RightClickBlocker

2, జూన్ 2016, గురువారం

కర్ణాటక శాస్త్రీయ సంగీత ముని - శ్రీపాద పినాకపాణి


గురు పరంపర ఎంత ముఖ్యమో భారతీయ కర్మభూమిలో పుట్టిన అనేక యోగుల, సిద్ధుల, ఋషుల జీవిత చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది. దానికి ఉత్తమ ఉదాహరణలు ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, చిన్మయానంద, దయానంద వంటి అవతార పురుషులు. వారు ధర్మస్థాపనకై చేసిన ప్రయత్నంలో ఉన్న పవిత్రత దానిని గంగాప్రవాహంలో శాశ్వతం చేస్తుంది. అలాగే సంగీతం ద్వారా సేవ చేసిన యోగులు ఎందరో. ఆ కోవకు చెందిన వారే శ్రీపాద పినాకపాణి గారు. సంగీతంలో యోగం సిద్ధించిన వారు శ్రీపాద పినాకపాణి గారు. ఆయన పరంపర ఎంత వైభవంగా ఉందో ఆయన శిష్యులైన మహామహులు వోలేటి వేంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, దోమాడ చిట్టబ్బాయి, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు గారు, ఆయన తనయులు మల్లాది సోదరులు మొదలైన వారి ప్రతిభ, కీర్తి ప్రతిష్ఠలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఆ మహామహోపాధ్యాయులు శ్రీపాద పినాకపాణి గారి వివరాలు ఈ బ్లాగు పోస్టులో.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ప్రియ అగ్రహారంలో ఆగష్టు 3, 1913వ సంవత్సరంలో శ్రీపాద కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు ఆఖరి సంతానంగా పినాకపాణి జన్మించారు. కామేశ్వరావు గారు రాజమండ్రి ప్రభుత్వ శిక్షణ కళాశాలలో ప్రొఫెసరుగా పనిచేస్తూ ఉండటంతో పినాకపాణిగారి ప్రాథమిక విద్యభ్యాసం రాజమండ్రి మరియు కాకినాడలలో జరిగింది. కామేశ్వరరావు గారికి నాటకరంగంతో అనుబంధం ఉండటంతో పినాకపాణిగారికి సంగీతంపై మక్కువ కలిగింది. అప్పట్లో నాటకాలలో పద్యాలు, గీతాలు ఉండేవి. అవి సంగీత ప్రాధాన్యత కలిగి ఉండేవి. బాల్యంలో తన సోదరి బీ.ఎస్ లక్ష్మణ రావు గారి వద్ద సంగీతం నేర్చుకుంటున్నప్పుడు విని తాను కూడా నేర్చుకున్నారు. అక్క పాడుతుంటే తప్పులు సరిదిద్దే వారు కూడా. అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి ఆ గురువు గారు సంగీతం నేర్చుకోవలసిందిగా సలహా ఇచ్చారు. అలా రాజమండ్రిలో లక్ష్మణరావు గారి వద్ద 1924లో పినాకపాణి గారి సంగీత అభ్యాసం మొదలైంది. 1929లో హైస్కూలు పాసయ్యే సరికి ఆ శిక్షణ కూడా పూర్తైంది.

అప్పట్లో కాకినాడలో ఓ జమీందారు గారు రసికుల ఆర్థిక సాయంతో సరస్వతీ గాన సభ అనే సంస్థను నడిపే వారు. ఆ సంస్థ గొప్ప గొప్ప కళాకారులను రప్పించి కచేరీలు ఏర్పాటు చేయిస్తూ ఉండేది. ఆ సంస్థ కార్యక్రమాలకు హాజరైన పినాకపాణిగారు అరైకూడి రామానుజం అయ్యంగారు, కాంచీపురం నైనా  పిళ్లై, పాపా వెంకట్రామయ్య, కుంభకోణం రాజమాణిక్యం పిళ్లై, తిరుచ్చి గోవిందస్వామి పిళ్లై మొదలైన వారి కచేరీల ద్వారా తంజావూరు సాంప్రదాయ కర్ణాటక సంగీతం వైపు ప్రభావితులైనారు. ఆయన అరైకూడి మరియు గోవిందస్వామి పిళ్లైల పద్ధతిని అనుకరించి తంజావూరు గాత్ర శైలిని ఆంధ్రులకు పరిచయం చేశారు. తాను ఇదివరకు నేర్చుకున్న కృతులు వీరు వేరుగా పాడుతూ ఉండటంతో ఆ పద్ధతిలో తాను మరల నేర్చుకుని తన సంగీత ప్రావీణ్యాన్ని మరింత పెంపొందించుకున్నారు. అప్పటికి ఆయన ఇంకా యుక్తవయసులోనే ఉన్నారు. ఒకసారి పినాకపాణి గారి గాత్రం విని అరైకుడి రామానుజం అయ్యంగారిని సంగీత రసికులైన ఎస్వై కృష్ణస్వామి గారు "వీరు మీ శిష్యులా" అని అడిగారుట. అంతగా పినాకపాణి గారు ఆయన పద్ధతిని నేర్చుకున్నారు.  "అరైకూడి నేను విన్న అత్యుత్తమ గాత్ర సంగీత విద్వాంసులు" అని పాణిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పాణి గారి శిష్యులైన నేదునూరి కృష్ణమూర్తి గారు ఒకసారి ఆయనను "ఏమిటి అరైకూడి గొప్పతనం" అని అడిగారుట. "గమకాలలో స్పష్టత ఆయన ప్రత్యేకత. అనుస్వరాలతో కూడిన గమకాలు పలికించటంలో ఆయన దిట్ట" అని చెప్పారుట పాణి గారు. తంజావూరు సాంప్రదాయంలో అరైకూడి వంటి కళాకారులు పాడుతున్నప్పుడు, వారి రికార్డులను విని ఆ స్వరాలను, సంగతులను పినాకపాణి రాసుకొని వెంటనే పలికే వారు.

అప్పట్లో గ్రామఫోన్ రికార్డుల్లో ఎక్కువగా పదాలు మరియు జావళీలు ఉండేవి. వాటిని విని ఇట్టే నేర్చుకునే వారు పినాకపాణి గారు. అలాగే తండ్రిగారితో కలిసి వెళ్లి నాటకరంగానికి సంబంధించిన సంగీతంలో కూడ ప్రావీణ్యం సంపాదించారు. అప్పటి మేటి హిందూస్థానీ కళాకారుల రికార్డులు విని ఆ సాంప్రదాయంలో మెళకువలు కూడా నేర్చుకున్నారు. తల్లిదండ్రులు రామేశ్వరం వెళుతుంటే తనను డిసెంబర్ చెన్నై సంగీతోత్సవాలు వీక్షించేందుకు అక్కడ వదిలి వెళ్లమని కోరారు. చెన్నైలో ఉండి అరైకూడి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు, స్వామినాథ పిళ్లై, కారైకూడి సోదరులు మొదలైన మహామహుల సంగీత కచేరీలు హాజరయ్యారు.  గురువులు లక్ష్మణ రావు గారి ప్రోత్సాహంతో ఆయన ద్వారం వేంకటస్వామి నాయుడు గారి వద్ద శిష్యరికానికి చేరారు. 1932లో ఇంటర్మీడియేట్ తరువాత విజయనగరంలో ద్వారం వారి ఇంట్లోనే ఒక గదిలో ఉంటూ ఆయన దగ్గర రాగాలాపన నేర్చుకొని తన సంగీత ప్రావీణ్యాన్ని వృద్ధి చేసుకున్నారు.

ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు గారి గాత్ర ధర్మంలో సాహితీ విన్యాసం పినాకపాణి గారిని ఎంతో ఆకట్టుకుంది. దానిని వెంటనే ఆకళింపు చేసుకొని తన స్నేహితుడైన డొక్కా శ్రీరామమూర్తితో కలసి వెంటనే గానం చేశారు. అలాగే మొదటి రెండవ కాలాలలో ఎలా పాడాలో కూడా ముసిరి గారి గాత్రం విని నేర్చుకున్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్ గారిని గమనించి నాలుగు కాలాలున్న పల్లవిని ఆరంభించటంలోని మెళకువలను నేర్చుకున్నారు. చెన్నైలోని ఎగ్మోర్‌లో వీణ ధనమ్మాళ్ గరి కచేరీ ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. అరైకూడి గారి వద్ద గమనించిన రాగ భావాన్ని ఆయన ద్వారం వారి వద్ద పాడినప్పుడు "నువ్వు చాల వృద్ధిలోకి వస్తావు" అని ఆశీర్వదించారట.

విశాఖపట్టణంలో ఎంబీబీఎస్‌లో చేరిన తరువాత అక్కడ తన రూంమేట్‌తో కలసి ఉదయం నాలుగు గంటలకు లేచి అక్కడ వరండాలలో, బీచిలో పినాకపాణి తీవ్ర సాధన చేశారు. 1939లో ఆయన ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేశారు. తొలి పూర్తి స్థాయి కచేరీని ఒక లెక్చరర్ గారి ప్రోత్సాహంతో విశాఖపట్టణంలో ఏర్పాటు చేయగా ఆ కచేరీకి ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు మైసూరు చౌడయ్య గారు హాజరై ఎంతో అభినందించారు. ఆయన ఆహ్వానంతో పినాకపాణి గారు మైసూర్ వెళ్లారు. చౌడయ్య గారింట్లోనే పేయింగ్ గెస్టుగా ఉంటూ సంగీత సాధన చేశారు. అంతటి విద్వాంసులైన చౌడయ్య గారు పినాకపాణి గారికి సాధనలో వయోలిన్ సహకారం అందించేవారు. ఆయనకు పినాకపాణి గారి గాత్రశైలి ఎంతో నచ్చేది. చెన్నైలో స్థిరపడిన ఒక తెలుగు కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒకసారి చౌడయ్య గారింటికి స్థానిక సభలలో పాడే అవకాశాల కోసం వచ్చారు. వారిలో ఒకరైన బాలాంబను పినాకపాణి గారు 1940లో వివాహం చేసుకున్నారు. 1945వ సంవత్సరంలో ఆయన ఎం.డి డిగ్రీలో పట్టభద్రులై డాక్టర్ పినాకపాణిగా పిలువబడ్డారు. విశాఖపట్టణంలో తనను అసిస్టెంటు సర్జన్‌గా ధృవీకరించకపోవటంతో రాజీనామా  చేసి రాజమండ్రి వెళ్లారు. నూకల చినసత్యనారాయణ గారు ఆయన మొదటి శిష్యులు. తరువాత రాజమండ్రిలో నేదునూరి కృష్ణమూర్తి గారు ఆయన శిష్యునిగా చేరారు. తిరిగి 1951లో వైజాగ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ సర్జంగా నియమించబడ్డారు. 1954లో సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొందారు. 1957లో కర్నూలుకు బదిలీ చేయబడ్డారు. ఆయన అక్కడే 1968లో పదవీ విరమణ చేశారు. తన మెడికల్ కెరీర్ మొత్తంలో ఆయన కచేరీలు చేస్తునే ఉన్నారు. 1938 నుండి 2001 వరకు ఆకాశవాణిలో ఏ -గ్రేడ్  కళాకారుడిగా కచేరీలు ఇచ్చారు. చెన్నైలో ఉన్నప్పుడు శ్రీపాద వారికి ప్రముఖ వయోలిన్ విద్వాంసులు రంగరామానుజ అయ్యరు గారితో సాన్నిహిత్యం ఏర్పడింది. వారి ప్రభావం పినాకపాణి గారి సంగీతంపై ఎంతో కనబడింది. చెన్నైలోని ఇతర ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు పినాకపాణి గారి ప్రతిభను ఎంతో ప్రశంసించారు.

ఆయన సంగీతం స్వచ్ఛతకు, శాస్త్రీయతకు, గమకాలలో సౌందర్యానికి నిలువుటద్దం. సంగీతం త్రయం యొక్క కీర్తనలను ఆయన అత్యంత భక్తి భావంతో ఆలపించేవారు. ఆయన ఆలాపనలలో ఎన్నో అలకారాలు, కొసమెరుగులు ఉండేవి. సాహిత్యంలో ఆయన కనబరచిన విన్యాసం అనుపమానం. రీతిగౌళ, సురటి వంటి కఠినమైన రాగాలలో కూడా ఆయన కనబరచిన మనోధర్మం అమోఘం. ఆయనకు శాస్త్రముపై ఉన్న పట్టు హిమాలయ శిఖరాలంత ఉన్నతమైనది. సంగీతం, వైద్యశాస్త్రంలో నైపుణ్యంతో పాటు అయన మంచి శరీర దారుఢ్యంపై దృష్టి కలిగి ఉందేవారు.

పినాకపాణి గారు ఎన్నో పుస్తకాలను రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తన ఐదేళ్ల పరిశ్రమతో నాలుగు భాగాలలో "సంగీత సౌరభం" అనే పుస్తకాన్ని రచించి ప్రచురించారు. దీనిలో వేయికి పైగా కృతులకు స్వరాలు ఉన్నాయి. ఇది తరువాతి కళాకారులకు కర్ణాటక సంగీత శిక్షణలో నిఘంటువైంది.  మనోధర్మ సంగీతం అనే పుస్తకాన్ని రచించి ఆయన భావి కళాకారులకు స్వంత మనోధర్మాన్ని ఎలా అరచుకోవాలో తెలిపారు. ఈ పుస్తకం తెలుగు విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశమయ్యింది. 160కి పైగా పల్లవులకు స్వరస్థానాలు మొదలగు వివరాలతో పల్లవి గాన సుధ అనే పుస్తకాన్ని రచించారు. మేళ రాగమాలిక అనే పుస్తకంలో 72 మేళకర్త రాగాల గురించి అద్భుతమైన వివరాలు పొందుపరచారు. ఆరు వర్ణాలను, 108 అన్నమాచార్య కీర్తనలను స్వరపరచారు. ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా సంగీత కళానిధి, కలైశిఖామణి బిరుదులు, 1966లో ఆంద్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ అవార్డు, 1973లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విద్వాన్ గుర్తింపు, 1974లో తి.తి.దే వారి సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదు,ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి కళాప్రపూర్ణ బిరుదు, 1977లో జాతీయ సంగీత నాటక అకాడెమీ అవార్డు,  1982లో ఆంధ్ర ప్రదేశ్ సంగీత అకాడెమీ ఫెలోషిప్, 1984లో పద్మభూషణ్ అవార్డు, 2008లో కళాసాగరం అవార్డు, 2012లో చెన్నై త్యాగబ్రహ్మ గాన సభనుండి జీవితసాఫల్య పురస్కారాలు వచ్చాయి. 80 ఏళ్ల వయసుపైబడిన తరువాత కూడా ఆయన రోజుకు నాలుగైదు గంటలు శిష్యులకు నేర్పే వారు. వోలేటి వేంకటేశ్వర్లు గారు "గురువు గారు సంగీతంలో ఆయన దైవం" అన్నారు. ఇంతమంది పేరుపొందిన శిష్యులున్నా ఆయనలో ఉన్న వినయం ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం.

దాదాపు వంద ఏళ్ల వయసు వృద్ధాప్యం వలన మంచం పాలైనా కూడా ఆయన పాడి శిష్యుల చేత సాధన చేయించే వారు. 2004లో ఐసీయూలో ఉన్నా కూడా శిష్యులచేత సాధన చేయించారు. అటువంటిది ఆయనకు సంగీతంపై గల ధ్యానం. ఏనాడూ మంచంపై పడుకొని ఉన్నా ఆయన గళంలో శుద్ధి, సంగీతంపై పట్టు ఏమాత్రం తగ్గలేదు. ఇరవై నాలుగు గంటలూ సంగీతమే ఆయనకు ధ్యాస. సుదీర్ఘమైన సంగీత జీవితం తరువాత, తన నూరవ యేట పరిపూర్ణమైన జీవితం గడిపి 11 మార్చి 2013 నాడు ఆయన కర్నూలులో పరమపదించారు. ఆయన శిష్య పరంపర దినదిన ప్రవర్ధమానమై వారు కూడా పద్మభూషణ్, సంగీత కళానిధి వంటి పురస్కారాలు అందుకున్నారు. వారిలో అనుభవజ్ఞులు  తితిదే వారి ఆస్థాన విద్వాన్ వంటి పదవులను అలంకరిస్తున్నారు. ఆ శిష్య పరంపరలో పినాకపాణి గారి సంగీత ఝరి సురగంగలా ప్రవహిస్తూనే ఉంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.  

1 వ్యాఖ్య: