4, జూన్ 2016, శనివారం

కీచక వధ - నర్తనశాల చిత్ర సంభాషణలు


యుగయుగాలుగా పరస్త్రీ వ్యామోహంలో పడి నాశనమైన మహాబల సంపన్నుల గాథలు ఎన్నో మన పురాణేతిహాసాలలో ఉన్నాయి. ఆటువంటి వాడే మత్య్సదేశాధీశుడైన విరాటరాజు బావమరిది కీచకుడు. కామాంధుడై సోదరి అంతఃపురంలో దాస స్త్రీగా మారువేషంలో ఉన్న ద్రౌపదిని మోహించి, ఆమెను బెదిరించి, దౌర్జన్యం చేసి, అత్యాచారం చేయబోయిన కీచకుని ఆ కొలువులోనే మారువేషంలో తలదాచుకున్న పాండవులు ఏవిధంగా ఆ అజ్ఞాతవాసం భంగం కాకుండా వధిస్తారో నర్తనశాల చిత్రంలోని సంభాషణల ద్వారా తెలుసుకుందాం. సముద్రాల రాఘవాచార్య గారు ఈ మాటలు రచించగా పద్యాలు తిక్కన విరచిత మహాభారత విరాటపర్వములోనివి. చదివి ఆస్వాదించండి.

నర్తనశాల చిత్రానికి మూడు పాత్రలు ఆయువుపట్టు - ద్రౌపదిగా సావిత్రి, కీచకునిగా ఎస్వీఆర్, బృహన్నలగా ఎన్‌టీఆర్. ఒకపక్క సావిత్రి-ఎస్వీఆర్ మధ్య జరిగే సన్నివేశాలు రసవత్తరంగా సాగుతుంటే మరోపక్క అన్న నందమూరి విభిన్నమైన బృహన్నల పాత్రలో మనలను అలరించారు. కీచకునిలో ఉండే అహంకారం, మదం, కామము, దర్పము అన్ని అవలక్షణాలనూ అద్భుతంగా పండించారు ఎస్వీఆర్. అందుకే ఆయనకు జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఈ చిత్ర నటనకు ఉత్తమ నటుని అవార్డు వచ్చింది. ఇక సావిత్రి గురించి ఏమి చెప్పగలం? ద్రౌపది పాత్ర ఆమెకు కొట్టిన పిండి. ఎన్నో రసాలు ఆ ముఖ కవళికలలో వ్యక్తపరచి ఆ పాత్రలో జీవించారు. ఎస్వీఆర్ సంభాషణలు, హావభావాలు ఒక పక్క, సావిత్రిగారి నటనా చాతుర్యం మరో పక్క - సినిమాను న భూతో న భవిష్యతి చేశాయి. అద్భుతమైన విజయం సాధించిన ఈచిత్రం 1963లో విడుదలై జాతీయ స్థాయిలో రెండవ ఉత్తమ చలన చిత్రంగా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో స్థానం నిలుపుకొంది. ఎస్వీఆర్, సావిత్రి మరియు ఎన్‌టీఆర్ నటనాజెవితంలో ఒక కలికితురాయిగా నిలిచిపోయింది.

*****************************************

సుధేష్ణ అంతఃపురంలో సైరంధ్రి మహారాణిగారిని అలరించే గానం పూర్తి చేసింది. అప్పుడే కీచకుడు ఆమెను చూశాడు.

కీచకుడు: "హ హ హ...ఆహా! ఏమి ఈ సౌందర్యం!! ఏమా ముఖ వర్ఛస్సు!! ఎన్నడూ చూడని లావణ్యం!! ప్రాణం పోసిన బంగారపు బొమ్మ...ఆ..నిలకడ నేర్చిన మెరుపు తీగ. అవనీతలానికి అవతరించిన అప్సర..ఎవరీ మత్స్యగ్రంధి? ఆ.. మనం విరాట మహారాజులుంగారి బావమరుదులం, సుధేష్ణాదేవి గారి సోదరులం. సింహబల బిరుదాంకితులం, కీచక నామధేయులం. నీవెవరు? ఈ మత్స్యదేశం మా నీడన పెరిగి మా కనుసైగలలో మసలుతోంది. నీదేవూరు? ఎవరిదానవు? మారమేల మాలినీ? ఓ! వెరపా? లేక మము గన్న మైమరపా??ఆహ్! కన్నులు మిరిమిట్లుగొలిపే అందం అలవిమాలిన ఆభిజాత్యం. ఆహ్! కానరాలేదెన్నడూ ఇంతటి నెరజాణ..."

సైరంధ్రి అక్కడినుండి భయంతో వెళ్లిఫోతుంది.

సుధేష్ణ: "తమ్ముడూ..."

కీచకుడు: "ఆ! అభివాదనములు. చూదామని వచ్చాను సోదరిని చూశాను అతిలోకసుందరిని. సోదరీ! ఇంతవరకూ మధురగానం చేసిన ఆ మనోహారిణి ఎవరు? "

సుధేష్ణ: "సైరంధ్రి.."

కీచకుడు: "సైరంధ్రి..."

సుధేష్ణ: "మహారాజుగారిని చూశావా? "

కీచకుడు: "లేదు. ఇంతకుముందెన్నడూ ఈ జగదేకసుందరిని చూడలేదు. ఎంతకాలమైంది ఈ అలివేణి అంతఃపురంలో అడుగుపెట్టి?"

సుధేష్ణ: "పోయిన విజయదశమికి. ఆ... నీ ఘనవిజయానికి బావగారు ఏం బహుమానాలు తెచ్చారో? ....తమ్ముడూ"

కీచకుడు: "అనేక అమూల్య రత్నహారాలతో మేమే వారిని బహుకరించాం. ఆ... సోదరీ! ఈ వన్నెలాడి కులగోత్రాలేమిటి?"

సుధేష్ణ: "ఎవరో గంధర్వుల భార్యట. పేరు మాలిని. ఇంతకు ముందు హస్తినాపురంలో పాండవులను సేవించిందట."

కీచకుడు: "ఆ అరాళకుంతల వివరాలు వినాలని మనసు ఉవ్విళ్లూరుతున్నది. ఆమె నాథులేమైనారు?"

సుధేష్ణ: "అదృష్టం తారుమారై ఆమెకు దూరమైనారట. ఏడాదిపాటు ఇక్కడ తలదాచుకుంటానని అడిగింది. ఉండమన్నాను. అంతఃపుర దాసిగా ఉంది"

కీచకుడు: "దాసిగానా?? ఆ శృంగార రసాధిదేవత దాసిగానా?? ఆమె దాస్యానికి అర్హురాలు కాదు సోదరీ. రత్న కిరీట ధారణకే యోగ్యురాలు. వస్తా"

సుధేష్ణ: "తమ్ముడూ.."

********************************

కీచకుడు సైరంధ్రికి ఉద్యానవనంలో అడ్డుపడతాడు.

కీచకుడు: "సైరంధ్రీ! నీ కన్నుల తీరు! తెమ్మెరుల సోలు! ఒంపుల సొంపు! ఆహ్! వజ్రసన్నిభమైన నా హృదయాన్నే వ్రయ్యలు చేస్తున్నది."

సైరంధ్రి: "నన్ను వెళ్లనివ్వండి".

కీచకుడు: "ఆ. .."

సైరంధ్రి: "అంతఃపురంలో మహారాణి సేవలకు వేళయ్యింది"

కీచకుడు: "సేవలందవలసిన చిన్నారి నీవింకొకరిని సేవించటమా!! నా అంతఃపురానికి మహారాణివై దాసదాసీజనాల సేవలందుకొని నా మనోరథం ఈడేర్చు."

సైరంధ్రి: "సేనానీ! రాత్రిళ్లు రమణుల సౌశీల్యాన్ని కాపాడటం మీ ధర్మం. అంతఃపుర అన్యకాంతలతో అధికప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీనవంశాభిజాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికే కళంకం"

కీచకుడు: " హ హ హ. నన్ను వంచించలేవు మించుబోడి. నీవు హీనవంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకూ తెలుసు. ఇంకా ఎందుకు ఈ బిగువు సుందరీ."

సైరంధ్రి: "కీచకా! నేను అందని మ్రాని ఫలాన్ని."

కీచకుడు: "అందని ఫలానివి కాబట్టే అర్రులు చాచుచున్నాను. నా అందం చూచి, పొందుకై వేచి కానుకలంపి కైమోడ్చి నా వెంటపడే కాంతామణులెందరినో కాదని కాలదన్నిన నేను నీ అనురాగాన్ని అర్థిస్తున్నాను. నన్ను నిరాకరించకు. నా ముచ్చట తీర్చు "

సైరంధ్రి: "నేను వివాహితను. అయిదుగురు భర్తలకు అర్ధాంగిని."

కీచకుడు: "అయిదుగురు భర్తలకర్ధాంగివైన నీవు ఆరవ వానిగా నన్నంగీకరించలేవా? ఆనంద పరచలేవా? తప్పు లేదులే"

సైరంధ్రి: "సింహబలా! నిజం తెలియక నిప్పుతో చెలగాటమాడుతున్నావ్. నేను పత్రివ్రతను"

కీచకుడు: "హ హ హ..పతివ్రత...పరుల పంచన చేరి పది మందికి ఊడిగం చేసే పరిచారికవు. నీవూ పతివ్రతవేనా? ఏదీ చెప్పు? అనసూయవా? అరుంధతివా? చంద్రమతివా? దమయంతివా? సీతవా? లేక సావిత్రివా?"

సైరంధ్రి: "ఆగు! పరకాంతానురక్తితో ఎందరో ప్రాణాలే పోగొట్టుకున్నారు. కులనాశనానికి తలపెట్టకు. కోరి మృత్యువును కౌగిలించుకోకు."

కీచకుడు: "హు. బెదిరిస్తున్నావా మధిరాక్షీ! నన్నెదిరించి నిలబడగలిగిన వాడు ఈ మత్య్సదేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావ్? వైరివీర కుంజరయూధంబులకు సింహస్వప్నం. నారీజన మంజుల హృదయాలకు మధురస్వప్నం. మాలినీ! వీడు పట్టిన పట్టు వీడడు. నిన్ను చేబట్టక మానడు."

సైరంధ్రి: "అది అసంభవం"

అంతలో సైరంధ్రిని వెదుకుతూ ఉత్తర ఆ ఉద్యానవనానికి వచ్చింది.
ఉత్తర: "మాలినీ! మాలినీ! .."

ఉత్తర రాకతో అప్పటికి కీచకుని బెడద తప్పిందని సైరంధ్రి సంతోషిస్తుంది.

***************************

సుధేష్ణాదేవి అంతఃపురంలో కీచకుడు సోదరిని మాలినిని కోరుటకై వెళతాడు

కీచకుడు: "సోదరీ! సోదరీ! నాకో ఉపకారం చేయాలి సోదరీ!

సుధేష్ణ: "అదేమిటి తమ్ముడూ! ఈ మత్య్సరాజ్యానికే క్షేమకరుడవైన నీకు నేనేం చేయగలను?"

కీచకుడు: "నీవే చేయగలవు. వాగ్దానం చేయి"

సుధేష్ణ: "చేయగలిగిందైతే చేస్తాను. అదేమిటి?"

కీచకుడు: "సైరంధ్రి నా మనసు హరించింది. ఆమె అందం మరచిపోదామన్నా మరపు రావట్లేదు. ఆమె లేకుండా నేను జీవించలేను సోదరీ. ఎలాగైనా ఆమెను నాకు దక్కించు."

సుధేష్ణ: "వద్దు తమ్ముడూ! పరకాంతల పొందు ప్రమాదం. జీవితాలను నీతో ముడివేసుకున్న చిన్నారులున్నారు. కోరి నీ కొలువు చేస్తూ నీ కనుసన్నలకు కలవరించే సింగారులున్నారు. వారిని కాదని ఒక పరిచారికను కోరటం పరువు కాదు.

కీచకుడు: "నా కొలువులో కానీ, అమరేంద్రుని కొలువులోని అతివలైనా సరే ఆమె కాలి కొనగోటికి సాటి రారు. నీ హితబోధలతో నా విరహ బాధ శమించదు. ఆమె శృంగార గంగా ప్రవాహంలో నేను మునిగి తేలినప్పుడే నా తాపానికి శాంతి. ఆ విషయం మరచిపోకు."

సుధేష్ణ: "మరొక్కమారు ఆలోచించు తమ్ముడూ! మహా పరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని, అనుక్షణం ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారిచేత హతులయ్యారట"

కీచకుడు: "ఆహ్..గంధర్వులే కాదు దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్దించలేరు. ఆమెను నా బారినుండి రక్షించనూలేరు. ఏమైనా సరే ఆమెను నీవు నా మందిరానికి పంపించే తీరాలి"

సుధేష్ణ: "అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయమిచ్చిననాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను. పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యక్తబుచ్చలేను."

కీచకుడు: "లేవా? నాకంటే ఆ పరిచారికే ఎక్కువా నీకు? ఆమెకిచ్చిన మాట కోసం  నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో! ఈ మత్య్స రాజ్యమే నా బలదర్పాల మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఆమె ఈ అంతఃపురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రయమిచ్చిన నీవు, నీ మహారాజు, ఈ రాజ్యం కూడా ఉండదు. అంతవరకూ రాకూడదని నిన్ను అర్థించాను. తేల్చుకో నేనో ఆ పరిచారికో!"

సుధేష్ణ: "తమ్ముడూ! ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యాన్ని బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలం చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు. ఆడపడుచుగా అర్థిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడూ!"

కీచకుడు: "అసంభవం! సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందరి నా మందిరంలో ఉండాలి. లేదా, ఈ మత్స్యమండలాన్నే మట్టిపాలు జేస్తాను"

*****************************
తమ గృహంలో సైరంధ్రి, బృహన్నల

బృహన్నల: "ఆందోళన పడకు పాంచాలీ!!. అనువుగాని వేళ ఆవేశం పనికిరాదు. ఆ కీచకుని పాపం పండి ఇంత కిరాతకానికి సాహసితున్నాడు. జాగ్రత్తగా మన కార్యం సాధించుకోవాలి. కొంచెం ఓపిక పట్టు"

సైరంధ్రి: "కానీ, ఆ కామాంధుని దురాగతాలు మితిమీరితే?"

బృహన్నల: "మితిమీరితే ఏదో ఉపాయం ఆలోచించి గుట్టుగా మట్టుబెడతాం. అజ్ఞాతవాసం అంతం కాబోతున్న ఈ సమయంలో మనకు తొందరపాటు కూడదు. యధావిధి నీ నిత్య జీవితం కొనసాగించు. వెళ్లు..వెళ్లు..."

*************************************

సుధేష్ణ అంతఃపురంలో

సైరంధ్రి: "మహారాణీ! ఏం మహారాణీ అలా ఉన్నారు?"

సుధేష్ణ: "నా మనసేమీ బాలేదు మాలినీ! "

సైరంధ్రి: "మధిర పుచ్చుకుంటే మనసు కాస్త కుదుట పడుతుందేమో? తీసుకురానా?"

సుధేష్ణ: "ఆ..మధిర...కానీ మన మందిరంలో మంచి మధిర లేదు. మా సోదరుని మందిరం మధిరకు పెట్టింది పేరు. వెళ్లి తీసుకురా మాలినీ!"

సైరంధ్రి: "హా! వారింటికి నన్ను వెళ్లమని ఆనతిస్తున్నారా? "

సుధేష్ణ: "ఆనతివ్వడం లేదు మాలినీ! అర్థిస్తున్నాను."

సైరంధ్రి: "ఆశ్రయమిచ్చిన నాడు అనుచిత కార్యాలకు వినియోగించనని మాటిచ్చారు. పరుల ఇండ్లకు పంపనన్నారు. అన్నమాట వమ్ము చేస్తారా మహారాణీ?"

సుధేష్ణ: "నేను వెళ్లమంది పరుల మందిరానికి కాదు మాలినీ! నా సోదరుని మందిరానికి. "

సైరంధ్రి: "కానీ, తమ మందిరంలొ నన్ను చూచింది మొదలు మీ సోదరుని మాట ఏదో అపాయాన్ని సూచిస్తున్నది. "

సుధేష్ణ: "అపాయం నుంచి తప్పించుకోవాలనే అపేక్షిస్తున్నాను. సూర్యాస్తమయంలోగా నిన్ను తన మందిరానికి పంపించకపోతే మా మత్స్య రాజ్యాన్నే మట్టిచేస్తానన్నాడు. ఆ అవినీతుని మాట వినకపోతే మా రాజవంశమే అంతరిస్తుంది. ఆనాడు నిరాధారవైన నీకు ఆశ్రయమిచ్చాను. నిస్సహాయురాలనై ఈనాడు నీ రక్ష కోరుతున్నాను. మా రాజ్యం, మా రాజవంశం నీవే రక్షించాలి సైరంధ్రీ!"

సైరంధ్రి: "మీ క్షేమానికి నేను ఆహుతి కావాలా మహారాణీ! సాటి మగువ చాటవలసిన మాటలేనా ఇవి?  ప్రతి స్త్రీ పవిత్రంగా భావించుకునే శీలాన్ని బలిపెట్టమంటారా? "


సుధేష్ణ: "అది నా వాంఛ కాదు. అలా జరగబోదు. నీవు మహాబలవంతుల ఇల్లాలివి. నీకే అపరాధం జరుగదు. వెళ్లిరా మాలినీ."

సైరంధ్రి: "సరే. విధి బలీయం మహారాణీ. వెళతాను. "

***********************************

కీచకుని మందిరంలో ఏకపాత్రాభినయం:

"ఆ హ హ సింహబలా!! ఏమి నీ సౌందర్య శోభ! సైరంధ్రీ సమాగమ సంతోషాతిశయమున నీ వదన లావణ్యము వేయిమణుగులధిగమించినది. ఆ హ హ హ...ఈ సోగసు జూచి మాలిని మనసు రంజిల్లకుండునా? నా సందిట వ్రాలకుండునా?

హ...ఏ అందెల సందడి విన్ననూ ఆ సుందరేనని మనసున ఆందోళన అధికమవుతున్నది. సంకేత సమయము మించిపోతున్నది...మాలిని రాదే? అక్క పంపలేదా?...హుం..ఏల పంపదు? తమ్ముని కోరిక మన్నించనిచో తనకే అపాయమని ఎరుగదా? ఒకవేళ సైరంధ్రి మహారాణి ఆదేశమును కాదనెనా? అంత సాహసమా! హుం..వచ్చి వలచి వలపించి మహిలోనే మహేంద్రవైభవమును చవిచూపించు! హ హ హ హ.

ఏమిది దేవీ! నీకై మనోహర హంసతూలికాతల్పమాయత్తపరచి నిరీక్షుంచుచుండ నీవీ మధుపాత్రలో మసలుచుంటివా? నిన్నిట దాగనివ్వను. నాలోనే దాచుకొందును.

ఆ...ఓసి..ఇక్కడ నిలచితివా! నీరాక గమనించలేదని అలిగితివా! ఎందులకీ పెడమోము చెలీ! భ్రమ...వట్టి ప్రతిమ...

ఏల ఆ రమణి ఇంకనూ రాలేదు? "

సైరంధ్రి: "మహారాణి గారు మధిర తీసుకు రమ్మన్నారు"...

కీచకుడు: "హుం హ హ..నీవు పలుకు నేర్చిన ప్రతిమవు. నేను భ్రమింపను. సైరంధ్రి ఇంకనూ రాలేదు...హుం...ఆమెను బలాత్కరించైనను నా దానిగా చేసుకొనెదను. "

సైరంధ్రి: "దేవి గారు త్వరగా రమ్మన్నారు"...

కీచకుడు: "ఎవరదీ! నీవేనా సుందరీ! నా సైరంధ్రివేనా? నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా? స్వాగతం! సుస్వాగతం! "

సైరంధ్రి: "దేవి గారు చాలా దప్పిగొన్నారు"

కీచకుడు: "వారి తమ్ముడు అంత కన్నా దప్పిగొనియున్నాడు. నీ సరస వచనామృతంతో నా తృష్ణ చల్లార్చు. రా.."

సైరంధ్రి:"ఆగు సింహబలా! నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించుట నీకు తగని పని. "

కీచకుడు: "అంతఃపుర దాసివా? కాదు దేవీ! కాదు. నా ప్రేమ రాశివి, నా హృదయ రాణివి. అనుగ్రహించు దేవీ!"

సైరంధ్రి:"ఛీ! నీచుడా! అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు! పతివ్రతల పొందు గోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకోకు.."

కీచకుడు: "హ హ హ భరింపరాని విరహాగ్ని కన్నా ఆ పాపాగ్నే మాకు సమ్మతం. మా అభీష్టం నెరవేర్చకుండా ఉండాలేవు. రా!!"

సైరంధ్రి:"నిలు! పరంకాతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో! హుం జానకినాశించి రావణుడు వంశనాశనమైనాడు. శచీదేవినాశించి నహుషుడు.."

కీచకుడు: "ఆ.. ఆపు నీ పురాణ గాథలు. నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హంసతూలిక మనలను ఆహ్వానిస్తోంది. దా..."

సైరంధ్రి:"పాపీ! కామాంధకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావ్. కడసారిగా హెచ్చరిస్తున్నాను. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచి పెట్టు. లేదా...

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతు-
ల్గీర్వాణాకృతు లేవురిప్డు నిను డోర్లీలన్ వెసన్ బెట్టి గం-
ధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యంబెమ్మెయిం కీచకా!

కీచకుడు:"హహ్ గంధర్వులట గంధర్వులు! ఏ వూరు! సుర గరుడోరగ యక్ష రక్ష కిన్నెర గరుడ గంధర్వ కింపురుషాదులే దిగి వచ్చినను ఈ సింహబలుని అవక్రవిక్రమ పరాక్రమమునకు మోకరిల్ల వలసినదే. ఇక నిన్నెవరూ రక్షించువారు లేరు. నా ముచ్చట తీరనిదే నిను విడువను. రా!!!

ఎక్కడికి పోగలవు? ఈ అఖిలచరాచరములలో ఎక్కడ దాగినా సరే పట్టి నా బాహుపంజరములో బంధించగలను. "

సైరంధ్రి పరిగెత్తుకుంటూ విరాటరాజు కొలువుకు వస్తుంది

సైరంధ్రి:"మహారాజా! మహారాజా! నన్ను రక్షించండి."

కీచకుడు: "రక్షణా! నన్ను నిరోధించి నిన్ను రక్షించే దక్షులెవరున్నారు ఈ సభలో!! ఎవరు!! "

సైరంధ్రి:"మహారాజు మందిరంలో పని చేసే మానవతికి మహారాణి తమ్ముడు చేసే మర్యాద ఇదేనా? కమ్మని రాజాన్నాలతో కండలు పెంచి అధికారం స్వీకరించింది అబలలపై అత్యాచారానికేనా? పతివ్రతలను పరాభవించటానికేనా? "

కీచకుడు: "చాలించు నీ అరణ్య రోదన. ఈ మత్స్య మండలానికే నే మహారాజును. ఈ మహారాజు నే నిలబెట్టిన మట్టిబొమ్మ. నా చేతిలో కీలుబొమ్మ. అతన్ని అర్థించటం దేనికి? నన్నాశ్రయించు."

సైరంధ్రి: "సభాసదులారా! ధర్మవేత్తలారా! మీ సముఖంలో ఇంత సాహసం జరుగుతుంటే చూసి సహిస్తారా?  కాదనలేరా? మౌనం వహిస్తారా? మీకు నావంటి తోబుట్టువులు లేరా? మీలో నీతినియమాలు దయాదాక్షిణ్యాలు అడుగంటిపోయాయా? ప్రాణాల కోసం ధర్మం ధ్వంసం చేస్తారా? పదవుల కోసం కర్తవ్యం మరచిపోతారా? "

కీచకుడు: "హుం హు హు హు. ఈ సభాచారుల వీరము, బాహుసారము చూశావుగా? ఈ భూనాథుడే కాదు, నీ గంధర్వ నాధులే కాదు త్రిలోకనాథులే ఏకమై వచ్చినా నిన్ను రక్షింపలేరు."

విరాటరాజు: "బావా! నీ నిశ్చయం తిరుగులేనిదని నేనెరుగుదును. కానీ, సభాగౌరవం కూడా పాటించుట నీ బాధ్యత కాదా?  నా మాట విని నీవు..."

కీచకుడు: "ఊ... సరే. సైరంధ్రీ! రేపటి వరకు గడువిస్తున్నాను. ఆలోచించుకో! తిరస్కారం చేస్తే బలాత్కారం తప్పదు జాగ్రత్త."

సభలో ఉన్న వలలుడు ఆవేశంతో అక్కడ ఉన్న ఫల వృక్షాన్ని పెకలించబోతాడు.

కంకుభట్టు: "వలలా! ఆశ్రితులకు నీడనిచ్చే ఫల వృక్షాన్ని వంటచెరకులకై నిర్మూలించటం మంచిది కాదు."

సైరంధ్రి: "బాహుబల సంపన్నులు, ప్రతివీర భయంకరులైన గంధర్వులే అసమర్థులై వెనకాడుతున్నారే? వారి కాంతకే పరాభవం తప్పకపోతే ఇక ఏ ఇల్లాలు  పరువుగా బ్రతుకుతుంది? ఈ అన్యాయానికి అంతులేదా? "

కంకుభట్టు: "సైరంధ్రీ. చాలు నీ ప్రలాపాలు. ప్రభువులు నీ దుస్థితిని కళ్లారా చూశారు. ఇక హద్దు మీరకు. గంధర్వుల కాంతనంటావు. వారేమో పౌరుష ప్రతాపవంతులంటావు. వారెందుకు నిన్ను రక్షించలేదో నీకే తెలియాలి. సమర్థులైతే సమయం చూసి పగతీర్చుకుంటారు. పడతి ఎంత ఆపన్నురాలైనా నలుగురిలో నిలబడి పతులను తూలనాడటమా? కులసతుల గౌరవం కూలద్రోసి జంకు బొంకు మాని నాట్య ప్రదర్శన సాగించు. వెళ్లు."

సైరంధ్రి: "అవును. నాది నాట్యమే. నా భర్తలు నటులు, జూదరులు. వారికి లేని గౌరవం నాకెలా ఉంటుంది?"

***********************************
గృహంలో సైరంధ్రి వలలునితో:

సైరంధ్రి: "ఆనాడు కురుసభలో దుశ్శాసనుడు చేసిన పరాభవం భరించాను. అరణ్యసీమలో సైంధవుడు చేసిన అత్యాచారం సహించాను. ఈనాడు విరటుని కొలువులో దాసినై సేవిస్తున్నాను. దేనికి? మీ పరువు ప్రతిష్ఠ నిలపటానికా? లేక ఈ నీచ కీచకుని వలన అవమానం పొందటానికా? నా పరాభవాన్ని కళ్లారా చూసి కూడా మీకింకా ఎలా నిద్రపడుతోంది?"

వలలుడు: "నిద్రించలెదు దేవీ. నిద్రించలేదు. నిమిష నిమిషానికీ ఆవేశంతో దహించుకుపోతున్నాను. అన్నింటికీ అన్నగారి ఆత్మగౌరవమే ఆటంకమవుతోంది. ఆనాడు నిండు కొలువులో నిన్ను చూచి రారాజు తొడ చరిచిననాడే ఆ కౌరవ హతకులను చీల్చి చెండాడి ఉంటే మనకు ఈ ఆపదలు, అవమానాలు కలిగి ఉండేవి కాదు. మన కష్టాలన్నిటికీ ఆ ధర్మనందనుడే కారణం. "

బృహన్నల: "అవేశపడకు అన్నయ్య. అజాతశత్రువును అర్థం చేసుకోలేక అధిక్షేపిస్తున్నావు. ధర్మ నందనుడంటే ఎవరనుకున్నావు?"

ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు
ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడుచూడ్కి మానిత సంపదలీనుచుండు
ఎవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు

అతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీరకోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడై ధర్మసుతుడు

అంతటి మహానుభావుడైనా ధర్మం కోసం పరుల పంచన తలవంచటం తప్పలేదు.

సైరంధ్రి: "ధర్మం...ఏమిటా ధర్మం? జూదం ధర్మమా? భార్యను పందెమొడ్డటం ధర్మమా? ఎన్నాళ్లీ ధర్మం? ఎంతవరకీ సహనం? అన్న గారి గౌరవమే మీకు ప్రధానమా? నాకు జరిగిన పరాభవానికి ప్రతీకారమే లేదా? పరదాస్యంతో మీ బలదర్పాలు నశించిపోయాయా? మళ్లీ ఆ దురాత్ముడెదురైతే నా మాన ప్రాణాలేమౌతాయో యోచించలేదా? "

వలలుడు: "ఇక ఒక్కటే యోచన దేవి. ఆ ధర్మజుడే కాదు ఆ ధర్మదేవత ఎదురైనా సరే ఆ కీచకుణ్ణి ఇప్పుడే చిత్రవధ చేస్తాను. నీ పవిత్ర దేహాన్ని తాకిన ఆ పాపిని ఖండఖండాలు చేస్తాను. ఆ మదోన్మత్తుని దేహాన్ని మెదిపి మాంసపు ముద్ద చేస్తాను. నీ పగ చల్లారుస్తాను."

బృహన్నల: "అన్నయ్యా! సాహసం అన్ని వేళలా జయప్రదం కాదు.సమయాసమయాలు పాటించి ముందంజ వేయాలి. "

సైరంధ్రి: "ఇది కూడా అన్నగారి హితబోధేనా? "

బృహన్నల: "అవును. జరిగిన అవమానానికి వారెంతో బాధపడుతున్నారు. తగిన ప్రతీకారం చెయ్యాలనే అన్నగారి అభిమతం. "

వలలుడు: "ఆ... అన్నగారు అనుమతించారా?"

బృహన్నల: "అవును."

సైరంధ్రి: "అహా!!! ఈ అభాగ్యురాలికి ఎప్పుడా అదృష్టం. "

బృహన్నల: "రేపే... రేపే...అతి రహస్యంగా జరగాలి. "

సైరంధ్రి: "ఆ!!! పాపం కాదా? "

బృహన్నల: "కాదు. పతి ఆజ్ఞ పాలించటం పాపం కాదు. ఆరితేరిన నటివలె లేని వలపు నటించు.  అతన్ని రప్పించు. తరువాతి కథ మా చిన్నన్న గారు పూర్తి చేస్తారు. వెళ్లిరా! ఊ. అన్నగారూ! పదండీ. "

***********************************
కీచకుని ఏకపాత్రాభినయం:

"సింహబలా! ఇటు. ఇటు సింహబలా! హ హ హ. సింహబలుడవని బిరుదు. వైరివీరులకు సింహస్వప్నమని ప్రతీతి. సరస శృంగార కళాకోవిదుడవై జగదేకసుందరీప్రేమ మందారుడవైన నీకు ఒక సామాన్య అంతఃపుర పరిచారిక ప్రేమ తిరస్కారమా! ఎంత అవమానము! ఎంత అవమానము! నీ సర్వసైన్యాధిపత్యము సింహబల బిరుదము వ్యర్థము నిరర్థకము.

ఆహ్! నా సామర్థ్యాన్నే శంకిస్తున్నావా? హరిహరాదులే అడ్డం వచ్చినా సరే అహంభావిని బంధించి తెచ్చెద. హ హ హ హ..."

*************************************

మాలిని అతనిని తోటకు రమ్మని కబురంపుతుంది

కీచకుడు: "మాలినీ! రసిక చక్రవర్తినని మురిసిపోయే నా గర్వం సర్వము ఖర్వము చేశావు. స్త్రీ హృదయము తెలుసుకోలేక పోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలినీ! నిజమే! నలుగురిలో నగుబాటు చేస్తే అభిమానవతికి ఆగ్రహం కలగటం సహజమే. ఇప్పటికైనా అనుగ్రహించావు. ధన్యుడిని. ఏదీ! నీ కడగంటి చూపులతో అమృతవర్షం కురిపించు! నీ సరసవచోమాధురితో నాకు శ్రవణానందం కలిగించు. రా సైరంధ్రీ. దేవతలనైనా చేజాచి అర్థించని నేను ఈనాడు దీనుడనై నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కటాక్షించు దేవీ!"

సైరంధ్రి:"రాత్రికి నర్తనశాలలో!!"

కీచకుడు: "ఆ. తెలివిగల దానవు. మంచి చోటే ఎన్నుకున్నావు. నిజమే. పగలంతా ఆటపాటలతో ప్రతిధ్వనించే నర్తనశాల అర్ధరాత్రి నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. హా హ హ హ. మాట తప్పవుగా.."

సైరంధ్రి: "ఊహూ... ఆ ఒంటరిగా..."

కీచకుడు: "అవునవును. ఎవరైనా చూస్తే నీ రహస్యం రచ్చకెక్కుతుందని భయం.సరి సరి. ఒంటరిగనే వస్తా. మరువకు సుమా! ఆహ్"

***************************************

నర్తనశాలలో దీపాలన్నీ ఆర్పి సైరంధ్రి ఒక స్థంభం చాటున ఉంటుంది. వలలుడు స్త్రీ వేష ధారియై కీచకునికై వేచియుంటాడు.  చీకటిలో అక్కడ కూర్చున్నది సైరంధ్రి అనుకోని సరస సంభాషణలు మొదలు పెడతాడు.

కీచకుడు: "హ హ హ. ఆహ ఆహ. మాలినీ! ఎంత మనోహరంగా ఉంది ఈ పరిమళం. ఈ సువాసన నీ పువ్వులది కాదు. దివ్యకామినివైన నీ మేని సుగంధం.

వలలుడు: "ఊ.."

కీచకుడు: "ఇదిగో నీ అపూర్వ సౌందర్యానికి అలంకారంగా ఈ అమూల్య రత్నహారం తెచ్చాను. ఇటువంటి రత్నాలీలోకంలో లేవు."

వలలుడూ: "నావంటి నారీరత్నం కూడా లేదు. "

కీచకుడు: "ఆ!! నీ దరితీపి పలుకులకే ఈ శరీరం పరవశం పొందుతోంది."

వలలుడు: "ఊ. పొందుతూ అమరలోకానందం పొందుతారు. మరే సుందరి సాంగత్యాన్నీ ఆశించరు."


కీచకుడు: "కనుకనే నీ రూపానికి ముగ్ధుడనయ్యాను. మాలినీ! ఎంతసేపు ఈ చీకట్లో చిందులాట. ఒక్కసారి ఇటు తిరిగి నన్ను కన్నెత్తి చూడరాదూ! మేలిముసుగు తొలగించి చిరునవ్వుతో వెన్నెలలు చిలికించరాదూ! అబ్బా! ఇదేమిటి మాలిని చిగురుటాకుల వలె సుతిమెత్తగా గాలి సోకితేనే కందిపోయే నీ లేత చేతులకు ఇంతటి కరుకుదనం ఎలా వచ్చింది?"

వలలుడు: "రేయిపగలు దాసీగా ఊడిగం చేసే దాని చేతులు కరుకుగా కాక మృదువుగా ఎలా ఉంటాయ్? "


కీచకుడు: "అబ్బా! ఇంతలోనే అలుకా! అద్వైతానన్నా అర్థం చేసుకోవచ్చు కానీ ఆడదాని మనసును మాత్రం అర్థం చేసుకోవటం చాలా కష్టం మాలినీ. ఏదీ ఒక్కసారి....."

వలలుడు: "అదిగో! తాకవద్దంటే మానరు కదా! చంద్రుడింకా అస్తమించలేదు. జనసంచారం తగ్గలేదు. నవరస రసికులు కదా. అంతలోనే తొందరా? "


కీచకుడు: "మాలినీ! నీ సౌందర్యం నన్ను మత్తెక్కిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. మాలినీ నేను నీ దాసుడను. దాసుడను మాలినీ! అజ్ఞాపించు శిరసావహిస్తాను. "

వలలుడు: "ఒక్కసారిగా మీరు నా దివ్యరూపం చూశారంతే దిగ్భ్రమ చెందుతారు. మధురస పానంతో మత్తెక్కి ఎర్రబడిన మీ కళ్లను రెండు చేతులతో మూసుకోండీ. "


కీచకుడు: "ఆహ్!! ఏనాడు నీ దేదీప్యమాన దివ్య సుందర విగ్రహాన్ని చూశానో ఆనాడే నా కన్నులు మిరిమిట్లు గొలిపి మూతలు పడ్డాయి. అయినా నీ ఆజ్ఞను కాదనరాదుగా!! సరే కళ్లు మూసుకుంటున్నాను."

వలలుడు: "ఏవండీ! నిజం చెప్పండీ. నన్ను మీరు ప్రేమించారా? కామించారా? "


కీచకుడు: "ఎంతమాటన్నావు మాలినీ! త్రికరణశుద్ధిగా ప్రేమించాను. మా కులదేవతల మీద ఆన."

వలలుడు: "ఎంతటి అమాయకులు మనోహరా నా నిజమైన దివ్యసుందర విగ్రహాన్ని చూడు."

కీచకుడు: "హా! వలలుడవా!"

వలలుడు: "కాదు! నీ పాలిట మృత్యువును. నేటితో నీ పాపాలు పండినై. పరిహారం చెల్లించబోతున్నావు."

కీచకుడు: "హా. వంటవాడవు నీవా నన్నెదిరించేది. ఓహో! మాలిని చెప్పిన గంధర్వాధములలో నీవొక్కడవా! సరే రా! నీ అటకట్టే!"

వలలుడు:నీ ఆటకట్టించి నిన్ను తుదముట్టించటానికి ఇక్కడకు రప్పించాను. కాచుకో!...


కీచకుడు: "నీవు..నీవు..."

కీచకుడు ముష్టి యుద్ధంలో వలలుని చేత హతుడవుతాడు.


1 కామెంట్‌: