29, మే 2016, ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ - కథ


కల్పనలో ఊహించిన హొయలు
శిల్ప మనోహర రూపమునొంది
పదకరణముల మృదుభంగిమల
ముదమార లయమీరు నటనాల సాగే

అనే పాటకు రంజని అద్భుతమైన కూచిపూడి లయవిన్యాసము సభికులకు సురలోక నర్తకీమణుల నాట్యవిన్యాసలను తలపింప జేస్తోంది. ఎదురుగా కూర్చున్న భర్త వంశీమోహన్ మనసు పులకించి మౌనంగా అందమైన ప్రేమగీతం పలికింది. ఇంటికి వచ్చాక "రంజనీ! ఎల్.విజయలక్ష్మి గారిని గుర్తు చేశావు. హ్యట్సాఫ్ టు యువర్ డ్యాన్సింగ్ మేజిక్..." అన్నాడు. "ఏవండోయ్! ఎంత మీ భార్య అయితే మాత్రం మరీ ఎల్. విజయలక్ష్మి గారితో పోల్చటం భావ్యం కాదు. ఆవిడ లేడి పిల్లకు లయగతులు నేర్పిస్తే ఎలా ఉంటుందో అన్న దానికి ప్రతిబింబం..." అని సవరించింది. "సర్లేవోయ్! అవధుల్లేని ఆనందంలో అలా అనేశాను..పిల్లలు ఏం చేస్తున్నారో చూడు.." అన్నాడు. నృత్య ప్రదర్శనకు వెళ్లేముందు పిల్లలతో రెండు గంటల గడిపిన మధుర క్షణాలను ఆస్వాదిస్తూ ఆలోచిస్తున్నాడు వంశీ.

"అమ్మా లాస్య! ఏదీ నిన్న నేర్చుకున్న స్టెప్స్ ప్రాక్టీస్ చేద్దాం రా.." అంది రంజని. "అమ్మా! ఇంత రాత్రి పూట ప్రాక్టీసా! అలసిపోయాను..ఈ ఒక్కరోజుకు బ్రేక్ ప్లీజ్!" అంది లాస్య. "లేదు తల్లీ. ఒక్క రోజు ఇలా బద్ధకంగా వదిలేస్తే పక్క రోజు కూడా అలానే అనిపిస్తుంది. మనకు టైం చాలా ప్రెషియస్. ప్లీజ్ కం ఫర్ ప్రాక్టీస్." అని ఖచ్చితంగా అంది రంజని. క్రమశిక్షణకు ప్రతిరూపం ఆ కళాకారిణి. లాస్య అయిష్టంగానే గజ్జెలు కట్టుకు వచ్చింది. ఇద్దరూ క్రింద హాలులోకి వెళ్లి ఎదురుగా ఉన్న నటరాజు విగ్రహానికి వందనం చేసి ప్రాక్టీసు ప్రారంభించారు.

"శిరుత నవ్వుల వాడు సిన్నెకా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా" అని డాక్టర్ శోభారాజు గారు ఆలపించిన గీతానికి తల్లి స్టెప్సు నేర్పిస్తోంది. దశావతారాలను వర్ణించే ఈ సంకీర్తనలో రంజని తన్మయురాలై హావభావాలను జానపద రీతిలో నేర్పుతుంటే లాస్యలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తల్లి సాహిత్యాన్ని వివరించి నేర్పిస్తుంటే మరింత ఆసక్తి పెరిగింది. మొత్తం అంశాన్ని గంటన్నర పాటు అభ్యాసం చేశారు తల్లీ కూతుళ్లు. పిల్ల తల్లి ఒళ్లో తలపెట్టి నిద్రపోయింది. లాస్య భవిష్యత్తుపై రంజనికి ఎన్నో ఆశలు. మంచి కళాకారిణిగా తీర్చిదిద్దాలని తాపత్రయం. పక్కనే హాయిగా నిద్రపోతున్న పదేళ్ల చిన్న కూతురు స్వరాళిని ముద్దు పెట్టుకుంది. అచ్చం వాళ్ల నాన్న పోలికే అని మరో మారు మురిసిపోయింది.


వంశీ భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. "ఏవండీ! ఇంకా పడుకోలేదా? ప్రాక్టీసుకు విఘ్నం ఎందుకని రాత్రి అయినా లాస్య చేత డ్యాన్స్ చేయించాను. అందుకని ఆలస్యం అయ్యింది. దానికి నాట్యంపై మంచి అవగాహన ఉంది. క్రమశిక్షణ కావాలి" అంది.  "చిన్న పిల్ల కదా రంజనీ! నువ్వు ఇలాగే నేర్పిస్తూ ఉంటే డిసిప్లిన్ అదే వస్తుంది" అని నవ్వి వంశీ భార్యను దగ్గరకు తీసుకున్నాడు. "స్వరాళికి పెయింటింగ్ అంటే ఇష్టమండీ. దాన్ని మంచి టీచర్ దగ్గర చేర్పించాలి" అంది రంజని. "రంజనీ! ముందు పిల్లలకు ప్రకృతిని, ఈ విశ్వంలోని అద్భుతాలను ఆస్వాదించే వ్యక్తిత్వాలను ఇద్దాము. తరువాత కళలు, సృజనాత్మకత అవే వస్తాయి. ఈ సెలవుల్లో పిల్లలను తమిళనాడు టూర్ తీసుకువెళ్లి అక్కడి అద్భుతమైన దేవాలయాలను, వాటిలోని శిల్ప సంపదలను చూబిద్దామని ఉంది" అన్నాడు. "తప్పకుండా! " అంది రంజని. అలాగే అని పిల్లల భవిష్యత్తు ప్రణాలిక చేస్తూ నిద్రపోయాడు వంశీ.

"నాన్నా! గుళ్లకు ట్రిప్ ఏంటి? మేము రాము" అంది ఉదయాన్నే లేచి వంశీ ప్లాన్ విన్న లాస్య. పన్నెండేళ్ల లాస్య ముఖంలోకి చిరునవ్వుతో చూసి వంశీ పిల్లలిద్దరినీ తమ ఇంట్లో ఉన్న లైబ్రరీలాంటి పుస్తకాల అర వద్దకు తీసుకు వెళ్లి అందులోని భారతీయ దేవాలయాలు మరియు నాట్య కళలు అనే పుస్తకాన్ని తీసి వారిద్దరి ముందుంచాడు. ఒక్కొక్క పేజీ ముందుకు తిప్పుతూ అందులోని శిల్పకళా సంపదను, నాట్య భంగిమలను, వివిధ నాట్య పద్ధతులను వారికి వివరించాడు. నాట్యం పరమాత్మకు ఒక పవిత్రమైన సేవ అనే భావాన్ని వారిలో చిగురింప జేశాడు. "నాన్నా! ఇంత పెద్ద పెద్ద శిల్పాలను, వాటితో గుళ్లను ఎప్పుడు నిర్మించారు, ఎలా నిర్మించారు? ఐ యాం ఎక్సైటెడ్" అని కళ్లు పెద్దవి చేస్తూ చెప్పింది లాస్య. తనలో ఆసక్తి చిగురించింది అని గమనించి "లాస్యా! మరి ట్రిప్ కి రెడీ?" అని అడిగాడు. "అవును నాన్నా!" అంది లాస్య. ఇంతలో స్వరాళి "నాన్నా! ఎవరో రాజా రవి వర్మ అని గ్రేట్ పెయింటరట. మా ఆర్ట్ టీచర్ చెప్పింది. ఆయన పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయి? నాకు చూపిస్తావా?" అని అడిగింది. "అవునా! రాజా రవివర్మ చాలా గొప్ప చిత్రకారుడు. కేరళకు చెందిన వాడు. ఆయన పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కొని తప్పకుండా చూద్దాం" అన్నాడు వంశీ. ఎగిరి గంతులు వేసింది స్వరాళి.

"రంజనీ! పిల్లలను నేను మదురై, చిదంబరం, చెన్నై తీసుకువెళ్లాలి. నువ్వు కూడా వస్తే ఒక కళాకారిణిగా వాళ్లకు అన్నీ వివరించే అవకాశం..." భర్త అంతరంగం అర్థం చేసుకున్న రంజని ఒక్క నిమిషం ఆలోచించి "అయితే దసరా సెలవుల్లో వెళదాం. ప్లాన్ చేయండి" అంది. వెంటనే వంశీ ట్రిప్ అంతా కూలంకషంగా ప్రణాళిక చేశాడు. పిల్లలనిద్దరినీ పిలిచి - "మనం మీకు ఇష్టమైన అంశాల గురించి తెలుసుకోవటానికి వెళుతున్నాము కాబట్టి మీకో హోంవర్క్. ఇద్దరూ మీ సొంత పదాలలో ట్రిప్ గురించి ఏరోజుది ఆరోజు ఒక 2 పేజీలు రాయాలి. లాస్యా! నువ్వు గమనించిన విషయాలు అమ్మతో డిస్కస్ చేసి నీ నాట్యంలో అమలు పరచాలి. స్వరాళీ! నీకు నచ్చిన దృశ్యాలను నీకు వచ్చిన పద్ధతిలో పెయింట్ చేయాలి. వీటికి కావలసిన సామాను నేను పట్టుకు వస్తాను" అన్నాడు. పిల్లలిద్దరూ సంతోషంతో కేరింతలు కొట్టారు. "బానే ఉంది మీ ఉత్సాహం. నాన్న చెప్పినట్లు మీరు చూసిన వాటి గురించి ఆలోచించి అక్షరాలలో పెట్టంది నాకు కూడా చాలా సంతోషం" అంది రవళి.

విమానంలో చెన్నై చేరుకుంది ఈ అందమైన కుటుంబం. మొట్టమొదట స్వరాళి కోసం చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మ్యూజియంకు వెళ్లారు. అక్కడ రాజ రవి వర్మ చిత్ర కళాకృతుల ప్రదర్శన చూస్తుంటే స్వరాళికి నోట మాట రాలేదు. ఆ చిన్నారి మనసులో ఎన్నో భావనలు. "నాన్నా! 110 ఏళ్ల క్రింద ఇలాంటి కలర్స్ ఉండేవా? అచ్చం మనుషుల్లానే ఉన్నాయి ఇందులో కేరేక్టర్స్!! ఆ దీపం పట్టుకున్న లేడీ చూశారా? వాట్ అ లైవ్లీ పెయింటింగ్!! అయాం సో ఇన్స్పైర్డ్ అండ్ ఎక్సైటెడ్!" అని తన్మయురాలైంది. "స్వరాళీ! టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో ఇంతటి సజీవమైన చిత్రాలను గీసిన రాజా రవి వర్మ చిత్రాల వివరాలు, ఆయన చరిత్ర చదవాలని ఉందా? ఇదిగో పుస్తకం. ఇది నీకు నా దసరా బహుమానం. నేను నువ్వు రాయబోయే వ్యాసం కోసం ఎదురు చూస్తుంటాను" అని చక్కటి పుస్తకాన్ని స్వరాళికి అందించాడు. ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేవు. నాన్నను హత్తుకొని, వెంటనే పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టింది.

చెన్నై నుండి చిదంబరం చేరుకుంది ఆ కుటుంబం. కారు దిగి తూరుపు గోపురం దగ్గరకు చేరుకున్నారు. "లాస్యా! ఇక్కడ ప్రాకారాన్ని జాగ్రత్తగా పరిశీలించు. భరతనాట్య శాస్త్రంలోని 108 కరణాలను ఈ ప్రాకారంపై శిల్పాకృతిలో చెక్కి ప్రతిష్ఠించారు" అంది రంజని. "అమ్మా! కూచిపూడికి భరతనాట్యానికి చాలా ముద్రలు ఒకేలా ఉన్నాయే! అసలు అన్ని వందల ఏళ్ల క్రితం ఇలాంటి శిల్పాలు ఎలా చెక్కి అంతపైకి ఎలా నిలుపగలిగారు?" అని ప్రశ్నల వర్షం కురిపించింది లాస్య.  "అవునమ్మా! భారతీయ నృత్య రీతులలో కూచిపూడికి, భరతనాట్యానికి కొన్ని ముద్రలు ఒకటే. భరతముని రచించిన నాట్యశాస్త్రం నుండి కూర్చబడింది భరతనాట్యం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గలదీ నాట్యం. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల పోషణతో, ఇటువంటి దేవాలయాలలో నిత్యసేవలో, ఉత్సవాలలో భరతనాట్యం పరిఢవిల్లింది.." అని వివరంగా భరతనాట్యం విశిష్టతను తెలిపింది రంజని.

లాస్య మనసులో ఈ నాట్యశాస్త్రం గురించి, తాను నేర్చుకునే కూచిపూడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని రెండిటా ప్రావీణ్యం సంపాదించాలని పట్టుదల కలిగింది. అంతటి మహోన్నత చరిత్ర గల దక్షిణ భారత నృత్య రీతులపై మనసులో ఆరాధనా భావం ఏరపడింది. ఆ గోపురంపై శిల్ప భంగిమలను, రంగులను, వాటిలోని జీవ కళను చూసి అబ్బురపడింది లాస్య. దాదాపు ఒక అరగంట సేపు అక్కడ గడిపిన తరువాత లోపలికి వెళ్లారు. నడిచే మార్గంలో ఓ పక్క అద్భుతమైన బొమ్మల కొలువు. దేవీ నవరాత్రుల ఆ బొమ్మల సందర్భంగా పేర్చిన ఆ కొలువులోని ప్రతిమల సౌందర్యం చూసి ఆనందపడ్డారు. "పిల్లలూ, చూశారా? మనకు తమిళులకు బొమ్మల కొలువు సాంప్రదాయం ఉంది. భాషలు వేరైనా మన సంస్కృతులు, సాంప్రదాయాలలో చాలా రిసెంబ్లెన్సెస్ ఉన్నాయి. అదే మన దేశం గొప్పతనం. అన్నిటినీ గౌరవించాలి. అన్నిటి గురించి తెలుసుకోవాలి" అని రంజని. పిల్లలకు అర్థమైంది.

"లాస్యా! ఈ గుడికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఇక్కడ ఉన్న మంటపాలు. అవి చిత్ సభ, కనక సభ, నృత్య సభ, రాజ సభ మరియు దేవ సభ.చిత్ సభ జ్ఞానానికి ప్రతీక. ఈ సభలో ఇక్కడి దైవమైన నటరాజస్వామి తన అర్థాంగి అయిన శివకామసుందరితో ఉంటాడు. ఇదే గర్భ గుడి. చిత్ సభకు ఎదురుగా ఉన్న కనక సభ నుండి నిత్య పూజలు, సేవలు చేస్తారు. నృత్య సభలో నటరాజు మహాకాళితో కలిసి నాట్యం చేశాడని నానుడి. యోగంలో సహస్రార చక్రానికి ప్రతీకగా వేయి స్థంభాలతో రాజ సభను నిర్మించారు. దేవసభలో శివపార్వతులు, గణపతి, స్కందుడు, చండీశ్వరుడు ఉంటారు" అని చిత్ సభ వైభవాన్ని వివరించింది రంజని. మధ్యాహ్నం పన్నేండు గంటల సమయం. ఆ సమయంలో అక్కడ జరిగిన సేవ చూసి లాస్య ఆనందంలో తేలిపోయింది. "ఏవండీ! కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు నాట్యం చేసినట్లు లేదూ" అని రంజని. అందరిదీ అదే అనుభూతి. "అమ్మా! ఐ యాం సో హ్యాపీ టు బి హియర్. మై రెస్పెక్ట్ ఫర్ డ్యాన్స్ హస్ మల్టిప్లైడ్" అంది లాస్య. అందరూ తృప్తిగా దర్శనం చేసుకొని బయలుదేరారు.

"స్వరాళీ! ఈరోజు మనం మన దేశంలోనే అత్యంత వైభవమైన దేవాలయాన్ని దర్శించబోతున్నాము" మదురైలో హోటెల్ చేరుకున్న తరువాత ఉత్సాహంగా అన్నాడు వంశీ. వెంటనే తన వద్ద తన చిన్ననాటి మదురై దేవాలయం మ్యాప్ తీసి పిల్లల ముందు పరచాడు. పిల్లలిద్దరూ మదురై నాయక రాజులకున్న తెలుగు మూలాలు తండ్రి ద్వారా తెలుసుకొని తెలుగు-తమిళ ప్రజలకున్న అవినాభావ సంబంధాన్ని గ్రహించారు. "నాన్నా! ఈ దేవాలయమేనా అర్జున్ సినిమాలో చూపించింది. దీని రెప్లికా చేశారా హైదరాబాదులో!! వావ్ ఈ యాం ఈగర్ టు విసిట్ దిస్ టెంపుల్" అంది లాస్య. స్నానం చేసి అందరూ మదురై మీనాక్షి దేవాలయం వద్దకు చేరుకున్నారు. గైడును మాట్లాడుకుని మొత్తం ప్రాంగణం దాదాపు 2-3 గంటలు చూశారు. పుష్కరిణి చుట్టూ ఉన్న నడకదారి పైకప్పు మీద అద్భుతమైన బొమ్మలు గీసి రంగులు అద్ది ఉన్నాయి. మహాభారతం, శివపార్వతుల వైభవం, గణపతి మొదలైన గాథలను తెలిపే ఈ చిత్రాలు చూసి స్వరాళి గెంతులు వేసింది. దేవాలయంలోని ధ్వజ స్థంభం వద్ద ఉన్న వివిధ దేవతా మూర్తుల శిల్పసౌందర్యం చూసి లాస్య నివ్వేర పోయింది. తల్లిదండ్రులు ఓపికగా మొత్తం దేవాలయ వివరాలు తెలుపుతుంటే పిల్లల కళ్లలో ఆసక్తి, ఆరాధన, ఆశ్చర్యం వెల్లువెత్తాయి. ఎంతో తృప్తితో ఆ కుటుంబం మదురైనుండి హైదరాబాదు విమానంలో చేరుకుంది.

తిరిగి వచ్చిన పిల్లలు తమ మనసులోని భావనలను నాన్న చెప్పినట్లుగా రాయటం మొదలు పెట్టారు. కలాలు కదులుతున్నాయి, భావనలు అక్షర రూపం దాల్చి తమకు ఆసక్తి గల కళలకు ప్రతిబింబంగా వెలువడుతున్నాయి. విషయాలు తెలుసుకోవటానికి యాత్రలు ఎంత గొప్ప సాధనాలో ఆ పిల్లలకు అర్థమైంది. అదే వారి అక్ష్రమాలికలలో ప్రతిధ్వనించింది. పిల్లలలో భారతీయ కళల పట్ల మంచి భావనలు కలిగినందుకు రంజని-వంశీ దంపతులు ఎంతో సంతోషించారు. రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో ఆ వ్యాసాలకు ప్రథమ బహుమతి వచ్చింది.

"రంజనీ! త్వరగా బయలుదేరు, ప్రోగ్రాం కి టైం అవుతోంది" అన్నాడు వంశీ ఓ ఆదివారం సాయంత్రం. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక కళల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాలలో ఆరోజు రంజని ప్రదర్శన. పిల్లలను ఇంట్లో వదిలి భార్య భర్తలు కారులో బయలుదేరారు. రోడ్లు ఖాళీగా ఉండటంతో కాస్త వేగంగానే వెళుతున్నారు. కారు అదుపు తప్పి డివైడర్‌ను గుద్దుకుంది. రంజని పాదం బాగా దెబ్బతింది. వంశీ చిన్న చిన్న గాయలతో రోడ్డు మీద పడ్డాడు. ఆస్పత్రిలో వేరే దారిలేక రంజని పాదం తొలగించాల్సి వచ్చింది. జీవితంలో ఊహించని ఈ కఠిన పరీక్షకు ఆ కుటుంబం తలక్రిందులైంది. నాట్యమే జీవితంగా, ఆ కళే శ్వాసగా జీవించిన రంజని కాలులేక నెలలపాటు మంచం మీద ఉండే పరిస్థితి.

"నాన్నా! అమ్మ ఇలా ఉండకూడదు. అమ్మ మళ్లీ నడవాలి, నాట్యం చేయాలి. ఆర్టిఫిషియల్ లింబ్ గురించి కనుక్కోండి" అంది లాస్య. "అవును లాస్యా! జీవితంలో ఎప్పుడూ స్థైర్యం కోల్పోకూడదు. అమ్మ మళ్లీ నాట్యం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేద్దాం" అన్నాడు వంశీ. జైపూర్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై నగరాలు తిరిగి అత్యుత్తమమైన కృత్రిమ పాదం గురించి వివరాలు తెలుసుకున్నాడు. దాదాపు ఆరునెలల పరిశోధన తరువాత చెన్నైలో అత్యుత్తమమైన పాదం రంజని కాలికి శస్త్రచికిత్స ద్వారా అతికించారు. ఆ తరువాత ఏడాది రంజని జీవితంలో మరువలేని సమయం.

"రంజనీ! త్వరగా లేచి రా! కాలికి ఎక్సర్సైజ్ కావాలి" అని పదే పదే గుర్తు చేసి, స్ఫూర్తినిచ్చి రంజనిని చేత అడుగులు వేయించాడు. "ఏవండీ! నా వల్ల కావట్లేదు. చాలా నొప్పిగా ఉంది" అని కన్నీళ్లతో భర్తను కౌగిలించుకుంది రంజని. "చూడు! చాలా మందికి జీవితంలో పరీక్షలు వస్తుంటాయి. ఇటువంటప్పుడే ధైర్యంగా మనం నొప్పిని, కష్టాన్ని, దౌర్బల్యాన్ని ఓర్చుకొని ముందడుగు వేయాలి..." అలా చెప్పుకుంటూ తన భుజంపై ఒక చేయి వేయించుకుని రంజనిని దాదాపు పావు గంట నడిపించాడు. "ఏవండీ! మీ మాటలు వింటుంటే నొప్పి మర్చిపోయి నడువగలుగుతున్నాను.." అని కన్నీటిని తుడిచివేసుకుని గల గలా నవ్వింది. "అమ్మా! యూ క్యాన్ డూ ఇట్. యూ హ్యావ్ టు డ్యాన్స్ ఎగైన్..." అని చప్పట్లు చరుస్తూ లాస్య ఉత్సాహంగా తల్లికి స్ఫూర్తినిచ్చింది. దాదాపు 3 నూలెల కఠోర శ్రమ తరువాత రంజని అడుగులు వేయగలిగింది. ఈ మూడు నెలలూ, వంశీ లాస్యను రంజని శిష్యులలలో ఒకరి వద్ద డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తునే ఉన్నాడు. ప్రతి రోజూ లాస్యను తీసుకువెళ్లటం, ప్రోత్సహించటం, తనకి కావలసినవి అన్నీ సమకూర్చటం వంశీ ప్రతిదీ జాగ్రత్తగా తానే స్వయంగా చూసుకున్నాడు.

"ఏవండీ! మీ పట్టుదలతో, ప్రోత్సాహంతో నడవగలుగుతున్నాను. అవిటిదాన్ని అయిపోయానన్న భయం నుండి మళ్లీ ధైర్యంగా నడువగలను అన్న స్థాయికి తీసుకు వహ్చారు. అంతా మీ వల్లే" అంది భర్తతో ఆరాధనా పూర్వకంగా. "రంజనీ! అదే యాక్సిడెంటులో నీ బదులు నాకు కాలు పోతే? నువ్వు కూడా ఇంతే చేసే దానివి కదా" అన్నాడు. తలదించుకుంది రంజని. "రంజనీ! నీ ప్రస్థానం ఇంతటితో ఆగడానికి వీల్లేదు. నువ్వు ఎలాగైనా నాట్యం చేయాలి" అన్నాడు. "ఏవండీ! నేనేమన్నా సుధాచంద్రన్ అనుకున్నారా? పిల్లలంటే తెలియక అంటున్నారు..మీరు కూడా..."  "రంజనీ! నువ్వు సుధాచంద్రన్ ఎందుకు కాకూడదు? డాక్టర్ గారిని సంప్రదించి వివరాలు కనుక్కుంటాను" అన్నాడు. "వై నాట్! ఆ కాలిపై బాగా ఒత్తిడి పడనంత వరకూ ఏదైనా చేయవచ్చు" అన్నాడు ఆర్థోపెడిక్ సర్జన్. వంశీకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

"రంజనీ! ఈరోజే నీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఆరంభం" అని డాక్టర్ చెప్పింది వివరించాడు. సందేహంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది రంజని. "ఏదీ పాదాలు ఎత్తి ఈ స్టూల్ మీద పెట్టు" అన్నాడు. ఎందుకు అంటూ పాదాలు స్టూలు మీద పెట్టింది. వంశీ ఆమె కృత్రిమ పాదానికి గజ్జెలు తొడిగాడు. ఆనందబాష్పాలు రాల్చింది రంజని. వంశీ రంజని పాత డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో టీవీలో ప్లే చేశాడు. తడబడుతూ నాలుగు అడుగులు వేసే సరికి నొప్పి, భయం, ఆందోళన. రంజని కుప్పకూలిపోయింది. "ఏవండీ! ఈ జీవం లేని పాదం ఆ పాదం ఎప్పటికీ కాదండీ! నేను నాట్యం చేయలేను" అంది. "రంజనీ! సరే. ఈరోజుకు వదిలేయ్. కానీ, నేను చేయలేను అన్న ఆలోచన ఎక్కువ సేపు నీ మనసులోకి రానీయకు" అని చెప్పి రంజనిని దగ్గరకు తీసుకున్నాడు. "ఏవండీ! నాకు కొంత సైకలాజికల్ సపోర్ట్ కావాలి. మనం సైకాలజిస్టు అభిరాం గారిని కలుద్దాం"  అంది రంజని కాస్త ఓదార్పు పొందిన తరువాత. "అలాగే" అన్నాడు వంశీ.

"రంజని గారు! నేను సైకాలజిస్టుగా ఎందరో రోగులను, మానసిక రుగ్మతలను చూశాను, నయం చేశాను. కానీ చాలా అరుదుగా ఇలా ఒక వ్యక్తి ముందడుగు కోసం ముందు చూపుతో సైకాలజిస్టు సలహా కోసం వచ్చిన వాళ్లను చూశాను. ఐ ఎడ్మైర్ యూ టూ ఫర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ మై ప్రొఫెషన్" అని ఆమెకు స్ఫూర్తిదాయకమైన ఒక ప్రణాళికను రూపొందించాడు ప్రఖ్యాత మనస్తత్త్వ శాస్త్ర నిపుణులు డాక్టర్ అభిరాం గారు. దైవంపై విశ్వాసంతో, భక్తితో గట్టి సంకల్పం చేసుకొని యోగ మరియు ప్రాణాయం చేస్తూ, డాక్టర్ అభిరాం గారి ప్రణాళికతో, భర్త ప్రోత్సాహంతో మానసిక దారుఢ్యాన్ని పొందిన రంజనిలో ఆరు నెలల సమయంలో చాలా మార్పు వచ్చింది.

"ఏవండీ! ఈరోజు నాట్యం మళ్లీ మొదలు పెడతాను" అని వంశీతో చెప్పి లాస్యను కూడా పిలిచింది. "లాస్యా! గురు వందనం, మొదటి అడుగులకు తాళం వేయి తల్లీ" అని అడిగింది. నటరాజు ముందర మళ్లీ దాదాపు ఏడాది తరువాత రంజని మళ్లీ అడుగులు మొదలు పెట్టింది. కూతురు లయ గతులను పలుకుతుంటే రంజని నిదానంగా నాట్య విన్యాసాన్ని మొదలు పెట్టింది. దాదాపు మూడు నెలలు తీవ్ర ప్రయత్నం చేసింది. మనసు తడబడినా, అడుగులు భారం అనిపించినా వంశీ ఆమెను వెనుకడుగు వేయనీయలేదు. రంజని తిరిగి పూర్వంలా నాట్యం చేయగలుగుతోంది. మరో మూడేళ్ల పాటు సాధనతో మళ్లీ ప్రదర్శనిలిచ్చింది. ఆ సాధనా ప్రయాణంలో లాస్య తన నాట్య శిక్షణను పూర్తి చేసుకుంది. ప్రతి ఒక్క అడుగులోనూ వంశీ వాళ్లిద్దరికీ తోడుగా ఉన్నాడు. స్వరాళి చిత్రలేఖనంలో మంచి శిక్షణ పొంది అద్భుతమైన ప్రగతిని సాధించింది. తల్లిదండ్రుల క్రమశిక్షణ, ప్రోత్సాహంతో, ప్రేమానురాగాలతో స్వరాళి పదిహేనేళ్లకే అద్భుతమైన కళాకారిణిగా రూపుదిద్దుకొని జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంది.

డిసెంబరులో కోణార్క్ నాట్యోత్సవాలు..."వి నౌ ప్రెసెంట్ టు యు ఎ యునీక్ డ్యాన్స్ మెడ్లే ఇన్ కూచిపూడి వేర్ ద ఆర్టిస్ట్స్ షాల్ డ్యాన్స్ టు ఎ పెయింటింగ్, డెపిక్టింగ్ దశావతార ఫాలోడ్ బై ఎన్ ఐటం ఎక్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. దశావతార ఈజ్ ఎ రాగమాలిక అండ్ ద పేయింటర్ షాల్ కంప్లీట్ ఇట్ ఎట్ ద సేం టైం ద డ్యాన్స్ ఎండ్స్..." నాట్యబృందంలో ప్రధాన కళాకారులు రంజని-లాస్య. పెయింటర్‌గా స్వరాళి..తమను తాము మరచిపోయి ఆ దశావతార నృత్యాంశంలో ఒదిగిపోయి, కళ ద్వారా పరమాత్మతో అనుసంధానమైనారు ఆ తల్లీ కూతుళ్లు. కరతాళధ్వనుల మధ్య ఆ అంశం ముగిసింది. నాట్యాంశం ముగిసే సరికి స్వరాళి చేతుల్లో ఒక అద్భుతమైన దశావతార చిత్రం సంపూర్ణమైంది. ఆమె ప్రతిభకు సభికులు అబ్బురపడ్డారు. తరువాతి అంశం ముందు రంజని మైకులో ఇలా చెప్పింది.

"ఇఫ్ ఐ యాం ఏబుల్ టు డ్యాన్స్ ఎగైన్ టుడే ఆఫ్టర్ ద హారిబుల్ యాక్సిడెంట్ ఫ్యూ ఇయర్స్ ఎగో, ఇట్ ఈజ్ డ్యూ టు ద మోటివేషన్ అండ్ సపోర్ట్ ఫ్రం మై హస్బెండ్ వంశీ. ఐ డెడికేట్ దిస్ డ్యాన్స్ టు ద డివినిటీ అండ్ ద స్ట్రాంగ్ విల్ పవర్ ఇన్ హిం"...అని కన్నీళ్లతో భర్తను వేదిక మీదిక ఆహ్వానించింది. అతని పాదాలకు నమస్కరించి స్వరాళి వేసిన చిత్రాన్ని సమర్పించింది. ఇప్పుడు ఆమెకు పిల్లలకు వంశీ కుటుంబసభ్యుడే కాకుండా గురువు, దైవం మరియు స్ఫూర్తి ప్రదాత. ఎదురుగా ఉన్న నటరాజుకు నమస్కరించి "దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిహ్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ" అన్న గీతానికి లాస్యతో కలిసి నృత్యం చేసింది. తమ తనువు, మనసు, సంకల్పం, భక్తి, కృతజ్ఞత అన్నీ రంగరించి తాదాత్మ్యతతో నర్తించారు. సభికులు వారిలోని కళావైభవాన్ని దాని వెనుక ఉన్న పరిశ్రమను గుర్తించి రెండు నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టారు. వంశీ-రంజనిల జీవితంలో ఆరోజు మధురమైనది.

"రంజనీ! పిల్లలూ! ఈరోజు నాకు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా ఉంది. మీరు ముగ్గురూ సాఫల్యాన్ని పొందారు. అది నా జీవితానికి సాఫల్యాన్నిచ్చింది." అన్నాడు. ముగూరూ వంశీ పాదాలకు ఆనందబాష్పాలతో అభిషేకం చేసి ఆయన విశాలమైన హృదయంలో ఒదిగిపోయారు. "దొరకున్నా ఇటువంటి సేవ" అన్న గీతం ఆ ఇల్లంతా మారుమ్రోగుతునే ఉంది. దివ్యత్వం నిండి ఆ ఇల్లొక దేవాలయంగా కనిపించింది. కళామతల్లి తన ముగ్గురు బిడ్డలతో పాటు వారి వెనుక ఉన్న ఆ మహాపురుషుని సేవానిరతికి, పట్టుదలకు పొంగిపోయింది. 

3 కామెంట్‌లు: