RightClickBlocker

26, ఆగస్టు 2015, బుధవారం

ఆది అనాదియు నీవే దేవా


ఆది అనాదియు నీవే దేవా నింగియు నేలయు నీవే కావా
అంతటి నీవే ఉండెదవు శాంతివై కాంతివై నిండెదవు
నారద సన్నుత నారాయణా నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీసతి పతివో
దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణా భవహరణా
కనక చేల! భయ దమన శీల! నిజ సుజన పాల! హరి సనాతనా!
క్షీరజలధి శయనా! అరుణ కమల నయనా! గాన మోహనా! నారాయణా!

సృష్టి రహస్యము, బ్రహ్మాది దేవతల ఆవిర్భావము, మనువుల సృష్టి, లోకములు మొదలైన వివరాలు అన్నీ వ్యాసుల వారు భాగవతంలో పొందుపరచారు. భగవంతుని భక్తుల గురించి కూడా ఎన్నో వివరాలు తెలిపారు. హరి భక్తులు అనగానే గుర్తుకు వచ్చే వారు ప్రహ్లాదుడు, అంబరీషుడు. శ్రీహరి భక్తిలో మునిగి ప్రహ్లాదుడు దానవుడైన తండ్రి పెట్టిన బాధలన్నీ అధిగమించి దుష్ట శిక్షణకు తోడ్పడ్డాడు. అంబరీషుడు దుర్వాసుడు ఎంత తన సహనాన్ని పరీక్షించినా అకుంఠితమైన హరిభక్తితో వాటిని దాటగలిగాడు. అసలు హరిభక్తిని విశ్వానికి చాటింది నారదుడు. నిరంతరం నారాయణ నామస్మరణతో, నారద మహర్షి పరమాత్మ లీలావినోదములలో విడదీయని భాగమైనాడు.  వ్యాసులవారి భాగవతాన్ని అత్యంత మధురంగా తెలుగులోకి అనువదించారు మహాకవి పోతన.

దాశరథి గారు తెలుగుజాతి కన్న ఒక మాణిక్యం.  భాషా పాండిత్యంతో పాటు భక్తి సుగంధాన్నిఈ గీతానికి అణువణువున అలదిన గొప్ప కవి ఆయన.  మన తెలంగాణా ముద్దు బిడ్డే.  ఈ గీతంలో పోతన గారి భావజాలానికి దగ్గరగా వెళ్లారు దాశరథిగారు.

ఈ విశ్వం యొక్క నాందికి కారణం పరమాత్మ అని భాగవతంలో స్పష్టంగా తెలియజేశారు. అందుకనే దాశరథి గారు పరమాత్మను ఆది అన్నారు. కానీ, ఆ పరమత్మకు మొదలు లేదు. ఆయన సనాతనుడు. పంచభూతములు ఆయనచే సృజించబడినవి కాబట్టి నింగి నేల నీవే అని అన్నారు కవి. నారదుడిచే నుతించబడిన ఆ నారాయణుడు తానే మానవునిగా, శివునిగా, విష్ణుమూర్తిగా అవతరించాడు. దానవులను శిక్షించి మానవాళిని రక్షించే మన పాపములను హరించే శుభచరణములు కలవాడు.

చరణంలో పరమాత్మ రూప లక్షణాలను వర్ణిస్తున్నారు కవి. బంగారు వస్త్రములు ధరించిన వాడు, ఎర్రని కలువల వంటి కనులు కలవాడు, తన వేణు గానముతో లోకాన్ని మోహింపజేశేవాడు, భయాన్ని పోగొట్టే సుగుణములు కలవాడు, సుజనులైన నిజభక్తులను పాలించే వాడు, సనాతనుడు, పాలకడలిలో ఆదిశేషునిపై శయనించేవాడు ఆ నారాయణుడు అని అందమైన తెలుగు సాహిత్యంలో వర్ణించారు దాశరథి గారు. నారదునిపై చిత్రించిన ఈ గీతం నారదభక్తికి నిలువెత్తు దర్పణం.

ఒక గీతానికి సాహిత్యం సాద్గుణ్యత అయితే సంగీతం, గానము సాఫల్యాన్ని ఇస్తాయి.  రసాలూరించే సాలూరి వారు భక్త ప్రహ్లాద చిత్రంలో ఈ గీతానికి సంగీతం సమకూర్చగా గానగంధర్వులు మంగళంపల్లి బాలమురళి గారు  నటించి, గళమాధుర్యంతో అమృతాన్ని కురిపించారు. దాశరథిగారు శ్రీవైష్ణవుడైనా అద్వైత భావాన్ని ఈ గీతంలో కురిపించి తమ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నలుదెసల వెదజల్లారు.  రాగమాలికలో ఒక పాటను కూర్చాలంటే ఏయే రాగాలు కూడితే బాగుంటుందో తెలియాలి. దానికి సంగీతం మూర్తీభవించిన సరస్వతీపుత్రులు సాలూరి వారి కన్నా ఎవరు మిన్న?  రాగాలను గంగా ప్రవాహంలా పలికిచే బాలమురళి గారి గొంతులో ఈ గీతం నారాయణ మంత్రంలా ప్రకాశించింది.    త్రిమూర్త్యాత్మకమైన ఈ గీతం భక్తి భావ సంగీత సుధలను కురిపించింది.  అందుకే ఇన్నేళ్ల తరువాత కూడ ఇంకా శ్రోతలకు శ్రీమన్నారాయణుని స్తుతులలో తలమానికంగా నిలిచింది. ఎందరో మహానుభావులు వారందరికీ శతసహస్ర వందనాలు!

బాలమురళీకృష్ణ గారి గళంలో ఈ పాట వినండి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి