విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం
ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిశ (ప్రాకృత) వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వర గతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకది భాష్యముగ
విరించినై ...
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై ...
నా ఉచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
కొన్ని గీతాలు ఆ కవి హృదయాన్ని ఆవిష్కరించటంతో పాటు భాషకే వన్నె తెస్తాయి. అజరామరమవుతాయి. అలాంటి ఓ గీతం సిరివెన్నెల చిత్రంలోని సరసస్వర సుర ఝరీ గమనమౌ అనే సీతారామశాస్త్రి గారి గీతం. గీతం యొక్క రూపం కవి యొక్క హృదయం. సంగీతానికి అర్థం తెలిపిన గీతం ఇది. సృష్టిలో మొట్టమొదటి శబ్దం ఓం. ఇది ఎలా ఉద్భవించింది? బ్రహ్మ తలపులలో ఉద్భవించినది. విశ్వానికి మూలం ఓం అని దీని అర్థం. నాడులన్నిటికీ స్పందనను ఇచ్చిన తొలి శబ్దం ఓం కారము. ప్రణవంగా చెప్పబడినది ఈ ఓంకారము. అంటే నిరంతరం ప్రస్తుతించబడేది అని అర్థం. విశ్వమంతటా ఓంకార నాదం నిరంతరం వస్తూనే ఉంటుంది. వినేంత నిర్మలత్వం పెంచుకుంటే అది వినిపిస్తుంది. ఈ నాదం విశ్వరూపమై కనులనే కొలనులో ప్రతిబింబిస్తే, గుండెలోతులలో ప్రతిధ్వనించిన బ్రహ్మదేవుని వీణా గానమే ఈ సంగీతం. మంచిరసాలతో నిండిన స్వరాలు గంగాప్రవాహంలా సాగే అవతరించిన సంగీతం సామవేదము యొక్క సారము. ఈ రసహృదయుడు పాడిన గీతం జీవన గీతం. తానే బ్రహ్మయై గీతాన్ని రచించి వీణయై దానిని వినిపించాడు కవి. తూరుపు దిక్కనే వీణపై, సూర్యుని కిరణాలనే తంత్రులపై, మేలుకొన్న పక్షుల రవములు నీలి ఆకాశమనే వేదికపైన పలికిన కిలకిల స్వరములే స్వరజతులై ఈ జగత్తుకు శ్రీకారాము కాగా, విశ్వమనే కావ్యమునకు ఈ గీతం భాష్యముగా కవి హృదయం తానే బ్రహ్మగా ఆవిష్కరించింది. జన్మించే ప్రతి శిశువు పలికే జీవితం యొక్క అద్భుతమైన నాద తరంగాలు, చైతన్యము పొందటం ద్వారా కలిగిన స్పందనల వలన ఆ హృదయ ధ్వనులు మృదంగ నాదంగా, ఆది అంతములులేని రాగము, ఆది తాళములో, అనంతమైన జీవన వాహినిగా సాగిన సృష్టి లీల కవి బ్రహ్మ కలమున జాలువారింది, గాయకుని నోట పలికింది. ఆ గీతం ఉచ్ఛ్వాస అయితే గానం నిశ్శ్వాస అయ్యింది.
సృష్టి ఆద్యంతమూ నాదప్రవాహం ఏయే రూపాలలో మనకు ఆవిష్కరిస్తుందో ఇంత కన్నా అందంగా, పవిత్రంగా మనకు ఎవ్వరూ తెలియజేయలేరు అంటే అతిశయోక్తి కాదు. ఏ వాగ్గేయకారుడి అనుభూతికీ ఇది తక్కువ కాదు. ఎందుకంటే ఈ గీతం అనంతమైన విశ్వము, పరమాత్మ లీలలు, నిరంతర ప్రవాహంగా సాగే నాదానుసంధానాలకు సంబంధించింది. వేటూరి గారు ఈ నాదప్రవాహాన్ని శంకర గళనిగళము, శ్రీహరి పదకమలము అన్నారు. అది కూడా ఇటువంటీ అనుభూతి జనితమైన భావనే. సృష్టి స్థిలయములలో జీవరాశికి కలిగే స్పందనలు, ఆ సృష్టిలీలలో ప్రకృతిలో కలిగే ఉదయాస్తమయాలు, ప్రకృతికి స్పందించే జీవకోటి భావవ్యక్తీకరణలు...అన్నీ ఆ నాదోద్భవములే. వీటికి ఓంకారం ఆది. ఆ ఓంకారంతో అనుసంధానమయినదే సామవేదం. దాని సారమే సంగీతము. ఈ భావనను దివ్యంగా అందించే గీతంలో కవి హృదయాన్ని ఆవిష్కరించే పాత్ర అంధుడిది. అంధుడైనంత మాత్రాన భావనలు, విశ్వవిలాసపు రసాస్వాదన ఉండదు అనుకోవటం చాలా తప్పు. దృష్టి లేకపోతేనేమి? అంతర్ముఖుడైన కళాకారుడు తాదాత్మ్యతతో అన్నిటినీ అనుభూతి చెంది ఆలపించే గీతం ఇంత అందంగానే ఉంటుంది.
భావానికి ఔన్నత్యం కర్మేంద్రియముల స్థాయిని దాటి జ్ఞానేంద్రియముల ద్వారా చూడగలిగినప్పుడు. ఆ భావనకు భాష, సంగీతం తల్లిదండ్రులు. సీతారామశాస్త్రిగారి ఈ గీతం ఆయన పొందిన దివ్యానుభూతికి పతాకస్థాయి. నాదప్రవాహం ఓంకారమునుండి పుట్టి సృష్టిలోని అణువణువులోనూ భాగమైనందువల్లే దానికి దివ్యత్వం కలిగింది. నాదాన్ని శరీరమంతా నిరంతరం కలిగియున్నవాడు శివుడని త్యాగరాజస్వామి కొలిస్తే సృష్టి చేస్తూ విపంచిపై బ్రహ్మ అనుభూతి చెందాడు అని సీతారామశాస్త్రిగారు మనకు మనోజ్ఞంగా చెప్పారు. సామసంగీత రాయ అని అన్నమచార్యుల వారు శ్రీవేంకటేశ్వరుని కొలిచితే ఇక్కడ ప్రకృతితో తల్లీనమైన పరమాత్మ వ్యక్తీకరణగా మనకు సీతారామశాస్త్రిగారు వివరించారు.
ఇక భాషా సంపదకు వస్తే ఈ గీతం తెలుగు భాషకే మరో మారు ప్రాణం పోసింది. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, నడుము, బొడ్డు, ముద్దు వంటి పదాలతో బూతు సాహిత్యం కల్తీ సారాలాగా తెలుగు చిత్రసీమలో పారుతున్న సమయంలో మనకు విశ్వనాథ్ గారు దివ్యౌషధమైన సంగీత సాహిత్య ప్రచోదనమైన చిత్రాలను అందించి భాషకు, సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రాణం పోశారు. వారి దివ్యదృష్టికి సీతారామశాస్త్రిగారి దివ్యానుభూతి తోడైతే ఇక తెలుగుదనానికి తక్కువేమిటి? సాహిత్యంలోని ప్రతి అక్షరం కూడా పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించేదే. విధాత తలపు, అనాది జీవన వేదం, ఆది ప్రణవ నాదం, విశ్వరూప విన్యాసం, విరించి విపంచి గానం, సరసస్వర సురఝరీ గమనము, సామవేద సారం, ప్రాగ్దిశ వీణ, దినకర మయూఖ తంత్రులు, జాగృత విహంగ తతులు, వినీల గగనము, జగతికి శ్రీకారము, విశ్వకావ్యమునకు భాష్యం, జీవన నాద తరంగం, హృదయ మృదంగ ధ్వానం, అనాది రాగం, అనంత జీవన వాహిని, సృష్టివిలాసం, ఉచ్ఛ్వాస, నిశ్శ్వాస ఇలా ప్రతి ఒక్క అక్షరం కూడా చైతన్యపూరితమై, ప్రాకృతికమై మనసును తాకినవే.
సంగీతం గురించి ఏమి చెప్పను? కేవీ మహదేవన్ గారు స్వయంగా సామగానాన్ని అందించారేమో అనిపిస్తుంది. హరిప్రసాద్ చౌరాసియా గారి అద్భుతమైన వేణువాద్యం ఈ గీత సాహిత్యానికి ఎంతో వన్నె తెచ్చింది. అవ్యక్తానుభూతిని కలిగించేది వేణువాదనం. దానికి మూర్తీభవించిన ప్రతిభ చౌరాసియా గారిది. భావానికి గాయకుడి గళం జీవం. బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు ఈ పాటలోని సాహిత్యానికి అమృతత్వం ఇచ్చారు. ముఖ్యంగా బాలుగారు పల్లవిలోను, పాటచివరి సాహిత్యంలోనూ కనబరచిన మాధుర్యం న భూతో న భవిష్యతి. ఇది వారి నేపథ్య గాయక జీవితంలో కలికితురాయి.
ఓంకారానికి సనాతన ధర్మంలో గల ప్రాధాన్యతను సాహిత్యం, సంగీతం, గాత్రంలో పరిపూర్ణంగా ప్రతిబింబించిన ఈ గీతం సిరివెన్నెల చిత్రానికే కాదు భారత దేశ సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ గీతానికి సీతారామశాస్త్రిగారికి ఉత్తమ గేయరచయితగా, బాలుగారికి ఉత్తమ గయాకునిగా జాతీయ అవార్డులు రావటం వారి ప్రతిభకు, రసావిష్కరణకు సార్థకత.
ఎన్ని మార్లు విన్నా ఈ గీతం మరింత మధురంగా అనిపిస్తుంది.దివ్యత్వాన్ని కురిపిస్తూనే ఉంటుంది.
అద్భుతమయిన వ్యాఖ్యానం ఇచ్చారు. సీతారామ శాస్త్రి గారిని తిరుగు లేని సినీకవిగా నిల బెట్టేసిన పాటలు సిరివెన్నెల గీతాలు. సృష్టికి ఆది అయిన, విరించి శ్వాసించిన, జీవులలో ప్రాణ నాదమై నరాలను స్పందింప చేస్తున్న ఓంకారం, ప్రభాత వేళను పులకింప చేస్తున్న ఆ వేణుగాన సమ్మోహనం. ఓహ్! చాలా భావుకతతో రాసిన వ్యాసం చదివి తీరాలి.
రిప్లయితొలగించండిఈ పాట విన్నప్పుడల్లా రోమాంచమే కదా!
రిప్లయితొలగించండి