24, ఆగస్టు 2015, సోమవారం

శ్రీకాళహస్తీశ్వర దండకం - భక్త కన్నప్ప

శ్రీకాళహస్తీశ్వర దండకం - భక్త కన్నప్ప




జయ జయ మహాదేవ శంభో హరా శంకరా సత్య శివ సుందరా నిత్య గంగాధరా!
బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ దయాసాగరా!
భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్!
దివ్య జప హోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్!
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్!
విశ్వరూపా! మహామేరు చాపా! జగత్సృష్టిసంరక్షసంహారకార్యః కలాపా!
మహిన్ పంచభూతాత్మ నీవే కదా! దేవ దేవా! శివా!
పృథ్వి జల వాయురాకాశ తేజో విలాసా! మహేశా! ప్రభో!
రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా!కాశీపురాధీశ విశ్వేశ్వరా!
నీలిమేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరా! శ్రీశైల మల్లేశ్వరా!
కోటి నదులందు సుస్నాముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా!శ్రీరామలింగేశ్వరా!
నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమా వాస భీమేశ్వరా!భీమేశ్వరా!
దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీస్వరా! శ్రీకాళహస్తీస్వరా!
దేవ దేవా! నమస్తే నమస్తే! నమస్తే! నమః! 

శివుని పంచభూత తత్త్వాలకు ప్రతీక పంచభూతలింగ క్షేత్రాలు - పృథివీ లింగ రూపంలో కాంచీ ఏకాంబరేశ్వరుడు, జలలింగ రూపంలో తిరుచిరాపల్లిలో జంబుకేశ్వరుడు, తేజోలింగం రూపంలో తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడు, వాయులింగ రూపంలో శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడు, ఆకాశలింగ రూపంలో చిదంబరంలోని నటరాజస్వామిగా వెలశాడు శివుడు. అటువంటి మహిమాన్విత పంచభూతలింగ క్షేత్రం కాళహస్తి. సాలెపురుగు, నాగుపాము, ఏనుగు కొలచిన క్షేత్రం కాబట్టి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఈ వాయులింగ క్షేత్రానికి. స్వర్ణముఖీ నదీతీరాన తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం రాహు-కేతు గ్రహదోషము మరియు సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ధి.



భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెందిన తిన్నడు శ్రీకాళహస్తిలో వెలసిన కాళహస్తీశ్వరుని కొలచి తరించిన మహా శివభక్తుడు. బోయవాని కుటుంబంలో కాళహస్తి వద్ద జన్మించాడు. అతనికి తల్లిదండ్రులు తిన్నడుగా నామకరణం చేశారు. వేటగాడైనందువలన శివుని శాస్త్రోక్తంగా కొలిచే విధి తెలియకపోయినా అమితమైన భక్తితో నోటి నీటిని తెచ్చి స్వామికి అభిషేకము చేశాడు, వేటమాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. పత్రం పుష్పం ఫలం తోయం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు భక్తితో తిన్నడు సమర్పించినవన్నీ శంకరుడు ప్రీతితో స్వీకరించాడు. ఒకసారి ఆతని భక్తిని పరీక్షించటానికి శంకరుడు కాళహస్తీశ్వర దేవాలయ సమీపంలో భూప్రకంపనలు సృష్టిస్తాడు. దేవాలయం కప్పుభాగం ఊగి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మిగిలిన వారంతా భయంతో పారిపోగా ఒక్క తిన్నడు మాత్రం లింగాన్ని తన శరీరంతో కప్పి దానిని ధ్వంసం కాకుండా కాపాడుతాడు. అటు తరువాత అతను ధీరన్నగా పిలువబడతాడు.

ఒకసారి కన్నప్ప శివుని లింగంపై ఒక కంటిలో రక్తం స్రవించటం గమనిస్తాడు. వేదన చెంది ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే బాణంతో తన కంటిని పెళ్లకించి ఆ కంటి స్థానంలో పెడతాడు. అప్పుడు ఆ కంటి రక్తస్రావం ఆగుతుంది కానీ శివుని మరో కన్ను స్రవించటం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు తన రెండో కన్ను పెకళించటానికి సిద్ధపడతాడు. తాను గుడ్డివాడైతే కన్నును శివుని కంటి స్థానంలో పెట్టలేనేమోనని తన కాలి బొటనవ్రేలిని స్రవించే కన్నుపై పెట్టి, తన రెండవకన్నును పెరికి కాలిబొటనవేలు ఆనవాలుతో స్రవించే శివుని కంటి స్థానంలో నిలుపుతాడు. అతని అపారమైన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి రెండు కళ్లు ప్రసాదించి కన్నప్పగా నామకరణం చేస్తాడు. కన్నప్ప పరమశివుభక్తునిగా ముక్తిని పొందుతాడు. శైవ సాంప్రదాయంలో నాయనార్లు పరమభక్తులుగా గుర్తింపబడి చరిత్రకెక్కారు. వారిలో కన్నప్ప నాయనారు ఒకడు.

శైవులు కన్నప్పను అర్జునిని అవతారంగా పరిగణిస్తారు. ద్వాపరయుగంలో శివుని అర్జునినికి యుద్ధం జరుగుతుంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివునికై తపస్సు చేస్తాడు. శివుడు అతను పరీక్షించదలచి బోయవాని వేషంలో వచ్చి అతని ముంగిట మూకాసురుని ఒక అడవపందిగా సృష్టిస్తాడు. తన తపస్సుకు భంగం కలిగించిన పందిని అర్జునుడు బాణం వేసి సంహరించబోగా శివుడు ఆ పందిని ముందే బాణంతో సంహరిస్తాడు. ఆ పందిని నేను సంహరించానని బోయవాడు అర్జునినితో వాదిస్తాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుని శౌర్య పరాక్రమాలకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి అభేద్యమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఇది కిరాతార్జునీయంగా ప్రసిద్ధి చెందిన గాథ. ఆ జన్మలో శివుని ముందే గుర్తించని దానికి ఫలితంగా అర్జునుడు కలియుగంలో తిన్నడుగా జన్మించి శివుని కొలచి సాఫల్యం పొందుతాడు. ఇదీ కన్నప్ప గాథ.

కాళహస్తి మహాత్మ్యం అనే చలన చిత్రంలో ఈ తిన్నడి గాథను రమణీయంగా తెరకెక్కించారు కన్నడ దర్శకేంద్రులు హెచ్ ఎల్ ఎన్ సింహ గారు. ఆ చిత్రంలో కన్నడ కంఠీరవగా పేరొందిన మహానటుడు రాజ్ కుమార్ గారు అద్భుతంగా నటించారు. బోయవాని పాత్రలో ఆయన జీవించారు. ఆ చిత్రంలో తోలేటి వేంకటరెడ్డి గారు రచించిన కాళహస్తీశ్వర దండకం ఘంటసాల గారికి ఎంతో పేరు తెచ్చింది. భూకైలాస్ వంటి చిత్రాలకు సంగీతం కూర్చిన గోవర్ధనం-సుదర్శనం గార్ల సంగీతం ఈ చిత్రానికి కలికితురాయి.

దండకాలు భారతదేశ ఉపాసనా విధులలో ఒక విశేషమైన స్థానం కలిగి ఉన్నాయి. దండకం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది కాళిదాసు రచించిన శ్యామాలా దండకం - మాణిక్యవీణాం. అలాగే శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే ఆంజనేయ దండకం..ఇవి చాలా  ప్రసిద్ధి చెందాయి. దక్షిణ భారతదేశ భాషలలో తెలుగులోనే ఎక్కువ దండకాలు రచించబడ్డాయి. అనర్గళంగా, ఒకరకమైన ఆవేశంతో కూడిన భక్తి సుమాలు దండకాలు. విశేషమైన వర్ణన, ఆర్తి,భక్తితో, పొడవైన వాక్యములతో భక్తుడు భగవంతునితో చేసే విన్నపం దండకం. అటువంటి దండకాలలో ఈ కాళహస్తీశ్వర దండకం ఎంతో పేరుపొందింది.

ఈ దండకంలో తోలేటివారు కన్నప్ప భక్తిని, బోయవానిగా తన అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ అదే సమయంలో అతని అనన్య సామాన్యమైన శివభక్తిని చాటేలా రచించారు. శివుని పంచభూత తత్త్వాన్ని, మహామహిమాన్వితమైన కాశీ, శ్రీశైలం, రామేశ్వరం, ద్రాక్షారామం మరియు కాళహస్తుల ప్రస్తావన చేశారు.

ఘంటసాల గారి గళంలో, రాజ్ కుమార్ గారి నటనలో ఈ దండకాన్ని వీక్షించండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి