ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పర బ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుడనుచు
సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిము నే అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబౌదువు
గరిమల మిము నే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు
నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవమని
ఈవలనే నీ శరణనెదను ఇదియే పరతత్వము నాకు
అసలు పరమాత్మ తత్త్వము ఏమిటి? మన తలపులకు పరమాత్మ యొక్క అభివ్యక్తీకరణకు తద్వారా అనుగ్రహానికి గల సంబంధం ఏమిటి? దీనికి సమాధానం మన సనాతన ధర్మ వాఙ్మయం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నా కొంత మంది మహానుభావులు ఆ సమాధానాన్ని చాలా ప్రభావవంతంగా, సుళువుగా అర్థమయ్యేలా తెలియజేశారు. అందులో అన్నమాచార్యుల వారి ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అనే సంకీర్తన అగ్రగణ్యము.
మనము ఏ విధంగా తలచితే ఆ విధంగానే పరమాత్మ అనుభూతి, అనుగ్రహం కలుగుతుందని మనకు ఈ సంకీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు తెలియజేస్తున్నారు. మన అంతరాంతరములో శ్రద్ధగా పరిశీలిస్తే పిండి కొలది రొట్టె లాగా మన భావనైర్మల్యము బట్టి పరమాత్మ అని అన్నమాచార్యులవారు చెబుతున్నారు.
ప్రీతితో, స్నేహముతో విష్ణుభక్తులు విష్ణువని కొలిచితే, వేదాంతులు పరబ్రహ్మయని తెలిపారు. శైవులు శివునిగా తలచితే, కాపాలికులు భైరవునిగా ఆనందంతో నుతించారు. శాక్తేయులు ఆదిపరాశక్తిగా భావించి ఆరాధించారు. ఈ విధముగా పరమాత్మను నానా విధాలుగా తలచి కొలుస్తారు.
అజ్ఞానంతో, సంకుచితమైన ఆలోచనతో, అల్పబుద్ధితో పరమాత్మను అల్పంగా ఆలోచినవానికి ఆయన అల్పమే. గొప్పతనంతో, సద్బుద్ధితో, జ్ఞానంతో పరమాత్మను గొప్పగా తలచినవానికి ఆయన గొప్పగా అనుగ్రహిస్తాడు. ఎలాగైతే కొలనులో నీటి కొద్దీ తామరలో, అలాగే మన సంకల్పము, భావ వికాసము బట్టి ఆయన అనుగ్రహము. పరమాత్మ వలన ఎటువంటి కొరత ఎప్పుడూ లేదు. గంగానదీ పరీవాహక ప్రాంతంలో బావులలో ఆజలమే ఊరుతుంది. వేరొక దానికి స్థానంలేదు. అలాగే మన మనసు ఎంత శుద్ధిగా ఉంటే దానికి నిష్పత్తిలో ఫలితం. మనకు దగ్గరలో ఏడుకొండలలో నెలకొన్న వేంకటేశ్వరుడే ఆ పరమాత్మ. అదే భావనతో ఆయన శరణు కోరుదాము. అదే పరమార్థము, పరమానందము.
మనలో భావ నైర్మల్యానికి, సంకల్పానికి పరమాత్మ అనుగ్రహం ఎలా ముడిపడి ఉందో ఈ సంకీర్తన ద్వారా తెలిపారు అన్నమాచార్యుల వారు. ఏ స్వరూపంగా కొలచినా తలచినా ఆ స్వరూపంగా అనుగ్రహిస్తాడు పరమాత్మ. కావలసినది మన సాధన, ఆ సాధనలో త్రికరణ శుద్ధి మరియు శరణాగతి ముఖ్యమైన ప్రాతిపదికలు.
పురాణేతిహాసములలో భక్తిప్రపత్తులతో ఏ రూపాన్ని కొలచినా అనుగ్రహం ఎలా కలిగిందో అనంతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఈ సంకీర్తన ద్వారా మనకు వస్తు గుణ రూప సమన్వితమైన సగుణోపాసననుండి అన్నీ ఆయనే అన్న పరమాత్మ యొక్క ఏకత్వ భావనను, ఆయన అనుగ్రహానికి మనలో కావలసిన లక్షణాలను సద్గురువులు సామాన్యులకు అర్థమయ్యేలా తెలియజేశారు. యద్భావం తద్భవతి అన్నది పరమాత్మ. భావానికి భక్తి, శరణాగతి, నిశ్చలమైన విశ్వాసం తోడైతే ఆయన ఏ రూపమైనా మనలో దర్శించవచ్చు.
వాగ్గేయకారులు మనకు ఆధ్యాత్మిక సందేశాన్ని ఎంత కరతలామలకం చేశారన్నది వారి యొక్క ఉన్నతికి సూచిక. అన్నమాచార్యుల వారు నందకాంశులు. పరమాత్మను నిరంతరం అనుభూతి చెంది, ఆ ఆనందంలో రమిస్తూ మనకు ఆ తత్త్వాన్ని కళ్లకు కట్టినట్లుగా మధుర భక్తితో కూడిన శృంగార రచనలతో పాటు అత్యద్భుతమైన ఎంతమాత్రమున వంటి ఆధ్యాత్మిక సంకీర్తనలను కూడా అందించారు. వారికి మన తెలుగుజాతి ఎప్పటికీ రుణపడి ఉంది.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో ఈ సంకీర్తన వినండి.
What an appropriate explanation andi!
రిప్లయితొలగించండి