దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈ గీతం జాతీయ ఆలాపనగా ఎంపిక కావలసింది. అనేక కారణాల వల్ల అది సాకారం కాలేదు. ఈ గీతంలో భరతమాత రూపు రేఖలుగా దేవభూమి, పచ్చనిపైరులు, విశాలమైన పీఠభూములు, పక్షుల కిలకిలరావాలు, సూర్యోదయం చేసే తూర్పు తీరాలు, కళలు, కళాకారులు, సంస్కృతి చేత పూజించబడే వైభవం, కోట్లాది ప్రజల మనోభీష్టాలు ప్రస్తావించి అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించారు కృష్ణశాస్త్రి గారు. ఈ భూమియొక్క గొప్పతనాన్ని రెండు చరణాలలో మనోజ్ఞంగా చిత్రీకరించారు. భావుకతకు మారుపేరైన వారి పదసౌరభాలు భరతమాత పాదాలను చుంబించేంత అద్భుతంగా ఈ గీతంలో ఉంటాయి. అందుకే ఈ గీతసౌందర్య మాధుర్యాలు ఎన్నటికీ ఇగిరిపోని గంధాలు. భారతీయత ఏమిటో ఒక్క గీతంలో చెప్పాలంటే విరాట్పురుషుని రూపాన్ని పది అంగుళాల రూపంలో దర్శించిన రీతిలోనే అనుభూతి చెంది వ్రాయాలి. అదే కృష్ణశాస్త్రి గారి అనుభువైకవేద్యమైన జయజయజయ ప్రియభారత. ఈ గీతాన్ని వారి మేనకోడళ్లైన వింజమూరి అనసూయ,సీత ద్వయం స్వరపరచి తొలుత గానం చేశారు. కృష్ణశాస్త్రి గారు, వింజమూరి సోదరీమణులకు పాదాభివందనాలు.
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి
జయ జయ సశ్యామల సుశ్యామ చలశ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
భావం:
మాకందరికీ ప్రియమైన, మా జన్మభూమివైన ఓ భరతమాతా! దేవభూమివి, కోట్లాది స్త్రీపురుషుల హృదయాలకు నేత్రమైన నీకు జయము జయము. నల్లని రూపముతో, పచ్చని పైరులు చీరచెంగుగా కలిగి, అందంగా అల్లబడిన నల్లని కురులలో వసంతఋతువులో పూసిన పూమాలలు కలిగి, నా హృదయములోని ఆశయములనే లాక్ష (లక్క) వంటి ఎర్రని పారాణితో అలంకరించబడిన పాదములు కలిగిన భరతమాతా! నీకు జయము జయము. దిక్కుల చివరవరకు (దూరదూరాలకు) ఎగిరి వెళ్లే పక్షుల దివ్యమైన గానముతో ఆనందించే, గాయకులు, మేలుకొలిపే వారి గానములనే విశాలమైన పథములలో విహరించే, నాయొక్క మధురమైన గేయముతో చుంబించబడిన సుందరమైన చరణములు కలిగిన భరతమాతా! నీకు జయము జయము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి