27, అక్టోబర్ 2025, సోమవారం

దేవ కార్యం - పితృ కార్యం

మనం చేసే కార్యాలలో హోమంతో కూడినవి దేవతలకు ప్రీతిగా చేసేవి, పితృదేవతలకు ప్రీతిగా చేసేవి ప్రధానంగా రెండు భాగాలు. పర-అపర కర్మలకు అనుసంధానమైనవి ఇవి. వీటిలో మనం వినే పదాలు స్వాహా స్వధా. ఇవి ఏమిటి?
స్వాహా అన్న పదానికి అగ్ని దేవుని భార్య, హవిష్ప్రదానం అన్నవి ప్రధానమైన అర్థాలు. యజ్ఞకాండలో స్వాహా శబ్దం లేకుండా హవిస్సులు వేల్చడం ఉండదు. ఏ దేవతలను ఉద్దేశించి యజ్ఞాదులు చేస్తున్నారో వారికి హవిస్సులు అందడానికి స్వాహా తప్పనిసరి. ఆహుతులు స్వాహాకార, వషట్కార పూర్వకంగా వేల్చినప్పుడే దేవతలకు అందుతాయి. అయితే, సంధ్యావందనంలో కేశవ నామాలు చెప్పేటప్పుడు త్రిరాచమ్య అంటూ ముమ్మారు స్వాహాకారంతో ఆచమనం చేయడం పద్ధతి. ఇక్కడ హోమాగ్ని ప్రసక్తి లేదు. అయినప్పటికీ అవి దేవతలకు సమర్పించేవే కనుక స్వాహా శబ్దాన్ని వాడవలసి వస్తున్నది. స్వాహా శబ్దం హోమ సంబంధమైన సాంకేతిక పదం మాత్రమే కాదు. అది సార్థకమైన వాఙ్నామం కూడా. చక్కగా హుతమగుగాక అనే అర్థాన్ని కొందరు భాష్యకారులు ఉదహరించారు. ఇది మహామహిమాన్వితమైన మంత్రమని కొందరు విద్వాంసుల భావన. వేద మంత్రాలు లేకుండానే స్వాహా మంత్రోచ్చారణ చేసే సందర్భాలు ఉన్నాయి. నిత్యనైమిత్తిక కర్మలలోనూ యజ్ఞ యాగాదులలోనూ ఆచమన క్రియతో స్వాహా సాక్షాత్కరించడం ప్రారంభ మవుతుంది. దేవతలకు ఆహుతులను అందించే శబ్దంగా స్వాహా ప్రసిద్ధమైంది. అంతే కాదు అనేక మంత్రాలకు చివర స్వాహా ఉంటుంది. స్వాహా దేవికి ప్రీతికరమైనది ఘృతము. అందుకే అగ్ని కార్యాలలో ఘృతము ప్రధానమైన భుక్కు.
అగ్నికార్యంలో/ యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి). అగ్ని దేవుని భార్య స్వాహాదేవి యొక్క మరో రూపం స్వధా. ఈ స్వధా దేవికి ప్రీతికరమైనవి నల్ల నువ్వులు. అందుకే నల్ల నువ్వులను తర్పణ విధి పూర్వకంగా భుక్కుగా పితృదేవతలకు సమర్పిస్తాము. స్వధానమ తర్పయామి అన్న మంత్రం శ్రాద్ధ కర్మలలో వినిపించే మంత్రం. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు గోత్రం పేరు మరియు రూపాన్ని (వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం) పేర్కొని, తదనంతరం "స్వధా నమః తర్పయామి" అని మూడు సార్లు చెప్పి తర్పణం సమర్పిస్తాము.
మీరు పై నిర్వచనాలను, ప్రయోజనాలను గమనిస్తే రెండు విభాగాల ప్రక్రియలు కూడా చాలా సారూప్యత కలిగి ఉంటాయి. అందుకే పితృకార్యాలకు, ఇతర అగ్నికార్యాలతో సమానమైన స్థానం, ప్రయోజనాన్ని చెప్పారు మన ఋషులు.
రెండిటిలో ప్రధానమైన భేదాలు రెండిటి మధ్య తేడాను స్పష్టంగా తెలుపటానికి సాంకేతికంగా ఏర్పడినవే అని నా ఉద్దేశం. అందుకే పితృకార్యాలను ఇతర అగ్నికార్యాలను అంతే పవిత్రంగా, అంతే నమ్మకంతో, భక్తి పూర్వకంగా నిర్వర్తించాలి అని ప్రాజ్ఞులు నొక్కివక్కాణిస్తారు.