21, మార్చి 2015, శనివారం

పాలించు కామాక్షి పావని పాప శమని




పాలించు కామాక్షి పావని పాప శమని

చాలా బహు విధముగా నిన్ను సదా వేడుకొన్న నా యందేల
ఈ లాగు జేసేవు వెత హరియించి వేవేగమే నన్ను

స్వాంతంబులోన నిన్నే తలచిన సుజనులకెల్లను ఈ వేళ
సంతోషములొసగేవని నీవు మనోరథ ఫలదాయినివని
కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము
కాపాడిన తల్లి కదా నేడు నీదు బిడ్డను లాలించి

కనకగిరి సదన లలిత నిను భజన సంతతము సేయ నిజముగను
వినుము నిఖిల భువన జననీ ఇపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి

ఎందుకో అమ్మ బాగా గుర్తుకు వచ్చింది. అమ్మకు అమ్మవారి కీర్తనలు అంటే చాలా ఇష్టం. వెంటనే యూట్యూబ్ లోకి వెళ్లి కొన్ని సంకీర్తనలు విందామని పాలించు కామాక్షి విన్నాను. కళ్లలో నీళ్లు తిరిగాయి. పాపశమనీ అన్నచోట మధ్యమావతి రాగంలోని మార్దవం, కరుణ పొంగి పొరలినట్లనిపించింది. అమ్మ అనగానే వాత్సల్యము, దయ, లాలన, కరుణ, సంతోషము వంటి మంచి భావనలెన్నో కలుగుతాయి. ఈ కృతి వింటే అవన్నీ కలుగుతాయి నాకు. దివ్యరూపంలో ఉన్న మా అమ్మ కూడా నాకు ఎప్పటికీ వెన్నంటి ఉంటుందని సాంత్వన కలిగింది. అభీష్టాలను ముందు నిలబడి నడిపించే ఫలదాయనిగా అమ్మ నాతోనే ఉంటుంది అనిపించింది. ఆ కామాక్షి తల్లి అమ్మను గుర్తు చేసి తనను తలచుకునేలా చేసింది. దిక్కుతోచక పరిగెడుతున్నానా అనిపించిన సమయంలో కామాక్షీ తల్లి స్తుతి దృఢత్వాన్నిచ్చింది. జగమును కాపాడే కారుణ్యమూర్తివి కదా తల్లి? ఈ వాక్యం వినగానే దుష్టశిక్షణ చేసే జగన్మాత రూపం మదిలో కదలాడింది. సంకీర్తనల గొప్పతనమిదేనేమో? విశ్వాన్ని నిరంతరం కాపాడే ఆదిపరాశక్తికి ప్రతి రూపం కన్నతల్లి. తంజావూరులోని బంగారు కామాక్షిని ఎంతో నిష్ఠగా కృతుల ద్వారా ఉపాసన చేసిన శ్యామశాస్త్రుల వారు ఎంత ధన్యులో? వారికి పాదాభివందనాలు.

భక్తిలో శరణాగతి చాల ముఖ్యమైన భాగం. ఆ శరణు భావన కలిగితే తప్ప భక్తి ఫలించదు. సనాతన ధర్మ సాంప్రదాయంలో వాగ్గేయకారులు తమ మనోభావనలను సంకీర్తనల ద్వారా మనకు తెలిసేలా శాశ్వతం చేశారు. సంగీత త్రయంలో ఒకరైన శ్యామశాస్త్రి వారి మనోగతాన్ని తెలిపే ఒక కృతి పాలించు కామాక్షి పావని అనే మధ్యమావతి రాగంలో కూర్చబడిన సాహితీసౌరభం. శరణాగతి అనేది ఆ దేవతా స్వరూపంపై అచంచలమైన విశ్వాసముంటే తప్ప కలుగదు. శాక్తేయంలో ఉన్న గొప్పతనమేమిటంటే అమ్మ యొక్క సాత్విక స్వరూపాన్ని కన్న తల్లిలా భావించి ఆ అమ్మతో సంభాషించే తత్త్వం.

https://www.youtube.com/watch?v=RYTyeq05GHo

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి