పాడవోయి భారతీయుడా! ఆడి పాడవోయి విజయ గీతిక!
స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి
స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారుల
ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునే వాడే
స్వార్థమీఅనర్థ కారణం అది చంపుకొనుటె క్షేమదాయకం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారత దేశం అందించినులే శుభ సందేశం
సరిగ్గా 55 ఏళ్లు ఈ పాట రచించి. అక్షరాలా ఇప్పటికీ పరిస్థితులు ఏమీ మారలేదు. ఇందులోని సందేశం పూర్తిగా సముచితం. శ్రీశ్రీ గారు భక్తి శృంగార రచనలనుండి విప్లవ రచయితగా మారుతున్న సమయంలో వచ్చిన గీతం ఇది. అటు తరువాత రెండు తరాలు గడిచినా ఇందులోని సందేశం మరింత ప్రాధాన్యతను పొందిందే తప్ప తరగలేదు. చెప్పబడిన సమస్యలు మరింత జటిలమయ్యయే తప్ప పరిష్కరించబడలేదు. కారణం?
1. ఏ ఇంటికైన పునాదులు ముఖ్యం. మన దేశానికి కూడా అంతే. మొదటి ప్రభుత్వం వేసిన తప్పటడుగులు అలానే కొనసాగి కుటుంబపాలనగా మారి దేశాన్ని రాచరికం కన్నా ఘోరమైన ప్రజాస్వామ్య ఖూనీ మార్గంలో నడిపించాయి.
2. మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకొని వోటు వేసినప్పుడల్లా ఆ మార్పును రాజకీయ కుతంత్రాలతో పడగొట్టింది కుటుంబపాలన, స్వార్థపు ప్రాంతీయ రాజకీయ పార్టీలు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసే రాజకీయ పక్షాలు నేటికి వటవృక్షాలైనాయి.
3. మార్పు నాయకులలో రావాలని ప్రజలు, ప్రజలలో రావాలని నాయకులు ఇలా ఒకరినొకరు కారణంగా వేలెత్తి చూపటం తప్ప మార్పును కోరుకునే వారు కలిసి ముందుకు నడచి వెళ్లటం లేదు. స్వార్థపు రాజకీయ ఎత్తుగడల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి మార్పు కోరుకునే భావ వీచికలు.
4. విద్యావ్యవస్థలో పూర్తిగా భారతీయత లోపించటం. ఉద్యోగాల కోసం విలువలను తెలిపే పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించటం విద్యావ్యవస్థలోని వ్యాపార ధోరణి వల్లనే. నేటి విద్యా వ్య్వస్థలోని ప్రమాణాల వలన వలన హక్కులు-బాధ్యతలు-విలువలు తెలిసిన పౌరులు కాకుండా ఉద్యోగార్హతలు కలిగిన పౌరులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నారు.
ఈ పోటీ ప్రపంచం వలన మనుషులలో స్వార్థం పెరిగి పోయింది. శ్రీశ్రీగారు చెప్పినట్లు మనలోని స్వార్థాన్ని చంపటం తప్ప వేరొక మార్గం లేదు భారతం దేశం బాగుపడాలంటే. ఏకదీక్షతో వ్యక్తిత్వ పరివర్తన కోసం మనం పాటుపడాలి. దానికి సనాతన ధర్మం మనకు ఎన్నో ఉపాయాలను ఇచ్చింది. ధర్మాన్ని తెలుసుకుని ఆచరిస్తే స్వార్థమనే సర్పం పడగలు విప్పకుండా ఉంటుంది. ధర్మాన్ని ఆచరిస్తే దేశ ప్రయోజనాలు అవే ప్రాధాన్యతను పొందుతాయి. ధర్మాన్ని ఆచరిస్తే బంధుప్రీతి, అవినీతి తగ్గుతాయి. ధర్మాన్ని ఆచరిస్తే చీకటి బజారులోకి వెలుగు నిండుతుంది. ధర్మాన్ని ఆచరిస్తే ధరలు తగ్గుతాయి, పదవులపై వ్యామోహముండదు, కులమత తారతమ్యాలు తొలగుతాయి. ఎవరి ధర్మం వారు పాటిస్తే అన్ని అనర్థాలూ దూరమవుతాయి. మరి ధర్మం పాటించాలంటే?
ధర్మాన్ని బోధించే వాఙ్మయాన్ని చదవాలి, పాఠ్యాంశాలలో చేర్చాలి. విలువలను విద్యకు మూలం చేయాలి. ధర్మాన్ని మూఢత్వంగా కాకుండా ప్రగతికి బాటగా ప్రభుత్వాలు పరిగణించాలి. వ్యక్తిత్వ వికాసం ఉద్యోగార్హత కావాలి. నాయకుల ఎన్నికకు ధీరత్వం, దేశభక్తి, స్వప్రయోజనాల త్యాగం ప్రధాన ప్రాతిపదిక కావాలి. సంస్కృతి, వారసత్వం మొదలైన వాటిపై అవగాహన పెరగాలి.
ఒక్కటి గుర్తు చేసుకోవాలి. ధర్మమంటే నవీనతకు, నాకరిగతకు, అభివృద్ధికి వ్యతిరేక పంథా కానే కాదు. ధర్మం ఏ పరిస్థితిలోనైనా మనిషిని ముందుకు నడిపిస్తుంది. కాలానుగుణంగా మారేది ధర్మం. కానీ, అది ప్రతిబంధకం ఎన్నటికీ కానే కాదు. శాస్త్ర సాంకేతిక పురోగతికి, పారిశ్రామీకరణ, పట్టణాలకు వలసలు ఇవేవీ ధర్మ వ్యతిరేకం కాదు. ధర్మమనేది వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది. తద్వారా సమాజాన్ని నిర్దేశించేది. అందుకే ధర్మం మన జీవనశైలికి వెన్నెముక అయితే ఈ దేశం సమస్యలు ఒక్క పదేళ్లలో మాయమవుతాయి. ఎందుకంటే, మిగిలిన ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి మనకు. కేవలం పరాయి ధర్మం మోజులో పడి మన ధర్మాన్ని మనం వదిలేశాము కాబట్టే చాలా మటుకు సమస్యలు. స్వధర్మాన్ని గుర్తించి, గౌరవించి, పాటిస్తే మన బ్రతుకులు ప్రగతి బావుటాలే.
అప్పుడే పాడవోయి భారతీయుడా! ఆడి పాడవోయి విజయ గీతిక!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి