ఉన్న కాలమే అని చెప్పుకోవచ్చు. వీరు వచ్చాకే భావానికి పెద్దపీట వేసి శాస్త్రీయత మేళవించి అద్భుతమైన సాహిత్య సంగీత సుగంధాలు అలదబడ్డాయి. త్యాగరాజస్వామి నిధి చాలా సుఖమా, జగదానందకారకా, దీక్షితులవారి రంగపుర విహార, వాతాపి గణపతిం భజే, శ్యామశాస్త్రుల వారి హిమాచలతనయ వంటి వేల కృతులు శాస్త్రీయ సంగీతాన్ని ఉపాసనాపూర్వకంగా పొందిన ఆధ్యాత్మికశక్తితో వెలువడిన సాహిత్యంతో జతపరచినవి. క్షేత్రాలు, దేవతామూర్తులు, నిత్యోపాసన వీరు మనకు అందించిన అద్భుతమైన వారసత్వంలో మూలస్తంభాలు. వర్ణన అన్నది అనుభూతి చెందితేనే సఫలమవుతుంది. ఆ అనుభూతి ఉపాసనతోనే సాధ్యం. త్యాగరాజస్వామి రాముణ్ణి నిరంతరం ఉపాసన చేస్తే దీక్షితుల వారు శ్రీవిద్యోపాసనలో తపోసంపన్నులై నిలిచారు, శ్యామశాస్త్రుల వారు బంగారు కామాక్షి అమ్మను ఒక బిడ్డలా నిత్యం కొలిచారు. కాబట్టే వారి సాహిత్యం మిగిలిన వారి కన్నా మిన్నగా నిలిచిపోయాయి. 

అంతే కాదు, సమకాలీన రాచరికాలు, సంస్థానాలు సంగీతత్రయ సాహిత్యానికి తగిన ప్రోత్సాహాన్నిచ్చాయి. త్యాగరాజస్వామి రాచరికాన్ని పూర్తిగా వర్జించినా వారి సాహిత్యాన్ని అప్పటి,  తరువాతి రాచరికాలు ముందుకు తీసుకు వెళ్లాయి. అందుకే ఆయన శిష్య పరంపర సాహిత్యాన్ని కాపాడగలిగింది. 

ముగ్గురిలో దీక్షితుల వారు దేశాటన ఎక్కువగా చేసి మరింత విస్తారమైన సాహిత్యాన్ని రచించారని చెప్పుకోవచ్చు. త్యాగరాజస్వామి కూడా తాను నివసించిన తిరువయ్యారుకు 500 కిలోమీటర్ల పరిధిలో పర్యటించారు. శ్యామశాస్త్రి గారు బంగారు కామాక్షి దేవాలయంలోని విధుల వలన వీరిద్దరి కన్నా కాస్త తక్కువగా పర్యటించారు. అయితే, ముగ్గురూ కూడా ఉపాసనలో సిద్ధి పొందే రససిద్ధిని కూడా సాధించారు. 

నిజం చెప్పాలంటే, వారి జీవితాలలో ఆధ్యాత్మిక సాధనల వల్లనే వారి సాహిత్యాలు శాశ్వత స్థానాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతం అటువంటి ఉన్నతమైన సాహిత్యానికి చక్కని అలంకరణగా, ఒక సముచితమైన వేదికగా, ఆ దైవిక శక్తితో వేగంగా అనుసంధానం చేసే స్వరారోహణంగా నిలుస్తుంది. అందుకే సాహిత్యాన్ని రమించి సంగీతంలో మేళవించే కళాకారులు చరిత్రలో నిలిచిపోతారు. కేవలం శాస్త్రీయతకే ప్రాధాన్యతనిచ్చి భావం యొక్క విరాట్స్వరూపాన్ని అవగతం చేసుకోలేని వారు కనుమరుగవుతారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఈ రహస్యాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని నిరంతరం పాటించారు కాబట్టే భారతరత్న అయ్యారు. అలాగే మరెందరో గొప్పకళాకారులు. ఈ మేళవింపును గ్రహించని ఎందరో విద్వాంసులు సంగీతసాధన ద్వారా పరమపదసోపానాన్ని అధిరోహించలేకపోయారు.  

కర్నాటక శాస్త్రీయ సంగీత రాగాలలోని స్వరాలతో చేసే గమకాలు అందాన్ని, సొగసును ఇస్తే, భావం వాటి మీద లయవిన్యాసం చేసి సార్థకతను పొందింది. భావరాగతాళ సమన్వితమైనది కాబట్టే సంగీతత్రయ సంపద దివ్యత్వాన్ని పొందగలిగింది. 

10, జులై 2026, శుక్రవారం

లక్ష్మీ రావే మా ఇంటికి - శుక్రవారం భక్తి గీతం


లక్ష్మీ రావే మా ఇంటికి పరలక్ష్మీ రావే మా ఇంటికి

|క్షీరాబ్ధి పుత్రి పరలక్ష్మీ రావే మా ఇంటికి ॥॥

లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగ నెలకొన
సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి ॥ లక్ష్మీ ॥

కుంకుమ పచ్చకస్తూరి కోరికతోను గోరోజనము
జాజిపువ్వు జలజలోచని ముదముతోన అర్పింతుము ॥ లక్ష్మీ ॥

చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము
మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా ॥ లక్ష్మీ ॥

పసుపు అక్షతలు పరిమళద్రవ్యము పంచ బిల్వములు పూర్ణ కలశము
మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా ॥ లక్ష్మీ ॥

బొండుమల్లెలు మొగలిపూలు దండిగా చేమంతి పూలు మేలైన పారిజాతము
మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా ॥ లక్ష్మీ ॥ 

అందముగ జరియంచు చీర కుందనమ్ము పచ్చని రవిక
మొగలిపువ్వుల జడనే అల్లి జడకుచ్చులను కట్టెదనమ్మా
మాతా నీకు ముదముతో నేను చేతునమ్మా చక్కని పూజ ॥ లక్ష్మీ ॥

అందముగ అడవి పండ్లు కదళీ పండ్లు రేగిపండ్లు
మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూరపండ్లు
పండు వెన్నెలలో నిన్ను పద్మాసని నేపూజింప ॥ లక్ష్మీ ॥   

ఓ వరలక్ష్మీదేవి! మా ఇంటికి వచ్చి శోభాయమానంగా, శాశ్వతంగా నివసించు. నీవు సూక్ష్మమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి, భక్తులకు మోక్షాన్ని అనుగ్రహించే తులసికోటలో నివసించే సుందరివి, దివ్య అలంకారాలను ధరించిన తల్లివి. నీ పూజ కోసం కుంకుమ, పచ్చకస్తూరి, గోరోజనం, జాజిపూలు, చల్లని గంధం, చందనం, సాంబ్రాణి ధూపం, పసుపు, అక్షతలు, పరిమళ ద్రవ్యాలు, పంచ బిల్వదళాలు, పూర్ణకలశం, బొండుమల్లెలు, మొగలిపూలు, చేమంతిపూలు, పారిజాత పుష్పాలు అన్నింటినీ ఎంతో ప్రీతితో సిద్ధం చేసి నీకు సమర్పిస్తున్నాము. అలాగే అందమైన జరీ అంచుగల చీర, పచ్చని రవికను సమర్పించి, మొగలిపూలతో నీ జడను అలంకరించి, ఆనందపూర్వకంగా చక్కని పూజ చేస్తాము. అడవిపండ్లు, కదళీ (అరటి) పండ్లు, రేగిపండ్లు, దానిమ్మ పండ్లు, ఖర్జూర పండ్లు వంటి ఉత్తమ ఫలాలను నైవేద్యంగా సమర్పించి, పండు వెన్నెల వెలుగులో కమలాసనంపై ఆసీనురాలైన నిన్ను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాము. మా ఇంటిలో శాశ్వతంగా నివసించి ఐశ్వర్యం, శుభం, సౌభాగ్యం, ఆనందం, శాంతి, ఆధ్యాత్మిక శ్రేయస్సు ప్రసాదించి, చివరకు మోక్షాన్ని అనుగ్రహించు తల్లీ!  

https://youtu.be/HVju0y2UIFw?t=1833

పాండురంగ మహత్యం – 1957: భక్తి రస కావ్యం

1957 నవంబర్ 28న విడుదలైన పాండురంగ మహత్యం తెలుగు భక్తి చిత్రాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్...