26, డిసెంబర్ 2016, సోమవారం

బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి జీవిత విశేషాలు, ముజ్జగాలు మోహించగ గీతం


రాయలసీమ ఎందరో మహనీయులకు, బహుముఖ ప్రజ్ఞాశాలురైన కళాకారులకు జన్మభూమి. అందులో నాటక మరియు సినీ రంగ ప్రముఖులు చాలా ఎక్కువ. చిత్తూరు నాగయ్య గారు, కేవీరెడ్డి గారు, బళ్లారి రాఘవ గారు, పసుపులేటి కన్నాంబ గారు, పద్మనాభం గారు...వీరంతా ఈ రతనాలసీమలో జన్మించినవారే. అటువంటి ప్రజ్ఞాశాలుల కోవకు చెందినవారే శాంతకుమారి గారు. వారి సంగ్రహ చరిత్ర మరియు వారు పాడిన ఓ ఆణిమ్ముత్యం ముజ్జగాలు మోహించగ అనే గీతం వివరాలు.

1920 సంవత్సరం మే 17న కడపజిల్లా పొద్దుటూరు సమీపంలో వెల్లాల శ్రీనివాసరావు, పెదనరసమ్మ దంపతులకు శాంతకుమారి గారు జన్మించారు. ఆవిడకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బమ్మ. తల్లి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, తండ్రి నటులు. ఇద్దరి కళలను పుణికి పుచ్చుకున్న సుబ్బమ్మ చిన్ననాడే సంగీతం అభ్యసించటం మొదలు పెట్టారు. ఆవిడ పీ. సాంబమూర్తిగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి డీకే పట్టమ్మాళ్ గారు సుబ్బమ్మ గారి సహాధ్యాయిని. చిన్నతనంలోనే నాటక సంఘాలలో చేరి 16 ఏళ్లకు ఆకాశవాణి కళాకారిణిగా పేరొందారు. శాస్త్రీయ సంగీత వృత్తిని కొనసాగించటానికి ఆమె చెన్నై వెళ్లారు. అక్కడ విద్యోదయ పాఠశాలలో సంగీత ఉపాధ్యాయినిగా చేరారు. ఆవిడ సంగీత ప్రస్థానంలో సాలూరి రాజేశ్వరరావు గారితో కలసి ఆకాశవాణిలో పాడారు.

1936లో పీవీ దాస్ అనే సినీ ప్రముఖులు అప్పటివరకు శశిరేఖా పరిణయంగా నాటక రంగంలో ప్రసిద్ధి పొందిన కథను మాయాబజార్ అనే చిత్రంగా నిర్మించి దర్శకత్వం వహించాలని పూనుకున్నారు. శశిరేఖ పాత్రకోసం సరైన కళాకారిణి కోసం వెదుకుతుండగా చెన్నై విద్యోదయ పాఠశాలలో సుబ్బమ్మ గాత్రం ఆయన విని ఆయన ఎంతో ముచ్చట పడ్డారు. ఆ అమ్మాయిని సినిమాలో పాత్రకు పంపించవలసిందిగా ఆమె తల్లిదండ్రులను కోరారు. శ్రీనివాసరావు-పెదనరసమ్మ దంపతులకు, సుబ్బమ్మ నాయనమ్మకు ఆమె  సినిమాల్లో చేరటం ఇష్టం లేదు. వారు అమ్మాయి సంగీత కళాకారిణిగానే అభివృద్ధి చెందాలని పట్టుపట్టారు. కానీ, సుబ్బమ్మ తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని 4 రోజులు నిరాహారదీక్ష చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పలేదు. పీవీ దాస్ గారు ఆమె పేరును శాంతకుమారిగా మార్చారు. మాయాబజార్ చిత్రంలో శాంతకుమారి గారు శశిరేఖ పాత్ర వేసి ఎంతో సహజంగా నటించటమే కాదు, పాడారు కూడా. ఈ చిత్రంలో ప్రముఖ నటులు లక్ష్మణ స్వామి గారు అభిమన్యునిగా నటించారు. చిత్రం పెద్ద విజయం సాధించింది.



1937లో పీ.పుల్లయ్య గారు సారంగధర చిత్రాన్ని తీశారు. ఇది ఆయనకు తొలి దర్శకత్వం. అందులో శాంతకుమారిని చిత్రాంగి పాత్రకు ఎంపిక చేశారు. తొలిపాత్ర శశిరేఖ లాలిత్యం కూడినదైతే చిత్రాంగి కపటమైన పాత్ర. ఈ వైవిధ్యాన్ని ఆమె ఎంతో సహజంగా తన నటనలో కనబరచారు. ఆ చిత్రంలో ఆమె త్యాగరాజస్వామి వారి రాగసుధారస అనే కీర్తనను  పాడారు. చిత్రం మంచి విషయం సాధించింది. 28ఏళ్ల పుల్లయ్య గారి మంచితనాన్ని గమనించిన శాంతకుమారి ఆయాన తన నట జీవితాన్ని ప్రోత్సహిస్తారని భావించి ఆయనను వివాహం చేసుకోవాలని కోరారు. అదే సంవత్సరంలో వారిద్దరి వివాహం జరిగింది. ఆ తరువాత శాంతకుమారి నట జీవితం నిరాటంకంగా విజయవంతంగా సాగింది.

శాంతకుమారి గారి చిత్ర ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయి 1943లో విడుదలైన కృష్ణప్రేమ చిత్రం. ఇందులో ఆమె రాధ పాత్ర పోషించారు. మహామహులైన నటీమణులు, గాయనీమణులు పాలువాయి భానుమతి గారు (రాధ సోదరి చంద్రావళిగా), టంగుటూరి సూర్యకుమారి గారు (నారదునిగా, అవును స్త్రీ పురుష పాత్రను ధరించటం ఆరోజుల్లో చాలా అరుదు) ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా బాగా విజయం సాధించింది. 1945లో విడుదలైన మాయాలోకం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కథానాయికగా నటించారు. తరువాత 1949లో కేవీరెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైన గుణసుందరి కథలో గుణసుందరి (శ్రీరంజని) సోదరి రూపసుందరిగా నటించారు. ఈ చిత్రాన్ని  కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. 1950లో విడుదలైన షావుకారు చిత్రంలో శాంతకుమారి గారు శాంతమ్మగా నటించారు. ఈ చిత్రంలో నాయిక పాత్ర షావుకారు జానకి గారిది. ఈ చిత్రం అఖండ విజయాన్ని పొందింది. ఈ చిత్రం నుండి దాదాపు శాంతకుమారి పెద్ద వయసు పాత్రలను పోషించటం మొదలు పెట్టారు.



1950 దశకంలో ధర్మదేవత, అర్థాంగి, సారంగధర (ఈ మారు రాణీ రత్నాంగి పాత్ర), బొమ్మల పెళ్లి, జయభేరి మొదలైన తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాలో కూడా నటించారు. శాంతకుమారి నటనా జీవితంలో 1960లో విడుదలైన శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం ఓ ముఖ్యమైన మైలురాయి. ఈ చిత్రంలో ఆమె శ్రీనివాసుని తల్లి వకుళమాతగా అద్భుతంగా నటించారు. నటనతో పాటు "ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా" అన్న ఆర్ద్రతతో కూడిన పాటను అద్భుతంగా పాడారు. "వీనుల విందుగ వేణుగానము విని తరించగా వేచితిరా వేచి వేచి నీ వెన్న ముద్దవలె కరగి పోయెరా నా బ్రతుకు" అని ఆమె గళంలో జాలువారిన ఈ పాట నేటికీ వీక్షకుల కళ్లు  చెమరింపజేస్తుంది. ఈ పాట, ఈ చిత్రం ఆమె బహుముఖప్రజ్ఞకు ప్రతిబింబం.

1960 దశకం మొత్తం శాంతకుమారి వయసుకు మించిన పాత్రలు వేశారు. ఆమెకు బాగా పేరు తెచ్చిన పాత్ర రామానాయుడు గారి రాముడు-భీముడు చిత్రంలో అక్క పాత్ర. ప్రేమ, వాత్సల్యంతో నిండిన ఈ పాత్రలో ఆమె ఎన్‌టీఆర్ సోదరిగా అద్భుతంగా నటించారు. శాంతినివాసం, సిరిసంపదలు, రేచుక్క, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు వంటి మంచి చిత్రాలలో నటించారు. తల్లిగా, సవతి తల్లిగా ఆమె వేసిన పాత్రలు చిరస్మరణీయం. శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం చిత్రాన్ని హిందీలోకి భగవాన్ బాలాజీగా అనువదించారు.



శాంతకుమారి గారు మొత్తం మీద 250పైగా చిత్రలలో నటించారు. అందులో 60 తమిళచిత్రాలు. మిగిలినవి తెలుగు. వీటిలో 25పైగా చిత్రాలు రాగిణి మరియు పద్మశ్రీ అనే సొంత  బ్యానర్లపై తీయబడినవే. పద్మశ్రీ సంస్థ పుల్లయ్య వీరి కుమార్తె  పేరున స్థాపించబడింది. శాంతకుమారి  నాగేశ్వరరావు, జగ్గయ్య, జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ మొదలైన వారికి తల్లి పాత్రలను పోషించి తెలుగు తమిళ భాషలలో ఎంతో పేరు పొందారు. తెలుగులో విజయవంతమైన చిత్రాలన్నీ దాదాపుగా పుల్లయ్యగారు తమిళంలో మళ్లీ తెరకెక్కించారు. 1970 దశకంలో శాంతకుమారి అక్కా చెల్లెళ్లు, తల్లా పెళ్లామా, ప్రేం నగర్, కొడుకు కోడలు, సెక్రెటరీ, ముత్తైదువ చిత్రాలలో నటించారు.

ఆ తరువాత ఆమె సినీ రంగం నుండి విరమణ తీసుకొని రచనల వైపు మళ్లారు. భక్తి పాటలను రచించారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆమె తను శిష్యురాలైన లలితాకుమారికి పాటలు నేర్పించారు. శాంతకుమారి గారు రచించిన భక్తి గీతాలను బాలమురళీకృష్ణా గారు ఆలపించారు. సుదీర్ఘమైన ఆమె సినీజీవితంలో ఆమె ఎన్నో పాటలను పాడారు. వాటిలో  "మోహనాంగ రారా", "ఎవరోయి ఎవరోయి (మాయాలోకం), "ఊగూమా కృష్ణ", "ఇదే ఆనందము" (కృష్ణ ప్రేమ), "కలకల ఆ కోకిలేమో", "చక్కని దొరలేలే చందమామ" (గుణసుందరి కథ), "ఎన్నాళ్లని కన్నులు కాయగ" (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం), "మనసు తెలిసిన ఓ నాన్న" (తల్లా పెళ్లామా) మొదలైనవి. సినీ గీతాలే కాదు, శాంతకుమారి గారు ఎన్నో ప్రైవేట్ గీతాలను ఆకాశవాణిలో పాడారు.

నటన, నిర్మాణం, గాత్రం, రచన, సంగీతం మొదలైన కళలలో పట్టు సాధించి తన ప్రతిభను తెలుగు, తమిళ ప్రజలకు అందజేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి గారికి 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. 16 జనవరి 2006న శాంతకుమారి చెన్నైలో పరమపదించారు.

శాంతకుమారి గాత్ర మాధుర్యం తెలియాలంటే ఆమె పాడిన ఈ మధుర భక్తి గీతం వినాల్సిందే. రాధ మనసులో కృష్ణునిపై గల వివిధ భావనలను ముజ్జగాలు మోహించగ అనే గీతంలో శాంతకుమారి గారు అద్భుత్గమా పండించారు. ఆమె పాటలో భావుకత, రాధ ప్రేమ, స్వామిపై రాధకు గల అధికారం, ఆ స్వామి మోహన మురళీగానంపై గల మక్కువ ప్రస్ఫుటం. గోకులాన్ని వీడి మధుర, ద్వారకలలో ఉన్న శ్రీకృష్ణుని బృందావనం తిరిగి రమ్మని ఎంతో హృద్యంగా వేదుకునే రాధ మనసును శాంతకుమారి ఆవిష్కరించారు. శంఖ చక్రాలు, సారథ్యాలు, అస్త్ర శస్త్రాలన్నీ యమునలో పారవేసి తన వద్దకు రమ్మని కోరే రాధ మనసు శాంతకుమారి గళంలో పరిపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. గోకులాన్ని వదలి వెళ్లిన కృష్ణుని పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏ పక్షం (యుద్ధాలు, సారథ్యాలు ఒకవైపు ప్రేమ సామ్రాజ్యమైన బృందావని ఒకవైపు) అని అడుగుతుంది. ఆ కురుక్షేత్రం మురళి మరియు రాధ కన్నా ఎక్కువా అని ప్రశ్నిస్తుంది. మధురభక్తిలో ఎన్ని భావనలుంటాయో అన్నీ ఈ గీతంలో కవి ఆవిష్కరించగా అంతే అందంగా శాంతకుమారి గారు పాడి దీనిని అజరామరం చేశారు. ఈ పాట ఎవరు రాశారో, ఎవరు స్వరపరచారో తెలియదు. బహుశ సాలూరి వారి స్వరఝరిలో వచ్చిన లలితగీతమేమో అనిపిస్తుంది. ఈ పాట విని తరించండి.

ముజ్జగాలు మోహించగ మురళిని మ్రోయించరా కృష్ణా కృష్ణా

శంఖమేల? చక్రమేల? సారథ్యములేలరా?
అస్త్ర శస్త్రజాలమెల్ల యమున పారవైచి రారా

ఎందుకురా మధురా నగరి? ఎందుకురా ద్వారకాపురి?
బృందావని వీడి నీవు పొందిన సుఖమేమున్నది?

పక్షపాతమేల? నీ పక్షమేది గోపాలా?
మురళి కన్న రాధ కన్న కురుక్షేత్రమేల?


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి