31, మే 2026, ఆదివారం

షోడశి – వాల్మీకి రామాయణానికి గుంటూరు శేషేంద్రశర్మ చేసిన ఆధ్యాత్మిక దర్శనం



గుంటూరు శేషేంద్రశర్మ గారి మిగిలిన రచనలు నేను చదవలేదు, షోడశి కొన్నేళ్ల క్రితం చదివాను. అద్భుతమైన తపస్సు ఈ రామాయణ రహస్యాలు తెలిపే ఆధ్యాత్మిక పుస్తకం. ఆ పుస్తకం మీద నా వ్యాఖ్య:

తెలుగు సాహిత్యంలో విమర్శనాత్మక గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. రామాయణంపై వ్యాఖ్యానాలు కూడా అనేకం వచ్చాయి. కానీ గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన షోడశి వాటన్నిటికీ భిన్నమైన గ్రంథం. ఇది ఒక వ్యాఖ్యానం కాదు; ఒక దర్శనం. ఇది సాహిత్య విమర్శ కాదు; ఒక అంతర్ముఖ యోగసాధకుని అన్వేషణ. వాల్మీకి రామాయణాన్ని కథగా చదివినవారు అనేకమంది; కానీ దాని వెనుక దాగి ఉన్న మంత్రశాస్త్రాన్ని, శ్రీవిద్యను, కుండలినీ యోగాన్ని, వేదసూక్ష్మార్థాలను దర్శించినవారు చాలా అరుదు. ఆ అరుదైన దర్శనశక్తి శేషేంద్రది. అందుకే ఆయన రామాయణాన్ని కథగా కాదు, మంత్ర నిర్మాణంగా చూశారు. ఆయన అభిప్రాయం ప్రకారం వాల్మీకి కేవలం కవి కాదు; మంత్రద్రష్ట. రామాయణం కేవలం వినోదం కోసం చెప్పబడిన ఇతిహాసం కాదు; మానవ చైతన్యాన్ని మేల్కొలిపే ఒక ఆధ్యాత్మిక నిర్మాణం.

షోడశి అనే పేరులోనే శేషేంద్ర ఉద్దేశం దాగి ఉంది. షోడశి అనేది శ్రీవిద్యలో పరమరహస్యమైన త్రిపురసుందరి తత్వానికి సంబంధించిన పదం. శేషేంద్ర దృష్టిలో రామాయణం మొత్తం శ్రీవిద్య యొక్క గూఢ నిర్మాణాన్ని తనలో దాచుకుంది. అందుకే ఈ గ్రంథం ఒక సాహిత్య పాఠకుడి కన్నా, ఒక సాధకుడి మనసుకు మరింత చేరువ అవుతుంది. వేదాలు, తంత్రశాస్త్రం, మంత్రవిద్య, యోగం, ఉపనిషత్తులు — ఈ నాలుగు ఐదు ప్రవాహాలు ఒకే నదిగా కలిసిన ప్రదేశం షోడశి. రామాయణాన్ని చదివే మనిషి కథలోని సంఘటనలను మాత్రమే గమనిస్తాడు; కానీ శేషేంద్ర చూపించిన మార్గంలో చూస్తే ప్రతి సంఘటన వెనుక ఒక తత్వం, ప్రతి పాత్ర వెనుక ఒక యోగరహస్యం కనిపిస్తుంది. ఆయన స్పష్టంగా రామాయణాన్ని వేదాల ప్రతిరూపంగా పరిగణిస్తారు.

శేషేంద్ర వ్యాఖ్యానంలో అత్యంత విశిష్టమైన అంశం సీత తత్వం. సాధారణ రామాయణ పఠనంలో సీత ఆదర్శ స్త్రీ, ఆదర్శ భార్య. కానీ షోడశిలో ఆమె ఆ స్థాయిని దాటి విశ్వశక్తిగా అవతరిస్తుంది. శేషేంద్ర దృష్టిలో సీత శక్తి స్వరూపం. భూమి నుంచి జన్మించిన సీత, ప్రకృతి గర్భంలో నిద్రిస్తున్న పరాశక్తికి ప్రతీక. రావణుడు ఆమెను అపహరించడం ఒక స్త్రీని బంధించడం కాదు; అహంకారం చేత శక్తి చెరపట్టబడటం. రాముడు ఆమె కోసం వెతకడం అనేది భార్యాన్వేషణ కాదు; కోల్పోయిన దివ్యత్వాన్ని తిరిగి పొందే ఆత్మయాత్ర. ఈ భావంలో సీత త్రిపురసుందరి, లలితా పరమేశ్వరి, ఆద్యాశక్తి అన్నీ అవుతుంది. అందుకే శేషేంద్ర వ్యాఖ్యానంలో సీత రామాయణంలోని పాత్ర కాదు — రామాయణానికి ప్రాణం.

అదేవిధంగా రాముడిని కూడా ఆయన సాధారణ పురాణపాత్రగా చూడరు. శేషేంద్ర దృష్టిలో రాముడు చరిత్రలోని రాజకుమారుడు కాదు; ధర్మానికి మానవ రూపం. ఆయనలోని మహిమ దైవత్వంలో కాదు; ధర్మనిష్ఠలో ఉంది. అందుకే రామాయణం దేవుడు రాక్షసుడిని సంహరించిన కథగా కాక, ధర్మం అహంకారాన్ని జయించిన కథగా ఆయనకు కనిపిస్తుంది. రావణుడు కూడా కేవలం రాక్షసుడు కాదు; అతను మానవునిలోని అహంకారం, జ్ఞానాన్ని స్వార్థానికి బంధించే మేధస్సు. ఈ కోణంలో చూసినప్పుడు రామ-రావణ యుద్ధం చరిత్రలో జరిగిన యుద్ధం కాదు; ప్రతి మనిషి అంతరంగంలో నిత్యం జరుగుతున్న యుద్ధం.

షోడశిలో అత్యంత ప్రసిద్ధి పొందిన భాగం సుందరకాండపై శేషేంద్ర చేసిన వ్యాఖ్యానం. ఆయన దృష్టిలో సుందరకాండ హనుమంతుని వీరగాథ కాదు; అది ఒక కుండలినీ యోగ గ్రంథం. ఈ వ్యాఖ్యానం వల్లే షోడశి భారతీయ సాహిత్య విమర్శలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. శేషేంద్ర ప్రకారం హనుమంతుడు వానరుడు కాదు; మానవునిలోని ప్రాణశక్తి. సముద్రలంఘనం అనేది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణం కాదు; పరిమితులను దాటి అనంతాన్ని చేరే యోగసాధన. లంక మనస్సులోని అహంకార కోట. అక్కడ బంధింపబడిన సీత మనలోని దివ్యశక్తి. హనుమంతుడు ఆ శక్తిని దర్శించడానికి వెళ్లే సాధకుడు. అందుకే ఆయన యాత్ర మొత్తం కుండలినీ ఆరోహణకు ప్రతీకగా శేషేంద్ర విశ్లేషిస్తారు.

ఈ విశ్లేషణలో అత్యంత సంచలనాత్మకమైన అంశం త్రిజటా స్వప్నం. శేషేంద్ర చేసిన ప్రసిద్ధ వ్యాఖ్యానం ప్రకారం త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్రమే. సుందరకాండలోని ఆ స్వప్నవివరణలో గాయత్రీ మంత్ర నిర్మాణాన్ని, దాని నాలుగు పాదాలను, ముప్పై రెండు అక్షరాల తాత్త్విక క్రమాన్ని ఆయన గుర్తిస్తారు. ఈ వ్యాఖ్యానం సాధారణ సాహిత్య విమర్శకు అందని స్థాయిలో ఉంటుంది. ఇక్కడ శేషేంద్ర కవి కాదు; తంత్రశాస్త్రజ్ఞుడు. సాహిత్య విమర్శకుడు కాదు; మంత్రవేత్త. అందుకే షోడశి చదువుతున్నప్పుడు మనం ఒక గ్రంథాన్ని చదువుతున్న భావం కంటే ఒక యోగసాధకుని ధ్యానాన్ని వినిపిస్తున్న అనుభూతి కలుగుతుంది. 

ఇంకా ఒక ఆశ్చర్యకరమైన కోణం — శేషేంద్ర వాల్మీకి భాషను పరిశీలించే విధానం. ఆయన అభిప్రాయం ప్రకారం రామాయణంలోని శబ్దాలు కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే కాదు; వాటికి మంత్రశక్తి కూడా ఉంది. అందుకే ఆయన వాల్మీకి పదం వెనుక మరో వాల్మీకి దాగి ఉన్నాడు అనే భావాన్ని ప్రతిపాదిస్తారు. ఒక శ్లోకాన్ని కేవలం అర్థంతో చదివితే కథ కనిపిస్తుంది; ధ్యానంతో చదివితే మంత్రం వినిపిస్తుంది. శ్లోకాల నిర్మాణం, కాండల క్రమం, పాత్రల ప్రవేశం, దృశ్యాల అమరిక — ఇవన్నీ ఒక యాదృచ్ఛిక కవితా నిర్మాణం కాదు; ఒక గూఢమైన యోగ నిర్మాణమని ఆయన భావిస్తారు. ఈ కారణంగా షోడశి ఒక విమర్శా గ్రంథం కంటే ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక అన్వేషణగా నిలుస్తుంది.

షోడశిలో శేషేంద్ర వాల్మీకి కవిత్వాన్ని వేదకాలపు ఆలోచనలకు దగ్గరగా ఉంచి విశ్లేషిస్తారు. రామాయణంలో ఇంద్రుని ప్రాముఖ్యత, వేదప్రతీకల ఉనికి, కవితా నిర్మాణం వంటి అంశాలను ఆధారంగా తీసుకుని రామాయణాన్ని మరింత ప్రాచీన దృష్టితో చూడాలని సూచిస్తారు.వాటి వెనుక ఉన్న పాండిత్యం, శాస్త్రపరిజ్ఞానం, పరిశోధనా దృష్టి ఆశ్చర్యపరుస్తాయి.

శేషేంద్ర భాష్యం ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఎక్కడా భక్తి పేరుతో ఆలోచనను ఆపరు; అలాగే తర్కం పేరుతో ఆధ్యాత్మికతను తిరస్కరించరు. వేదం, తంత్రం, కవిత్వం, యోగం — ఇవన్నీ ఒకే సత్యాన్ని వేర్వేరు భాషల్లో చెబుతున్నాయని ఆయన నమ్మకం. అందుకే షోడశిలో ప్రతి అధ్యాయం ఒక కొత్త తలుపు తెరుస్తుంది. ఎక్కడో వేదం కనిపిస్తుంది. ఎక్కడో శ్రీవిద్య కనిపిస్తుంది. ఎక్కడో యోగశాస్త్రం వినిపిస్తుంది. చివరకు అవన్నీ వాల్మీకి కవిత్వంలో కలిసిపోతాయి.

చివరికి షోడశి గురించి చెప్పాలంటే — ఇది రామాయణాన్ని అర్థం చేసుకునే గ్రంథం కాదు; రామాయణాన్ని మళ్లీ దర్శించడానికి నేర్పించే గ్రంథం. ఇది కథను విశ్లేషించదు; కథ వెనుక దాగిన చైతన్యాన్ని వెలికితీస్తుంది. ఇది పాత్రలను వివరించదు; వాటి వెనుక ఉన్న తత్వాలను మేల్కొలుపుతుంది. అందుకే శేషేంద్ర ఒక చోట రామాయణాన్ని మహాకావ్యం కాదు; మహామంత్రంగా దర్శిస్తారు. ఆ ఒక్క వాక్యమే షోడశి సారాంశం. ఈ గ్రంథం చదివాక రాముడు ఒక పాత్రగా కనిపించడు — ఒక ధర్మచైతన్యంగా అనిపిస్తాడు. సీత ఒక స్త్రీగా కనిపించదు — ఒక పరాశక్తిగా అనుభూతి అవుతుంది. హనుమంతుడు ఒక వీరుడిగా కనిపించడు — ఒక సాధనాశక్తిగా నిలుస్తాడు. రావణుడు ఒక రాక్షసుడిగా కనిపించడు — మనలోని అహంకారంగా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు రామా యణం గతంలో జరిగిన కథ కాదు; మనలో జరుగుతున్న యాత్రగా మారుతుంది. అదే షోడశి మహిమ. అదే శేషేంద్రశర్మ గారి దార్శనిక గాంభీర్యం.   

29, మే 2026, శుక్రవారం

కొలువై యున్నాడే కోదండపాణి - సద్గురువులు త్యాగరాజస్వామి


 

కొలువై యున్నాడే కోదండపాణి

సలలితమతులై సారెకు శీలులై
వలచుచు కోరివచ్చి సేవింపఁగ

జనకజభరతాదులతో మంచి నైవేద్యంబుల
చనువున వేడుక నారగించి మెఱపుకోట్ల గేరు
కనకపటము సొమ్ములను ధరించి వేదోక్తమైన
సనకవచనములచే తోషించి శ్రితుల పోషించి

వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుఁగుచు
సురవారసతులు బాగ నటింప అదిగాక పరా-
శరనారదమునులెల్ల నుతింప ఎంతెంతో నెనరున
సురపతి వాగీశులు సేవింప మేను పులకింప

ఉడు రాజముఖుఁడు శేషశయ్యపైని చెలంగగ గని
పుడమి కుమారి సుగంధము పూయ నమ్మినవారలకే
కడగంటిని కోరిన వరమీయ త్యాగరాజు నెనరున
అడుగడుగుకు మడువులనందీయ శ్రీరామయ్య 

శ్రీరామచంద్రుడు కరతలంలో కోదండధనుస్సును ధరించి, తన దివ్య రాజసభలో మహోన్నత వైభవంతో విరాజిల్లుచున్నాడు. సౌమ్యస్వభావులైన, సద్గుణసంపన్నులైన భక్తులు ప్రేమభక్తి పరవశులై ఆయనకు సేవలందించుచున్నారు.

ప్రియభార్య సీతాదేవి, ప్రియభ్రాత భరతుడు సమర్పించిన సుస్వాదుభోజ్య నైవేద్యములను ఆయన సంతోషపూర్వకముగా స్వీకరించుచున్నాడు. కోటి విద్యుత్పుంజముల కాంతిని తలపించు తేజస్సుతో ప్రకాశించుచున్నాడు. స్వర్ణమయ దివ్యాంబరములను ధరించి శోభాయమానుడై యున్నాడు. సనకమహర్షి మధురస్వరములతో పారాయణం చేయు వేదఘోషలను ఆనందముతో ఆలకించుచున్నాడు. శరణాగతులను సదా రక్షించువాడై వెలుగొందుచున్నాడు.

సుగంధ పరిమళములతో నిండిన దివ్యవాతావరణమునందు ఆయన ప్రకాశించుచుండగా, అప్సరసలు మనోహరరీతిగా నృత్యములు చేయుచున్నారు. పరాశరుడు, నారదుడు తదితర మహర్షులు ఆయన మహిమను కీర్తించుచున్నారు. ఇంద్రుడు, బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు కృతజ్ఞతా ప్రీతులతో శ్రీరామసేవలో నిమగ్నులై యున్నారు.

చంద్రబింబసదృశ సుందరాననుడైన శ్రీరాముడు ఆదిశేషుని దివ్య శయ్యపై విశ్రాంతి పొందుచున్నాడు. భూదేవి తనయయైన సీతాదేవి సుగంధ చందనమును ఆయన దివ్యాంగములపై లేపనముగా అర్పించుచున్నది. కేవలము తన కటాక్షవీక్షణమాత్రముచేతనే భక్తులకు వరప్రసాదములను అనుగ్రహించుచున్నాడు.భక్తశిఖామణియైన శ్రీత్యాగరాజస్వామి పరమభక్తిపూర్వకముగా తాంబూలసేవను సమర్పించుచు, శ్రీరామచంద్రుని అనుగ్రహమును యాచించుచున్నాడు.

- సద్గురువులు త్యాగరాజస్వామి 

దేవగాంధారి రాగంలో స్వరపరచిన ఈ కృతిని హైదరాబాద్ సోదరులు ఆలపించారు


8, ఫిబ్రవరి 2026, ఆదివారం

త్యాగరాజ హృదయం


 

త్యాగయ్య మామూలు మానవునిలా దుర్భర మరణం పొందలేదు, 10 రోజుల ముందే భద్రాద్రి రాముని గాంచి, గిరిపై నెలకొన్న అనే కృతి ద్వారా ఆ సాక్షాత్కారానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి, ఆ స్వామి సూచనను గ్రహించి తన మరణ ఏర్పాట్లను చేసుకున్నాడు, శిష్యులందరూ చూస్తుండగా స్వేచ్ఛగా ఆత్మ దేహాన్ని వీడేంత ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకున్నాడు. అందుకే 250 ఏళ్లు గడిచినా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మరో 1000 ఏళ్లు గడిచినా ముందు తరాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. త్యాగరాజ హృదయాన్ని ఆయన శిష్యులు ఎందరో అక్షర రూపంలో ఆవిష్కరించారు. త్యాగయ్య ఆఖరి రోజుల స్థితికి కేశవ్ గారి చిత్రం చూడండి. 

పులకాంకితుడై యానందాశ్రువుల నింపుచు మాటలాడవలెనని
కలువరించ గని పది పూటల పై గాచెదనను త్యాగరాజ వినుతుని

గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి భద్రగిరిపై నెలకొన్న!

ఎక్కడో తంజావూరు దగ్గర ఉన్న త్యాగరాజస్వామికి భక్త రామదాసు, ఆయన కొలిచిన భద్రాద్రి రాముని గురి ఎలా తెలిసి, కృతిలో వర్ణించగలిగారు? అదే కదా, భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పతనం. ఏ ప్రచార సాధనం లేని రోజుల్లో దివ్యదృష్టి ద్వారా, నోటి మాట ద్వారా పుంఖానుపుంఖాల విషయాలు, గ్రంథాలు దేశమంతా సద్గురువుల ద్వారా, సత్పురుషుల ద్వారా చాటబడేవి. 

గమనిక: భద్రాద్రి రాముడు రామదాసునే కాదు, ఆ తరువాత కాలంలో వచ్చిన త్యాగయ్యను కూడా బ్రోచాడన్నదానికి ఈ కృతి నిదర్శనం.  

కులదైవం - ఇష్టదైవం


కులదైవం
========

ఇది నేను చెప్పే విషయం కాదు, కొన్నాళ్ల క్రితం గురువు గారి చెప్పినది, యథాతథంగా రాసే ప్రయత్నం చేశాను. శ్రీగురుభ్యోనమః.

సనాతనధర్మ సాంప్రదాయాలను అనుసరించే ప్రతి వ్యక్తికి కూడా కులదైవం ఉంటుంది. అది ఎవరు అనేది మన తల్లిదండ్రులకు, పూర్వీకులకు, మన స్వగ్రామంలో ఉండేవారికి తెలుస్తుంది. ఒకవేళ వారికి తెలియకపోతే ఏమిటి అన్న కోణం వైపు చివర్లో దృష్టి పెడదాము. 

అసలు కులదైవం అంటే? మన జన్మకు, మన కుటుంబ నేపథ్యానికి సంబంధించిన దేవత. మన గతం గురించి అన్నీ ఎరిగి నిరంతరం వెన్నంటి ఉండే దేవత. పూర్వజన్మ కర్మఫలాలను బట్టే ప్రస్తుత జన్మ కుటుంబ నేపథ్యం. దాన్ని శాసించేది కులదేవత. బాగా ఉపాసన చేసి బాహ్యాభ్యంతర శుచి కలిగిన వారికి కులదేవత అనుగ్రహం, దర్శనం కలిగి తీరుతుంది. జ్ఞానులకు, అవధూతలకు, సద్గురువులకు ఈ కులదేవత కనబడుతుంది. అంతే కాదు, ఆ దేవత ఆ కుటుంబం లేదా వ్యక్తులపై ఎటువంటి వీక్షణంతో ఉంది అన్నది కూడా వారు చెప్పగలరు. కులదేవతలకు లెఖ్ఖలు ఉంటాయి. అందుకే కొన్నిసార్లు వారిని ఉపాసన చేయని మనుషులను తెలియని సమస్యలు పట్టిపీడిస్తుంటాయి. 

అందుకే, ధార్మికులకు సంధ్యావందనం లాంటి నిత్యకర్మలతో పాటు కులదేవతా ఉపాసన కూడా చాలా ముఖ్యం. తెలియని పీడలు, బాధలు అంతగా ప్రభావం చూపకుండా ఉంచేది కులదేవతే. పితృదేవతలు ఎలాగైతే వంశాభివృద్ధినిస్తారో అలాగే కులదేవతలు ఈతిబాధల నుండి, ఋణబాధల నుండి ఉపశమనం కలిగిస్తారు. 

గమనిక - అందరికీ తిరుమల శ్రీనివాసుడు కులదైవం కాదు. కొందరికి నారసింహుడు, కొందరికి శివుడు, కొందరికి లలిత, కొందరికి సుబ్రహ్మణ్యస్వామి, కొందరికి గణపతి, కొందరికి వీరభద్రుడు, మరికొందరికి సూర్యనారాయణుడు, కొందరికి భద్రకాళి, ఇంకొందరికి చండి, ఇంకొందరికి ఆంజనేయుడు. ఖచ్చితంగా ఆ రూపాన్ని తెలుసుకొని కొలువవలసిందే. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకపోవటం, ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవ్వటం, తెలియని అనారోగ్యాలు, కీచులాటలు..ఇటువంటివి కులదేవతను ఉపాసన చేయని ఫలితాలే. కులదైవం సాధారణంగా మన పూర్వీకులు నివసించిన ప్రాంతానికి సమీపంలో వెలసి ఉంటుంది. ఫలానా వేణుగోపాలస్వామి మా కులదైవం అని ఎవరైనా చెప్పారనుకోండి - దాని అర్థం వారి పూర్వీకులలో ఎవరో ఆ దేవతానుగ్రహాన్ని పొంది తరించి ఆ మార్గాన్ని తరువాతి తరాలకు చెప్పటం వల్లనే.   

చాలామటుకు కులదైవం వంశపారంపర్యంగా ఆస్తికులైతే తెలిసే అవకాశం ఉంది. ధర్మభ్రష్టులై కుటుంబంలో ఏ దేవుళ్ళను ఉపాసన చేశారు అన్న విషయాన్ని ఎక్కడో త్యజించిన వారి తరువాత తరాలవారికి కులదేవత ఎవరో తెలియకపోవచ్చు. అలాంటి వారికి పైన చెప్పినట్లు గురువులు, అవధూతలు, జ్ఞానులు, సిద్ధులు కులదైవాన్ని గుర్తించి చెప్పగలరు. ఒకవేళ ఆ అవకాశం లేఅకపోతే నిత్యం ఇంట్లో దీపం పెట్టి నన్ను అనుగ్రహించి నీ రూపాన్ని తెలుపు అని ప్రార్థిస్తే ఖచ్చితంగా కులదేవత సంకేతాలు పంపి మనకు దారి చూపుతుంది. 

ఇష్టదైవం:
=======

ఇష్టదైవం అనేది ఊరికే నిర్ణయించబడదు. పూర్తిగా మన పూర్వజన్మల వాసనలను బట్టే మనకు కొన్ని దైవాల మీద మక్కువ, నమ్మకం ఏర్పడుతుంది. ఉదాహరణకు నేను గత జన్మలో అమ్మవారిని పూజించినా లేక అటువంటి కర్మలలో పాల్గొన్నా లేక అనుభూతులు చెందినా, ఆ వాసనలు ఈ జన్మలో కూడా కొనసాగుతాయి. తెలియకుండానే ఆ దైవానికి ఆకర్షించబడతాము. అందుకే ఇది పూర్తిగా ఆత్మప్రబోధమైనదే. 

ఇష్టం దైవం ఉపాసన ఊరికే పోదు. అలాగే, కులదైవాన్ని విస్మరిస్తే అనుకున్న ఫలితాలు పూర్తిగా రావు. కులదైవం తెలియకపోతే ఒక్కొక్కసారి ఈ జన్మ కాలం పాటు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటే మనకు ఎప్పుడో ఒకప్పుడు కులదైవం ఇష్టదైవం ద్వారా గోచరమవుతుంది. కులదైవం గురించి వ్రాసిన పోస్టులో దీపారాధన చేసి ఆ దీపజ్యోతిని కులదైవం అవగతమయ్యేలా చేయమని ప్రార్థించాలని చెప్పాను. మనకున్న సగుణోపాసనలో దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది ఇటువంటి కారణాల వల్లే. 

సారాంశం: మనిషిగా జన్మించాక ఆస్తికత చాలా ముఖ్యం. ఇలా కుల ఇష్టదైవాలను ఇతోధికంగా పూజిస్తే కామ్యములు తీరతాయి, కర్మలను సక్రమంగా నిర్వర్తించగలము, ఉన్నతమైన జన్మలను పొందగలము.  

7, ఫిబ్రవరి 2026, శనివారం

శృంగేరి శారదా పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి చరిత్ర



సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాఙ్ముఖం
నౌమి శాస్త్రేషు నిష్ణాతం చన్ద్రశేఖరభారతీం


ఇంద్రియ విషయములకు అతీతులై నిరంతరం ధ్యానమగ్నులై వేదవిద్యా నిష్ణాతులై జీవించిన చంద్రశేఖర భారతీస్వామి వారికి నమస్సులు.

ఈ కర్మభూమిపై గత శతాబ్దకాలంలో జీవన్ముక్తులైన మహాత్ములు కొద్దిమందిలో శృంగేరి శారదాపీఠం 34వ అధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ తీర్థ స్వామి వారు ఒకరు. మహాలయ ఆమావాస్య, వారి పుణ్యతిథి. మన పుణ్యభూమిపై నడయాడిన ఆ మహనీయుని వివరాలు సంక్షిప్తంగా:

శృంగేరి పుణ్యక్షేత్రంలో ఈశ్వరి గోపాలశాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులు ఉండేవారు. వారికి 11 మంది బిడ్డలు జన్మించినా ఒక్కరూ బతకలేదు. అప్పటి శృంగేరి శారదా పీఠాధిపతులైన సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారిని ఆశ్రయించగా స్వామి వారు వారిని అనుగ్రహించి సత్సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. ఆ సంతానం వల్ల తల్లిదండ్రులతో పాటు శృంగేరి సంస్థానానికి, భరతభూమికి మేలు కలుగుతుందని, కాబట్టి అతనిని శారదాంబ సేవకు అంకితం చేయమని సూచించారు. గోకర్ణం తీర్థయాత్ర వెళుతున్న దంపతులకు మహాబలేశ్వరుడు స్వప్న సాక్షాత్కారమిచ్చి పురుష సంతానం కలుగుతుందని చెబుతాడు. 1892వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన, నందన నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు వారికి మగబిడ్డ జన్మించాడు. స్వామి వారి అనుగ్రహంతో ఆ తల్లిదండ్రులు బాలునికి నరసింహశాస్త్రి అని నామకరణం చేశారు.

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు దైవానుగ్రహంతో జన్మించిన నరసింహశాస్త్రి చిన్ననాటి నుండే ప్రాపంచిక విషయాల పట్ల నిరాసక్తితో, పూర్తిగా అంతర్ముఖుడై జ్ఞాన సముపార్జనలోనే ఉండేవాడు. శృంగేరి శారదాపీఠం కార్యనిర్వాహకులైన శ్రీకంఠ శాస్త్రి గారి వద్ద నివసిస్తూ విద్యాభ్యాసం చేశాడు. చిన్ననాటి నుండి నరసింహకు మూకపంచశతి అంటే మహా ప్రీతి. దానిని పఠిస్తూ తన్మయత్వంలో ఉండేవాడు. అలా ఒకసారి దానిని పఠిస్తూ బాహ్యప్రపంచాన్ని మరచి శృంగేరి పరిసరాలను దాటి కూడా వెళ్లాడు. నరసింహశాస్త్రికి బాలమేధావి, అమితమైన జిజ్ఞాస మరియు జ్ఞాపకశక్తి కలవాడు. ఆంగ్లభాషను పాఠశాలలో, సంస్కృతాన్ని ఇంట్లో తండ్రి వద్ద అభ్యసించాడు. నరసింహునికి ఎనిమిదవ ఏట బ్రహ్మోపదేశం హరిగింది. త్రికాల సంధ్య, ద్వికాల అగ్నికార్యం చేసే క్రమశిక్షణకు ఆ వయసులోనే నరసింహుడు అలవాటు పడ్డాడు. 11వ ఏట పీఠాధిపతుల సూచనతో నరసింహుడు శృంగేరిలోని సద్విద్యా సంజీవని సంస్కృత పాఠశాలలో చేరారు. ఆ స్వామి వారే బెంగళూరులో స్థాపించిన భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యా అభివర్ధని పాఠశాలలో మీమాంస మరియు వేదాంతములలో ఉన్నత విద్యనభ్యసించారు. ఆ గురువుల మనోసంకల్ప ఫలంగా నరసింహుడు అద్భుత విద్యా ప్రావీణ్యంతో చంద్రశేఖర భారతీస్వామిగా 1912లో ఉత్తరాధికారిగా నియమించబడ్డారు. ఆ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో శివాభినవ నృసింహభారతీ స్వామి వారు విదేహముక్తి పొందగా చంద్రశేఖర భారతీస్వామి వారు శృంగేరి శారదా పీఠం 34వ అధిపతిగా పీఠాన్ని అధిరోహించారు.

వీరి హయాంలోనే శృంగేరి శారదా పీఠ నవీకరణ, శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి స్మృతిగా నృసింహవనం రూపొందాయి. 1916వ సంవత్సరంలో మైసూరు మహారాజా వారి సమక్షంలో శారదా క్షేత్రానికి కుంభాభిషేకం జరిగింది. 1924 వారు మైసూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో విజయ యాత్ర చేశారు. 1927లో ఆదిశంకరుల జన్మస్థలమైన కాలడిలో వేదాంత పాఠశాలను స్థాపించారు. మైసూరు ట్రావంకోర్ సంస్థానాలలో పర్యటించిన తరువాత శృంగేరి తిరిగి వచ్చారు. దీని తరువాత స్వామి వారు పూర్తిగా తపోమగ్నులై, అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి శిష్యులకు భాష్యములు బోధించేవారు. 1931లో పీఠం యొక్క నిర్వహణకై తన శిష్యుడైన శ్రీనివాసశాస్త్రికి సన్యాసమిచ్చి అభినవ విద్యా తీర్థ స్వామిగా నామకరణం చేసి ఉత్తరాధికారిగా ప్రకటించారు. దాదాపుగా అప్పటి నుండి పీఠం బాధ్యతలను అభినవ విద్యాతీర్థులే నిర్వహించారు. దీనికి మైసూరు రాజాస్థానం కూడా ఎంతో తోడ్పడింది. 1938 ప్రాంతంలో చంద్రశేఖర భారతీ స్వాముల వారు బెంగళూరు, మైసూరు, కాలడిలలో పర్యటించారు. తరువాత పూర్తిగా అవధూత స్థితిని పొంది ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉన్నారు. కేవలం శిష్యులకు వేదాంత బోధలో మాత్రమే మాట్లాడే వారు. 1945 నుండి స్వామి వారు పూర్తి అవధూత జీవితాన్ని గడిపారు. సత్యాన్వేషులకు, పాలకులకు మాత్రమే దర్శనమిచ్చే వారు, మిగిలిన సమయమంత తపోదీక్షలోనే. 1954లో భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు శృంగేరి పర్యటించి స్వామి వారితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించి వారి ఆశీర్వాదం పొందారు.

అవధూతగా స్వామి వారు తమ తపోశక్తితో అద్భుతమైన దేహకాతిని పొంది శారదాంబ ప్రత్యక్ష రూపంగా భక్తులకు గోచరించేవారు. 1954 సంవత్సరంలో స్వామి వారు దేహత్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. మహాలయ అమావాస్య, అనగా, 1954 సంవత్సరం సెప్టెంబర్ 26న తుంగా నదిలోకి వెళ్లి పద్మాసన స్థితిలో, దేహానికి ఎటువంటి కష్టమూ లేకుండా, ఆత్మకు ఎటువంటి క్షోభ లేని సచ్చిదానంద స్థితిలో దేహత్యాగం చేశారు. దీనికి ఆనాటి శిష్యులే ప్రత్యక్ష సాక్షులు. డాక్టర్లు దేహపరీక్ష చేసి పరిపూర్ణమైన ఆరోగ్యస్థితిలోనే స్వామి వారు సంకల్ప మాత్రంచే దేహత్యాగం చేశారు అని ఆశ్చర్యపోయారు. అభివన విద్యాతీర్థుల వారు వీరి గురువుల సమాధి పక్కనే శివలింగంతో స్మారకం నిర్మించారు.

చంద్రశేఖర భారతీస్వామి వారు గురురాజ సూక్తి మాలిక మరియు వివేకచూడామణి భాష్యం రచించారు. వీరు కంచి పరమాచార్యుల వారికి సమకాలీకులు. భరతజాతి అదృష్టం ఇద్దరు చంద్రశేఖరేంద్రులు ఒకే సమయంలో రెండు మహోన్నతమైన పీఠాలను అధిరోహించి సనాతన ధర్మ పరిరక్షణకు విశేషంగా తోడ్పడ్డారు. 42 ఏళ్ల పీఠాధిపత్యంలో తమ తపోశక్తిని పూర్తిగా ఆ క్షేత్ర పవిత్రతను కాపాడటానికి, ధర్మ రక్షణకు ధారపోశారు చంద్రశేఖర భారతీస్వామి వారు.

ఆ అవధూతకు పాదాభివందనములు.

శ్రీ టీకే గోవిందరావు జీవిత విశేషాలు



కర్ణాటక సంగీత ప్రపంచంలో భావప్రధాన గానానికి ప్రతీకగా నిలిచిన మహావిద్వాంసుడు శ్రీ త్రిపుణితుర కృష్ణారావు గోవిందరావు గారు. గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత శాస్త్రవేత్తగా, గురువుగా, రచయితగా ఆయన చేసిన సేవలు అపారం. ఆయన జీవితం మొత్తం కర్ణాటక సంగీతానికి అంకితం అయింది అని చెప్పవచ్చు.

జననం – కుటుంబ నేపథ్యం:

టీకే గోవిందరావు గారు 1929 ఏప్రిల్ 21న కేరళ రాష్ట్రంలోని త్రిపుణితురలో తంకమ్మాళ్, కృష్ణారావు దంపతులకు జన్మించారు. సంగీతం, సంస్కృతి పరంగా సంపన్నమైన కుటుంబంలో ఆయన పెరిగారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి చూపిన ఆయనకు కుటుంబమే తొలి ప్రేరణగా నిలిచింది.

తొలి అభ్యాసం - గురు పరంపర:

ప్రారంభంలో చెంబై వైద్యనాథ భాగవతర్ గారి ప్రభావం ఉన్నా, ఆయన జీవితాన్ని పూర్తిగా మలిచిన గురువు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్. 15 ఏళ్ల పాటు ఆయన వద్ద గురుకుల సాంప్రదాయంలో ముసిరి వారి వద్ద విద్యనభ్యసించి భావప్రాధాన్యమైన గాత్ర ధర్మాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు. 1949లో శ్రీ టి.కె. గోవిందరావు గారు మద్రాసులోని సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్‌లో చేరారు. అక్కడ సంగీత కళానిధి తిరుప్పాంపురం స్వామినాథ పిళ్లై గారు మరియు శ్రీమతి టీ బృంద వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో సంగీత విద్వాన్ పట్టాను పొందారు. 

ముసిరి బాణి అంటే – పదాల అర్థానికి అత్యంత ప్రాధాన్యం, భావాన్ని స్పష్టంగా వ్యక్తపరచే గానం, అతి అలంకారాలు లేకుండా హృదయాన్ని తాకే శైలి.ఈ లక్షణాలన్నీ టి.కె. గోవిందరావు గారి గానంలో స్పష్టంగా కనిపిస్తాయి.

గాయకుడిగా ప్రత్యేకత:

టీకే గోవిందరావు గారి గానంలో శ్రోతలను ఆకట్టుకునే ముఖ్య లక్షణం భావం.స్వరాలు కేవలం శబ్దాలుగా కాకుండా, భావాన్ని మోసుకొచ్చే వాహకాలు అని ఆయన నమ్మకం. అందుకే ఆయన కృతులను పాడేటప్పుడు సాహిత్య ఉచ్చారణ, పదార్థ భావం, భక్తి రసం సమపాళ్లలో ఉంటాయి. అత్యంత క్లిష్టమైన రాగాలకూ ఆయన గానం సరళంగా, హృద్యంగా ఉంటుంది.

ఆకాశవాణి మరియు ఇతర సంస్థల ద్వారా సేవ:

గాయకుడిగా మాత్రమే కాకుండా, ఆకాశవాణిలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించడం ద్వారా కూడా ఆయన కర్ణాటక సంగీతానికి సేవ చేశారు. ఆకాశవాణిలో చీఫ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ, నాణ్యమైన సంగీత కార్యక్రమాలు, యువ కళాకారులకు అవకాశాలు, సంప్రదాయ సంగీత పరిరక్షణ వంటి అంశాలకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

యాభై ఏళ్లకు పైగా సాగిన ఆయన సంగీత జీవితంలో, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా, ఆకాశవాణి చెన్నైలో సంగీత నిర్మాతగా, చివరికి న్యూఢిల్లీ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో చీఫ్ ప్రొడ్యూసర్ (మ్యూజిక్)గా సేవలందించారు. అదేవిధంగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సలహా కమిటీ సభ్యుడిగా, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఐసీసీఆర్ మరియు బనారస్, ఢిల్లీ, మద్రాస్, అన్నామలై, బెంగళూరు, తెలుగు విశ్వవిద్యాలయాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.

గురువుగా, రచయితగా, పరిశోధకుడిగా:

గోవిందరావు గారు ఒక గొప్ప సంగీత పండితుడు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి వంటి మహానుభావుల కృతులపై లోతైన అధ్యయనం చేసి, సరైన సాహిత్య, భావార్థం స్వర నిర్మాణం వివరించే విధంగా అనేక పుస్తకాలు రచించారు రచించారు. ప్రత్యేకంగా త్యాగరాజ స్వామి కృతులపై ఆయన చేసిన కృషి పరిశోధకులకు ఎంతో ఉపయోగపడింది.

ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆయన తన అసలైన లక్ష్యమైన గాయకుడిగా మరియు గురువుగా సేవ చేయడాన్ని ఎప్పుడూ వదలలేదు. భారతదేశమంతటా మాత్రమే కాకుండా శ్రీలంక, సింగపూర్, మలేషియా, యుకె, అమెరికా, కెనడా, మస్కట్ వంటి దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి, వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దారు. గురువుగా ఆయన కఠినమైన నియమాలు పాటించినా, శిష్యులపై అపారమైన ప్రేమ చూపేవారు.సంగీతాన్ని వృత్తిగా కాకుండా, ఒక సాధనగా, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూడమని శిష్యులకు బోధించేవారు. ఆయన శిష్యులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇదే ఆయనకు నిజమైన గౌరవం.

కర్ణాటక సంగీతంలోని మౌఖిక సంప్రదాయాన్ని పరిరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ఆయన గానమందిర్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా సంగీత గ్రంథాల ప్రచురణ, ఆడియో–వీడియో రికార్డింగులు, సంగీత సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహించారు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులు మరియు మహారాజ స్వాతి తిరునాళ్ కృతులన్నింటినీ ప్రామాణికంగా సేకరించి, రోమన్ మరియు దేవనాగరి లిపుల్లో, అర్థాలతో మరియు స్వర నోటేషన్‌తో ప్రచురించడం ఆయన చేసిన మహత్తర సేవ. నవరాత్రి మండపంలో ఆయన చేసిన గానం ప్రసిద్ధి చెందింది. అరుదైన స్వాతి తిరునాళ్ కృతులు ఆయన గానంలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

పురస్కారాలు – గౌరవాలు:

తన జీవితాంతం చేసిన సేవలకు గాను ఆయనకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. సంగీత కళానిధి, సంగీత చుడామణి, సంగీత శాస్త్ర రత్నాకర, సంగీత ఆచార్య, గాయక శిఖామణి వంటి అనేక బిరుదులతో పాటు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. శ్రీ కాంచీ కామకోటి పీఠం నుండి ఆస్థాన విద్వాన్ గౌరవం కూడా పొందారు.

వారసత్వం:

టీకే గోవిందరావు గారు 2011 సెప్టెంబర్ 18న పరమపదించారు. కానీ ఆయన గానం, రచనలు, శిష్య పరంపర ఆయనను నిత్యజీవిగా నిలిపాయి. బొంబాయి సోదరీమణులు లలిత-సరోజ, టీకే రామచంద్రన్, కల్పకం రామన్ వంటి ఎందరో శిష్యులు ఆయన పరంపరను కొనసాగిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో భావానికి ఉన్న విలువను కొత్త తరాలకు గుర్తుచేసిన మహానుభావుడు ఆయన.

ముగింపు:

టీకే గోవిందరావు గారు కేవలం ఒక గాయకుడు కాదు. ఆయన ఒక ఆదర్శ గురువు, లోతైన భావజాలం కలిగిన పండితుడు, ఒక అద్భుతమైన సాంప్రదాయానికి పరిరక్షకులు. కర్ణాటక సంగీతం శ్రోతల హృదయాల్లో జీవించాలి అన్నదే ఆయన జీవిత లక్ష్యం. అటువంటి మహానుభావుని సేవలు ఎప్పటికీ మరువలేనివి. 

జయతు జయతు జయజయోస్తు జననీ వాణీ - భక్తి గీతం


 

చిన్నప్పుడు ఆకాశవాణిలో చిత్తరంజన్ గారు నేర్పించిన సరస్వతీదేవి భక్తి గీతం:

జయతు! జయతు! జయజయోస్తు! జననీ వాణీ!
వీణాపుస్తకపాణీ! సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

సురమునిగణ సంసేవిత సుమధుర హాసోజ్వలనయనా!
సితపద్మాసనశోభిత నతజనసేవితచరణా!భవభయహరణా!
సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

అనుదినమును నీ నామము మరువక స్మరియింతుమమ్మ! నీవే శరణంటిమమ్మ!నిఖిలలోకజనయిత్రీ! కరుణించుము తల్లీ!
పాహి హే జననీ! పాహి పరమపావనీ!
సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

అర్థం:

అమ్మా సరస్వతీ దేవీ! నీకు జయము జయము. వీణను, పుస్తకాన్ని చేతుల్లో ధరించిన నీవు మూడు లోకములలోని జనులచే పూజించబడేవు. పద్మము నుండి జన్మించిన బ్రహ్మదేవుని పత్నివి నీవు. అందమైన కురులు కలిగిన దానవు. నీకు జయము జయము. 

దేవతలు, ఋషులు నిరంతరం సేవించే దేవివి నీవు. మధురమైన చిరునవ్వుతో,మెరిసే కనులకాంతితో, తెల్లని పద్మాసనంపై విరాజిల్లుతున్నావు. భక్తజనులచే సేవించబడిన చరణములు కలిగియున్నావు. మాకు జననమరణ భయాలను తొలగించే తల్లివి నీవే.

ప్రతి రోజూ నీ నామాన్ని మరువకుండా స్మరిస్తూ మేమంతా నీశరణు కోరుతున్నాము అమ్మా. మూడు లోకాలకు జనని అయిన తల్లీ, మాపై కరుణ చూపించు. ఓ తల్లీ! మమ్మల్ని కాపాడు! నీవు అత్యంత పావనమైన మాతవు! మా జీవితాలకు రక్షణగా నిలువు తల్లీ!

 https://www.youtube.com/watch?v=4sue4fiSEtg 

పాండురంగ మహత్యం – 1957: భక్తి రస కావ్యం

1957 నవంబర్ 28న విడుదలైన పాండురంగ మహత్యం తెలుగు భక్తి చిత్రాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్...