9, అక్టోబర్ 2010, శనివారం

గాయత్ర్యష్టకం, మంత్ర సారం

శరన్నవరాత్రుల మూడవ నాడు (తదియ) గాయత్రి అలంకారములో అలరారే ఆ ఆదిపరాశక్తిని  స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన గాయత్ర్యష్టకం, తాత్పర్యము మీకోసం. ఈ సందర్భంగా నేను ఇదివరకు ప్రచురించిన గాయత్రీ మంత్ర సంబంధమైన వ్యాసం మళ్లీ ఈ వ్యాసంలో చివరన పొందుపరుస్తున్నాను.

గాయత్ర్యష్టకం



విశ్వామిత్ర తపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం
నిత్యానిత్య వివేకదాం స్మితముఖీం ఖండేందు భూషోజ్జ్వలాం
తాంబూలారుణ భాసమాన వదనాం మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయా
తత్వార్థాత్మికవర్ణపంకిసహితా తత్వార్థబుద్ధిప్రదాం
ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీం
జప్తుః పాపహరాం జపాకుసుమనిభాం హంసేన సంశోభితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

కాంచీచేల విభూషితాం శివమయీం మాలార్ధమాలాదికాన్
బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదాం
భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం
సాయంకాల సుసేవితాం స్వరమాయీం దూర్వాదళశ్యామలాం
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం
తారాహీరసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరాం
రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదాశోభితాం
తత్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధద్భ్రమద్భ్రామరీం
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలధ్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదాం
వీణావేణుమృదంగకాహలరవాన్ దేవైః కృతాంఛృణ్వతీం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం


ఫలశ్రుతిః
 

హత్యాపానసువర్ణతస్కరగుర్వంగనాసంగమాన్
దోషాన్ఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛింధ్య సూర్యోపమాః
గాయత్రీ శృతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా
జప్త్వా యాంతి పరాం గతిం మునిమిమం దేవ్యాః పరం వైదికాః

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య
శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం గాయత్ర్యష్టకం సంపూర్ణం


తాత్పర్యం: 

విశ్వామిత్రుని తపఃఫలముగా వచ్చి, బ్రాహ్మణులు, ఋషులచే పూజింబడి, అనంతమైన, నిత్యమైన వివేకాన్ని ఇచ్చే, నెలవంకను ఆభరణముగా కలిగి శోభిల్లుతున్న, ఎర్రని వదనముతో భాసిల్లుతున్న, సూర్యుని మధ్యలో నివసిస్తున్న, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

మల్లెలు, కలువలు, మొగలి పూలమాలలతో శోభిల్లు పాదములు కలిగిన, తత్వార్థజ్ఞానాన్ని సంకేతించే బీజాక్షరాలు కలిగినది, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే, ప్రాణాయామములో నిష్ణాతులైన పండితులచే పూజించబడే, ఎల్లప్పుడు శుభాన్ని కలిగించే, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

కాలియందెల మృదువైన ధ్వనితో సమస్త జగత్తులో మృదుత్వాన్ని పెంచే, బ్రాహ్మణుల అర్పించిన అర్ఘ్యాలు,తర్పణాలతో రాక్షసులను అణచే, జపం చేసే వారి పాపాలను తొలగించే, ఎర్రని శరీర ఛాయ కలిగి, హంసవాహినియై, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

పట్టువస్త్రములు ధరించి,  పూల మాలలతో అలంకరించబడినదై, అనంతమైన శుభాన్ని కలిగించే, శరణును ప్రసాదించే, బుద్ధినుంచి మోహాన్ని విడగొట్టే, భూర్భువస్సువయై (దీని వివరణకు కింద గాయత్రీ మంత్రసారం చదవండి),  మూడులోకాలకు మాతయై, ఆధ్యాత్మికశాఖలచే నుతింపబడే, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

తనను ధ్యానము చేసేవారి తాపాగ్ని నాశనము చేసే, ఎల్లప్పుడు సంయమనము కలిగి, శాంతమూర్తియై, సుస్వరయై, దూరముగా ఉన్న దర్భ (గడ్డిపోచ) వలె నల్లని ఛాయకలదై, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

సాయంకాల సమయంలో కాషాయవస్త్రధారిణియై బ్రాహ్మణులచే పూజింబడి, నక్షత్రాలవలె మెరుస్తున్న వజ్రహారములు ధరించిన, స్తనముల మధ్య చంద్రునివలె ప్రకాశించుచున్న రత్నాభరణములు కలిగిన, పూర్ణచంద్రునివలె ప్రకాశిస్తున్న ముఖము కలదై, రామునిచే పూజింపబడి, శంఖము మొదలగు హస్తాలంకారములతో, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

చుట్టూ భ్రమరములు తిరుగుతు ఉన్న పూలమాలలు కేశములలో అలంకరించబడినదై, భ్రమరము వలె ధ్వని చేయుచు, నాలుకయందు తత్వజ్ఞానమనే రసము కలిగి, నాసికాభరణమునుండి వెలువడే ప్రకాశముతో చీకటిని ఛేదించే, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

పదకమలములయందు ఉన్న కుంకుమ, పుప్పొడి రేణువులనుండి వెలువడే కిరణాలతో ప్రకాశిస్తున్న, రంభ నృత్యాన్ని తిలకిస్తూ ఆనందించే, వేదాంతజ్ఞానాన్ని ప్రసాదిస్తూ, వీణ, వేణువు, మృదంగాది వాద్యముల నాదమును వింటూ, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

ఫలశ్రుతి:
హత్య, మధిరాపానము, బంగారం దొంగిలించటం, గురుపత్నిని మోహించటం వంటి మహాపాపాలను నాశనం చేసే,  ఇంద్రుడు, సూర్యులకు సమమైన మంత్రమును సాయంకాల సమయమున బ్రాహ్మణులు జపించుటవలన వారి ఆత్మలకు అత్యుత్తమైన వైదిక గతి కలుగుతుంది.

గాయత్రీ మంత్రం:

ఓం భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ |

తాత్పర్యం: ప్రణవ మంత్రంగా, భూః భువః సువః అనే మూడు వ్యాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.


గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు:

1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.
2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.

మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి