▼

31, అక్టోబర్ 2026, శనివారం

అహోబిలహరిని అర్చింతును - సాయికృష్ణ యాచేంద్ర గారి భక్తి గీతం


అహోబిలహరిని అర్చింతును
నా అంతరంగమే అర్పింతును

నరమృగప్రవృత్తులు ధరలో కలవని
ఎరిగింప ఈ రూపు ధరియించిన

భయావహం ఆ రూపం అయినా
దయామయం హృదయం
కన్నులలోన కరుణోదయం
మనసేమో శ్రితజనప్రియం 

రజోగుణం ఆ భావం అయినా
సాత్వికమే స్వభావం
తామసమణచగ దాల్చెను కాదా
త్రిగుణాతీతుడు దివ్యదేహం 

అహోబిలంలో వెలసిన శ్రీనరసింహస్వామిని భక్తితో అర్చింతును. నా అంతరంగమునే ఆయనకు సంపూర్ణంగా అర్పింతును. ఈ లోకంలో మానవప్రవృత్తులు, మృగప్రవృత్తులు రెండూ కలసి ఉన్నాయని తెలియజేయడానికి నరమృగరూపాన్ని ధరించిన ఆ స్వామిని ఆరాధింతును. చూడటానికి భయంకరమైన రూపమైనా, ఆయన హృదయం దయామయము. ఆయన కన్నులలో కరుణ ఉదయించును. ఆయన మనస్సు శరణాగతుల పట్ల ప్రేమతో నిండి ఉండును. ఆయన ఉగ్రభావం రజోగుణాన్ని సూచించినా, సహజస్వభావం సాత్వికమే. లోకంలోని తామసప్రవృత్తులను అణచివేయడానికే ఆ ఉగ్రరూపాన్ని ధరించెను. సత్త్వ, రజస్, తమోగుణాలను అవసరానుసారం వ్యక్తపరచినా, వాటన్నింటికీ అతీతుడైన పరమాత్మ ఆ నరసింహుడు. దుష్టులకు భయంకరుడై, భక్తులకు కరుణామయుడై, త్రిగుణాతీతమైన దివ్యస్వరూపంతో వెలసిన అహోబిలహరిని అర్చించి, నా హృదయాన్నే ఆయన పాదాలకు సమర్పింతును.

సాయికృష్ణ యాచేంద్ర గారి గీతాన్ని పుహళేంది బిలహరి రాగంలో స్వరపరచగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కృతిని ఆలపించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి