1, జూన్ 2016, బుధవారం

స్వర రాగ గంగాలహరి - ఎం ఎల్ వసంతకుమారి



కర్ణాటక సంగీత త్రయమైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి 18వ శతాబ్దంలో ఈ శాస్త్రీయ సంగీతానికి పునాదులు వేస్తే దాన్ని 20వ శతాబ్దంలో ముందుకు తీసుకువెళ్ళిన త్రయం డీకే పట్టమ్మాళ్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మరియు ఎంఎల్ వసంతకుమారి. వైవిధ్య భరితమైన గాత్రశైలులలో ఈ ముగ్గురు మహిళామణులు నవీన కర్ణాటక పరంపరకు మూలస్థంభాలైనారు. వీరిలో పిన్నవారైన వసంతకుమారి గారు రాగాలాపనలో వైవిధ్యంతో దశాబ్దాలపాటు కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో ధృవతారగా ప్రకాశించారు. మద్రాస్ లలితాంగి వసంతకుమారి, అదే, ఎం.ఎల్. వసంతకుమారి గారి పేరు వినగానే మధురమైన స్వరం, శృతిపక్వమైన గానం, పెద్ద బొట్టు, పట్టు చీర, నిండైన రూపం స్ఫురణకు వస్తాయి.  కర్ణాటక మరియు సినీ సంగీత సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని సంపాదించి ఎంతో కీర్తిప్రతిష్ఠలు పొందిన ఈ తల్లి వివరాలు తెలుసుకుందాం.

1928 జులై 3వ తేదీన కూతనూర్ అయ్యసామి అయ్యరు, లలితాంగి దంపతులకు చెన్నైలో వసంతకుమారి జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ సంగీత కళాకారులే. చిన్ననాడే రాగాలు పలికించినా తల్లిదండ్రులు ఆమె బాగా చదివి డాక్టర్ కావాలని కోరుకున్నారు. కోయంబత్తూర్ తాయి, ఫ్లూట్ సుబ్బారావు, వీణ ధనమ్మాళ్ వద్ద వసంతకుమారి సంగీతం నేర్చుకున్నారు. తల్లితో కచేరీలకు వెళ్లే వసంతకుమారి అమ్మ రాగాలను ఏ విధంగా ఆలపించేదో బాగా నిశితంగా పరిశీలించి నేర్చుకునేవారు. వసంతకుమారి 1940లో సిమ్లాలో తల్లితో కలిసి తొలి కచేరీ ఇచ్చారు. 1941లో తల్లి అనారోగ్యంతో పాడలేకపోవటంతో తాను ఆమె బదులు బెంగుళూరులోని కచేరీలో పాడవలసి వచ్చింది. ఒకసారి కర్ణాటక సంగీతంలో మహావిద్వాంసుడైన జీఎన్ బాలసుబ్రహ్మణ్యం ఆమె గాత్రం విన్నారు. ఆమె గొంతులోని స్వచ్ఛతను గమనించి జీఎన్‌బీ ఆమె తల్లిదండ్రులను అభ్యర్థించి వసంతకుమారిని తన శిష్యురాలిగా చేర్చుకున్నారు. వసంతకుమారి జీఎన్‌బీ తొలి శిష్యురాలు. జీఎన్‌బీ వద్ద మనోధర్మాన్ని చక్కగా నేర్చుకున్న ఎమ్మెల్వీ తరువాతి కాలంలో తన గురువుల వైశిష్ట్యాన్ని ఎంతో పవిత్రంగా పరంపరలో కొనసాగించారు. గురువులాగే తాను కూడా ఉద్వేగాలకు అతీతంగా ప్రశాంతంగా, నిదానంగా రాగాలాపన సశాస్త్రీయంగా చేసేవారు. అందుకే ఎమ్మెల్వీ తదుపరి కాలంలో చాలా ప్రాచుర్యం పొందారు. ఎమ్మెల్వీ కర్ణాటక శాస్త్రీయ సంగీతమే కాకుండా హిందూస్థానీలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు.

గురువుల జీఎన్‌బీ శిక్షణలో ఆమె రాగాలాపన సశాస్త్రీయంగా మనోధర్మం ప్రకారం నేర్చుకున్నారు. మనోధర్మంపై పట్టు మరియు హిందూస్థానీ సంగీతం పరిజ్ఞానంతో ఆమె క్లిష్టమైన రాగాల ఆలాపన మరియు స్వరకల్పనను విభిన్నమైన శృతిభేదంతో రంగరించేవారు. మహనీయుల కృతులను ఆలపించేటప్పుడు ఒక రాగం నుండి ఇంకో రాగంలోకి వెళ్లేటప్పుడు తన గాత్రంలో తారమంద్రాతి భేదాలను అద్భుతంగా పండించేవారు. తన సృజనాత్మకతను షణ్ముఖప్రియ-శంకరాభరణం, భైరవి-ఖమాస్, అభోగి-వలజి రాగాల మధ్య మార్పులో సునాయాసంగా, అద్భుతంగా కనబరచే వారు. ఆమె హంసధ్వని రాగాలాపన ఎందరో హిందూస్థానీ సంగీత విద్వాంసులకు ప్రమాణమైంది.

1951వ సంవత్సరంలో ఎం.ఎల్.వసంతకుమారి వివాహం ఆర్. కృష్ణమూర్తితో జరిగింది. వారికి శ్రీవిద్య మరియు శంకరరామన్ అని ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ అమ్మాయే ప్రఖ్యాత చలనచిత్ర నటి శ్రీవిద్య. ఎంఎల్‌వీ చిన్న వయసునుండే శ్రీవిద్యకు సంగీతం, నాట్యం నేర్పించారు. భర్త వ్యాపారంలో దెబ్బతినటంతో కుటుంబం నడవటానికి రాత్రి కచేరీలు చేశారు. ఆమెకు సంగీతంలో ఉన్న బహుముఖ ప్రజ్ఞ వలన ఆమెకు చలన చిత్రాల్లో పాడే అవకాశం వచ్చింది. సినీరంగంలో అన్ని దక్షిణాది భాషల్లో ఆమె అద్భుతమైన గీతాలు ఆలపించారు. ఆమె సంగీతానికి ముగ్ధులైన ప్రముఖ హిందీ కథానాయకుడు రాజ్ కపూర్ 1956లో విడుదలైన చోరీ చోరీ చిత్రంలో ఆమె పాడిన ఒక తిల్లానాను పొందుపరచారు. తెలుగు చిత్రాల్లో ఆవిడ పాటిన హిట్ పాటలు - నాగుల చవితి చిత్రంలో "ఓం నమో నమో నటరాజ నమో","నటరాజు తలదాల్చు నాగదేవా", మాయాబజార్ చిత్రంలో "శ్రీకరులు దేవతలు", భూకైలాస్ చిత్రంలో "మున్నీట పవళించు నాగశయనా", భలే అమ్మాయిలు చిత్రంలో "గోపాల జాగేలరా", జయభేరి చిత్రంలో "నీవెంత నెరజాణవౌరా", బీదలపాట్లు చిత్రంలో "సరసకు రాడేలనే", కాళహస్తి మహాత్మ్యం చిత్రంలో "చాలు చాలు నవమోహనా", "చూచి చూచి" మొదలైన పాటలను అద్భుతంగా అలపించారు. ఈ చలనచిత్ర గీతాలు చాలామటుకు శాస్త్రీయ సంగీత నేపథ్యం కలవి లేదా శాస్త్రీయ నృత్యాంశాలపైనే. 1946లో ప్రారంభమైన ఆమె సినీ నేపథ్య గాత్ర ప్రస్థానం 1965 వరకు కొనసాగింది. ఈ సమయంలో ఆమె దాదాపుగా 100 చిత్రాల్లో పాడాఅరు. అత్యధికంగా తమిళ్, మలయాళం, తెలుగు భాషలలో దాదాపు ఇరవై ఏళ్లు శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటలను ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులు కూర్చగా అద్భుతంగా పాడారు.1948లో విడుదలైన కృష్ణభక్తి అనే తమిళ చలనచిత్రంలో త్యాగరాజ స్వామి వారి "ఎంత వేడుకొందు ఓ రాఘవా" అనే కృతిని పాడే కళాకరిణిగా నటించి నేపథ్య గానం అందించారు.

1965 తరువాత ఎం.ఎల్.వీ పూర్తిగా శాస్త్రీయ సంగీతంపైనే దృష్టి సారించారు. కుమార్తె యుక్తవయసులో ఉన్నప్పుడు ఆమె నృత్య కార్యక్రమాలలో గాత్రసహకారం ఎం.ఎల్ అందించేవారు. అదే పంథాలో ముందుకు వెళ్లి ఎం.ఎల్ భరతనాట్యానికి సంబంధించిన కృతుల ఆల్బం కూడా విడుదల చేశారు. తల్లి లలితాంగి వారసత్వంగా ఎం.ఎల్ పురందరదాసు కృతులపై పరిశోధన చేశారు. ఎన్నో దేవర్‌నామాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రఖ్యాత హిందూస్థానీ సంగీత విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గారి వద్ద మెళకువలు నేర్చుకొని హిందూస్థానీ బాణీలో సింధుభైరవి రాగాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. తమ కులదైవమైన కుతనూర్ సరస్వతిని ఆమె కొలిచేవారు. వీలైనప్పుడల్లా తంజావూరులోని ఆ తల్లి దేవాలయాన్ని సందర్శించేవారు.కర్ణాటక సంగీత ప్రస్థానంలో ఎం.ఎల్. వసంతకుమారి నారాయణ తీర్థులవారి కృతులను కూడా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆమె పాడిన "కళ్యాణ గోపాలం" అనే తీర్థుల వారి రచన సింధుభైరవి రాగంలో ఎంతో పేరుపొందింది. అలాగే ఆమె సింధుభైరవిలో "వేంకటాచల నిలయం" అనే పురందరదాసు కృతి కూడా ఎంతో ప్రచారంలోకి వచ్చింది.

రాగం-తానం-పల్లవి ప్రక్రియ ఎం.ఎల్. వసంతకుమారి గారి మరో ప్రత్యేకత. డీకే పట్టమ్మాళ్ గారు ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ సాంప్రదాయంపై ఎం.ఎల్.వి చేసిన పరిశోధన వలన తరువాతి తరాల కచేరీలలో ఒక ప్రమాణమైంది. వసంతకుమారి గారు అమృతవర్షిణి రాగంలో రాగం తానం పల్లవి పాడి తన ప్రజ్ఞను చాటారు. ఎం.ఎల్.వీ మరో ప్రత్యేకత ఆమె ఏ కచేరీకు ముందు కూడా సాధన చేసే వారు కాదు. ఈ విషయం ఆమె శిష్యురాలైన ప్రఖ్యాత సంగీత విదంవాసురాలు సుధా రఘునాథన్ గారు మరియు ఆమె గాత్రానికి వయోలిన్ సహకారం అందించిన ఏ కన్యాకుమారి గారు చెప్పారు. ఎం.ఎల్.వీ గానంలో విడుదలైన ఆల్బంలలో ప్రణమామ్యహం, పురందరదాస కృతులు, దేవీ కదంబమాల, భరతనాట్యం పాటలు, గోల్డెన్ గ్రేట్స్, గురు శిష్య పరంపర, స్వర సంగమం మరియు వసుధ (సుధా రఘునాథన్‌తో కలిసి పాడినవి), సునాద బృందావనం, వందిసువె గురురాఘవేంద్ర,వాతాపి గణపతిం భజేహం మొదలైనవి బాగా ప్రచారంలోకి వచ్చాయి. తిరుప్పావై పాశురాలను ఆమె పాడిన రీతి అద్భుతం. అందుకే ఆ సంపుటి బహుళ ప్రాచుర్యం పొందింది.

దూరదర్శన్, ఆకాశవాణిలలో ఎం.ఎల్.వీ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి సాటిగా కచేరీలు చేశారు. సొగసు మరియు శాస్త్రీయత కలబోసి ప్రేక్షకులను, శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన అసమాన ప్రతిభామూర్తి ఎం.ఎల్. వసంతకుమారి. సంగీతం శ్రోతల హృదయాలను తాకాలన్నది ఆమె సిద్ధాంతం. ఆమె శిష్య పరంపరలో సరస్వతీ శ్రీనివాసన్, సుధా రఘునాథన్, త్రిసూర్ రామచంద్రన్, ఆయన సతీమణి చారుమతీ రామచంద్రన్, ఏ కన్యాకుమారి, యోగం సంతానం, వనజా నారాయణన్, మీనా సుబ్రహ్మణ్యం, టీ.ఎం.ప్రభావతి, జయంతి శ్రీధరన్, జయంతి మోహన్ మొదలైన ప్రఖ్యాత సంగీత కళాకారులు ఉన్నారు. ప్రేమ, వాత్సల్యం, క్రమశిక్షణ కలబోసి తన శిష్యులకు శిక్షణ ఇచ్చారు. వారి వారి సామర్థ్యాలను బట్టి శిష్యులకు సముచితమైన శిక్షణ ఇచ్చారు. అత్యున్నమైన విలువలతో ఆమె తన జీవనాన్ని, శిష్య సంబంధాలాను సాగించారు.

1967వ సంవత్సరంలో ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వారు దేశంలో మూడవ అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ఇచ్చి గౌరవించారు. 1970వ సంవత్సరంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం వారి సంగీత నాటక అకాడెమీ అవార్డు వచ్చింది. పురందరదాసు కృతుల ప్రచారానికి ఆమె చేసిన పరిశోధనకు, సేవకు గుర్తింపుగా 1976వ సంవత్సరంలో మైసూర్ విశ్వవిద్యాలయం వారు ఆమెకు డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించారు. 1977లో 49 ఏళ్ల వయసులోనే సంగీత కళానిధి బిరుదు పొందిన ఘనత ఆమెకు దక్కింది.

దాదాపు నలభై ఐదేళ్ల సుదీర్ఘ సినీ కర్ణాటక సంగీత ప్రస్థానంలో శిఖర స్థాయికి చేరుకొని ఎంతో గౌరవాన్ని, మన్ననలను పొందిన ఎం.ఎల్ వసంతకుమారి గారు 1991లో 63 ఏళ్ల వయసులో కామెర్ల వ్యాధికి గురై మరణించారు. ఆమె శిష్యులు కూడా పద్మభూషణ్, పద్మశ్రీ, సంగీత కళానిధి వంటి పురస్కారాలు, బిరుదులు పొందే స్థాయికి ఎదిగి ఆమె మహోన్నత సంగీత వారసత్వ వైభవాన్ని కొనసాగిస్తున్నారు. ఎందరొ మహానుభావులు అందరికీ వందనాలు.

ఆమె ఆలపించిన కృతులలో సింధుభైరవి రాగంలో పురందరదాసుల వారి వేంకటాచల నిలయం వినండి. చలన చిత్ర గీతాలలో భూకైలాస్ చిత్రంలోని దశావతార గీతం "మున్నీట పవళించు నాగశయనా" కమలా కుమారి నాట్యం చేయగా చూడండి

1 కామెంట్‌: