16, ఏప్రిల్ 2017, ఆదివారం

పాడనా తెనుగు పాట - కృష్ణశాస్త్రి చిక్కని తేనెల ఊట


తెలుగు - అమ్మ నేర్పిన భాష, శతాబ్దాల నుండి ప్రవహిస్తున్న జీవనది. మాతృభాష అనగానే తెలియని ఉత్సాహం. చక్కని తెలుగు వినపడితే మనసు ఉరకలెత్తుతుంది. భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటే సమయమే తెలియదు. భాషలోని పద సంపద గమనిస్తుంటే లోకమే పట్టదు. తెలుగుదనం, తెలుగు నుడికారం, తెలుగు రుచి అనే ఝరులలో తేలియాడుతుంటే అమ్మ ఒడిలో నిదురుపోయినంత సాంత్వన.

తెలుగుదనం అనగానే దేవులపల్లి వారు గుర్తుకొస్తారు. తేట తేనె లాంటి తెలుగు పదాలతో ఎన్నో అద్భుతమైన గీతాలను ఆయన రచించారు. 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రానికి నేపథ్యం - విదేశీ వనిత భారతీయుడిని వివాహం చేసుకొని, భారత దేశానికి వచ్చి, భాష కళలు నేర్చుకుని, భారతీయతను పరిపూర్ణంగా తెలుసుకోవటం, అత్త మామలకు కనువిప్పు కలిగించటం. ఆ వనిత తీయని తెలుగు భాష అంటే మక్కువ పడి నేర్చుకొని పాడిన పాట ఇది. భారతీయులుగా ఉంటూ మన భాషను విస్మరిస్తున్న నేటి యువతరానికి, తల్లిదండ్రులకు ఈ చిత్రం ఓ పెద్ద కనువిప్పు.

ఈ చిత్ర కథా నాయిక ఆన్నిక్ చేమొట్టి ఫ్రెంచ్ వనిత. భారతీయ కళలపట్ల ఆకర్షితురాలై భారత దేశం వచ్చి భరతనాట్యం నేర్చుకొని, దేవయానిగా పేరు మార్చుకొని మన నాట్యశాస్త్రంలో ఎందరికో శిక్షణనిస్తున్నారు. ఆమె భారత్-ఫ్రెంచ్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమానికి సారథ్యం కూడా వహించారు. భారత దేశంలోనే స్థిరపడి మన కళను ఆరాధిస్తున్న ఆమె సేవలకు గుర్తింపుగా ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది.

దేవులపల్లి వారు ఇటువంటి మంచి నేపథ్యం, కథ ఉన్న చిత్రానికి అద్భుతమైన తెలుగుతల్లి వైభవాన్ని చాటే గీతాన్ని అందించారు. ఈ గీతంలో దేవులపల్లి వారి సాహిత్య సౌరభాలు తెలుగుదనపు సౌందర్యంతో మేళవించబడ్డాయి. గుళ్లో గంటలు, గోదావరి గలగలలు, మావులు, తోపులు, మోపులు, పైరగాలులలో మంచి ముత్యాల హారంలా, మధురమైన అమృతరసాల తోట తెలుగు పాట. అటువంటి పాటను పాడే అవకాశం పొందిన ఆ విదేశీ వనిత మనోభావాన్ని కృష్ణశాస్త్రిగారు ముగ్ధమనోహరంగా అవిష్కరించారు. తెలుగుదనానికి ప్రతీకలైన వారు మహా వాగ్గేయకారులు త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు. వీరి నోట మధురంగా వినబడినది, అన్ని నాడులలో చైతన్యం కలిగించేది, వాడవాడల హృదయాల కరగించే తీయని మాటల మూట, తేనెలూరించే తెలుగు పాట. మన తెలుగుదనాన్ని ప్రతిబింబించే మరో ముఖ్యమైన అంశం అప్పుడే వివాహమైన తెలుగు వనిత.  మేనిపై చక్కనైన చీర, కాటుక కళ్లు, మెడలో తాళిబొట్టు, కాళ్లకు పారాణి, నొసట మెరిసే కుంకుమ, కాళ్లకు ఘల్లు ఘల్లుమనే అందెలు, అలా అలా నడచి వచ్చే తెలుగు పడుచు గురించి తెలిపేది తెలుగు నాట ప్రతి చోట పాడబడినది తెలుగు పాట. అద్భుతమైన తెలుగుదనాన్ని ఆకళింపు చేసుకొని, ఆస్వాదించి దానికి అక్షర రూపం కలిగించి పాడింది ఆ విదేశీ వనిత.  గీత సాహిత్యం:

పాడనా తెనుగు పాట
పరవశనై మీ ఎదుట మీ పాట
కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మోపులపైన
మసలే గాలుల గుసగుస లో
మంచి ముత్యాల పేట
మధురామృతాల తేట

త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడునాడుల కదిలించేది
వాడ వాడల కరిగించేది
చక్కెర మాటల మూట
చిక్కని తేనెల ఊట

ఒళ్లంత వయ్యారి కోక
కళ్లకు కాటుక రేఖ
మెళ్లో తాళి కాళ్లకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడే
తెనుగు తల్లి పెట్టని కోట
తెలుగు నాట ప్రతి చోట

ఒక కొత్త సంస్కృతిని మన జీవితంలోకి ఆహ్వానించాలంటే ఆ సంస్కృతి మన హృదయాన్ని ఎక్కడో తాకి, అందులో మనం ఇదివరకెన్నడూ అనుభవించని ఆనందం పొంది, మనకు తెలియని ప్రశ్నలకు సమాధానం అంది, మనలను మరింత దృఢచిత్తులను, శాంతమనస్కులను చేయగలిగి ఉండాలి. పాశ్చాత్య సంస్కృతి పట్ల భారతీయులు ఆకర్షితులు కావటానికి ప్రధాన కారణాలు అటువంటివి కావు. మన సంస్కృతి పేరుతో సమాజంలో ఉన్న దురాచారాలను, వివక్షను సహించలేని మనుషులు తాత్కాలిక ఉపశమనం కోసం పాశ్చాత్యానికి అలవాటు పడ్డారు. ఏమిటి అందులో ఉన్నది? ఎవరూ ప్రశ్నించలేని, ఏ కట్టుబాటూ లేని స్వేచ్ఛ. స్వేచ్ఛ మనిషికి కావాలి, కాని అది మనలను బలహీనులను చేసి ఏ సమస్యనూ పరిష్కరించుకోలేని పరిస్థితికి తీసుకు వెళ్లకూడదు. పాశ్చాత్యంలో ఉన్న జాడ్యం అదే. మన సంస్కృతిలోకి వచ్చిన వివక్ష, దురాచారాలను దూరం చేయటానికి పాటుపడకుండా పరధర్మాన్ని ఆశ్రయించటం వలన నేటి భారత యువతీయువకులలో భారతీయత అనేది చాలా మటుకు లేకుండా పోయింది. దాని ఫలితం? తెలుగుదనం వంటి మధుర ఫలాల రుచిని వారు ఆస్వాదించలేకున్నారు.


భాషకు పట్టు సంస్కృతి. సంస్కృతిని సంస్కరించుకుంటే అది పదికాలాల పాటు నిలుస్తుంది. అప్పుడు భాష కూడ నిలుస్తుంది. తెలుగుదనాన్ని వదిలివేసి మనం పరధర్మాల పంచన బానిస బతుకులు బతుకుతుంటే ఓ విదేశీ వనిత ఈ తెలుగుదనం, సంస్కృతిలోని గొప్పతనాన్ని గుర్తించి, దానిలో తనివితీరా ఆనందించి పాడిన గీతం ఈ పాడనా తెనుగు పాట. అటువంటి గీతాన్ని కృష్ణశాస్త్రి గారి కన్నా ఇంకెవరు బాగా రాయగలరు? అందుకే చిత్రదర్శకులు ఆయనను ఎన్నుకున్నారు. భాష యొక్క గొప్పతనం మంచి ప్రాసతో, మంగళకరమైన ధ్వనులతో చెవులకింపుగా ఉండటమే కాదు, బంధాలను సృష్టించి, వాటిని దృఢపరచి, మనుషులను ఏకం చేయగలగటం. అదే తెలుగుదనంలో ఉన్న గొప్పతనం కూడా. శతాబ్దాల పాటు మనుషులను ఏకం చేసి ఓ పటిష్టమైన, వినూత్నమైన, విలక్షణమైన సాంప్రదాయన్ని, సంస్కృతిని భరతభూమిపై నెలకొల్పింది. ఇంతటి మహత్తరమైన భాషను మనం దేని కొరకు కూడా వదులుకోవాల్సిన పనిలేదు. వృత్తి-భాషా సంస్కృతి రెండు పట్టాలవంటివి. ఒకటి ఉపాధినిస్తే రెండవది శాశ్వతమైన ఆనందాన్ని, మనదైన సంస్కృతిలో ఓ చిరునామాను ఇస్తుంది. రెండూ చాలా ముఖ్యం. అందుకే వృత్తిలో అభ్యున్నతి కోసం భాషా సంస్కృతిని మనం వదులుకోకూడదు. వదులుకుంటే జీవితంలో చాలా గొప్ప విషయాన్ని కోల్పోయి వైకల్యముతో దారితప్పినట్లే.


కృష్ణశాస్త్రి గారి తెలుగు భాషా ప్రావీణ్యంతో వెన్నలాంటి తెలుగుపదాలు, పాలు-తేనె కలబోసి ఆస్వాదించిన రీతిలో మన హృదయాలను తాకుతాయి. ఈ పాటలోని ప్రతి అక్షరం అలాంటిదే. తెలుగు నుడికారాన్ని, అందులోని నయగారాన్ని దేవులపల్లి వారి పాటలో మనం అణువణువునా అనుభూతి చెందవచ్చు. తెలుగుదనానికి మన గ్రామీణ వాతావరణానికి అవినాభావ సంబంధం ఉంది. పచ్చని పొలాలు, కష్టపడి పని చేసి మనకు ఆహార ధాన్యాలను అందించే కృషీవలులు, ఉరకలెత్తే గోదారమ్మ, ఆ తల్లితో అనుసంధానమైన జీవితాలు, మళ్లు-చేలు-మోపులు తెలుగుదనానికి ఆయువు పట్లు. అందుకే ఆ జీవనాన్ని కృష్ణశాస్త్రి గారు మొదటి చరణంలో తెలుగుదనంతో మేళవించారు. వాగ్గేయకారులు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆనాటి పరిస్థితులను, జీవనశైలిని, ప్రజల భాషను కూడా ప్రతిబింబించేదిగా మనకు సాహిత్య సంపదగా అందించారు. వారి సాహిత్యంలోని తెలుగుదనం ఈ భాషా ప్రవాహంలోని నాటి నీటి తేటలను తెలియజేస్తుంది. ఆ సాహిత్యం ప్రజల హృదయాలను తాకి, పాషాణమైన హృదయాలను కరగిస్తుంది. ప్రజలను ఏకం చేస్తుంది. అందుకే రెండవ చరణంలో వాగ్గేయకారుల తెలుగుదనాన్ని ప్రస్తావించారు. తాళి,కట్టు-బొట్టు, సింగారం కేవలం ఆకర్షణ కొరకు అనుకుంటే చాలా పొరపాటు. శాస్త్రీయత, దివ్యత్వం కూడినవి అవి. అలాగే గౌరవభావాన్ని పెంచేవి. అందుకే ఒక చరణాన్ని పూర్తిగా వాటి కొరకు కేటాయించారు దేవులపల్లి వారు.

ఆన్నిక్ చేమొట్టి (దేవయాని) పట్టు చీరకట్టి,  సిగలో పూలు  చుట్టి,  ,నల్లపూసలు ధరించి, నుదుటన బొట్టు పెట్టి చక్కని తేనెలొలికించే తెనుగు పాటను ఆలపించటాన్ని ఈ గీతంలో చిత్రీకరించారు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వపు ప్రతిభ ఈ చిత్రంలో మనకు  ప్రతి షాట్‌లోనూ ప్రతిబింబిస్తుంది. తెలుగుదనానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, సంభాషణలు, సంగీతము, సాహిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ చిత్రాన్ని ఓ అద్భుత దృశ్యకావ్యంగా మలచింది.  నేటి తరం తప్పకుండా విని అర్థం చేసుకోవలసిన గీతం ఇది. జీకే వేంకటేష్ గారి సంగీతంలో పూలపాక సుశీలమ్మ అద్భుతంగా పాడిన పాట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి