11, జనవరి 2026, ఆదివారం

తెర తీయగ రాదా - త్యాగరాజస్వామి కృతి



త్యాగరాజస్వామి సమకాలీకులలో ఉపనిషద్బ్రహ్మేంద్ర స్వామి వారు ప్రముఖులు. వీరు కాంచీపురంలో మఠాన్ని ఏర్పాటు చేసి 108 ఉపనిషత్తులపై భాష్యం రచించారు. సన్యాస స్వీకార సమయంలో గురువులు ఇచ్చిన పేరు రామచంద్రేంద్ర సరస్వతి అయినా వారు ఉపనిషత్తులపై చేసిన కృషి వలన ఆయనకు తదనుగుణమైన నామం వచ్చింది. వారు ఒకసారి త్యాగరాజస్వామిని కాంచీపురం రమ్మని ఆహ్వానించారు. శిష్యుల్ని వెంటబెట్టుకుని త్రోవలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడి వేల్పులను దర్శించిన అనుభవంతో కీర్తనలు రచించి పాడుకున్నారు త్యాగయ్య. కోవూరు, పుత్తూరు, నాగులాపురం, వాలాజీపేట, శ్రీరంగం, నాగపట్టణం తపస్థీర్థం, ఘటికాచలం మొదలైన క్షేత్రాల్లో రచించిన కీర్తనలన్నీ ఒక ఎత్తయితే, తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నప్పుడు పాడిన కీర్తన మరో ఎత్తు. అదో చారిత్రాత్మక సన్నివేశం. తిరుమలకు చేరుకున్న త్యాగయ్యకు వెంటనే దర్శనం కాలేదు. ఆలయంలో ప్రవేశించగానే అర్చకులు తెర వేసి స్వామి కైంకర్యాలు చేస్తున్నారు. నిరుత్సాహంతో చింతాక్రాంతుడైన త్యాగయ్య అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశమున్న కీర్తన ఆలపించారు. శ్రీనివాసుడు త్యాగయ్యపై కరుణించగా తెర తొలగిపోయి అద్భుతమైన దర్శనం కలిగింది. కృతి వివరాలు:

తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకటరమణ మచ్చరమను

పరమపురుష ధర్మాది మోక్షముల
పారదోలుచున్నది నాలోని

మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది

వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి యున్నది
వేగమే నీ మతముననుసరించిన త్యాగరాజ సన్నుత మదమత్సరమను

భావం: 

ఓ తిరుపతి వేంకటరమణా! నా మనసులో మదమత్సరాదులనే అరిషడ్వర్గములు నెలకొనియున్నవి. ఈ ఆరు అంతశ్శత్రువులనే తెర తొలగించుము. ఓ పరమపురుషా! ఈ తెర మానవుని సాధనా సంపత్తికి దోహదము చేసే ధర్మార్థ కామ మోక్షములను విధులకు దూరము చేయుచున్నది. ఈ తెర ఆకలిగొన్న చేప గేలము నందు గల ఎరను ఆశించి దానిలో చిక్కుకున్న రీతి, స్వచ్ఛమైన దీపకాంతికి అడ్డుపడి అంధకారములో పడవేసి అధోగతిపాలు చేస్తున్నది. ఈ మదమత్సరములనే తెర ఎడారులలో ఎండమావులను చూసి భ్రమసి పశుగణములు వాని వద్దకు చేరుకున్నట్లుగా మాయలో పడవేసి నీకు దూరము చేయుచున్నవి. వీటిని తొలగించి నీ దర్శనమును ప్రసాదించుము. నీ భక్తియనే మతమును అవలంబించాను, నన్ను కాపాడుము. 

గౌళిపంతు రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి