హరిహర సుతుడైన అయ్యప్పను తలచగానే డాక్టర్ యేసుదాసు గారు గానం చేసిన హరివరాసనం పాట గుర్తుకొస్తుంది. స్వామి అయ్యప్ప అనే చలన చిత్రం 1975లో తమిళ మలయాళ భాషలలో విడుదలై ఘనం విజయం సాధించింది. ఆ చిత్రంలో కూడా యేసుదాసు గారు ఈ పాటను గానం చేశారు. అదే చిత్రంలో శబరిమలను స్వర్ణ చంద్రోదయం అనే మరో పాట ఆయన పాడారు. గీతాన్ని తెలుగులోకి ఎవరు అనువదించారో తెలియదు. సంగీతం దేవరాజన్ గారు.
అయ్యప్ప హరిహర సుతుడు. కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవం. ప్రరి ఏడాది మకర సంక్రమణానికి ముందు గురుస్వామి నేతృత్వంలో 40రోజుల దీక్షగా స్వాములు మాల ధరించి శ్రద్ధా భక్తులతో పూజించి ఇరుముడితో కేరళలోని పత్తనమిట్ట ప్రాంతంలో ఉన్న శబరిమల చేరుకొని అక్కడి స్వామిని దర్శించుకుంటారు. ఆ హరిహరసుతుని పేరు ధర్మశాస్త. శివునికి మోహినీ అవతారుడైన శ్రీమహావిష్ణువుకు జన్మించిన వాడు ధర్మశాస్త. ఈ హరిహరసుతునిపై ఉన్న గాథలలో పండలం రాజావారి సుతునిగా ప్రాచుర్యం పొందినది ఒకటి. ఆ రాజావారి తొలుత ఈ బాలుని చూసినప్పుడు అతని మెడలో మణిహారం ఉందట. అందుకని అతనికి మణికంఠుడని నామకరణం చేశారు. ఈ విధంగా ధర్మశాస్త, మణికంఠ, అయ్యప్పగా ఆ హరిహరసుతుడు ఆ ప్రాంతప్రజలకు, దక్షిణ భారతదేశంలో ఎందరికో ఆరాధ్య దైవం.
శబరిమలలో ఉన్న ఈ ప్రధాన దేవాలయం పెరియార్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని కొండలలో పూంగవనం అడవుల మధ్య 3వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ దేవాలయం సంవత్సరంలో కొన్ని మార్లు మాత్రమే తెరిచి ఉంటుంది - మండలమహోత్సవం (దాదాపు నవంబర్ మధ్యనుండి డిసెంబర్ 26 వరకు), మకరవిళక్కు (మకర సంక్రాంతి సందర్భంగా), విషు పర్వదిన సందర్భంగా, సూర్యుని ప్రతినెలా సంక్రమణం రోజు.
అయ్యప్పస్వామిపై ఎన్నో చిత్రాలు, టీవీ ధారావాహికలు వచ్చాయి. వాటిలో 1975లో విడుదలైన స్వామి అయ్యప్పన్ చిత్రం ప్రధానమైనది. జెమినీ గణేశన్, సుకుమారన్ నాయర్, శ్రీవిద్య నటించారు. మాష్టర్ రఘు మణికంఠునిగా నటించారు. ఆ మాష్టర్ బాలనటుడిగా మలయాళం చిత్ర పరిశ్రమలో ఎంతో పేరుపొందాడు. పెద్దై రఘు నేడు కరణ్ అనే పేరుతో తమిళ చిత్రాల హీరోగా నటిస్తున్నాడు. ఈ స్వామి అయ్యప్పన్ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. అన్ని భాషలలోనూ పాటలు, చిత్రం ఘన విజయం సాధించాయి. తెలుగు అనువాదంలోని పాటలలో సింహభాగం యేసుదాసు గారు పాడారు.
ఈ శబరిమలను స్వర్ణ చంద్రోదయం అనే గీతంలో స్వామికి జరిగే అభిషేకాన్ని అందులోని వివరాలను మనకు తెలియజేశారు. ధర్మశాస్త అనగా ధర్మరక్షకుడు. ఆ స్వామికి నిత్యం జరిగే అభిషేకంలో పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారలు), పన్నీరు, విభూతి,పంపానది పుణ్యజలాలు, పుష్పాభిషేకం, చందనాభిషేకం..ఇలా వైభవంగా అర్చన జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్పా అని నామస్మరణ మారుమ్రోగుతూ ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. ఈ పాట వింటే స్వామిని దర్శించి ఈ సేవలను కళ్లారా చూడాలన్న సంకల్పం కలుగుతుంది. యేసుదాసు గారు పాడిన పాటను విని తరించండి.
శబరిమలను స్వర్ణ చంద్రోదయం ధర్మరక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం భక్తితో పాడుకుంటాం హృదయముల
ప్రీతియే ఉల్లమున పాలగును
అదే చల్లని నీ యెదన పెరుగవును
వెన్నయే నీవిచ్చు అనురాగం
నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తాం
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా
పుణ్యమిచ్చే పన్నీరభిషేకం
జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం
నీదు తనువంత జ్యోతివలె వెలిగేను
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా
దోసిట పుణ్యజలం అందుకొని
అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం
హరి ఓం అని చందనంతో అభిషేకం
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదమయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి