18, జనవరి 2026, ఆదివారం

వీరభద్రుడు-వీరభద్రుని పళ్ళెం

వీరభద్రుడు:

శివుని అంశతో జన్మించినవాడు ఇతడు. రౌద్రరూపము దాల్చిన శివుడు తన జడను లాగి నేలకు కొట్టగా ఈ వీరభద్రుడు జన్మించాడు. దక్షుడు బ్రహ్మ చేస్తున్న సత్రయాగము చూడటానికి వచ్చినప్పుడు తనను చూసి లేచి మాట్లాడని తన అల్లుడగు శివునిపై కోపించి శపించి వెళ్లిపోతాడు. ఆనాటి నుండి దక్షుడు శివునిపై శత్రుభావము వీడక ఉంటాడు. అందువల్ల శివుడిని,కుమార్తె ఉమ పిలువకుండానే బృహస్పతి సవనము ఆరంభిస్తాడు. అది తెలిసి ఉమ తన తండ్రి చేస్తున్న యాగమును చూడటానికి భర్త అనుమతిని పొంది యజ్ఞశాలకు వెళుతుంది. అక్కడ తండ్రిచే అవమానించబడి ఆయనను నిందిస్తూ యోగాగ్నిని సృష్టించి దానిలో దగ్ధమవుతుంది. ఆ వృత్తాంతమును శివుడు నారదుని ద్వారా తెలుసుకొని కోపోద్రిక్తుడై తన జడ ఒకటి పెఱికి భూమి మీద విసరగా, దాని నుండి వీరభద్రుడు ఆవిర్భవించి, ఘోరమైన రూపము దాల్చి దక్ష యజ్ఞమును ధ్వంసము చేయటానికి శివుని ఆనతి పొంది యజ్ఞశాలకు వెళ్లి యజ్ఞధ్వంసము మరియు దక్షవధ చేస్తాడు. అప్పుడు బ్రహ్మ మొదలగు దేవతలు శివుని ప్రార్థింపగా శివుఁడు ప్రసన్నుడై మళ్లీ దక్షాదులను అనుగ్రహిస్తాడు. దక్షయజ్ఞము ధ్వంసమయ్యే సమయంలో యజ్ఞపురుషుడు మృగరూపము ధరించి పారిపోవుచుండగా ఆ మృగమును వీరభద్రుడు వధిస్తాడు, శివుడు పునరుజ్జీవింపచేస్తాడు. దక్ష యజ్ఞ సమయంలో రౌద్ర రూపము దాల్చిన ఉమ అంశతో ఆవిర్భవించిన భద్రకాళిని వీరభద్రుని పత్నిగా భావిస్తారు. 

శివ పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం వీరభద్రుని గురించి ప్రస్తావిస్తాయి. మన దేశంలో లేపాక్షి, కొత్తకొండ, రిషీకేశ్, హుమ్నాబాద్, కుంభకోణం మొదలైన ప్రాంతాలలో వీరభద్రుని దేవాలయాలున్నాయి. వీరశైవాన్ని ఆచరించేవారు ఎక్కువగా కర్నాటక, తెలంగాణా, పల్నాడు ప్రాంతాలలో ఉంటారు. ఉత్తరాదిన దక్షయజ్ఞ విధ్వంసకుడిగా, దక్షిణాది వారు శివుని ప్రమథ గణాధిపతిగా, క్షేత్రపాలకునిగా, వీరునిగా వీరభద్రుని ఆరాధిస్తారు. శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. 

=

వీరభద్రుడి పళ్లెం:

వీరభద్రుడికు చేసే విశిష్టమైన పూజ, వీరశైవులు ఆచరించే ఒక ఆచారము వీరభద్రుడీ పళ్లెం/వీరభద్రుని వీథి పళ్ళెం. ఈ పూజా తతంగం అద్భుతమైన వీరవిన్యాసాలతో కూడి ఉంటుంది. అసాధ్యం అనిపించే వీరనాట్యంతో అద్భుతమనిపిస్తుంది.  శివద్వేషులను అంతం చేసే మహావీర ఖడ్గాన్ని ఈ ప్రక్రియలో ప్రదర్శిస్తారు.  ఆ వీరనాట్యం చూసి తీరాల్సిందే, చెప్పశక్యం కాదు. అటువంటి వీరభద్రుని పళ్ళెం వీరశివాచార కుటుంబాలకు, లింగధారులకు ఒక కుటుంబ ఆచారంగా వస్తూంటుంది. ఇందులో వీరభద్రుని ఆవిర్భావ కథను దక్షయజ్ఞ దండకంగా అమితమైన ఆవేశంతో చదువుతూ, ఢమఢమ డప్పులు మోగిస్తూ,  నారసాలు పొడుచుకోవడం, అగ్గి విన్యాసాలు చేయడం, సూదుల్లాంటి మేకులున్న పావుకోళ్ళని ధరించి అశ్శరభ శ్శరభ, దశ్శరభశ్శరభ అని నాట్యం చేయడం, నిప్పుల గుండాలు తొక్కడం ఇలా ఎన్నో వీరోచిత విన్యాసాలుంటాయి.

వీరి ఖడ్గ ప్రదర్శనం వీరా వేశంతో కూడుకొని వుంటుంది. స్త్రీలూ, పురుషులూ ఒక గుంపుగా వీధిలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుతూ ఈ ఖడ్గాలు చదివి ముందు సాగుతారు. ఖడ్గధారి ఖడ్గం చదివేటప్పుడు గుంపులోనుంచి ముందుకు వస్తాడు. సాంబ్రాణి ధూపంతో అతనిని ముంచెత్తుతారు. సన్నాయి బూరలతో, డోళ్ళతో, శంఖాలాతో, ఖడ్గధారిని ఆవేశ పరుస్తారు. ఆ ఆవేశంలో ఖడ్గధారి ఖడ్గం (వీరభద్ర ఆవిర్భావ గాథని వివరించే పదాల్లాంటివి) చదువుతాడు. పళ్లెంలో మహావీర ఖడ్గాన్ని ఉంచుతారు.  వీభద్రపళ్లెంలో ఈ ఖడ్గ విన్యాసం తప్పనిసరిగా ఉంటుంది. ఖడ్గం పట్టి చేసే  ఈ నృత్యాన్ని ఖడ్గ నృత్యమని కూడ పిలుస్తారు. ఈ నృత్యం ప్రత్యేకంగా కొన్ని జాతులవారు మాత్రమే చేస్తారు. ఏ కులం వారైనా వీర శైవ మతాన్ని అవలంబించిన ప్రతి వారూ ఈ నృత్యాన్ని తప్పక చేస్తారు.

తంతు తతంగం:

ఈ మహావీరఖడ్గ నృత్య సమయంలో పెద్ద పెద్ద ప్రభలు గట్టి ఆ ప్రభలను అనేక అలంకారలతో ముంచి వేస్తారు. ప్రభకు ముందూ వెనుకా స్త్రీ పురుషులు నడుస్తూ వుంటారు. ప్రభ ముందు సన్నాయి వాయిద్య కాండ్రు రెండుమూడు దళాలువారుంటారు. ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే వాయిద్యం వీరంగం. ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం. కణకణమని అతి దురితంగా డోళ్ళు మ్రోగుతాయి. సన్నాయి బూరలు తారాస్థాయిలో గుక్క పట్టి నృత్య కారుని చెవుల్లో వూదుతారు. సాంబ్రాణి ధూపం ముఖానికి దట్టంగా పట్టిస్తారు. దీనితో ఖడ్గధారి వీరావేశంతో ఒక్కగెంతు గ్తెంతి దశ్శరభశరభ, అశ్శరభ శరభ అంటూ డోలు వాయిద్య గాళ్ళను కవ్విస్తూ... అదదదద అబబబబ అగగగగ ... అని డోలు వాయిద్య గానిని కవ్వించి ముక్తాయింపులు ఇప్పించి దశ్శరభ అశ్శరభ అని వీరభద్రుని ఆవిర్భావగాథ లైన దక్షుని దండకం తదితరాలు చదువుతూ వీరనాట్యం చేస్తాడు. హంగూ, ఆర్భాటం చేస్తారు. వీరంగ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. ఇలా ఖడ్గం పట్టి దండకం చదువుతూ, వాయిద్యాల గమకాలననుసరించి, వీరావేశంతో ఆ ప్రక్కకూ, ఈ ప్రక్కకూ అడుగులు వేస్తూ, కంకణం కట్టిన కత్తిని వేగంగా త్రిప్పుతూ ఆసాంతంలో ఏ గ్రామదేవతను గాని ఏ దేవుణ్ణి పూజిస్తారో, ఆ గ్రామం పేరు తలచి జై మంగళ గిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్యగాండ్రను అదరించి శరభ, శరభ అంటూ నానా హంగామా చేసి ఆ కత్తిని ఎవరైతే ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారో, అతని పళ్ళెంలో వుంచుతారు.

ఇలా ఊరేగుతూ నాలుగు వీథులూ కలిసిన చోటల్లా ఒక్కొక్క వ్వక్తి పై విధంగా ఖడ్గ నృత్యం చేస్తాడు. ఇలా ఉత్సవం ముందుకు సాగేకొద్దీ జన సమూహం ఎక్కువై ఎంతో ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నృత్యధారి ధరించే ఖడ్గం చాల భారీగా వుంట్ఘుంది. ఖడ్గం మిలమిల మెరుస్తూ వుంటుంది. ఖడ్గం మధ్య భాగంలో తమలపాకులతో గాని, మామిడాకులతో గానీ కంకణం కడతారు. కొన్ని చోట్ల నిమ్మకాయలు గుచ్చడం ఉంది. 

ఖడ్గ ధారి కర్తవ్యాలు:

ఖడ్గం ధరించే వ్వక్తి విభూతి రేఖలు పట్టించి, విచిత్ర వేష ధారణలో వుంటాడు. ఖడ్గం ధరించే వ్వక్తి ఆ రోజున ఉపవాసముంటాడు. ప్రతి వారూ ఈ నృత్యం చేయడం కష్టం. నృత్యం చేసే ప్రతి వ్వక్తి దక్షుని దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. లేనట్లేయితే అడుగు పడదు. ఖడ్గ నృత్య ధారి ప్రళయ తాండవంగా నృత్యం చేసిన తరువాత శివమెక్కి ఆవేశంతో నారసాలు పొడుచు కుంటాడు.

నారసాలు:

ఖడ్గ నృత్యంలో ఆ నారసాల నృత్యం మహా ఉత్తేజంగా, భయంకరంగా వుంటుంది. ఖడ్గ నృత్యం అయిన వెంటనే ఆ వ్వక్తి నారసాలు పొడుచుకుంటాడు. 

నారసాలంటే అనేక రకాలుగా వుంటాయి.  ఏకనారసం, కంటి నారసం, గొంతు నారస, శిరసు నారసం, శూల నారసం మొదలైన పేర్లతో వుంటాయి. ఇవి శూలం మాదిరిగా ఉండి, త్రిశూలం చివరి భాగంలో నూనె గుడ్డలు చుట్టి, వాటిని వెలిగించి, సన్నని మొన భాగాన్ని నాలికపై గుచ్చుతారు. ఇలా గ్రుచ్చే సమయంలో జోరుగా వాయిద్య సమ్మేళనం జరిగుతుంది. రణగొణ ధ్వనులు చేస్తారు. ఉద్రేకంలో ఉన్న వారికి కర్పూరం వెలిగించిన పళ్ళెం చేతికిస్తారు. నృత్యకారుడు చేతితో నారసాన్ని పట్టుకుని వాయిద్యానికి తగినట్టు వీరాధివీరుడిలా గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తాడు. చేసే కొద్దీ వాయిద్యాల జోరు ఎక్కువ అవుతుంది. ఈ జోరులో వెలిగించిన వత్తులు, ఒక్కొక్కటిగా ఆరి పోవడంతో ఈ నృత్యం కూడ పూర్తి అవుతుంది.

స్థలానుకూలంగా ఆచారాలు: 

ఈ వీరభద్రుని పళ్ళెం పట్టే విధానంలోని ప్రధాన విన్యాసాల గురించే మనం ఇంతసేపూ చెప్పుకున్నాం.  కొన్ని చోట్ల ఈ విన్యాసాలతో పాటుగా నిప్పుల గుండాలు తొక్కడం తదితర ఎన్నో భీభత్సమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. కలియుగంలో జంతుబలులు నిషేధించినా కొన్ని చోట్ల అవి ఈ విన్యాసాల్లో చోటుచేసుకుంటాయి. సాధారణంగా కూషంఆండాన్ని సాత్విక బలిగా అర్పిస్తూ ఉంటారు. ఇలా వీరభద్రుని పళ్లెం వీరోచిత విన్యాసాలతో కూడి చివరగా ఏదైనా ఒక వీరభద్ర దేవాలయం దగ్గరే ముగుస్తూ ఉంటుంది.   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి