6, జులై 2020, సోమవారం

నగవులు నిజమని నమ్మేదా - అన్నమాచార్యుల వారు


నగవులు నిజమని నమ్మేదా? 
ఒగినడియాసలు వద్దనవే!

తొల్లిటి కర్మము దొంతుల నుండగ
చెల్లబోయిక జేసేదా?
ఎల్లలోకముల యేలేటి దేవుడ
వొల్లనొల్లనిక వద్దనవే

నలి నీనామము నాలిక నుండగ
తల కొని ఇతరము దడవేదా
బలు శ్రీవేంకటపతి నిన్ను గొలిచి
వొలుకు చంచలములొద్దనవే

భావం: ఈ నవ్వులు నిజమని నమ్మేదెలా? ఒకదాని వెంట ఒకటి వచ్చే దురాశలను వద్దనవే మనసా! పూర్వజన్మలలో చేసిన కర్మలు దొంతర్లుగా ఉన్నాయి, అయ్యో ఇంక కొత్తవి ఎందుకు చేయటం? సమస్తలోకాలను ఏలేటి ఓ వేంకటేశా! ఓ మనసా! కొత్తవి నా వల్ల కాదు. వాటిని తిరస్కరించు. సర్వేశ్వరుడవైన ఓ శ్రీనివాసా! నీ నామము నాలికపై ఉండగా వేరే వాని పట్ల నాకు వెంపర్లాట ఎందుకు? నా మనసు చంచలము కాకుండా స్థిరపరచుము.

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

https://www.youtube.com/watch?v=1mgPU_vwJts

ఎంత భాగ్యమో మా పాల గల్గితివి - త్యాగరాజస్వామి


ఎంత భాగ్యమో మా పాల గల్గితివి ఎవరీడు ముజ్జగములలో తన

చెంతజేరి సౌజన్యుడై పలికి చింత బాగ తొలగించి బ్రోచితివి

మున్ను మీ సమీపమున వెలయు సన్మునులనెల్ల నణిమాది లీలలచే
తిన్నగాను పాలన చేసినటు నన్ను గాచితివి త్యాగరాజనుత!

ఓ శ్రీరామా! నీవు మాకు ఆశ్రయమైతివి, ఇది ఎంతటి భాగ్యమో! ముల్లోకములలో నీకు సాటి ఎవరయ్యా! చెంతకు వచ్చి మంచిమనసుతో మాటలాడి చింతలు ఎంతో చక్కగా తొలగించి కాపాడినావు, ఇది ఎంతటి భాగ్యమో! నీ సన్నిధిన చేరిన యోగులకు అణిమాది అష్టసిద్ధులను ప్రసాదించి నీ దివ్యలీలలచే ఎంతో చక్కగా పాలన చేసిన రీతి నీవు నాకు ఆశ్రయమైతివి, ఇది ఎంతటి భాగ్యమో!

-సద్గురువులు త్యాగరాజస్వామి

రామసాక్షాత్కారము తరువాత త్యాగరాజస్వామి రచించిన కీర్తనలలో ఇదొకటి. చాలామందికి తెలియని విషయం - త్యాగరాజస్వామి వారికి రామకృష్ణానందస్వామి అనే గురువులు రామతారకమంత్రోపదేశం చేశారు. తిరువాయూరులోని పంచనదీశ్వరుని సన్నిధిలో త్యాగరాజస్వామి రోజుకు లక్షా ఇరవై ఐదు వేల రామ తారక మంత్ర జపం చేశారు. ఆ విధంగా 38 ఏళ్ల కాలంలో 96 కోట్ల మంత్ర జపం పూర్తి చేశారు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై యాగసంరక్షణకై విశ్వామిత్రునితో వెడలిన రూపంలో త్యాగయ్యకు ప్రత్యక్షమై వెంటనే అంతర్ధానమైనాడు. ఆ పారవశ్యంలోనే త్యాగరాజస్వామి "బాలకనకమయ చేల సుజనపరిపాల" అనే సాక్షాత్కార కృతిని ఆశువుగా గానం చేశారు. ఈ విధంగా రామతారక మంత్ర సిద్ధి పొందిన తరువాతే త్యాగరాజస్వామి ఎక్కువ కృతులను రచించారు. వాల్మికీ మహర్షి 24,000 శ్లోకాలలో రామాయణాన్ని రచించగా త్యాగయ్య 24,000 కీర్తనలను రచించారు.

కాబట్టి మనం గమనించవలసినది - రామతారకమంత్రోపాసనలో సిద్ధి పొంది త్యాగయ్య పరిపూర్ణమైన యోగిగా జీవించారు. పరబ్రహ్మ తత్త్వాన్ని పూర్తిగా అనుభూతి చెందిన తరువాతే అద్భుతమైన కీర్తనలను రచించారు. అందుకే ధనకనక వస్తు వాహనాదులు, రాజభోగాలు ఆయనకు రుచించలేదు, ఉంఛవృత్తిలోనే జీవించారు. నిరంతర రామభజన తత్పరులై, సాంసారిక విషయ వాంఛలకు దూరంగా ఉంటూ, రామతారకమంత్రమనే సచ్చిదానందములో పవిత్రమైన జీవితాన్ని గడిపారు. ఆ నాదయోగికి నమస్సులు.

5, జులై 2020, ఆదివారం

రమించు వారెవరురా - త్యాగరాజస్వామి కృతి



రామ నామంలోని రహస్యాన్ని మనకు ఒలిచిన అరటిపండులా తన కృతుల ద్వారా అందజేశారు నాదబ్రహ్మ త్యాగరాజస్వామి. అగ్ని బీజమై కాటుక కొండలవంటి సమస్త పాపములను నాశనము చేసే నామం రామ నామం. అనేక జన్మార్జిత పాపసంచయాన్ని అత్యంత శక్తిమంతమైన రామనామ స్మరణతో ఛేదించి ముక్తిని పొందవచ్చు అన్నది మనకు సనాతన ధర్మంలో ఎందరో సత్పురుషులు, సజ్జనుల జీవితాల ద్వారా విదితమే. దానినే మరల తన జీవన ప్రస్థానంలో అనేక కృతుల ద్వారా అనుభవ పూర్వకంగా పలికారు త్యాగరాజస్వామి. రామకోటి, రామాయణ పారాయణం, రామనామ స్మరణం, కీర్తనం వల్ల మనమే కాదు తరతరాలు ఉద్దరించబడతారు అని మా గురువు గారు ఎప్పుడూ చెబుతారు. అంతటి మహోన్నతమైన సాధనం మనందరికీ అందుబాటులో ఉంది. ఇక ఆలస్యమెందుకు? ఆ రహస్యాన్ని తెలుసుకుని, జపాది ఉపాసనామార్గాల ద్వారా అనుభూతి చెంది తరిద్దాం.  జై శ్రీరాం!

జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రం


ఈ రామనామ వైభవాన్ని తెలిపే కృతి వివరాలు:

సాహిత్యం
=======

రమించువారెవరురా రఘూత్తమా నిను వినా!

శమాది షడ్గుణగణ సకల భువన జనులలో 

రంయనే సుమర్మము రామయనే శర్మము స
దమరవరులకబ్బెనో త్యాగరాజ సన్నుత

భావం
======

రఘువంశోత్తముడవైన శ్రీరామా! సమస్త లోకములలోని ప్రాణులకు (శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ, సమాధాన అనే) ఆరు సద్గుణాలను ప్రసాదించి రమించేది నీవు కాక ఇంకెవ్వరు?  రం అనే అద్భుతమైన బీజాక్షర రహస్యం (అగ్ని బీజమై అత్యంత తేజోమయమైనది అని అర్థం), రామ అనే శాశ్వతమైన ఆనందాన్ని యోగులకు, దేవతలకు అందజేసి పరమశివునిచే నుతించబడింది నీవు కాక ఇంకెవరు? 

శ్రవణం
=======

సుపోషిణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

లక్షణములు గల రామునికి - త్యాగరాజస్వామి కృతి



లక్షణములు గల రామునికి ప్రదక్షిణమొనరింతాము రారే

కుక్షిని బ్రహ్మాండములున్నవట విచక్షణుడట దీక్షాగురుడట శుభ

లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట
శిక్షబడి సభను మెప్పించు భక్తరక్షకుండౌనట
అక్షరస్థులైన భజనపరులకే అంతరంగుడౌనట
సాక్షియై వెలయు త్యాగరాజపక్షుండౌనట ముప్పది రెండు

ముప్ఫై రెండు శుభలక్షణములు గల శ్రీరామునికి ప్రదక్షిణము చేసేదము రండి! కడుపులో బ్రహ్మాండములు కలవాడు, సమస్త జీవుల కార్యాకార్యములను పరిపూర్ణంగా ఎఱిగిన వాడు, తనను ఆశ్రయించిన వారి అంతరంగములోని చైతన్యమును పరమాత్మతో అనుసంధానం చేసే దీక్షను అనుగ్రహించువాడు, వస్తు స్వరూపము, స్వభావము చెప్పునట్టి వేదవచనములచే తెలియబడువాడు, అనేక పరీక్షలు లోనై భగవంతుని యందు నమ్మకము వీడకుండా మెప్పించే భక్తజనులను రక్షించువాడు, ఓంకారరూపమైన పరమాత్మ తత్త్వమునెఱిగి వివిధనామ రూప క్రియలతో భజించువారికి అంతరంగమయ్యేవాడు, సాక్షీభూతుడైనవాడు, పరమశివుని పక్షముననుండు వాడు, అనేక శుభలక్షణములు కలిగిన శ్రీరామునికి ప్రదక్షిణము చేసేదము రండి.

-సద్గురువులు త్యాగరాజస్వామి

శుద్ధ సావేరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు

4, జులై 2020, శనివారం

తుంగాతీరం విరాజం - కమలేశదాస రాఘవేంద్ర గీతరాజం


మధ్వ సాంప్రదాయంలోని గురు పరంపర అత్యంత వైభవమైనది. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులతో ఆరంభమైన ఆరంభమైన ఈ పరంపర ఆయన చాటిన ద్వైత సిద్ధాంతాన్ని పరిరక్షిస్తూ సనాతన ధర్మ వృక్షంలో పవిత్రమైన కొమ్మగా నిలిచింది. ఆయన స్థాపించిన ఉడిపి శ్రీకృష్ణ మఠం భవ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ మధ్వ సాంప్రదాయంలో 

తుంగాతీరం విరాజం భజ మన రాఘవేంద్ర యతిరాజం

మంగళకర మంత్రాలయ వాసం
శృంగారానన రాజిత హాసం
రాఘవేంద్ర గురురాజం భజ మన తుంగా తీర విరాజం

కరధృత దండ కమండల మాలం
సురుచిర చేలం ధృత మణిమాలం
రాఘవేంద్ర యతిరాజం భజ మన తుంగా తీర విరాజం

నిరుపమ సుందర కాయ సుశీలం
వర కమలేశార్పిత నిజ సకలం
రాఘవేంద్ర యతిరాజం భజ మన తుంగా తీర విరాజం



రామా నిను నమ్మిన వారముగామా - త్యాగరాజస్వామి



రామా నిను నమ్మిన వారముగామా సకల లోకాభి

పామర జన దూర వర గుణ ఘృణాపాంగ శుభాంగ ముని హృదయాబ్జ భృంగ

వాలాయముగాను రాను జాగేల సుగుణ దశరథ నృపాల హృదయానందకార శ్రి లోల పాల వెలయుమిక
ఫాల లోచన హృదయాలయాప్త జన పాల కనకమయ చేల ఇక పరాకేల ఇపుడు మమ్మేల నీదు మనసేల రాదు

నీవే గతి యంటిని గాని నే వేరేమి ఎరుగను ముందర రావే నీ పద పంకజ భక్తి నీవే భావజారి నుత
దేవ నీదు పద సేవా ఫలము మము గావునే పతిత పావన త్రిదశ నాధనీయ ముని జీవనానిశము బ్రోవనేల శ్రీరామ

ధారాధర నిభ దేహ జనాధార దురితాఘ జలద సమీర త్యాగరాజ హృదయాగార సార హీన సం
సారమందు వేసారి నిన్ను మనసార నమ్ము కొన నేరలేని నే నూరక ఇక విచారమందుటకు మేర గాదు శ్రీరామ

సమస్త లోకములకు ఆనందంకు కలిగించే శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము గామా? పామరులకు దూరుడవు, శ్రేష్ఠమైన గుణములు కలవాడవు, దయాకటాక్షములు గలవాడవు, శుభమైన అంగములు కలవాడవు, మునుల హృదయకమలములకు తుమ్మెద వంటి వాడవు నీవు. దశరథ మహారాజు హృదయమునకు ఆననందము కలిగించిన వాడవు మమ్ములను కాపాడుటకు వేగముగా రావేల? వచ్చి రక్షించుము. శివుని హృదయములో నివసించే వాడవు, ఆప్తజనులను పాలించే వాడవు, బంగారు వస్త్రములు ధరించే వాడవు, ఇంక పరాకెందుకు? ఇప్పుడు మమ్ములను కాపాడుటకు నీకు మనసేల కలుగుటలేదు? నీవే శరణన్నాను, నీ పాదపద్మముల భక్తి తప్ప వేరేమీ ఎరుగను, వేగముగా వచ్చి కాపాడుము. మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన వాడవు, నీ పాదములను సేవించే ఫలము మమ్ములను కాపాడును కదా! పతితులను పావనము చేసే వాడవు, మూడులోకములకు అధిపతివి, మునుల జీవనమైన వాడవు, ఎల్లప్పుడూ మమ్ములను బ్రోచుటకేల ఆలస్యము? మేఘముల వంటి కాంతితో శరీరము గల శ్రీరామా! జనులకు ఆధారము నీవే. పాపములనెడి మేఘములను వాయువు వలె తరిమి కొట్టేవాడవు, శివుని హృదయములో నివసించే వాడవు, ఈ సారములేని సంసార సాగరమందు వేసారి నిన్ను మనసారా నమ్ముకొన్నాను, నిస్సహాయుడైయున్న నన్ను బాధ పెట్టుట ఇంక మర్యాద కాదు శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము, వేగమే వచ్చి మమ్ము రక్షించుము.

- సద్గురువు త్యాగరాజస్వామి

https://www.youtube.com/watch?v=kYiuLbRHxRk

గం గణపతే నమో నమ - ముత్తయ్య భాగవతార్ కృతి

గం గణపతే నమో నమ! శంకరి తనయా నమో నమో!

అంకుశధర! మంగళకర! పంకజ చరణా! వారణ!

పంకజాసనాది వందిత! భక్తార్తి హరణ!ముదిత!
కుంకుమాప! గుణ నిధే! హరికేశ కుమార! మందార!

సమస్త విఘ్నములను అణచే శక్తికి కలిగిన బీజాక్షరం గం. ఆ గం బీజాక్షరముగా కలిగిన పార్వతీదేవి తనయుడైన గణపతికి వందనములు. అంకుశము ఆయుధముగా ధరించి, కమలముల వంటి చరణములు కలిగి,  సమస్త శుభములు కలిగించే గజముఖునికి వందనములు. బ్రహ్మాది దేవతలచే పూజించబడే, భక్తుల ఆర్తిని హరించి ఆనందాన్ని కలిగించే, కుంకుమ చేత పూజించబడిన, సుగుణములకు నిధియైన, శివుని కుమారుడు, భక్తుల పాలిట కల్పవృక్షమైన గణపతికి వందనములు.

- హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్ 

పాండురంగ మహత్యం – 1957: భక్తి రస కావ్యం

1957 నవంబర్ 28న విడుదలైన పాండురంగ మహత్యం తెలుగు భక్తి చిత్రాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్...