25, నవంబర్ 2016, శుక్రవారం

బాలమురళీరవం - ఓంకారాకారిణి


బాలమురళీకృష్ణ గారి రచనల్లో పాండిత్యంతో పాటు దేవతాస్వరూపము యొక్క గుణవిభవ వర్ణన ప్రత్యేకంగా ఉంటుంది.ఆయన రచించిన మరో కృతి పరిశీలిద్దాం. వాగ్గేయకారులు రాగం యొక్క పేరును కృతిలో ఉపయోగించటం ఒక ప్రక్రియ. ముత్తుస్వామి దీక్షితుల వారు ఈ ప్రక్రియకు చాలా ప్రసిద్ధి. త్యాగరాజ స్వామి వారు కూడా అక్కడక్కడా దీనిని ఉపయోగించారు. వారి పరంపరలో ఐదవ తరం శిష్యులైన బాలమురళీకృష్ణ గారు కూడా ఈ ప్రక్రియను తమ రచనల్లో బాగా ఉపయోగించారు. ఈ ఓంకారాకారిణి లవంగి రాగంలో కూర్చబడినది. ఆ పేరును చరణంలో ఉపయోగించారు. ఆ త్రిపురసుందరిని నుతిస్తూ బాలమురళి గారు ఈ కృతిలో బీజాక్షరాలతో పాటు శక్తివంతమైన పదాలను ఉపయోగించారు. వాగ్గేయకారుల పరంపరకు వన్నె తెచ్చారు.

ఆ అమ్మను ఓంకార ఆకారముగా, మన అహంకారాన్ని నశింపజేసేదిగా ప్రార్థిస్తున్నారు. ఒక్క హూంకారంతో శత్రువులను సంహరించే తల్లి హ్రీం అనే బీజాక్షరానికి రూపముగా, శివుని ధర్మపత్నిగా కొనియాడారు. తన ముద్రైన మురళిని ఉపయోగిస్తూ, ఆ గాన సుధాలహరిలో విహరించే అమ్మగా, పరమశివునిచే ప్రేమించబడిన త్రిపురసుందరిగా, కరుణారసంతో నిండిన లాలిత్యము గల సుందరిగా,వరం, అభయము ఇచ్చే సమస్త శుభాంగిగా ప్రస్తుతించారు. దాదాపుగా దీక్షితుల వారి కృతులలోని ఔన్నత్యాన్ని ఈ కృతిలో మనం గమనించవచ్చు. లవంగి రాగము కూడా ఆయన బాలమురళీకృష్ణ గారి సృష్టే. ఈ రాగంలో నాలుగే (స రి మ ద) స్వరాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగం చేసినందుకు తమిళ శాస్త్రీయ సంగీత పండితులు గగ్గోలు పెడితే ఆయన మరింత ధైర్యంగా ఇటువంటి రాగాలు మరికొన్ని కూడా సృష్టించారట. కనకాంగి రాగ జన్యమైన ఈ లవంగి సాహిత్యానికి దివ్యత్వాన్నిచ్చింది. ఈ కృతికి బాలమురళి గారు చెప్పిన చిట్టస్వరాలు ఆయన మేధోసంపత్తికి మచ్చుతునక. నిజంగా ఆయనలాంటి వాగ్గేయకారుల తరంలో జన్మించటం మన అదృష్టం. వారికి మరో మారు నివాళి. ఈ కృతిని బాలమురళిగారి గళంలోనే వినండి.


ఓంకారాకారిణీ! మదహంకార వారిణీ! అవతుమాం!

హూంకార మాత్ర శత్రు దమనీ! హ్రీంకార రూపిణి! రుద్రాణీ!

మురళీ సుధా లహరీ విహారీ! పురరిపు ప్రేమిత త్రిపుర సుందరీ!
కరుణారస భరిత లలిత లవంగీ! వరదా! అభయదా! సకల శుభాంగీ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి