9, ఏప్రిల్ 2017, ఆదివారం

నిధి చాలా సుఖమా - త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ఔన్నత్యం


నిధి చాలా సుఖమా! రాముని సన్నిధి సేవ సుఖమా! నిజముగ బల్కు మనసా!

దధి నవనీత క్షీరములు రుచో! 
దాశరథి ధ్యాన భజన సుధారసము రుచో!

శమ దమమను గంగా స్నానము సుఖమా! 
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా!
మమత బంధన యుత నర స్తుతి సుఖమా!
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా!

ఈ ప్రపంచంలో ధన కనక వస్తు వాహనాదుల పట్ల మమకారం లేకుండా ఉండటం చాలా కష్టం. ముఖ్యంగా నేటి కాలంలో కనీస అవసరాలకు పరిమితి ఓ అస్థిరమైన లక్ష్యంగా మారింది. కానీ, ప్రతి మనిషి కూడా ఆత్మావలోకనం చేసుకోవలసిన సమయం ఇది. ఎందుకంటే, ప్రాణం విడిచేటప్పుడు మనతో రాని వాటిపై విషయలోలుడైన మనిషి స్వార్థంతో అకృత్యాలకు పాల్పడుతున్నాడు, కావలసిన దానికన్నా సంపాదించుదామన్న తపనలో మానవత్వం కోల్పోతున్నాడు. ఈ పరుగులో కుటుంబం, తన ఆనందం, బాధ్యతలను విస్మరిస్తున్నాడు. అలాంటప్పుడే మన వాఙ్మయం మనకు ఉపయోగపడేది. త్యాగరాజస్వామి వారు తన కీర్తనలలో శాశ్వతమైన వాటిని వదిలి అశాశ్వతమైన వాటి వెంట పడటం ఎందుకు అన్న సందేశాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు. మనలను ప్రశ్నిస్తూనే మార్గాన్ని మనకు తెలియజేశారు. అలాగని త్యాగరాజస్వామి వారిలా అన్నీ త్యజించటం ఈ కాలంలో అసంభవం. కానీ, ఒక సమతుల్యత తప్పకుండా సాధ్యమే. ఆ సమతుల్యత ఉన్నపుడు స్వార్థం కూడా అదుపులో ఉంటుంది. అందుకే, ఆయన కీర్తనల సారం ఇప్పటి సమాజానికి కూడా పూర్తిగా సముచితమైనది.

నిధి చాలా సుఖమా అన్న కీర్తన సామాన్య మానవులమైన మనకు ఆచరణకు సాధ్యం కాని తత్త్వంలా కనిపిస్తుంది. రాముడిని నమ్ముకుంటే ఏమి మిగులుతుంది, సంసారం ఎలా నడుస్తుంది? ఇది ఈనాటి చదువుకున్న వారి ప్రశ్న. ఈ తత్త్వం నేటి కాలానికి వర్తించదు అని వారికి అనిపిస్తుంది. కానీ, దానిలోని అంతరార్థం తెలుసుకుంటే త్యాగరాజస్వామి ఎందుకు చెప్పారో అవగతమవుతుంది.

1. ధనకాంక్షకు ఓ పరిమితి ఉండదు. ఇంత వస్తే మరింత కావాలి అన్నది మానవుని నైజం. ఇది ఓ విషవలయం. దానిని ఛేదించాలంటే కావలసింది దానిపట్ల మమకారం లేకుండా ధర్మబద్ధంగా సంపాదించటం. దానిని మదుపు చేసి గుణీకృతం చేసుకోవచ్చు. అలా చేస్తూనే, మనకు శాశ్వతమైన దాని గురించి ఆలోచించి తీరాలి. రాముని సన్నిధిలో ఉన్న సుఖం ఆ స్థిర లక్ష్యం కాని ధనార్జనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎప్పుడైతే కోరికలు గుర్రాలవుతాయో మనసుకు అశాంతి కలుగుతుంది. అశాంతి మనిషిని మానవత్వం మరచి పక్కదారులు త్రొక్కేలా చేస్తుంది. ఈ విషవిలయంలో కష్టాలు కలిగినప్పుడు మాత్రమే మనిషికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. అలా కాకుండా భగవద్భక్తితో, శరణాగతితో మన ఆలోచలనను నియత్రించుకోవచ్చు. ఆ నియంత్రణ వలన అశాంతి తొలగి మనిషి స్థిరమైన, శ్రేయస్కరమైన, ఆత్మోన్నతి కలిగించే నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే దైవసన్నిధి సుఖవంతమైనది. దీనిని అర్థవంతంగా, ప్రభావవంతంగా తెలుపటానికి త్యాగయ్య పెరుగు, వెన్న, పాలు మొదలైన వాని యొక్క అశాశ్వతమైన రుచి-రాముని ధ్యానము, భజన అనే అమృత రసముల శాశ్వతమైన రుచిని ప్రస్తావించారు.

2. స్వార్థం పేట్రేగిన మనిషి తన అవసరాల కోసం మనుషులను పొగడ్తలలో ముంచెత్తుతాడు. దీని ఫలితం తాత్కాలికమే. వ్యక్తిత్వం ఆధారంగా కాకుండా అవసరం ఆధారంగా కలిగే పరిచయాలు, బంధాలు నిలువవు. తద్వారా మనిషి పతనానికి లోనవుతాడు. ఈ నరస్తుతి ఒకరకమైన ఆత్మ వంచనే. అభిప్రాయాలు, అవసరాలను బట్టి ముఖప్రీతి మాటలు చెప్పి, వారి వెనుక దూషించే వ్యక్తిత్వాలు నిరంతరం తెలియని అసంతులనలో ఉంటాయి. దానివలన మనిషి శాశ్వతమైన దానికి దూరమై అశాశ్వతమైన వాటి వెంటే పడతాడు. ఎదురుదెబ్బ తగలగానే భగవంతుడు గుర్తుకు వస్తాడు. విషయ లంపటాలను నుండి భగవంతుని వైపు మళ్లే సమయం కష్టాలు వచ్చినప్పుడే. అన్నీ బాగున్నప్పుడు ఆ భగవంతుని ఆర్తితో ప్రార్థించే వారు బహు అరుదు. త్యాగరాజ స్వామి ఈ విషయ లంపటాలతో కూడిన నరస్తుతి మరియు పవిత్రమైన భగవంతుని నుతి మధ్య తేడా తెలియజేయటానికి అద్భుతమైన ఉపమానం చెప్పారు. ఆధ్యాత్మిక సోపానానికి ముఖ్యమైన శమ దమాదులనే సద్గుణాల గంగానదిలో స్నానము సుఖమా లేక మురికి మయమైన దుర్విషయములనే బావిలో స్నానము సుఖమా అన్నారు.

వాగ్గేయకారుల ఔన్నత్యం సందేశాన్ని తెలియజేస్తూనే దానిని మన నిత్యజీవితంలో సుస్ఫష్టంగా ప్రతిబింబింపజేయటం. మన దేహానికి నచ్చేవి, ఆనందాన్ని ఇచ్చేవి, నచ్చనివి, దుఃఖాన్ని కలిగించే వాటికి పూర్తిగా భిన్నమై శాశ్వతమై, సచ్చిదానందకరమైన ఆత్మకు సంబంధించిన విషయాల మధ్య భేదాన్ని ఈ నిధి చాలా సుఖమా అన్న కీర్తన ద్వారా త్యాగరాజస్వామి మనకు అద్భుతంగా తెలియజేశారు. ఆయన కూడా మనలాంటి మనిషేనండోయ్. కాకపోతే, కఠోరమైన సాధన ద్వారా, జీవితంలో నేర్చుకున్న పాఠాల ద్వారా మమకారపు బంధనాల నుండి విముక్తుడై తన కీర్తనలలో ఆ శాశ్వతానందపు మాధుర్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన మహానుభావుడైనాడు.

ఇక కృతి నేపథ్యానికి వస్తే, త్యాగరాజస్వామి కుటుంబం పేద కుటుంబం. అపర రామభక్తుడైన త్యాగయ్య ఆ రామనామామృతంలో రమించగా వికసించినవి ఆయన కృతిసుమాలు. ఆ కీర్తనల మాధుర్యం తెలిసిన తంజావూరు ప్రభువు త్యాగయ్య ఆయనకు కానుకలు పంపి రాజాస్థానంలో సంగీత విద్వాంసునిగా చేరవలసిందిగా లేఖ రాస్తాడు. ఆ సందర్భంగా తనకు గురువుల అనుగ్రహంగా, రాముని కృప వలన కలిగిన సంగీత సంపదను రామునికే తప్ప నరస్తుతి కోసం వినియోగించనని త్యాగయ్య ఆ కానుకలను తిరస్కరిస్తాడు. ఆ సందర్భంలో ఈ కృతి ఆయన నోట వెలువడుతుంది. పూర్తిగా మమకారం లేని వ్యక్తిత్వం ఉంటేనే అటువంటి విలువైన, అందులోను తన పేదరికాన్ని తొలగించే కానుకలను తిరస్కరించగలడు మానవుడు. త్యాగయ్యకు జీవితంలో మానవులను స్తుతిస్తూ పేరు ప్రాపులు పొంది భోగ భాగ్యాలు అనుభవించటం అశాశ్వతం అని తెలుసు. అందుకే, ఉంఛవృత్తిలో తన పొట్టు నింపుకొని మిగిలిన వాటిని తృణప్రాయంగా పక్కకుపెట్టి తన కీర్తనలను రామునికే అంకితం చేశాడు, తన నాదోపాసనను ఆ పరబ్రహ్మకు ధారపోశాడు.

ఈ సందర్భంగా మనం ఒక్క విషయాన్ని చెప్పుకోవాలి. వాగ్గేయకారులలో కూడా అనేక రకాలు. ఎందరో రాజాస్థానాలను ఆశ్రయించి వారి పేరులను ప్రస్తావించే కృతులను రచించి జీవితంలో ధన కనక వస్తు వాహనాదులు, రాచమర్యాదలను పొందిన వారున్నారు. కొంతమంది మాత్రం దీనికి భిన్నంగా పూర్తిగా వాటిని త్యజించి ఆ భావనతోనే కీర్తనలను రచించారు. అందుకే వారి కృతులు ఈ అశాశ్వతమైన వాటి మీద ఏ మాత్రం అనురాగాన్ని కనబరచవు. అటువంటి వారిలో త్యాగరాజస్వామి అగ్రగణ్యులు. అందుకే వారి కృతులలో ఆధ్యాత్మిక పరిమళాలు మిగిలిన వారి కృతుల కన్నా ఎన్నో మెట్ల పైస్థాయిలో ఉంటాయి. ఆయన కృతులు చిరకాలం నిలిచి ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకమవుతాయి. ఇటువంటి వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపదను మనకు వారసత్వంగా ఇచ్చిన సద్గురువులు త్యాగరాజస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు.

నిధి చాలా సుఖమా కళ్యాణి రాగంలో కూర్చబడింది. ఈ కీర్తన నేపథ్యం, దానిలోని మాధుర్యం బాపు-రమణలు నిర్మించిన త్యాగయ్య సినిమలో అద్భుతంగా చిత్రీకరించారు. మొత్తం కీర్తనను చిత్రంలో పొందుపరచలేదు, కానీ సందేశం మాత్రం చక్కగా తెలియజేశారు. ఆ సన్నివేశం లింక్. అలాగే, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు దీనిని అద్భుతంగా రాగయుక్తంగా గానం చేశారు. రెండూ విని తరించండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి