19, జనవరి 2016, మంగళవారం

సంక్రాంతి అరిసెలు

సంక్రాంతి అరిసెల ప్రహసనం గురించి ఈ చిన్ని కథ....

"అమ్మాయ్ సరస్వతీ! బియ్యం నానబోసావుటే? సరిగ్గా నానకపోతే నా చేతులు పడిపోయేలా దంచినా అవి నలగవే. పాకం బెల్లం తెప్పించావా? నీదేం పోయింది? నా దుంప తెగుతుందే" - తిరుమలమ్మ గారు మంచం మీది నుంచి కేకలు వేస్తోంది.

"ఇదిగో అత్తయ్యగారూ! నేను ఇక్కడ పెద్ద ముగ్గు పెట్టుకున్నా. క్షణానికోసారి మీరు అరిసెల గురించి కేకలు పెడితే నాకు చుక్కలు లెక్క తప్పుతున్నాయి. ఇప్పటికిది పదోసారి చుక్కలు మొదలు పెట్టటం..మీదేం పోయింది...ఓ అచ్చటా ముచ్చటా ఎప్పుడూ తిండి యావే.."

"ఓసి నీ జిమ్మడా! సంక్రాంతికి అరిసెలు నా చిన్నప్పటినుంచీ ఆనవాయితే...ఇదిగో నీ ధర్మాన బతుకున్న తరువాత మంచి అరిసె తినే భాగ్యం పోయింది. అయినా నిన్నని ఏమి ఉపయోగంలే. పోయిన ఆ పెద్ద మనిషిని అనాలి. నన్ను నీ పాలిట వదిలేసి ఆయన ఎంచక్కా ముందు వెళ్లిపోయారు. అంతా నా ప్రారబ్ధం".

"ఈవిడ అఘాయిత్యం కూల. ప్రతియేడూ గంపెడు అరిసెలు చేస్తూనే ఉంటా. కనుమునాటికి ఒక్కటి మిగిలితే ఒట్టు. అది నోరా, చెత్త కుండీనా. నా ఖర్మ, ఎర్రగా బుర్రగా ఉంటాడని మేన బావను చేసుకున్నా చూడు. అదీ నేను చేసిన తప్పు. మేనత్తైనా ఇసుమంత ప్రేమ కూడా లేదు..." అని మనసులో ఉక్రోషపడింది సరస్వతి.

గబగబా లేచి వెళ్లి క్రితం రోజు నానబోసిన రెండు కిలోల బియ్యం చూసింది. అమ్మో! చేయాల్సిన పని గుర్తుకు వచ్చేసరికి గుండె జారింది. పిండి కొట్టాలి, పాకం కుదరాలి, చలిమిడి చేయలి, వేయించాలి, అరిసెలను వత్తాలి...దీని దుంప తెగ. ఇది అవసరమా...అమ్మో! చేయకపోతే ఈవిడ నా బుర్ర తినేస్తుందే....అని విసుగ్గా లేచి వెళ్లి ముగ్గులో మగ్నమైంది.

ఉదయం 6 గంటలకు మొదలు పెట్టిన ముగ్గు తీరుగా వేసి రంగులు అద్ది, గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మడి పూలు అలంకరించే సరికి ఎనిమిది. "ఓ సరసా! ముగ్గులేనా? కాఫీ ఏమన్నా ఉందా?" సుబ్బారావు కేక. సరస్వతి చేతి ఫిల్టర్ కాఫీ తాగితే కానీ సుబ్బారావు దినచర్య మొదలు కాదు. ఇంతలో తిరుమలమ్మ "సరస్వతీ! గుక్కెడు కాఫీ ఏమన్నా పోస్తావా లేదా? ప్రతిదీ అడగాలటే?"...మొదలు రామాయణం. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఆర్డర్లు. గబగబా స్నానం చేసి వచ్చి అందరికీ కాఫీలు అందించింది సరస్వతి. ఫలహారాలు అయ్యాయి. "అత్తయ్యా! పిండి కొడదాం రండీ" అని పిలిచింది.

అరిసెల పిండి అనగానే తిరుమలమ్మకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

"సరస్వతీ! ఆ రోలు, రోకలి, కుదురు శుభ్రంగా కడిగి ఆరనివ్వు. లేకపోతే నిన్న నూరిన చింతకాయ పచ్చడి వాసన వస్తుంది బియ్యప్పిండి"...

"అబ్బా అత్తయ్యా! నా పెళ్లై ఇరవై ఏళ్లు. ప్రతి యేడాదీ చేసే పనే. మీరు మొదటి ఏడు చెప్పినట్లు చెప్పక్కర్లేదు..".

"అంతేనే! నిరుడు చూసానుగా! ముందు రోజు రోట్లో నువ్వు రుబ్బిన పండు మిరపకాయ కారం ఘాటు నాకు అరిసెల్లో తగిలి తీపి కారం అప్పాల్లా దేభ్యంగా వచ్చాయి..వాంతులు విరేచనాలు...ఎన్నాళ్లయ్యిందో చక్కటి నేతి అరిసెలు తిని"...తిరుమలమ్మ ఎకసెక్కాలు.

"ఆ! ఎందుకు గుర్తు లేదూ! అర్ధరాత్రి నాకు పండుమిరపకాయం కావాలి అని ఎవరో లేచి వంటిల్లంతా వెదుక్కుంటుంటే పోనీలే పాపం ముసలావిడ జిహ్వ చాపల్యం అని మర్నాడే కాయలు తెచ్చి నూరి పచ్చడి చేశా. కష్టపడి రుబ్బింది కదా, రోలు కడిగి పెడదాం అని ఒక్కరికి ఉండదు ఈ కొంపలో...నేను చెబుతున్నా వినకుండా ఆత్రంతో వెళ్లి మీ చత్వారపు కళ్లతో ఆ రోలును సరిగ్గా శుభ్రం చేయకుండా అరిసెల పిండి నూరింది మీరు...."...సరస్వతి ఉక్రోషం.

"అవునే! అరిసెలు చెడితే నేను కారణం, కుదిరితే నీ గొప్పతనం. ఎంత గడుగ్గాయివే సరస్వతీ! నేను అరిసెలు చేస్తేనా ఊళ్లో వాళ్లందరూ చెప్పుకునే వాళ్లు. నువ్వు చేస్తేనో ఇంట్లో వాళ్ల పళ్ళు ఊడాల్సిందే..." అని నసుగుకుంటూ వాకిట్లోకి వెళ్లింది తిరుమలమ్మ. అక్కడ కోడలు వేసిన ముగ్గు చూసి అవాక్కయ్యింది. "ఏమి పనితనం సరస్వతిది!? ఏడాది మీద ఏడాది దీని ముగ్గులు ఇంకా బాగా వస్తున్నాయి.  అమ్మో నా దిష్టి తగులుతుందేమో" అని గబ గబ లోపలికి వచ్చి "సరస్వతీ! ఆ ముగ్గు..." అని అనబోయింది. "ఆ నేనే వేశాను" అని అత్తగారి కళ్లలోకి చూసి ఆమె మెప్పును గ్రహించి గర్వపడి సమాధానం చెప్పింది.

అత్తా కోడలు పిండి దంచటం మొదలు పెట్టారు. తిరుమలమ్మ వయసులో ఉన్ననాటి రోకళ్లను దాచి కోడలికి ఇచ్చింది. ముందుగా తిరుమలమ్మ రోకటికి పసుపు తాడు కట్టి, నమస్కరించి దరువు మొదలు పెట్టింది. అత్తగారి ఉత్సాహానికి ముచ్చట పడి సరస్వతి కూడా లయబద్ధంగా దంచటం మొదలు పెట్టింది, రోకళ్లు కొట్టుకోకుండా ఒకరి తరువాత ఒకరు దంచటం మొదలు పెట్టారు. ఇంతలో సరస్వతి మదిలో చిలిపితనం విరిసింది. దానికి తిరుమలమ్మ వంత పాడింది

"అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం"


"కోడలా కోడలా కొడుకు పెళ్లామా! పచ్చి పాల మీద మీగడేదమ్మ వేడి పాల లోన వెన్న ఏదమ్మా ఆహుం ఆహుం!"

"అత్తమ్మ నీ  చేత ఆరళ్లే గానీ ఓలెమ్మా పచ్చి పాల మీద మీగడుంటుందా వేడి పాల పైన వెన్న ఉంటుందా ఆహుం ఆహుం!"...

ఇలా ఒక వాయి బియ్యం చక చకా దంచేశారు. తిరుమలమ్మకు ఉత్సాహం రెట్టింపైంది.

"నోమీ నోమల్లాల నోమనన్నలాలో చందమామ చందమామ
 ఆవూరి మారాజు అయిదాణాలు ఇస్తేను ఈవూరి రాజు ముప్పావలిచ్చాడు.."

"రామ లచ్చన్నలాటి రాజులు లేరు సీతమ్మలాటి ఇల్లాలు లేదు
రామనా చందలాలో...."

అని వింజమూరి సోదరీమణులు పాడిన జానపద గీతాలు అందుకుంది. అత్తగారి ప్రతిభకు సరస్వతి ముచ్చటపడి మరింత వేగంగా దరువు వేసింది. ఆడుతూ పాడుతూ అత్తాకోడళ్లు పిండి దంచేశారు. "ఒరేయ్ సుబ్బారావ్! ఇక్కడ ఆడాళ్లం కష్టపడుతుంటే ఆ మడత కుర్చీలో నువ్వు విలాసం చూస్తున్నావా? వచ్చి పిండి జల్లెడ పట్టు"...అని కొడుకును కేక వేసింది. అమ్మ పిలుపుకు భయపడి ఒక్క ఉదుటున వచ్చి పిండి జల్లెడ పట్టాడు. వేళ్లతో పిండిని నులిమితే ఒక్క పలుకు తగిలితే ఒట్టు. అలాంటి జల్లెడ రోలు, రోకలి, కుదురుతో పాటు తిరుమలమ్మకు వారసత్వంగా వచ్చాయి. వాటిని అపురూపంగా చూసుకుంటుంది.

పిండికొట్టి అలిసిపోయిన అత్తాకోడళ్లకు మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చాడు సుబ్బారావు. "ఒరేయ్! ప్రాణం లేచి వచ్చింది రా కాఫీ తాగి. ఈ డెబ్బై ఏళ్ల వయసులో పిండి కొట్టే ఓపిక లేకపోయిన అరిసెలనేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.." అమ్మ, భార్యల పనితనం చూసి నవ్వుకున్నాడు సుబ్బారావు. హిమాలయాలపై మంచులా నున్నగా మెరుస్తోంది అత్తాకోడళ్లు కొట్టిన బియ్యప్పిండి. దాన్ని గిన్నెలోకి ఎత్తి, గట్టిగా ఒత్తి మూత పెట్టింది సరస్వతి. అంతా గమనిస్తూనే ఉంది తిరుమలమ్మ.


"సరస్వతీ! పాకం బెల్లం తెప్పించమన్నాను తెప్పించావా?"...అత్త గారి అరుపు విని "అబ్బా! తెప్పించాను. నేను చూస్తున్నాను కదా?". మూతి తిప్పింది సరస్వతి. "ఆ! త్వరగా రా! అరిసెలలో అసలు పని ఇప్పుడే మొదలు"....నొక్కులు నొక్కింది తిరుమలమ్మ. వంటింట్లో అటకపైన ఉన్న బూందీ బాణలి, చిల్లుల గరిట, తను పెళ్లి సమయంలో అమ్మ ఇచ్చిన అరిసెలు ఒత్తుకునే చెక్కలు తీసింది. పుట్టింటి వాళ్లు గుర్తుకొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. సముదాయించుకొని వంటింట్లో అడుగు పెట్టింది.

ఇక మొదలైంది తిరుమలమ్మ రామాయణం "మా చిన్నప్పుడు మా అమ్మ అరిసెలు చేస్తే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండేవి. పదా ఇరవయ్యా, రెండొందల అరిసెలు చేసేది. మాలక్షమ్మ గారి అరిసెలంటే ఊరంతా ఎదురు చూసేవాళ్లు. ఎలా వస్తాయో ఏమిటో ఈరోజు...సరస్వతీ! పాకం బెల్లం రుచి చూడవే. ఉప్పు వేసిన బెల్లమైతే అరిసెలు రావే"..."అబ్బా! మనకు ఎప్పుడూ ఇచ్చే కొట్లోనే తెచ్చాను అత్తయ్యా! ఇదిగోండి" అని తురిమిన బెల్లం కాస్త తిరుమలమ్మ చేతిలో పెట్టి రుచి చూడమని సైగ చేసింది. బెల్లం రుచి చూసిన తిరుమలమ్మ నోటికి తాళం పడింది.  సత్తు గిన్నెలో బెల్లం పాకం పడుతూ తిరుమలమ్మ

"శుభములు కలిగించుమా విఘ్న వినాశక
అఘములు తొలగించుమా ముక్తి ప్రదాయక"

అని గణపతిని ప్రార్థించి పాకాన్ని పరీక్షించింది. "సరస్వతీ పాకం అయిపోయిందేవ్! పిండివేస్తాను కలుపుదువు రా" అని పాకంలో కాస్త నెయ్యి, ఏలకులు, పంచదార పొడి వేసింది. కమ్మని వాసన ఇల్లంతా గుబాళించింది.

"ఏవండీ! కాస్త ఆ కుండలో నిన్న కాచి పెట్టిన నెయ్యి ఉంది. తీసుకురండీ! నేతితో చేస్తేనే అరిసెలు..." అని భర్తను ఆదేశించింది సరస్వతి. నెలరోజులనుండి తన ఇంట్లో పిదికిన పాలు కాచి, తోడెసి, చిలికి వెన్న తీసి, కాచిన నెయ్యిని ఎవ్వరికీ కనపడకుండా కుండలో దాచింది సరస్వతి. తనకు నేతి అరిసెలు అంటే ప్రాణం.

అత్తగారి పిలుపుతో సరస్వతి వచ్చి పిండి పాకం గిన్నెలో వేసి కలపటం మొదలు పెట్టింది. గరిటె తిప్పుతూ,

"అందగాడే విష్ణుమూరితి వానికి అందించినాను అరిసెలీరీతి
విందులాయే విష్ణుమూరితి ఏలిక వరములిచ్చేటి వైభవకీర్తి...."

అని అత్తగారు పెళ్లైన కొత్తల్లో నేర్పిన పాటపాడింది. "సరస్వతీ నీ గొంతులో ఈ పాట ఎంత బాగుంటుందే" అని కోడలిని మెచ్చుకుంది తిరుమలమ్మ. అత్తగారు చలివిడిని చక్కగా ఒత్తి కోడలికిస్తే, కోడలు వాటిని కమ్మని నేతిలో వేయించి, అత్తగారికి తిరిగి ఇస్తే అత్తగారు వైనంగా వాటిని ఒత్తి ఆరబెట్టటం. నువ్వులద్ది కొన్ని, కొబ్బరి అరిసెలు కొన్ని, ఇలా రెండు గంటల పాటు అత్తాకోడళ్లు అరిసెల యజ్ఞం చేశారు. గంపెడు అరిసెలు అందంగా పేర్చింది సరస్వతి. అరిసెలు నివేదన చేసి, పెద్దలకు నమస్కరించి, అందరికీ తలా ఒకటి పెట్టింది.

"అబ్బా సరస్వతీ! అరిసెలు ఎంత మధురంగా ఉన్నాయే..." - తిరుమలమ్మ
"సరసా! అరిసెలు నీ అంత తీయగా ఉన్నాయోయ్...." - సుబ్బారావు
"అమ్మా! నీ అరిసెల రుచి ఇంకెక్కడా రాదు..." - పిల్లలు
"చిన్నమ్మగోరూ! మీ అరిసెలు తింటేనే సంకురోత్రి పండగమ్మా!.." - పాలేరు

ఇలా అందరూ పొగిడే సరికి పడ్డ కష్టమంతా మరచి మురిసిపోయింది సరస్వతి. అత్తగారి దగ్గరకు వెళ్లి "అత్తయ్యా! అరిసెలు చేయటం కష్టమైనా, మీరు ఉత్సాహంగా పక్కన ఉన్నారు కాబట్టి హాయిగా శ్రమ తెలియలేదు.." అంది కృతజ్ఞతా పూర్వకంగా.

"సరస్వతీ! పండగంటే నలుగురూ కలిసి చేసుకునే సంబరాలు. ఇందులో ప్రతిదీ కలిసి చేస్తే మరింత పండగ వాతావరణం వస్తుంది. ఆ ముగ్గులు, గొబ్బెమ్మలు, ఈ అరిసెలు, నీ చేతి పొంగలి, జంతికలు...ఇవేనే నాకున్న నిజమైన సంబరాలు. మీ మామయ్య పోయి పదిహేనేళ్లు అయినా ఇంకా బతికి ఉన్నానంటే నీ ప్రేమ అప్యాయతల వల్లనే. అదంతా నువ్వు చేసే పనుల్లో కనిపిస్తుంది. అదే పదివేలు..."

ఇల్లంతా పండగ వాతావరణం నిండిపోయింది. తెలుగులోగిలి వెలిగిపోయింది. 

2 కామెంట్‌లు:

  1. SASIKALA VOLETY, Visakhapatnam.19 జనవరి, 2016 11:33 AMకి

    ఎంత చక్కటి కధో. కలిసి వుంటే కలదు సుఖం. అత్తా,కోడళ్ళ మధ్య.,.ఆప్యాయతతో కూడిన విసుగులు, విసుర్లు, కలిపి పని చేసుకోవడం లోని శ్రమైక జీవన సౌందర్యం, ప్రతీ పనిని సంగీత భరితం చేసుకోవడం వివరిస్తూ, సంక్రాంతి సాంప్రదాయక పిండి వంట అరిసెల ప్రహసనం ద్వారా చక్కటి కధ అల్లిన.ప్రసాద్ గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు వదినా! మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి