RightClickBlocker

15, మే 2016, ఆదివారం

ఆది అనాదియు నీవే దేవా - దాశరథి గారి గీతం (భక్త ప్రహ్లాద 1967)


ఒక భక్తి గీతానికి శరణాగతి అతి ముఖ్యమైనది. విష్ణు భక్తులలో నారదుడు ప్రముఖుడు. అలాగే ప్రహ్లాదుడు కూడా. మరి వీరిరువురి నేపథ్యంలో భక్తి గీతాన్ని రాయాలంటే అందులో శ్రీహరి వైభవాన్ని ఎంత అద్భుతంగా రాయాలి? దానికి భక్త ప్రహ్లాద చిత్ర దర్శకులు దాశరథి గారిని ఎన్నుకున్నారు. నారద భక్తి అనగానే ఈ ఆది అనాదియు నీవే దేవా అన్న గీతం గుర్తుకు వస్తుంది .  ఈ గీతంలో దాశరథిగారి భావ సౌందర్యం, భక్తి  మిళితమై నారదుని నోటి వెంట జాలువారినంత అందంగా మనకు ఆవిష్కరించబడింది.

ఆది అనాదియు నీవే దేవా నింగియు నేలయు నీవే కావా
అంతటి నీవే ఉండెదవు శాంతివై కాంతివై నిండెదవు
నారద సన్నుత నారాయణా నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీసతి పతివో
దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణా భవహరణా
కనక చేల! భయ దమన శీల! నిజ సుజన పాల! హరి సనాతనా!
క్షీరజలధి శయనా! అరుణ కమల నయనా! గాన మోహనా! నారాయణా!

దాశరథి గారు తెలుగుజాతి కన్న ఒక మాణిక్యం.  భాషా పాండిత్యంతో పాటు భక్తి సుగంధాన్నిఈ గీతానికి అణువణువున అలదిన గొప్ప కవి ఆయన. ఈ గీతంలో పోతన గారి భావజాలానికి దగ్గరగా వెళ్లారు దాశరథిగారు.  నరుడవో సురుడవో అన్నచోట, దానవ శోషణ  మానవ పోషణ శ్రీచరణ భవహరణ అనే పద ప్రయోగాలు భక్తి సామ్రాజ్యంలోని పారిజాత పుష్పాలు. ఇక చివరి రెండు పంక్తులలో త్యాగరాజస్వామి వారి పదజాలాన్ని కూడా స్ఫురింపజేశారు.  భక్తిని పతాక స్థాయికి తీసుకువెళ్ళారు. ఒక గీతానికి సాహిత్యం సాద్గుణ్యత అయితే సంగీతం, గానము సాఫల్యాన్ని ఇస్తాయి.  రసాలూరించే సాలూరి వారు భక్త ప్రహ్లాద చిత్రంలో ఈ గీతానికి సంగీతం సమకూర్చగా గానగంధర్వులు మంగళంపల్లి బాలమురళి గారు  నటించి, గళమాధుర్యంతో అమృతాన్ని కురిపించారు. నారదుని మించిన భాగవతోత్తముడెవరు? బాలమురళి గారు తమ నటనతో, గానంతో పరమ భాగవతతోత్తమునిగా ప్రకాశించారు.

దాశరథిగారు శ్రీవైష్ణవుడైనా అద్వైత భావాన్ని ఈ గీతంలో కురిపించి తమ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నలుదెసల వెదజల్లారు.  రాగమాలికలో ఒక పాటను కూర్చాలంటే ఏయే రాగాలు కూడితే బాగుంటుందో తెలియాలి. దానికి సంగీతం మూర్తీభవించిన సరస్వతీపుత్రులు సాలూరి వారి కన్నా ఎవరు మిన్న?  రాగాలను గంగా ప్రవాహంలా పలికిచే బాలమురళి గారి గొంతులో ఈ గీతం నారాయణ మంత్రంలా ప్రకాశించింది.    త్రిమూర్త్యాత్మకమైన ఈ గీతం భక్తి భావ సంగీత సుధలను కురిపించింది.  అందుకే ఇన్నేళ్ల తరువాత కూడ ఇంకా శ్రోతలకు శ్రీమన్నారాయణుని స్తుతులలో తలమానికంగా నిలిచింది. ఈ గీతాన్ని లీలావతిని ఇంద్రుడు చెరపట్టి కొనిపోవు సన్నివేశంలో చిత్రీకరించారు. ఎందరో మహానుభావులు వారందరికీ శతసహస్ర వందనాలు!

1 వ్యాఖ్య:

  1. Bhakta Prahlada is one of the greatest musicals in Telugu films. The above song is sung with great precision by balamurali garu. P Susheela garu songs and voice are immortal in this film. SVR is a true legend who simply took the role of Hiranya kashipa to the highest level.

    ప్రత్యుత్తరంతొలగించు