కర్ణాటక సంగీత ప్రపంచంలో భావప్రధాన గానానికి ప్రతీకగా నిలిచిన మహావిద్వాంసుడు శ్రీ త్రిపుణితుర కృష్ణారావు గోవిందరావు గారు. గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత శాస్త్రవేత్తగా, గురువుగా, రచయితగా ఆయన చేసిన సేవలు అపారం. ఆయన జీవితం మొత్తం కర్ణాటక సంగీతానికి అంకితం అయింది అని చెప్పవచ్చు.
జననం – కుటుంబ నేపథ్యం:
టీకే గోవిందరావు గారు 1929 ఏప్రిల్ 21న కేరళ రాష్ట్రంలోని త్రిపుణితురలో తంకమ్మాళ్, కృష్ణారావు దంపతులకు జన్మించారు. సంగీతం, సంస్కృతి పరంగా సంపన్నమైన కుటుంబంలో ఆయన పెరిగారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి చూపిన ఆయనకు కుటుంబమే తొలి ప్రేరణగా నిలిచింది.
తొలి అభ్యాసం - గురు పరంపర:
ప్రారంభంలో చెంబై వైద్యనాథ భాగవతర్ గారి ప్రభావం ఉన్నా, ఆయన జీవితాన్ని పూర్తిగా మలిచిన గురువు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్. 15 ఏళ్ల పాటు ఆయన వద్ద గురుకుల సాంప్రదాయంలో ముసిరి వారి వద్ద విద్యనభ్యసించి భావప్రాధాన్యమైన గాత్ర ధర్మాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు. 1949లో శ్రీ టి.కె. గోవిందరావు గారు మద్రాసులోని సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్‌లో చేరారు. అక్కడ సంగీత కళానిధి తిరుప్పాంపురం స్వామినాథ పిళ్లై గారు మరియు శ్రీమతి టీ బృంద వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో సంగీత విద్వాన్ పట్టాను పొందారు.
ముసిరి బాణి అంటే – పదాల అర్థానికి అత్యంత ప్రాధాన్యం, భావాన్ని స్పష్టంగా వ్యక్తపరచే గానం, అతి అలంకారాలు లేకుండా హృదయాన్ని తాకే శైలి.ఈ లక్షణాలన్నీ టి.కె. గోవిందరావు గారి గానంలో స్పష్టంగా కనిపిస్తాయి.
గాయకుడిగా ప్రత్యేకత:
టీకే గోవిందరావు గారి గానంలో శ్రోతలను ఆకట్టుకునే ముఖ్య లక్షణం భావం.స్వరాలు కేవలం శబ్దాలుగా కాకుండా, భావాన్ని మోసుకొచ్చే వాహకాలు అని ఆయన నమ్మకం. అందుకే ఆయన కృతులను పాడేటప్పుడు సాహిత్య ఉచ్చారణ, పదార్థ భావం, భక్తి రసం సమపాళ్లలో ఉంటాయి. అత్యంత క్లిష్టమైన రాగాలకూ ఆయన గానం సరళంగా, హృద్యంగా ఉంటుంది.
ఆకాశవాణి మరియు ఇతర సంస్థల ద్వారా సేవ:
గాయకుడిగా మాత్రమే కాకుండా, ఆకాశవాణిలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించడం ద్వారా కూడా ఆయన కర్ణాటక సంగీతానికి సేవ చేశారు. ఆకాశవాణిలో చీఫ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ, నాణ్యమైన సంగీత కార్యక్రమాలు, యువ కళాకారులకు అవకాశాలు, సంప్రదాయ సంగీత పరిరక్షణ వంటి అంశాలకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
యాభై ఏళ్లకు పైగా సాగిన ఆయన సంగీత జీవితంలో, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా, ఆకాశవాణి చెన్నైలో సంగీత నిర్మాతగా, చివరికి న్యూఢిల్లీ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో చీఫ్ ప్రొడ్యూసర్ (మ్యూజిక్)గా సేవలందించారు. అదేవిధంగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సలహా కమిటీ సభ్యుడిగా, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఐసీసీఆర్ మరియు బనారస్, ఢిల్లీ, మద్రాస్, అన్నామలై, బెంగళూరు, తెలుగు విశ్వవిద్యాలయాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.
గురువుగా, రచయితగా, పరిశోధకుడిగా:
గోవిందరావు గారు ఒక గొప్ప సంగీత పండితుడు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి వంటి మహానుభావుల కృతులపై లోతైన అధ్యయనం చేసి, సరైన సాహిత్య, భావార్థం స్వర నిర్మాణం వివరించే విధంగా అనేక పుస్తకాలు రచించారు రచించారు. ప్రత్యేకంగా త్యాగరాజ స్వామి కృతులపై ఆయన చేసిన కృషి పరిశోధకులకు ఎంతో ఉపయోగపడింది.
ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆయన తన అసలైన లక్ష్యమైన గాయకుడిగా మరియు గురువుగా సేవ చేయడాన్ని ఎప్పుడూ వదలలేదు. భారతదేశమంతటా మాత్రమే కాకుండా శ్రీలంక, సింగపూర్, మలేషియా, యుకె, అమెరికా, కెనడా, మస్కట్ వంటి దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి, వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దారు. గురువుగా ఆయన కఠినమైన నియమాలు పాటించినా, శిష్యులపై అపారమైన ప్రేమ చూపేవారు.సంగీతాన్ని వృత్తిగా కాకుండా, ఒక సాధనగా, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూడమని శిష్యులకు బోధించేవారు. ఆయన శిష్యులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇదే ఆయనకు నిజమైన గౌరవం.
కర్ణాటక సంగీతంలోని మౌఖిక సంప్రదాయాన్ని పరిరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ఆయన గానమందిర్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా సంగీత గ్రంథాల ప్రచురణ, ఆడియో–వీడియో రికార్డింగులు, సంగీత సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహించారు.
కర్ణాటక సంగీత త్రిమూర్తులు మరియు మహారాజ స్వాతి తిరునాళ్ కృతులన్నింటినీ ప్రామాణికంగా సేకరించి, రోమన్ మరియు దేవనాగరి లిపుల్లో, అర్థాలతో మరియు స్వర నోటేషన్‌తో ప్రచురించడం ఆయన చేసిన మహత్తర సేవ. నవరాత్రి మండపంలో ఆయన చేసిన గానం ప్రసిద్ధి చెందింది. అరుదైన స్వాతి తిరునాళ్ కృతులు ఆయన గానంలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.
పురస్కారాలు – గౌరవాలు:
తన జీవితాంతం చేసిన సేవలకు గాను ఆయనకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. సంగీత కళానిధి, సంగీత చుడామణి, సంగీత శాస్త్ర రత్నాకర, సంగీత ఆచార్య, గాయక శిఖామణి వంటి అనేక బిరుదులతో పాటు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. శ్రీ కాంచీ కామకోటి పీఠం నుండి ఆస్థాన విద్వాన్ గౌరవం కూడా పొందారు.
వారసత్వం:
టీకే గోవిందరావు గారు 2011 సెప్టెంబర్ 18న పరమపదించారు. కానీ ఆయన గానం, రచనలు, శిష్య పరంపర ఆయనను నిత్యజీవిగా నిలిపాయి. బొంబాయి సోదరీమణులు లలిత-సరోజ, టీకే రామచంద్రన్, కల్పకం రామన్ వంటి ఎందరో శిష్యులు ఆయన పరంపరను కొనసాగిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో భావానికి ఉన్న విలువను కొత్త తరాలకు గుర్తుచేసిన మహానుభావుడు ఆయన.
ముగింపు:
టీకే గోవిందరావు గారు కేవలం ఒక గాయకుడు కాదు. ఆయన ఒక ఆదర్శ గురువు, లోతైన భావజాలం కలిగిన పండితుడు, ఒక అద్భుతమైన సాంప్రదాయానికి పరిరక్షకులు. కర్ణాటక సంగీతం శ్రోతల హృదయాల్లో జీవించాలి అన్నదే ఆయన జీవిత లక్ష్యం. అటువంటి మహానుభావుని సేవలు ఎప్పటికీ మరువలేనివి.