26, నవంబర్ 2015, గురువారం

దైవం మానుష రూపేణ - జానీ శంకరీయం



నమస్సోమాయ చ రుద్రాయ చ తామ్రాయ చ అరుణాయ చ...

కార్తీక సోమవారం, సూర్యోదయం ఇంకా కాలేదు, తెలిమంచు దట్టంగా ఆవరించి ఉంది. పూజా మందిరంలో శ్రీరుద్ర పఠనం శ్రావ్యంగా జరుగుతోంది. సనాతమైన శివ పంచాయతనంలో స్ఫటిక లింగానికి విద్యాశంకర శర్మ గారు పవిత్రమైన గోదావరీ జలాలతో అభిషేకం చేస్తున్నారు. మహాన్యాసముతో తానే రుద్రునిగా మారి అభిషేచనం చేస్తున్నారు. నుదుట విభూతి రేఖలు, మల్లె పూవులా తెల్లని వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల ధరించి తన్మయత్వంతో రుద్ర విధిని సాగిస్తున్నారు. ఇల్లంతా శివమయమై ప్రకాశిస్తోంది.

"శంకరం! ఒరేయ్ శంకరం! అర్జెంటుగా బయటకు రా".. స్నేహితుడు జానీ పిలుపుతో. జానీ గొంతు విని వెంటనే లేచి బయటకు వెళ్లాడు శంకరం. "ఏమయ్యింది రా జానీ?" అని అడిగాడు. "ఆయేషా ఆయాసపడుతూ పడిపోయింది. ఎందుకో భయంగా ఉంది. త్వరగా కారు తీసుకొని బయలుదేరు". క్షణం ఆలోచించకుండా కారు తీసుకొని ఇద్దరూ జానీ ఇంటికి వెళ్లారు. ఆయాసపడుతున్న ఆయేషాను హుటాహుటిన పదిహేను కిలోమీటర్ల దూరాన ఉన్న రాజమండ్రి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

"సమయానికి తీసుకు వచ్చారు. వీరికి గుండెపోటు వచ్చింది. ఒక వారం తరువాత బైపాస్ సర్జరీ చేయాలి. ఈలోపు డబ్బు సమకూర్చుకోండి" అని డాక్టర్ చెప్పాడు. స్నేహితులిద్దరూ ఇంటి దారి పట్టారు. "జానీ! రేపు మధ్యాహ్నం ఇద్దరం రాజమండ్రి వెళ్లి నాకు మా నాన్న గారిచ్చిన అర ఎకరం పొలం అమ్మి డబ్బులు సిద్ధం చేసుకుందాం.." అన్నాడు. "ఒరేయ్! ఇంట్లో కామేశ్వరితో చర్చించకుండా హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దు. నీకున్నది ఆ అర ఎకరం ఒక్కటే. తొందరపడకు. ప్రభుత్వాసుపత్రిలో ప్రయత్నిద్దాం అక్కడ ఉచితంగా చేస్తారు" అని చెప్పాడు. "జానీ! నా నిర్ణయం మారదు. ప్రభుత్వాసుపత్రిలో ఏమి జరుగుతుందో నాకు తెలుసు. అయేషా ప్రాణాలు కావాలనుకుంటే నేను చెప్పిన మాట విను" అని గట్టిగా చెప్పి కారు దిగి ఇంట్లోకి వెళ్లాడు.

"ఏవండీ! మీకు జానీ అన్నయ్యకు ఉన్న సాన్నిహిత్యం నాకు తెలుసు, కానీ తన్నుమాలిన ధర్మం పనికి రాదు కదా. మనకున్న ఏకైక ఆస్తి ఆ అర ఎకరం. అది కూడా పోతే పిల్ల పెళ్లి, మన వృద్ధాప్యం...." భార్య కామేశ్వరి మాట పూర్తి కాకుండానే "కామేశ్వరీ! జానీ కుటుంబం నాకు చేసిన సాయానికి నేను ఏమి చేసినా రుణం తీర్చుకోలేను" అని వివరాలు చెప్పాడు.

"జానీ నేను ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ పూర్తి అయ్యే వరకు ఒకే స్కూలు, కాలేజీలో చదువుకున్నాం. అప్పుడు 1991వ సంవత్సరం. నేను డిగ్రీ మొదటి సంవత్సరం. మా అమ్మ, నాన్న రాజమండ్రి నుండి మా ఊరు రావటానికి బస్సెక్కారు. బస్సు రాజమండ్రి పొలిమేర దాటగానే అదుపు తప్పి బోల్తా పడింది. రాత్రి సమయం, అప్పట్లో అంబులెన్సుల వసతి లేదు. ఫోన్లు అన్నిచోట్లా ఉండేవి కాదు. ఆ సమయంలో అక్కడికి దగ్గరలో ఉన్న దర్గాలో ప్రార్థనలు ముగించుకొని వస్తున్న జానీ, అతని తండ్రి ఈ బస్సు ప్రమాదం చూసి దగ్గరకు వచ్చి వెంటనే రోడ్డుపై వచ్చే వాహనాలలో గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు, కదలలేని వారికి జానీ తండ్రి ప్రథమ చికిత్స చేశారు. ఆయన హోమియోపతీ డాక్టర్. బాగా గాయపడ్డా అమ్మ, నాన్నలను ఆస్పత్రికి తరలించి, వారికి స్వయంగా తన రక్తం దానం చేసి ప్రాణాలు పోశారు.

ఆ తరువాత నేను ఊరికి వెళ్లినపుడు నాన్న గారు ఇలా చెప్పారు. "శంకరం! మన సనాతన ధర్మం చెప్పినట్లు ఈ ప్రపంచంలోని ప్రతి చరాచరములోనూ పరమాత్మ ఉన్నాడు. మన అదృష్టం బాగుండి ఈ పుణ్యాత్ముడు మనకు ఆ సమయంలో పరమాత్మ రూపుడై రావటం వలన ఈరోజు మేము బతికి ఉన్నాము. మనం చదువుకున్న శాస్త్రాల సారం మానవ ధర్మాన్ని పాటించి పరమాత్మను అంతటా చూడగలగటం. నమకంలో చెప్పినట్లు ఆ పరమ శివుడు అన్ని రూపాలలోనూ ఉన్నాడు. దీనికి నిరూపణ నాకు దక్కిన ఈ పునర్జన్మ. వారి మతం ఏదైనా ఇటువంటి వారికి ఎప్పటికి కృతజ్ఞులమై ఉందాము. ఎప్పటికీ వారిలాంటి మానవత్వమున్న మనుషులను నీ జీవితంలో సన్నిహితులుగా  ఉంచుకో. వారికోసం ఏదైనా చేయి. రెండో ఆలోచనే వద్దు".

ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. అప్పటినుండీ నేను జానీ అన్నదమ్ముల్లా జీవితంలో ప్రతి విషయంలో తోడునీడగా మెలుగుతున్నాము. మంచే మాకు మతము. నేను పాటించే మార్గం మన ఇంటి గోడలు దాటేంతవరకే. తరువాత విశ్వజనీనమైన శక్తిని ఇలాంటి వారిలో చూసి అనుభూతి చెందటం వరకే నా ఆలోచన."

"నిజమేనండీ...కానీ, వాళ్ల మతం మన మతాన్ని ద్వేషిస్తుంది, మన సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమైన సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ హింసను చాటుతుందనిపిస్తుంది..."

"కామేశ్వరీ! మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అవి పుట్టిన దేశ కాలమాన పరిస్థితులను బట్టి. ఇస్లాం ఆరంభమైన ప్రాంతాలలో ఆ సమయంలో ఉన్న సమస్యలకు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారి ప్రాతిపదికలు రాసుండవచ్చు. అలాగే మనకు కూడా. ఆ రాజులు మన దేశంపై దండెత్తి అప్పటి మన ఆలయాల సంపదను చూసి ఓర్వలేక, ఇక్కడి మతాన్ని పాటించకుండా, వారి ధర్మాన్ని మనపై రుద్దాలనే దురుద్దేశంతో దారుణాలకు పాల్పడ్డారు. దాని వలన ఇస్లాం మతానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. అలాగే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హిందూ ఐక్యతను ఛిద్రం చేయటానికి, మైనారిటీల పేరుతో ఓట్లు పొందటానికి రాజకీయ పార్టీలు ప్రజలను విభజించారు. దీనిని ఇస్లాం మత పెద్దలు, ఇస్లాం మతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారు ఖండించలేదు. దానితో హిందూ-ముస్లింల మధ్య ఒక పెద్ద అగాథం ఏర్పడింది. కానీ, మతానికి ప్రతిబింబం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం బాగున్నప్పుడు ఇక మతంతో పనేమిటి? ఇక ఆచారాలంటావా? హిందువులలో వేర్వేరు మార్గాలను పాటించేవారిలో వైరుధ్యాలు లేవా? కాబట్టి లోతుగా పరిశీలించటం నేర్చుకో. తప్పకుండా మన ధర్మాన్ని ప్రశ్నించే వారిని ఎదుర్కోవాలి, మన ధర్మం ఉనికికి హాని కలిగించే వాటిని తిప్పి కొట్టాలి. కానీ, మతం పేరుతో ప్రజలపై ద్వేషం పెంచుకోకూడదు..."

కామేశ్వరి మౌనంగా ఉండిపోయింది. శంకరం అర ఎకరం పొలం అమ్మటం, అయేషాకు ఆపరేషన్ జరిగి తిరిగి ఆరోగ్యవంతురాలు కావటం, శంకరం-జానీల స్నేహం మరింత వికసించి దృఢపడింది. కామేశ్వరి మనసులో అయ్యో ఉన్న ఆస్తి కాస్తా పోయిందే అన్న అసంతృప్తితో కూడిన కోపం అలానే ఉంది.

కాలచక్రం తిరిగింది. ఐదేళ్లు గడిచాయి. శంకరం-కామేశ్వరిల కూతురు కళ్యాణి పిఠాపురంలో డాక్టర్ ఉమర్ ఆలీ షా విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో తన డాక్టరేట్ పనిలో భాగంగా కొన్ని ప్రాచీన గ్రంథాలపై అధ్యయనం చేస్తోంది. కామేశ్వరి కూతురు దగ్గరకు వెళ్లింది. పీఠం చూసిన తరువాత కామేశ్వరి ఉమర్ ఆలీ షా గారి విశాల హృదయానికి, వారి ఆధ్యాత్మిక వికాసానికి ముగ్ధురాలైంది. తెలుగు భాషపై ఆలీషా గారికి గల మక్కువ, సనాతన ధర్మాన్ని గౌరవించే ఇస్లాం మతంలోని శాంతికాములైన గొప్పవారి వివరాలు తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించింది. నాడు భర్త చెప్పిన విషయాలను మనసులో అవగతం చేసుకోగలిగింది.

కళ్యాణి, కామేశ్వరి తిరిగి గ్రామానికి కలిసి వస్తున్నప్పుడు తన ఇంటి దారి కాకుండ జానీ గారి ఇంటివైపు అడుగులు వేసింది. కామేశ్వరిని చూసి అయేషా, జానీ ఆశ్చర్య పడ్డారు. "అమ్మా! ఇంతవరకూ మా ఇంట మీరు అడుగు పెట్టలేదు. ఈరోజు రావటం ఎంతో సంతోషం. అల్లా మా ఇంటికి పార్వతీదేవిని పంపించినట్లుగా ఉంది..." అన్నారు.

కామేశ్వరి దగ్గరకు వచ్చి అయేషా చేతులు పట్టుకొని - "ఇన్నాళ్లూ నాలోని సందేహాలు తీరలేదు. అడుగు మీ ఇంటి వైపు పడలేదు. మనిషి వ్యక్తిత్వం నిర్మలమైతే ఇక మతానికి, కులానికీ, రంగుకు, రూపానికి అక్కడ తావు లేదు అన్నది నాకు పిఠాపురంలో అవగతమైంది. నేడు మీ ఇంటికి రావటం నా భాగ్యంగా భావిస్తున్నాను" అంది. కామేశ్వరిని, కళ్యాణిని ఇంట్లోకి సాదరంగా అహ్వానించారు అయేషా-జానీ దంపతులు. నిర్ఘాంతపోయింది కామేశ్వరి - ఎదురుగా వ్యాసం పీఠం పెట్టుకొని చక్కగా వేదమంత్రాలు వల్లిస్తున్న జానీ కొడుకు బాషా. స్పష్టమైన ఉచ్ఛారణతో "శన్నో మిత్ర శం వరుణః...శన్న ఇంద్రో బృహస్పతిః..." ఎంతో శ్రావ్యంగా ఆలపిస్తున్నాడు. తెల్లని లాల్చీ పైజమా, తలపై తెల్లని టొపీ, నల్లని గడ్డం, ముఖంలో ప్రశాంతత...రూపమేమో స్వచ్ఛమైన ముస్లిం, పలికేదేమో సుస్వర వేదమంత్రాలు..ఇరవై ఎనిమిదేళ్ళ బాషాలో దివ్యత్వం ఉట్టిపడుతోంది. చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరించింది కామేశ్వరి.

కామేశ్వరిని చూసి చిరునవ్వుతో పలకరించి నమస్కరించాడు బాషా. "అమ్మా! మీరూ, చెల్లాయి కళ్యాణి మా ఇంటికి రావటం ఎంతో సంతోషం. నాకు వేద విద్యపై ఆసక్తికి కారణం శంకరం గారు. వారి ప్రోత్సాహంతో, మద్దతుతో సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది" అని చెప్పాడు. మాటల్లోనే శంకరం అక్కడికి వచ్చాడు. కామేశ్వరి భర్తతో తన అవగతాన్ని వివరించింది. "కామేశ్వరీ - పిఠాపురంలో నివసించిన దత్తవతారులు శ్రీపాద శ్రీవల్లభులు అల్లా అర్థాన్ని వివరించారు. అల్లా అనే పదం అల్-అహ అనే రెండు పదాలనుండి ఆవిర్భవించింది. అల్ అనగా శక్తి అహ అనగా శక్తిని ధరించువాడు. అనగా పరమాత్మ. సనాతన ధర్మంలో ఇది శివపార్వతుల తత్త్వానికి పూర్తి సారూప్యత కలది. ఈ విషయాన్ని నేను బాషాతో ప్రస్తావించగా అతనిలో మన సాంప్రదాయం గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. దాని ఫలితమే నీ ముందున్న వేదపండితుడైన బాషా..." అన్నాడు.

అందరూ హాయిగా తమలో వికసించిన ఆధ్యాత్మిక సుమాల పరిమళాలను కాసేపు పంచుకున్నారు. అల్లా లేదా శివశక్తి తత్త్వం ఆ ఇంట అంతటా నిండిపోయింది. అటు తరువాత అల్లాహో అక్బర్ అన్న మసీదు ప్రార్థనలు కామేశ్వరికి నమస్సోమాయ చ రుద్రాయ చ లాగానే మధురంగా, దివ్యంగా ధ్వనించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి