26, జనవరి 2017, గురువారం

జాతీయతా భావం


మనం ఎంత భావ దారిద్య్రంలో ఉన్నామంటే దేశం కోసం అన్న మాటలు మాట్లాడితే వాళ్లు అతివాదులుగా చిత్రీకరించబడుతున్నారు. జాతీయతా భావం లేకపోతే ఇక ప్రజల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి? మువ్వన్నెల చీర చుట్టిన ఆ భిన్నత్వపు భరతమాత ఏదో మాటలకు కాదు. దానిలో  అంతర్లీనమైన శక్తి ఉంది, మనది, మనము అన్న అద్భుతమైన భావనను ఒక్క జాతీయతే ఇస్తుంది. కులం, మతం, భాష, రంగు, రూపం, ఆర్థిక స్థోమత ఇవేవీ ఐక్యతను ఇవ్వలేవు.

ఇటీవల నన్ను ఓ ప్రబుద్ధుడు ప్రశ్నించాడు - "అమెజాన్‌లో కాళ్లు దులుపుకునే పట్టా మీద భారత పతాకం ఉంటే దానికి వివాదమెందుకు? దేశంలో అంతకన్నా భయంకరమైన సమస్యలు ఉన్నాయి పరిష్కరించటానికి, ఈ కుహనా జాతీయవాదం ఎందుకు అని". సమస్యలు ఉన్నది నిజమే. కానీ ఒరేయ్ శుంఠా! పతాకం నువ్వననుకున్నట్లు నిర్జీవమైనది కాదు. ఓ అద్భుతమైన సంస్కృతికి, ఘన చరిత్ర గల కర్మభూమికి ప్రతీక. ఓ చిన్న సమస్య వస్తే దద్దరిల్లిపోయే పాశ్చాత్య సంస్కృతికి - ఏ సమస్య వచ్చినా అధిగమించే భారతీయ సంస్కృతికి గల తేడాను ప్రతిబింబించే ఓ జాగృత శక్తి. సమస్యల పరిష్కారం కోసమే జాతీయతావాదం. ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలోనో కాశ్మీరు మంచు ప్రాంతాలలోనో ఉన్న కష్ట జీవుల సమస్యలు తెలియాలంటే ఇది మన దేశం అన్న భావన ఒక్కటే మార్గం. భారత దేశం నా మాతృ భూమి, భారతీయులంద్రూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను..అని ప్రతి దినం పాఠశాల ప్రతిజ్ఞలో పఠించటం భారతీయతను చాటటానికే. జాతీయత ఉన్నపళాన రాదు. నేర్పించాలి, చిగురింపజేయాలి, నీళ్లుపోసి మొక్కను పెంచినట్లు జాగ్రత్తగా పోషించాలి. దానికి పతాక గౌరవం, గీతాలాపన, ప్రతిజ్ఞ ద్వారా దృఢ సంకల్పం, త్యాగ నిరతి అనేవి నాలుగు మూలస్థంభాలు. అందుకేరా ప్రబుద్ధుడా ఆ జాతీయ పతాకం అంటే మాకు అంత గౌరవం. దానికోసం ఎటువంటి త్యాగానికైనా మేము సిద్ధమే.

దేశాలు, పతాకాలు, గీతాలు ఏర్పడింది ఉన్మాదానికి కాదు, అతివాదానికి అంతకన్నా కాదు. మన మన స్వార్థాలను దాటి ఒకే తాటిపైకి తీసుకు రావటానికి ఏర్పరచబడిన అద్భుత సాధనాలు. ఈ దేశ పౌరునిగా, ఈ దేశ అతిథిగా వాటిని గౌరవించటం కనీస ధర్మం, బాధ్యత. పిచ్చి పిచి ప్రేలాపనలతో జాతీయతను ప్రశ్నిస్తేనే మీరనుకునే అతివాదం సరైన సమాధానం చెబుతుంది. అసలు భరతజాతిని మించిన భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ ఉంది? ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని మాండలికాలు, ఎన్ని వేషభూషలు, ఎన్ని ఆహారవ్యవహారాలు? ఇన్నిటిని ఐక్యం చేయగలిగిందంటే ఆ శక్తి మానవాతీతమైనదేగా? మరి అంతటి శక్తిని కలిగిన త్రివర్ణ పతాకాన్ని, జాతీయగీతాన్ని అగౌరవపరస్తే మౌనంగా ఉండే వాళ్లు, ఆ అదో పెద్ద సమస్య కాదు అనుకునే వాళ్లలో జాతీయతా భావం లేనట్లే.

సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అన్న బంకిం చంద్ర గారి గీతం విని దాని అర్థం తెలుసుకుంటే భారతీయత అంటే, భరతమాత అంటే ఏమిటో తెలుస్తుంది. జనగణ మంగళ దాయక జయహే భారత భాగ్య విధాత అన్న రవీంద్రుని మాటల ఆంతర్యాన్ని తరచి చూస్తే జాతీయత మహత్తు తెలిసి రోమాంచమవుతుంది. ప్రజల హితానికే జాతీయత, ప్రజల ఐక్యతకే జాతీయత, ప్రజల ఆనందానికే జాతీయత. పైడిమర్రి వేంకట సుబ్బారావు గారు రచించిన మన ప్రతిజ్ఞను చదివి అర్థం చేసుకుంటే జాతీయత ఎందుకో తెలుస్తుంది.

"భారత దేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం. దీనికి అర్హత పొందుటకు సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతివారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతి కలిగి ఉంటాను. వారి శ్రేయిభివృద్ధులే నా ఆనందానికి మూలం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను."

భారతీయులందరూ నా సహోదరులు అన్న భావన ఉంటే చాలదూ? ఐక్యత దానంతట అదే వస్తుంది. జాతీయతా భావం గర్వ కారణమైతే అది ఎంత స్ఫూర్తిదాయకమో తెలుసా? ఆ జాతీయతా భావమే పటేల్‌ను మహనీయుని చేసింది. వందలకొలది రాజ్యాలను ఏకం చేసి భరతజాతికి ఓ రూపునిచ్చింది. మన వారసత్వం ఎలాంటిది? సుసంపన్నమైనది, బహువిధమైనది. అంటే ఎంతో విలువైనది, బహుళత్వం కలిగింది. ఈ భావాన్ని మదిలో నింపుకుంటే మన హృదయం ఎంత విశాలమవుతుందో గమనించారా? ఆ భావనను పొందటానికి మనం కృషి చేయాలి అన్న సంకల్పం వస్తే చాలు. అందుకే ప్రతిజ్ఞ. పెద్దలను గౌరవించటం, అందరితో మర్యాదపూర్వకంగా మసలుకోవటం మనకు వచ్చిన ఆ మహోన్నతమైన వారసత్వపు ప్రధాన లక్షణం. దేశమంటే ప్రజలే. ఆ ప్రజల పట్ల సేవా భావం కలిగి ఉండాలి అన్నది మనకు అనాదిగా చెప్పబడింది. అది భారతీయతకు మూలం. ఆ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి నాకు ఆనందకారకం అన్న భావన  మన హృదయాలలో నిలుపుకుంటే ఇంక స్వార్థానికి తావేది? చూశారా? ఎంత గొప్ప ప్రతిజ్ఞో? ఈ సంకల్పం సాకారం చేస్తే ఇంక ఈ దేశంలో భావ దారిద్య్రానికి, స్వార్థానికి, కల్లోలానికి, విభజనవాదానికి తావేది?

ప్రజలను ఐక్యం చేయటానికే ఈ జాతీయ పండుగలు, పతాకావిష్కరణలు, గీతాలాపనలు. వాటికి కన్న తల్లిదండ్రులకన్నా గౌరవం ఉండి తీరాలి. అప్పుడే ఈ జాతి మనుగడ, శ్రేయోభివృద్ధి.

- అక్కిరాజు ప్రసాద్ 26/01/2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి