తుషార శీతల సరోవరాన
అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణ...
నీ కొరకే రాజా..వెన్నెల రాజా!
కలనైనా నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైనా నీ వలపే
కలువ మిటారపు కమ్మని కలలు కళలు కాంతులు నీ కొరకేలే
చెలి ఆరాధన శోధన నీవే జిలిబిలి రాజా జాలి తలచరా
కనుల మనోరథ మాధురి దాచి కానుక చేసే వేళకు కాచి
వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలచెరా
తెలుగు సినీ స్వర్ణయుగపు పాటల్లో శాంతినివాసం చిత్రంలోని కలనైనా నీ వలపే అన్న పాటకు ఓ ప్రత్యేక స్థానముంది. పాటకు భావం ప్రాణమైతే పదాలు ఆ భావానికి పట్టుగొమ్మలు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం ఎంత ఆస్వాదించినా తనివితీరదు. తుషారము, నీరవము, వెన్నెల రాజు, జిలిబిలి, మిటారపు, మనోరథము...ఎంత మంచి పదాలో! సముద్రాల రామానుజాచార్యుల వారి భావ వీచికలలో ఎంతటి సొగసో!
ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్యుల వారి తనయుడు ఈ రామానుజాచార్యులు. తండ్రి నుండి తెలుగుదనం పుణికి పుచ్చుకున్న ఈయన ఎన్నో మంచి రచనలు చేశారు. గుంటూరు జిల్లా పెదపులివర్రులో 1923లో జన్మించిన ఈయన చిన్ననాటినుంచే పద్యాలు, కవితలు రచించారు. భాషతో పాటు చదువులో కూడా బాగా రాణించారు. రేడియో సర్వీసు మరియు మెయింటెనెన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన చిత్రం 1960లో వచ్చిన శాంతినివాసం. ఈ చిత్రంలో శ్రీరఘురాం జయరఘురాం పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. అటువంటి భక్తి గీతం రాసిన ఆయన దానికి భిన్నంగా కలనైనా నీ వలపే అన్న మనోజ్ఞమైన భావగీతి అందించారు. వినోదా వారి శాంతితో మొదలైన సముద్రాల రామానుజుల సినీ ప్రస్థానంలో బ్రతుకుతెరువు, తోడుదొంగలు, జయసింహ, పాండురంగమహత్మ్యం, ఆత్మబంధువు, ఉమ్మడికుటుంబం, తల్లా పెళ్లామా, రామాంజనేయయుద్ధం మొదలైన 70 సినిమాలు ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులను సముద్రాల సీనియర్-జూనియర్‌గా పిలిచేవారు.
రామానుజాచార్యుల వారి ఈ రచనలో ప్రేయసి భావనను ఎంతో లాలిత్యంతో తెలిపారు. కలువ చంద్రుని కొరకై ఎలా వేచి ఉంటుందో అలా ఈ ప్రేయసి తన ప్రియుని కోసం వేచియుంది అన్న భావనను తొలి పంక్తి తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీథిలోన ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే రాజా వెన్నెల రాజా అని అద్భుతమైన ఉపమానంగా ఆవిష్కరించారు.
వికసించే కలువ యొక్క కలలు, కళలు, కాంతులు అన్నీ ఆ చంద్రుని కొరకే అయినట్లు ఆ ప్రేయసి ఆరాధన, వెదకటం అన్నీ ఆ ప్రియునికేనని తెలిపారు. కళ్లలో తన కోరికల మాధుర్యాన్ని దాచి, ప్రియుడు వేంచేసే వేళకై ఎదురు చూస్తూ, వాడే రేకులలో వీడని మమతలతో వేడుకుంటూ చెలి నిలుచుని ఉన్నదని విశేషమైన పదజాలంతో పలికారు.
ఘంటసాల మాష్టారి సంగీతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో ఈ శాంతినివాసం ఒకటి. ఆ మహానుభావునికి గాయకునిగా ఎంతపేరు వచ్చిందో అంతే పేరు సంగీత దర్శకునిగా కూడా వచ్చింది. ఆయన సంగీత సారథ్యం వహించిన ఈ కలనైనా నీ వలపే అన్న గీతాన్ని తెలుగు అక్షరం ముక్క రాని లీలమ్మ గారు అద్భుతంగా పాడారు. ఆమె పాట వింటుంటే ఎక్కడా కూడా తెలుగు రాదని మనకు అవగతం కాదు. హిందోళ రాగంలో తెలుగు చలనచిత్ర గీతాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఒకటి కలనైనా నీ వలపే. ఈ గీతాన్ని లీలగారు తప్ప ఎవరూ అంత మధురంగా పాడలేరు. చిత్రంలో నాయిక ఎవరు అంటే చెప్పటం కష్టం. ఏఎన్నార్ అన్న పాత్ర వేసిన కాంతారావు భార్యగా దేవిక, ఏఎన్నార్ సఖిగా రాజసులోచన, దారితప్పిన కాంతారావును దారిలోకి తెచ్చే శ్రేయోభిలాషి మరియు స్నేహితురాలిగా కృష్ణకుమారి...ముగ్గురికీ సమానమైన పాత్రలే ఉన్నాయి. ఈ గీతం కృష్ణకుమారిపై చిత్రీకరించబడింది. కృష్ణకుమారి-కాంతారావుల మధ్య ఉండే స్నేహం (అతను ప్రేమగా అపార్థం చేసుకుంటాడు) ఈ గీతానికి సరైన నేపథ్యం కాకపోయినా, సమస్యలతో సతమవుతున్న అతనికి సాంత్వననిచ్చే పాత్రకు ఈ పాట సముచితమేనేమో? ఆ కాలంలో ప్రజలు ఈ పాత్రకు ఎలా స్పందించారో తెలియదు.
సముద్రాల జూనియర్ సాహిత్యానికి ఘంటసలా మాష్టారు సంగీతంలో పి.లీల గారు పాడిన కలనైనా నీ వలపే పాట చూసి ఆస్వాదించండి.
chakkaga chepparu, Dhayavaadalu.
రిప్లయితొలగించండిscreen contrast sarigga ledu, B/w lo unte inkaa chakkaga undedi