7, మే 2016, శనివారం

కలికి చిలకలకొలికి మాకు మేనత్త - సీతారామయ్య గారి మనవరాలు


కని పెంచి పెళ్లి చేసి అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల పట్టింపుల వల్ల పుట్టింటికి రాలేకపోతే ఆ తల్లిదండ్రులకు, బిడ్డకు ఎంత బాధో సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించారు. ఇంకో యింటి పిల్లైనంత మాత్రాన పుట్టింటిని మరచిపోవాలా? ఆ ఆడబిడ్డ ఇంటికి ఆవిడ మేనకోడలు వెళ్లి అభిప్రాయ భేదాల వలన పుట్టింటికి రాలేకపోయిన మేనత్తను తాతగారింటికి ఎలా తీసుకు వస్తుందో చూస్తేనే కళ్లు చెమరుస్తాయి. చిన్న చిన్న పట్టింపులకు పోయి బంధాలు తెంచుకునే పెద్దవాళ్ల మనసులను కరిగించి రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది ఆ సీత. కన్న కూతురు ఇంట్లో మళ్లీ అడుగు పెడితే ఆ తల్లిదండ్రుల మనోభావాలు ఎలా ఉంటాయో అద్భుతంగా పండించారు అక్కినేని, రోహిణి  హట్టంగడి గార్లు.

పెళ్లిళ్లు రెండు కుటుంబాలను కలపాలి, విడదీయకూడదు. అందులో కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచే తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసి అత్త మామలు కోడలిని పుట్టింటికి దూరం చేయకూడదు. ఆ కోడలు రెండు కుటుంబాల మధ్య వారధి. కొత్త తరానికి నాంది. పుట్టినింట మెట్టినింట సౌభాగ్యాన్ని కలిగించే మహాలక్ష్మి. గౌరవం, విశ్వాసం, నమ్మకం, ప్రేమానురాగాలు ఇవ్వలి తప్ప ఉన్నవాటిని పోగొట్టకూడదు. ఎంత ఉన్నా లేకున్నా ఆ తల్లిదండ్రులు కూడా కనిపెంచటం వల్లే కదా తమకూ ఒక కోడలు వచ్చింది? అడుగడుగునా కుటుంబ బంధాలు మరియు ఆప్యాయతలకు నిలువుటద్దంలా నిలిచిన చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. అక్కినేని చిత్ర జీవితంలో ఇదో కలికితురాయి. మీనా నటనా జీవితంలో ఒక మైలురాయి. మరకతమణి కీరవాణి గారి సంగీతంలో వేటూరి గారు సాహిత్యం అందించిన ఈ చిత్రంలోని పాట కలికి చిలకలకొలికి మాకు మేనత్త అనే పాట వివరాలు క్రింద. ఈ గీతానికి చిత్రగారికి ఉత్తమ గాయనిగా నంది అవార్డు వచ్చింది. అంతే కాదు అక్కినేని గారికి, మీనాకు ఉత్తమ నటుడు, నటి ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.

పాట ద్వారా ముందు మేనత్త మామగారిని, తరువాత అత్తగారిని, చివరకు మామల మనసును కరిగించి మేనత్తను పుట్టింటికి తీసుకువెళుతుంది ఆ సీత. ప్రేమతో ఎంతటి కర్కశమైన మనసునైనా జయించవచ్చు అన్న సందేశాన్ని సీత పాత్ర మనకు చెబుతుంది. ఈ సమస్యలన్నీ మనజీవితాల్లో నిత్యం ఉండేవే. చిత్రాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మనింటికి వచ్చే కోడలిని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుకోవాలో, ఏ వయసులో ఏ త్యాగాలు చేయాలో అర్థమవుతుంది. ఈ చిత్రం భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఒక చక్కటి ఉదాహరణ, మనస్తత్త్వ శాస్త్రానికి నిఘంటువు.

మీ జీవితంలో కూడా  ఏదైనా రక్తసంబంధం ఇలా చిన్న చిన్న మనస్పర్థల వలన  దూరం అయ్యిందా? బాగా ఆలోచించి మీరే ఒక్క అడుగు ముందుకు వేయండి. ప్రేమతో కొత్త ఆరంభం చేయండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. బంధాలు మళ్లీ చేరువవుతాయి. ప్రయత్నించండి. సీతలాగే,  పెద్దలైతే గౌరవంతో కూడిన ప్రశంసలతో, పిన్నలైతే వాత్సల్యంతో మనసులను కరిగించండి. మానవుడికి బంధాలే  నిజమైన సంపదలండీ.


కలికి చిలకలకొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి

మేన అలుపే లేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్యా
మా ఇంటికంపించవయ్య మావయ్యా

ఆ చేయి ఈ చేయి అద్ద గోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మ నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురంచేసే
మా చంటి పాపను మన్నించి పంపు

మసక బడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనెనీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయోధ్య నేలేటి సాకేతరామా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి