శ్రీరామ నవమి రేపే. లోకాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి అవతరించిన పవిత్రమైన తిథి. లోకకళ్యాణార్థం ఈ రోజు సీతారాముల కళ్యాణం జరపటం అనాదిగా మనకు ఉన్న సాంప్రదాయం. సీతారాముల కళ్యాణం గురించి వాల్మీకి రామాయణంలో విశదంగా, మనోజ్ఞంగా తెలిపారు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో కూడి మిథిలకు చేరుకునే ఘట్టం నుండి, నలుగు కుమారులు, కోడళ్లతో దశరథ మహారాజు మరియు రాణులు అయోధ్య చేరుకునేంత వరకూ రమణీయమే.
ఈ సీతారామ కళ్యాణం ప్రధాన ఇతివృత్తంగా ఎన్నో చలన చిత్రాలు వచ్చాయి. అన్నీ మంచి విజయాలు సాధించాయి. ఎన్నో మనోజ్ఞమైన గీతాలను అందించాయి. శ్రీశ్రీగారి వాగ్దానం చిత్రంలోని (1961) గీతం శ్రీనగజా తనయం అన్నది హరికథ రూపంలో రాగా, అలాంటి గీతమే పాతికేళ్ల తరువాత 1986లో విడుదలైన స్వాతిముత్యం చిత్రంలో ఆత్రేయగారి కలంలో రామా కనవేమిరా అన్న గీతంగా వచ్చింది. దీనికి కూడా హరికథా నేపథ్యమే. కాకపోతే ఈ స్వాతిముత్యం గీతంలో సీతారామ కళ్యాణంతో పాటు భర్తను కోల్పోయిన నాయిక మరియు అమాయకుడైన నాయకుల వివాహం కూడా చిత్రీకరించబడింది. ఒక ఉదాత్తమైన సన్నివేశం ఇది. గీతంలోని భావం, సన్నివేశం, ప్రధాన పాత్రధారుల నటన నభూతో నభవిష్యతి. ఆ సందర్భానికి ఆత్రేయ గారు అద్భుతమైన గీతాన్ని అందించారు. తెలుగుదనం ఉట్టి పడే ఈ గీతం ద్వారా ఆ సీతారామ కళ్యాణ హరికథకు ప్రాణం పోశారు. ధర్మమూర్తి అయిన రామచంద్రుడు సభాసదుల మధ్య ఉండి కూడా ఆ సభలోకి వచ్చిన జానకిని చూడటం లేదని ఆమె చెలికత్తెలు అనుకుంటున్న భావనతో ఈ రామా కనవేమిరా ఆరంభమవుతుంది.
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
రమణీలలామ! నవలావణ్యసీమ! ధరాపుత్రి! సుమగాత్రి నడయాడి రాగా!
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా
శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సానిదమ పమగరిస
ఒస పరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమని
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు తాతకిట తకఝణుత
ఒస పరి చూపుల అసదృశ విక్రములు తకఝణు తకధిమితక
మీసము మీటే రోషపరాయణులు నీదమ పమాగరిగమ
మా సరి ఎవరను మత్తగుణోన్మణులు అహా
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలుకక్కిన దొరలు భూవరులు
తొడగొట్టి ధనువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నరపుంగవులు
తమ వొళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగ్రణులు
ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
ఆ ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అరెరెర్రెరె ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అహ ఎత్తేవారు లేరా అ విల్లు ఎక్కుపెట్టే వారు లేరా తికతెయ్యకు తాధిమితా
రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీతవంక ఓరకంట చూసినాడు సీతవంక వోరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ పెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ
ఫెళ ఫెళ విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు
జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ
దశరధ రామ దైత్యవిరామ దశరధ రామ దైత్యవిరామ
సీతాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయ్యమే అనగ అనగ రమణీయమే
సీతాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
రామయ్యా అదిగోనయ్య
రమణీలలామ నవలావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ
రామా కనవేమిరా శ్రీరఘురామ కనవేమిరా రామ కనవేమిరా కనవేమిరా
అర్థం:
"ఓ రఘురామా! సీతవంక చూడవేమి? నారీశిరోమణి, మనోజ్ఞమైన రూపం కలది, భూమిసుత, మృదువైన పలుకులు పలికించే సీత నడచివస్తోంది. చూడవేమి?" అని సీతాస్వయంవరం ప్రకటించిన తరువాత జనకుని కొలువులోకి జానకి ప్రవేశించే సమయంలో సీతమ్మ చెలికత్తెలు అనుకుంటున్నారట.
సీతా స్వయంవరానికై వేంచేసిన రాజులు ఎలా ఉన్నారు? తమను వరిస్తుందనే ముసి ముసి నవ్వులతో రసికులైనారట, వారంతా సుందరమైన చూపులతో అనన్యమైన పరాక్రమవంతులట. మీసాలను మెలివేసే పౌరుషవంతులట. మా సరి ఎవరని గర్వముతో పొంగిపోతున్నవారట. వారందరికీ ప్రతి క్షణం ఒక యుగంలా ఉత్కంఠతతో ఉందట. వారు ఆ సీత వంక, శివ ధనుస్సు వంక తన్మయులై కళ్లప్పగించి చూస్తున్నారట. కానీ, ఆ రాముడికి మాత్రం ఇవేవీ పట్టటం లేదుట.
ఒక్కొక్క వరుడు విల్లు ఎత్తే ప్రయత్నం చేయటం, చెమటలు పట్టి వెనుదిరగటం, ధనువు ఎత్తే ముందు తొడగెట్టే ధీరత, ఆ ధనుస్సు చేబట్టిన తరువాత గుండెలు జారి బావురుమన్నారట ప్రభువులు. విల్లు ఎత్తలకే సిగ్గుతో తలదించుకొని ఒక్కొక్క రాజు వెళ్లిపోతున్నాడట. గొప్ప గొప్ప పురుషులు విల్లును ఎత్తే ప్రయత్నంలో తమ ఒళ్లు విరిగి, కళ్లు తిరిగి వెనక్కు వెళ్ళారట. అక్కడున్న వారంతా విల్లు ఎత్తేవారే లేరా? ఎక్కుపెట్టేవారే లేరా? అని మాట్లాడుకున్నారట.
అంతలో మన రామచంద్రుడు లేచి గురువులకు నమస్కరించి, ఆ శివధనుసుపై చేయి ఉంచాడట. సీతవంక ఓరకంటితో చూసి చిటికెలో ఆ విల్లును ఎక్కుపెట్టాడట. ఆ ధనుస్సు ఫెళ ఫెళ విరిగిందట, కొత్తకళలొలికిస్తూ సీతమ్మ నవ వధువైందట. ఇంకేముంది? సభ అంతా రఘుకుల చంద్రుడు, రాక్షస సంహారుడు అయిన శ్రీరాముని జయము జయము అని పలికిందట. సీతమ్మ తలదించుకొని వచ్చి ఆ రాముని మెడలో వరమాల వేసిందట. ఆ సీతారాముల కళ్యాణము ఎంత చూచినా కమనీయమే. ఎంత చెప్పుకున్నా రమణీయమే.
వివరణ:
ఇక్కడ చలనచిత్ర దర్శకుల ఔన్నత్యం గురించి చెప్పుకోవాలి. సీతారామ కళ్యాణ ఘట్టం, దానిని వర్ణించే హరికథలో నాయికా నాయకుల మధ్య ఆశ్చర్యకరంగా జరిగే మూడుముళ్ల తంతును హిందూ వివాహము యొక్క పవిత్రత ఏ మాత్రం దెబ్బతినకుండా చిత్రీకరించటం విశ్వనాథ్ గారి గొప్పతనం. భర్తను కోల్పోయిన స్త్రీ బిడ్డను పెంచుకుంటూ ఉండటం గమనించిన నాయకుడు ఆ హరికథ వింటూ ఆమెను వివాహము చేసుకోవాలని తలచి అప్పటికప్పుడు సీతారామ కళ్యాణ మంటపంలో ఉన్న తాళిని తీసి ఆమెకు కట్టి ఆమె నుదుటన కుంకుమ పెట్టి అర్థాంగిగా స్వీకరిస్తాడు. ముందు సీతారామ కళ్యాణ హరికథ సన్నివేశం పెట్టకపోతే ఆ నాయకునికి అటువంటి తలపు వచ్చేది కాదు. ఎందుకంటే రాముని ధీరత అతనికి ముందడుగు వేయటానికి ధైర్యాన్ని ఇచ్చింది. అతని మంచితనం తెలిసినా కూడా ఆమె ఆ క్షణంలో విస్తుపోతుంది. తరువాత మనస్ఫూర్తిగా ఆ మార్పును అంగీకరించి అతనితో కలిసి జీవిస్తుంది.
రామాయణంలో సీతారాముల కళ్యాణ ఘట్టం, దానికి ముందు వెనుక సర్గలు పరిశీలిస్తే, ఈ వివాహం కూడా లోకకళ్యాణార్థమే అని స్పష్టంగా తెలుస్తుంది. నిమి వంశజులకు వరప్రసాదంగా వచ్చిన శివధనుసును దేవతలు, రాక్షసులు, యక్ష, కిన్నెర, కింపురుషులు, గంధర్వులు, మహోరగులు, మనుష్యులు ఎక్కుపెట్టలేకపోయారు. అటువంటి ధనువును ధర్మమూర్తి అయిన రామచంద్రుడు గురువులైన విశ్వామిత్రుల అనుగ్రహంతో ఎక్కుపెట్టగా అది మధ్యకు విరిగిపోతుంది. అయోనిజ, కారణజన్మురాలైన సీతమ్మను పత్నిగా స్వీకరించేందుకు అవతారపురుషుడైన రాముడే సరైనవాడు అని తెలుపటానికి శివధనుర్భంగ సన్నివేశం. ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా గృహస్థాశ్రమంలో ప్రవేశించటానికి ఏ విధమైన కారణాలు ఉంటాయో, కుటుంబాల గురించి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలో శ్రీమద్రామాయణం మనకు విశదీకరిస్తుంది. సీతారాముల దాంపత్యము గురించి, వారి వైభవం గురించి తెలియటానికే రామనవమి నాడు వారి కళ్యాణము ఆనవాయితీగా వచ్చింది.
కళాతపస్వి కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్, రాధిక నటించిన స్వాతిముత్యం చిత్రంలో ఆత్రేయగారు రచించ ఈ పాటకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.
శ్రీ సీతారామాభ్యాం నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి