25, నవంబర్ 2016, శుక్రవారం

జొన్నవిత్తుల వారి తెలుగుభాషా వైభవంపై గీతం


మాతృభాష కన్నతల్లి వంటిది. దానిని విస్మరిస్తే కన్నతల్లిని విస్మరించినట్లే. మాతృభాషను గౌరవిస్తే కొన్ని తరాలు తరిస్తాయి. లేకుంటే అంతటితో ఆ భాషా ప్రవాహం ఆగిపోయి పరధర్మం పాలైపోతాము. అక్షరాలను నేర్చుకోవటం, వ్రాయటం, చదువగలిగి మాధుర్యాన్ని ఆస్వాదించటంతో పాటు, భావాలను మాతృబాషలో వ్యక్తపరచగలగటం మన కనీస ధర్మం. భాష  కేవం పదల అల్లిక కాదు. దివ్యత్వం చేత ప్రచోదనమైన శబ్దవాహిని. మహానుభావుల నోట పలుకబడిన దివ్యవాహిని. జ్ఞానం, మేధస్సు, ఆధ్యాత్మిక శక్తి కలబోసిన పదాల సమ్మేళనం మాతృభాషా ప్రవాహం.

మందార మకరంద మాధుర్యాల రుచిని తెలిపేది భాష. మధురసపు మామిడి పండ్ల తీయదనాన్ని తెలిపేది ఈ భాష. ఋతువుల లక్షణ సంపదను ఆవిష్కరించేది భాష. కళల ఆకృతిని చిత్రపటంగా మనముందుంచేది భాష. మనుషులను బంధాలతో అల్లి ఐక్యతతో ముందుకు నడిపేది భాష. నవరసాల భావావిష్కరణ చేసేది భాష. పురాణేతిహాసముల ధర్మాలను ప్రస్ఫుటింపజేసేది భాష. మానవ జీవన వాహినిలో సంస్కృతి సాంప్రదాయలను అవిరామంగా అందించేది బాష.

భాషా వైభవం కొన్ని శతబాదాల పాటు శతికోటి ప్రభల వెలుగు వెలిగి ఆంగ్ల మాధ్యమంలో బోధన వచ్చిన తరువాత ఓ అర్ధ శతాబ్ద సమయంలో తీవ్రంగా క్షీణించ సాగింది. ఉపాధికై ఆంగ్లమాధ్యయం తప్పని సరి కావటంతో తెలుగు మాట్లాడే ప్రాంతాలలోనే తెలుగు బోధన తగ్గిపోయింది. నేను 1980  దశకంలో తెలుగును మొదటి భాషగా తీసుకోగలిగాను, అప్పుడు చెప్పగలిగిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఇప్పుడు రెండూ లేవు. భాష అటకెక్కింది. ఆంగ్లభాషా ప్రవాహంతో కలిసి పరుగెత్తలేకపోతోంది. తెలుగుభాష అనే వృక్షానికి తిరి ప్రాణం పోయవలసింది ఇళ్లలోనే. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లాడాలి, తెలుగును నేర్పించాలి, తెలుగు భాషా మాధుర్యాన్ని చవిచూపించాలి. సమాజంలో తెలుగు వాడకం చాలా వేగంగా తగ్గుతున్నా,  తెలుగు భాష ప్రాభవం పునరుజ్జీవమై గొదావరిలా ఉప్పొంగాలని కోరుకునే వారు ఎందరో. భాషాభివృద్ధికి, భాషాభిమానం పెంచటానికి, భాషా వినియోగం పెంపొందించటానికి కృషి చేస్తున్న వాళ్లు ఎందరో. ఇప్పటికీ తేటతేనె తెలుగులో అమృత రస ధారలనొలికించే కవులెందరో. రసహృదయులింకెందరో. వారందరికీ శతసహస్రవందనాలు.

తెలుగు భాషా వైభవం చాటే ఎన్నో గీతాలు వచ్చాయి. ఎన్నో అజరామరమైనాయి. అటువంటి వాటిలో ప్రముఖ సినీ గేయ రచయిత, సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన ఈ గేయం ఎంతో పేరుపొందింది. చక్కని భాష, ఆ భాష వైభవాన్ని తెలిపే చారిత్రాత్మక ప్రస్తావనలు, భాషలో ఉన్న సౌందర్యం, లాలిత్యం ఈ గీతం ద్వారా మనకు రచయిత అందించారు. తెలుగుదనాన్ని ఆస్వాదించటానికి ఈ గీతం ఓ మంచి అవకాశం. ఇంత చక్కని గీతం అందించిన జొన్నవిత్తుల వారికి హృదయపూర్వక నమస్కారములు.

చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు
నన్నయ తిక్కన ఎఱ్ఱన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి  సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

హిమగిరి జలనిధి  పదముల అమరిన  జిలుగు వెలుగు తెలుగు
గణ యతి ప్రాసల ధ్వని రస శాఖల కవితలల్లు పులుగు
నవ నవ పథముల కవితా రధములు సాగిపోవు  నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు

అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాథుని కవితాశుధారలో  అమరగంగ  పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రస ధారయై ధ్రువ తారయై  మన దేశ భాషలను లెస్సయై
దేవ భాషతో చెలిమిచేసి పలు దేశ  దేశముల వాసికెక్కినది

మన అక్షరాల  తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాల కడలి భావం మధు మురళి
అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం
భారత భాష  భారతి నుదుట తెలుగు భాష తిలకం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి