నృత్య సాంప్రదాయాలలో శబ్దాలకు ప్రత్యేక స్థానం ఉంది. శబ్దాలలో సరళమైన సాహిత్యంతో అభినయంతో వివరణ ఉంటుంది. శబ్దాలలో రెండు నుండి ఐదు చరణాల వరకు ఉండవచ్చు. ఒక్కొక్క చరణం వేర్వేరు అంశాలను ప్రస్తావించవచ్చు. శబ్దాలలో వేగమైన పద విన్యాసములు ఉండవు. భరత నాట్య శైలిలో శబ్దాలలో తొలుత కూర్చబడినవి ఒకే రాగంలా రాగా తరువాత వీటిని రాగమాలికలుగా, మిశ్రచాపు తాళంలో రూపొందించే సాంప్రదాయం వచ్చింది. శబ్దాలు రాజు గారి కొలువులో ఆ రాజు గుణవైభవాలను నుతించే శైలి కూడా ఉంది. ఇస్లాం రాజులను నుతించే కవులు సలాం అనే పదాన్ని కూడా శబ్దాలలో ఉపయోగించారు. కొన్ని ప్రాచుర్యమైన శబ్దాలు - కృష్ణ శబ్దం, రామాయణ శబ్దం, దశావతార శబ్దం, రాజశ్రీ శబ్దం, మండూక శబ్దం, వినాయక శబ్దం మొదలైనవి.
కృష్ణ శబ్దంలో వాసవసజ్జిక అయిన నాయిక నాథుని రాకకై అలంకరించుకొని వేచియుంటుంది. ఆయన గుణాలను వర్ణిస్తూ లయబద్ధంగా సాగుతుంది. ఇందులో పల్లవి "రారా స్వామి రారా" అనే పద సంపుటిని ఎక్కడైనా పునరుపయోగించుకొని అభినయాన్ని విశదీకరించే అవకాశం ఉంటుంది. కృష్ణ శబ్దం సాహిత్యం పరిశీలిద్దాం.
మోహన రాగం, ఆది తాళంలో కృష్ణ శబ్దం కూర్చబడింది. నాయిక స్వామిని రారా అని పిలుస్తోంది. యాదవకులానికి చంద్రుడైన, సముద్రుని వంటి గంభీరత కలిగిన, వంద కోట్ల మన్మథుల సుందర రూపము కలిగిన, అమితమైన భుజ బలము కలిగిన శూరుని, స్త్రీల మనసులు దోచుకున్న, మేరు పర్వతమంత ధీరత కలిగిన, కవులను పోషించిన, శత్రువులను సంహరించిన, భరత నాట్య శాస్త్రానికి నిధియైన, సరసత కలిగిన రాజును కరుణతో చూచి ఏలుకోమని పరి పరి విధాల నుతిస్తుంది.
ఈ కృష్ణ శబ్దం అభినయంలో మొదటి రెండు పంక్తులలో విపులంగా అభినయ కౌశల్యాన్ని కళాకారులు ప్రదర్శిస్తారు. స్వామి రారా యదువంశ సుధాంబుధి చంద్ర అనే పంక్తులను పదే పదే పలుకుతూ నాయకుని రాకకై ఆ నాయిక గంధం సిద్ధం చేయటం, పూలు కోయటం, మాలలల్లటం, తనను తాను అలనకరించుకోవటం, నాయకునికై మాలలల్లటం మొదలైన వాటిని విశదంగా అభినయంతో ప్రదర్శిస్తారు. అలాగే, మొత్తం సాహిత్యాన్ని వివిధ గతులలో కూడా ప్రదర్శిస్తారు. మొత్తం మీద శబ్దాలు కళాకారులు రాజ సభలలో ప్రదర్శించే ఓ ముఖ్యమైన అంశంగా పరిగణించ వచ్చు. ఈ శబ్దాలను అభినయ ప్రాధాన్యమైన కూచిపూడి సాంప్రదాయాలలో ప్రదర్శిస్తారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారిణి మంజుభార్గవి గారి కృష్ణ శబ్ద కూచిపూడి నృత్యాన్ని వీక్షించండి.
రారా! స్వామి రారా!
యదువంశ సుధాంబుధి చంద్రా!
రత్నాకర సమ గంభీరా!
శత కోటి మన్మథాకారా!
భాసుర భుజ బల రణ శూరా!
నారీ జన మానస చోరా!
మహా మేరు సమాన ధీరా!
కవి జన పోషక మందారా!
పర రాజ శత్రు సంహారా!
భరత శాస్త్ర నిధి నీవేరా!
నీవేరా, నీవేరా, నీవేరా!
సరసత గల దొర నీవేరా!
మము కరుణ జూచుటకు వేళరా! ఇది వేళరా!
చలమేలరా, మది పూనరా!
నీదానరా, మమ్మేలుకోరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి